సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సమయం చూసి, సందర్భాన్ని బట్టి జనం నాడిని పట్టుకొని ప్రసంగించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో బాంబుల మీద బాంబులు పేల్చారు. అధికార వర్గాల్లో కలకలం సృష్టించారు. రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తామని, అవసరమైతే పేరును మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు కలెక్టర్‌ల వ్యవస్థ కూడా అవసరం లేదని.. కలెక్టర్‌ పేరును జిల్లా పాలనాధి కారిగా మారుస్తామన్నారు. తానే ప్రతి జిల్లాలో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.

దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త చట్టాన్ని తెలంగాణలో అమలులోకి తీసుకొస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక.. జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకు రానున్నామని చెప్పారు. ప్రతి గుంట లెక్క తేలేలా రైతులకు పూర్తి యాజమాన్య హక్కు కల్పించ బోతున్నామని తెలిపారు. గిరిజనులు, పోడు భూముల సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఎవరికీ లంచం ఇవ్వొద్దని సూచించారు. పహాణి నకలు మార్చేశా మన్నారు. మొత్తానికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని కేసీఆర్‌ చెప్పారు. తొలుత నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. అయితే.. ఈ ప్రకటన రెవెన్యూ వర్గాల్లో పెనుచర్చకు దారితీసింది. ఆ విభాగంలో భయాందోళనకు బీజం వేసింది.

అంతకుముందే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబానికి సంబంధించిన భూ వివాదంపై కేసీఆర్‌ స్పందించారు. ఎన్నడూ లేని విధంగా.. రైతుకు నేరుగా ఫోన్‌చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తాను పడుతున్న ఇబ్బందులను పేర్కొంటూ ఓ రైతు.. ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్‌ చేస్తే.. దానికి స్పందించిన సీఎం కేసీఆర్‌.. నేరుగా ఆ రైతుకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్వయంగా జిల్లా కలెక్టర్‌ను రైతు ఇంటికి పంపించి సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిణామం చర్చనీయాంశమైంది. అయితే ఆ రైతుతో మాట్లాడుతున్న సమయంలో రెవెన్యూ విభాగంలో నెలకొన్న అవినీతిపై సీఎం పలు విమర్శలు చేశారు. దానిపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాలు నిరసన ప్రకటించాయి. వర్క్‌ టు రూల్‌ చేపట్టాయి. కేసీఆర్‌ వైఖరిపై బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు రెవెన్యూ అధికారులు.

నిర్మల్‌ సభలో పై ప్రకటన చేసిన తర్వాత మరికొన్ని సభల్లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్‌. రాష్ట్రంలో గుంటభూమి కూడా వివాదాస్పదం కాకుండా సంపూర్ణంగా భూప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. రెవిన్యూశాఖనే ప్రక్షాళన చేస్తానని.. అసలు ఆ పేరే మార్చివేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. రెవిన్యూ కలెక్షన్‌లే లేనప్పుడు కలెక్టర్‌ వ్యవస్థ కూడా అక్కరలేదని కలెక్టర్‌ పేరును జిల్లా పరిపాలన అధికారిగా మారుస్తామన్నారు. తనకు ఎవరిపైనా నమ్మకం లేదని అవసరమైతే జిల్లాకు రెండు, మూడు రోజులు కేటాయించి తానేస్వయంగా ప్రజా దర్బార్‌ నిర్వహిస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రతి రైతుకు అది పోడుభూమి అయినా, వారసత్వంగా సంక్రమించిందైనా మరేరకమైన భూమి అయినా కంక్లూజివ్‌ టైటిల్‌ను అందజేస్తానని ప్రకటించారు.

అయితే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి సారి అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున భూముల ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగానే రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసింది. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు తమ చేతివాటం చూపించి అక్రమ వసూళ్లకు పాల్పడి నట్లుగా తెలుస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారులు అవినీతి సొమ్ముకు ఆశపడి డిజిటలైజేషన్‌ పేరుతో వేల సంఖ్యలో పట్టాలను రికార్డుల్లోంచి తొలగించినట్లుగా అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. దీంతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాసుపుస్తకంలో తప్పులు దొర్లాయని ఒకరు, తమ భూమిని రికార్డుల నుంచి తొలగించారని మరొకరు ఇలా.. ఎందరో రైతులు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగు తున్నారు. అసలు దీనంతటికి కారణం కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనే అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. భూ ప్రక్షాళన సమయం లోనే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఉండి ఉంటే రైతులకు ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని చెబుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారుల వాదన మరో రకంగా ఉంది. భూ ప్రక్షాళన సమయంలో తాము శ్రమకు మించి.. నిద్రాహారాలు మానుకొని కష్టించి పనిచేశామని.. పాసుపుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసే క్రమంలో పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడటం వల్ల కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చని.. అంతేకాని తాము అవినీతి సొమ్ముకి ఆశపడి ఉద్దేశపూర్వకంగా ఏ తప్పులూ చేయలేదని చెబుతున్నారు. తమ కష్టానికి గుర్తింపు ఇవ్వకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే రెవెన్యూ శాఖపై ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు.

ఇక కేసీఆర్‌ ఇటీవల చేసిన మరో సంచలన ప్రటకన.. జిల్లా కలెక్టరు పేరును జిల్లా పరిపాలనాధి కారిగా మార్చడం. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లుగా సేవలందిస్తున్న వారు కేంద్రం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఉత్తీర్ణులైన ఐఏఎస్‌ అధికారులు.. అంటే వారి అధికారాల్ని గానీ.. అధికార హోదాని గాని మార్చడం అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం. రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ కేసీఆర్‌ కలెక్టర్‌ పేరును మారుస్తానని చెప్పడం ప్రజా స్వామ్యాన్ని అవహేళన చేసి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్‌ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తనకు ఓటు వేయలేదని, సామాన్య, మధ్యతరగతి ఓటర్లే తెలంగాణ రాష్ట్రసమితికి అండగా నిలబడ్డారని, వాళ్ల ఓట్ల వల్లే గెలిచామని ప్రకటించి మరో చర్చకు కారణ మయ్యారు. అంతేకాదు.. నిర్మల్‌ సభలోనే మరో వివాదాస్పద ప్రకటన చేశారు కేసీఆర్‌. తెలంగాణకు ఆదిలాబాద్‌ జిల్లా కశ్మీర్‌ లాంటిదన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి.

మరోవైపు.. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. కనీసం ఇప్పటిదాకా ఓ రూపు కూడా లేకున్నా ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే జాతీయస్థాయిలోనూ టీఆర్‌ఎస్‌దే హవా అని జనంలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణను రూపొందిస్తామని ప్రకటించారు.

అయితే.. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఆ పరిణామం టీఆర్‌ఎస్‌కు తగ్గిన ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని రాజకీయ చర్చలు నడిశాయి. అయితే… ఓటర్లు కొట్టిన ఆ దెబ్బ నుంచి బయటపడేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతుతో ఫోన్లో మాట్లాడి పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచారు. ఆ రైతు సమస్యను ఒక్కరోజులోనే పరిష్కరించారు. కానీ.. మరుసటిరోజే.. ఎదుటి పక్షానికి చెందిన వాళ్లు ఆడియో రికార్డును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. కేసీఆర్‌ ఏకపక్షంగా వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ఒకరి వాదనే విని అదే న్యాయమని ఎలా నిర్ధారిస్తారని నేరుగా సీఎంనే ప్రశ్నించారు. ఇలా.. ఈ పరిణామం కూడా కేసీఆర్‌కు బూమరాంగ్‌ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ రెండు పరిణామాల తర్వాత క్షేత్రస్థాయిలో ప్రచారం అత్యావశ్యకమని గ్రహించిన కేసీఆర్‌.. ఎన్నికల వేళ తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు సాగించారు. ఆరు రోజుల్లో 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 11 సభలు నిర్వహిం చేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్‌ తలపెట్టిన సభను రద్దు చేసుకున్నారు. ఆశించినంత జనం రాలేదన్న కారణంగా ఆ సభను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. కారు.. సారు.. పదహారు నినాదంతో రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న కార్యాచరణ మేరకు కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే అంతటా తానై ప్రచార సభల్లో పాల్గొన్నారు. కానీ.. జనం నాడి ఎలా ఉండబోతోందో మే 23 దాకా ఆగితే గానీ తేలే పరిస్థితి లేదు.

– సప్తగిరి.జి, 9885086126

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *