నరేంద్ర మోదీ కన్నా ముందు అనేక మంది నాయకులు భారత ప్రధానులుగా బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ఇద్దరు ముగ్గరు తప్ప వారంతా ఆర్థికంగా సంపన్న వర్గాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దేశ ప్రగతి, పాలనపై వారు పూర్తిగా తమ దృష్టిని కేంద్రీకరించారు. కొన్ని సంక్షేమ పథకాలను సైతం చేపట్టకపోలేదు. కానీ నరేంద్ర మోదీ వారికి పూర్తిగా భిన్నమైన నాయకుడు. ఆయన నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. పేదల కష్టాలు ఆయనకు పూర్తిగా తెలుసు. ఒక చాయ్‌ ‌వాలాగా పేదరికాన్ని చాలా దగ్గరగా చూశారు. అకుంఠిత దీక్షతో పని చేసి, అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నతమైన ప్రధాని పదవిని అందుకున్నారు. నూరుశాతం నిఖార్సైన ప్రజా నాయకుడినని నిరూపించుకున్నారు.

2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో పాలన చేపట్టారు. 1984లో ఇందిర హత్య కారణంగా సానుభూతి పవనాలతో నాటి ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ పూర్తిస్థాయి ఆధిక్యం సాధించారు. ఆ తరవాత అంటే మూడు దశాబ్దాల అనంతరం సంపూర్ణ మెజార్టీతో ఢిల్లీ పగ్గాలు చేపట్టిన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. ఇదేదో ఆయాచితంగా వచ్చిన ఆధిక్యం కాదు. తమ కష్టాలు తీరుస్తారన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. 2019లోనూ ప్రజలు మోదీపై మరింత విశ్వాసాన్ని కనబరిచారు. అందువల్లే మోదీ తన పాలనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాల ప్రజానీకం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు కనపడు తోంది. వారి జీవితాల్లో వెలుగు రేఖలు విస్తరిస్తు న్నాయి. బతుకుపై వారిలో భరోసా నింపుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాల్లో కేంద్ర వాటా నిధులు ఉన్నాయి. కానీ ఆయా సర్కార్ల ప్రచార యావలో కేంద్రం సమకూరుస్తున్న నిధుల విషయం వెలుగులోకి రావడం లేదు. అయినప్పటికీ పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అదే సమయంలో కేంద్రం తనంతట తాను నేరుగా అనేక కార్యక్ర మాలను చేపడుతోంది. ప్రధానమంత్రి వయో వందన యోజన ద్వారా పింఛన్‌ ‌సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్‌ఐసీ (భారతీయ జీవిత బీమా సంస్థ) అమలు చేస్తోంది. ఆరు పదుల వయసు దాటిన వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. ఇందులో పెట్టుబడి పెట్టిన మేరకు నెలవారీ పింఛన్‌ అం‌దజేస్తారు. ఉదాహరణకు రూ.1,62,162 పెట్టుబడి పెడితే నెలవారీ రూ.1000 పింఛన్‌ ‌పొందవచ్చు. అదే రూ.15 లక్షలు మదుపు చేస్తే నెలకు రూ.9,250 పింఛన్‌ ‌పొందడానికి అర్హులు. వయసులో ఉన్నప్పుడు దాచుకున్న మొత్తాన్ని నమ్మకమైన ప్రభుత్వ సంస్థలో మదుపు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొంది వయోధికులు విశ్రాంత జీవనాన్ని నిశ్చింతగా గడపవచ్చు. దీనికి అదనంగా అటల్‌ ‌పింఛన్‌ ‌యోజన అనే మరో కార్యక్రమాన్ని చేపట్టింది. హర్‌ ‌ఘర్‌ ‌జల్‌ ‌పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, స్వచ్ఛమైన తాగు నీరందించే బృహత్‌ ‌కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. 2023 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సాకారం చేయాలన్నది ప్రధాని లక్ష్యం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతి నిరుపేదకూ ప్రమాద బీమా కల్పించేందుకు సర్కారు కంకణం కట్టుకుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఏడాదికి కేవలం రూ.12 ప్రీమియం చెల్లిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు బీమా పొందవచ్చు. విధి వక్రించి నప్పుడు ఆపదలో ఉన్న కుటుంబానికి ఇది భరోసా కలిగిస్తుంది. ప్రధానమంత్రి జీవన్‌ ‌జ్యోతి బీమా యోజన ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల వయసు వారికి రూ. 2 లక్షలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికి ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.330 మాత్రమే కావడం గమనార్హం. ప్రధానమంత్రి హౌసింగ్‌ ‌స్కీమ్‌ ‌ద్వారా ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్నది లక్ష్యం.

ఆడపిల్లల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో బాలిక వివాహ ఖర్చులకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ ఖాతాను వాణిజ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించవచ్చు. మదుపు చేసే మొత్తాలపై ప్రభుత్వం ఆకర్షణీయ వడ్డీని అందజేస్తుంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల విస్తరణ కోసం ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజనను కేంద్రం తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలను అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడం, వెనకబడిన ప్రాంతాల్లో వైద్య విద్యను మెరుగుపరచడం, ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడం ఈ పథకం లక్ష్యం. దీనికింద అవసరమైన ప్రాంతాల్లో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ ‌వంటి అత్యున్నత సంస్థల స్థాపనకు సైతం కేంద్రం ముందుకు వస్తుంది. షెడ్యూల్డ్ ‌కులాలు, తెగలు, మహిళా పారిశ్రామికవేత్తలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు, తోటివారికి వీలైనంత మేరకు ఉపాధి కల్పించేందుకు స్టాండప్‌ ఇం‌డియా పథకాన్ని ప్రారంభించారు. దీని కింద పరిశ్రమలు ప్రారం భించేందుకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు. జాతీయ రహదారులపై ప్రయాణాలకు అడ్డంకులు లేకుండా చూసేందుకు సేతు భారతం యోజన కార్యక్రమాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా జాతీయ రహదారులపై రైల్వే క్రాసింగులు లేకుండా రైల్వే ఓవర్‌, అం‌డర్‌ ‌బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ప్రయాణ సమయం కూడా కలసివస్తుంది. రైళ్లు సైతం ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

ప్రధానమంత్రి వీధి విక్రేత ఆత్మ నిర్భర్‌ ‌నిధి పథకాన్ని గత ఏడాది జూన్‌లో ప్రారంభించారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వీధి విక్రేతలకు ఈ పథకం కింద రుణ సౌకర్యం కల్పిస్తారు. కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజన కింద పేదలకు అయిదు కిలోల గోధుమలు, పప్పులను అందజేస్తున్నారు. ఆయుష్మాన్‌ ‌సహకార పథకాన్ని గతేడాది అక్టోబరు 19న ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో సహకార సంఘాలు ఈ పథకం కింద కీలకపాత్ర పోషిస్తాయి. రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలను అందించడం కోసం ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ అభియాన్‌ ‌పథకాన్ని తీసుకువచ్చింది కేంద్రం. వలస కార్మికులకు ఆహార భద్రత కల్పించేందుకు ‘వన్‌ ‌నేషన్‌- ‌వన్‌ ‌రేషన్‌’ ‌పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది మోదీ సర్కారు. 2019లో పైలట్‌ ‌ప్రాజెక్టు ప్రాతిపదికన నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. 2020 నుంచి 12 రాష్ట్రాలకు విస్తరించారు. పోర్టబిలిటీ ద్వారా దేశంలో ఏ ఎలక్ట్రానిక్‌ ‌పాయింట్‌ ఆఫ్‌ ‌సేల్‌ (ఈపీవోఎస్‌) ‌నుంచి అయినా రేషన్‌ ఈ ‌పథకం ద్వారా పొందవచ్చు. 2019 నవంబరులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంజీవని పథకాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ‌ద్వారా రోగులకు వైద్యులు సేవలందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు నేరుగా వైద్యశాలలకు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. టెలిమెడిసిన్‌ ‌వ్యవస్థ లాంటిది. ఈ సేవను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధప్రదేశ్‌. ‌మాజీ ప్రధాని, దివంగత అటల్‌ ‌బిహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా 2019 డిసెంబర్‌ 25‌న అటల్‌ ‌భుజల్‌ ‌యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూగర్భ జలవనరులను పెంచడం దీని లక్ష్యం. జలవనరులను పెంచడం వల్ల తాగు, సాగునీటికి కటకట తప్పుతుంది.

బడుగు, బలహీన వర్గాల ప్రగతికి పాటుపడే వివిధ కొత్త పథకాలను ప్రారంభించడం, పాత పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం లక్ష్యంగా మోదీ సర్కారు గత ఏడేళ్లుగా ముందుకు సాగుతోంది. వీటి ఫలితాలు సైతం ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.

– దోర్బల పూర్ణిమాస్వాతి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram