చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…

చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…

వాడుకలో అందరూ పిలుచుకునే యాదగిరి గుట్ట తెలంగాణ తిరుమల మాదిరిగా రూపుదిద్దు కుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన యాదాద్రి ఇల వైకుంఠం రీతిలో హంగులు అద్దుకుంటోంది. ఇంతకు ముందు కలలో కూడా ఎవరూ ఊహించని రీతిలో యాదాద్రి అలరారబోతోంది. అతికొద్ది రోజుల్లోనే తెలంగాణ జనం కళ్లముందు సాక్షాత్క రించబోతోంది. తెలుగునాట వెలసిన నృసింహా లయాల్లో విశిష్టమైన ఈ పంచ నారసింహ క్షేత్రం యావత్‌ భారతావనిని ఆకర్షించేలా తుది మెరుగులు దిద్దుకోబోతుంది.

కొండను పిండి చేయడం వేరు… దానిమీది బండలను అందమైన శిల్పాలుగా అచ్చెరువొందే కళారూపాలుగా మలచడం వేరు. మొదటిదానికి యంత్రబలం ఉంటే సరిపోతుంది. రెండోదానికి మాత్రం సృజన కావాలి. నిష్ణాతులైనవారి దిశానిర్దేశం కావాలి. మరెంతో సహనం కావాలి. అందుకే రాజుల పాలన అంతరించిన తర్వాత మొత్తం శిలలతోనే ఆలయాలను నిర్మించే పద్ధతీ కనుమరుగైపోయింది. మళ్లీ ఇప్పుడు అంటే దాదాపు వెయ్యేళ్ల తర్వాత కేవలం శిలలతోనే రూపుదిద్దుకుంటోంది యాదాద్రి ఆలయం. దీనికోసం ప్రకాశం జిల్లాలో దొరికే కృష్ణశిలను ఎంపిక చేశారు. ఒక పొడవైన శిలను తీసుకుని దాన్ని స్తపతుల సూచనలతో దేవతా రూపాలూ పువ్వులూ లతలతో అందమైన శిల్పంగా మారుస్తారు. అలా మార్చిన రాతి స్తంభాలను ఒకదానిమీద మరొకటి అమరుస్తూ ఆలయ ప్రాకారాలనూ, మాడ వీధులనూ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రాతి స్తంభాల మధ్య ఖాళీలను పూరిం చేందుకు నాటి రాజుల కాలంలో ఉపయోగించిన లైమ్‌ మోర్టార్‌నే ఉపయోగిస్తున్నారు – అంటే – దీనికోసం బెల్లం, కరక్కాయ, టెంకాయ పీచు మొదలైన వాటితో తయారుచేసిన పదార్థాన్ని వాడతారు. ఇలా శిలలతో నిర్మాణం చేపట్టడం వల్ల మరో రెండు వేల సంవత్సరాల వరకూ ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

ప్రత్యేక దృష్టి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ యాదగిరిగుట్టపై ప్రత్యేక దృష్టి సారించారు. లక్ష్మీ నారసింహుడు కొలువై ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని యాదాద్రిగా మార్చారు. యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (వైటీడీఏ)ని ఏర్పాటు చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ క్షేత్రాన్ని సర్వహంగులతో అభివృద్ధి చేసేలా ఆదేశాలు జారీచేశారు.. కేవలం ఆదేశాలతోనే సరిపెట్టుకోలేదు. దాదాపు ఈ ప్రతిపాదన చేసినప్పటినుంచి ఐదేళ్లుగా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తరచూ యాదాద్రిని సందర్శిస్తూ.. ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతిని పరిశీలిస్తున్నారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ప్రధాన ఆలయమున్న గుట్ట పైభాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండాలి? టెంపుల్‌ సిటీపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై కేసీఆర్‌ స్వయంగా వేద పండితులు, శిల్పులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సోమనాథ్‌ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అధికారికంగా ఒక ఆలయ నిర్మాణానికి పూను కోవడం బహుశా ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. వైష్ణవ పీఠాధిపతి త్రిదండి చినజీయర్‌ స్వామి సలహాలూ సూచనలతో ఈ ఆలయం పునర్నిర్మాణం అవుతోంది.

పునరుద్ధరణ తర్వాత సహస్రాష్టక కుండయాగం

లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా పునర్నిర్మిస్తున్నారు. పూర్తిగా ఆగమశాస్త్రానుసారంగా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. శ్రీవారి రాజగోపురం స్వర్ణమయం చేస్తున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళానైపుణ్యంతో, ఆలయ ప్రాశస్థ్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా ఆలయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం (టెంపుల్‌ సిటీ) నిర్మిస్తున్నారు. యాదాద్రిపై మాడవీధులు, ప్రాకారాలు కలుపుకొని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయ నిర్మాణం జరుగుతోంది. లక్ష్మీనర్సింహస్వామి కొలువై ఉండే గుట్ట పైభాగంలో ప్రధాన దేవాలయంతోపాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వీవీఐపీ గెస్ట్‌హౌస్‌, అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామివారి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్‌, మెట్లదారి, బస్‌స్టేషన్‌, పోలీస్‌ ఔట్‌పోస్ట్‌, హెల్త్‌ సెంటర్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఏది ఎక్కడ ఉండాలనే దానిపైనా పూర్తి స్పష్టతతో నిర్మాణాలు సాగుతున్నాయి. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తరువాత సహస్రాష్టక కుండయాగం (1008 యాగకుండాలతో) 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనున్నారు.

పక్కా ప్రణాళికతో…

వందల ఏళ్ల పాటు నిలిచిపోయేలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపడుతున్నందున.. ప్రతి అంగుళం నిర్మాణంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అత్యాధునికంగా, ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్‌లాంటి ప్రసిద్ధ దేవాలయాలకు దీటుగా యాదాద్రి ఆలయం ఉండేలా చర్యలు తీసుకుంటు న్నారు. దేశంలోని ప్రతిఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని స్వయంగా కేసీఆర్‌ సమీక్షల్లో చెబుతున్నారు. గుట్ట కింద భాగంలోనే ఆలయ బస్‌స్టేషన్‌ నిర్మించనున్నారు. అక్కడినుంచి భక్తులను దేవాలయ వాహనాలద్వారా గుట్టపైకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిం చారు. గుట్టపైకి వెళ్లటానికి, తిరిగి రావటానికి వేర్వేరు దారులు ఉపయోగించనున్నారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగురోడ్డు, దానికి అనుబంధంగా రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా తేడా లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..

యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం లోని ప్రాకార రాతి స్తంభాల మీద వివిధ సాంస్కృతిక చిహ్నాలను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గత చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. దీనికోసం కుబేర స్థానమైన ఈశాన్యం వైపు ఉన్న స్తంభం మీద రెండు, ఐదు, ఇరవై, ఇరవైఐదు పైసల నాణేలూ, వాయవ్య స్తంభం మీద కబడ్డీ, క్రికెట్‌ మొదలైన ఆటలూ… నైరుతిలో ఆధునిక వ్యవసాయం, పరిశ్రమలూ, చేతివృత్తుల చిత్రాలూ… ఆగ్నేయంలో తెలంగాణ చిత్రపటం, ఉద్యమ దృశ్యం, తెలంగాణ తల్లి విగ్రహం… ఇలా యాదాద్రిలో ఏ స్తంభాన్ని చూసినా తెలంగాణ నాగరికతా సంస్కృతీ కనువిందు చేయనున్నాయి.

ప్రతి సంవత్సరం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోమత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ఈ ఉత్సవాలను చూడటానికి దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు వస్తూంటారు. ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోమత్సవాలు మార్చి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్నాయి.

– సప్తగిరి.జి, 9885086126

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *