బుదర చల్లడమే టిడిపి లక్ష్యం

బుదర చల్లడమే టిడిపి లక్ష్యం

గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం మీదా, మోదీ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అతి ద్వేషంతో విరుచుకు పడుతున్న విషయం రాష్ట్ర ప్రజలకు ప్రతి రోజూ అనుభవంలోకి వస్తున్నదే. అయితే ఈ ద్వేషం మరీ మితిమీరుతున్నదేమో అని ఇప్పుడు ప్రజలకు సందేహం కలుగుతోంది. ఆయన ప్రవర్తిస్తున్న తీరు పట్ల ప్రజలలో ఒకరకమైన ఏహ్యభావం కలుగు తోంది. విశాఖ రైల్వే జోన్‌ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తరువాత కూడా ముఖ్యమంత్రి ప్రధానిపై అతిగా ద్వేషం ప్రదర్శించడం, విశాఖకు వచ్చిన ప్రధాని పట్ల హామీలు నెరవేర్చలేదంటూ నల్ల నిరసన తెలపడం దీనికి కారణం.

మొదట్లో మోదీ హోదా ఇవ్వలేదంటూ బాబు విమర్శించారు. తరువాత పోలవరానికి డబ్బు లివ్వటం లేదంటూ ద్వేషం ప్రదర్శించారు. ఆ తరువాత విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించటం లేదని, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వటం లేదని, అసలు ఆంధ్రాకు ఏమీ ఇవ్వటం లేదని మొసలి కన్నీరు కార్చారు. మోదీపై కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో అవిశ్వాసం సైతం ప్రవేశపెట్టారు. అది చాలక ఢిల్లీ, కలకత్తా, బెంగుళూరు వంటి దేశంలోని పలు నగరాలలో మీటింగులు పెట్టి మరీ మోదీని తిట్టారు. బాబు చేస్తున్న ఈ హడావిడి చూసి మొదట్లో రాష్ట్ర ప్రజలు మోదీ నిజంగానే రాష్ట్రానికి ఏమీ చేయ లేదేమో, బాబు చెప్పేవన్నీ నిజమేనేమో అని సందేహించారు.

ఆ తరువాత మోదీ బాబు విమర్శలను తిప్పికొట్టడం ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమేం సంస్థలు ఇచ్చారు, ఎన్ని నిధులు ఇచ్చారు వంటి వివరాలు చెప్పటంతో ప్రజలు బాబును అనుమానించటం ప్రారంభించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ప్రకటించిన తరువాత బాబు దానిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు బాబుకు మోదీపై ఉన్న ద్వేషం గురించి ప్రజలకు కొంత స్పష్టత వచ్చింది. బాబు కావాలనే మోదీపై ద్వేషం ప్రకటిస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చారు. గత నెలలో మోదీ గుంటూరు వచ్చి కేంద్ర సంస్థల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ సభలోనే తాను రాష్ట్రానికి అప్పటివరకు ఏమేమి చేశామనేది చెప్పి, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆ సభతో రాష్ట్ర ప్రజలలో మోదీ పట్ల ఉన్న అనుమానాలు తీరిపోయి, అభిమానం పెరగటం ప్రారంభమయింది.

గతవారం విశాఖ వచ్చేముందు మోదీ విశాఖ రైల్వే జోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో 2014లో ఆంధ్రకు కేంద్రం తరపున ఇచ్చిన హామీలలో దాదాపు 80 శాతం పూర్తయినట్లే. ఇన్ని హామీలు నెరవేర్చిన కేంద్రం త్వరలోనే మిగిలిన హామీలను నెరవేర్చవచ్చు.

ఇప్పుడు కూడా ద్వేషం ఎందుకు?

రాష్ట్ర ప్రజల కోసమే కేంద్రంపై తన ధర్మ పోరాటం అని చెబుతున్న చంద్రబాబు విశాఖ జోన్‌ ప్రకటన తరువాత సంతోషించాల్సింది పోయి మరింత ద్వేషం ఎందుకు ప్రకటిస్తున్నట్లు అనే సందేహం ప్రజలలో తీవ్రంగా నాటుకుంది. చంద్రబాబు అసలు ఉద్దేశం మోదీని ఏదోవిధంగా ప్రజలలో చులకన చేయటం తప్ప నిజమైన రాష్ట్ర భక్తి కాదని వారు ఒక తీర్మానానికి వచ్చేశారని రాజకీయ పండితులు అంటున్నారు.

రాజకీయ పండితులు మరొక ముందడుగు వేసి బాబు రాష్ట్రభక్తిపై మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు గతంలో తొమ్మిదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. పోలవరం గురించి కాని, స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ జోన్‌ వంటి అభివృద్ధి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదని చెబుతున్నారు. తొమ్మిదేళ్లపాటూ వచ్చిన అన్ని నిధులను కేవలం హైదరాబాద్‌లోనే పెట్టారని, ఆ తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన 143 కేంద్ర సంస్థలు అన్నిటిని హైదరాబాద్‌లో పెట్టించి, మిగతా జిల్లాల ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శిస్తున్నారు. అప్పట్లో పోలవరం గురించి ఒత్తిడి తెచ్చిన గోదావరి జిల్లాలకు చెందిన తన సొంత పార్టీ కార్యకర్తలనే బాబు పట్టించుకోలేదని, తరువాతి ఎన్నికల్లో వారికి టిక్కెట్లు నిరాకరించారని గుర్తు చేస్తున్నారు. అటువంటి బాబుకు ఇవాళ పోలవరం గురించి మాట్లాడే హక్కు లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు.

వాస్తవంగా చూస్తే అసలు పోలవరం గురించి పెద్దగా పట్టించుకున్న వ్యక్తి రాజశేఖర్‌ రెడ్డి. 2014లో మోదీ పోలవరం ఆంధ్రప్రజల జీవనాడి అని గుర్తించి, దానికి పూర్తి అనుమతులు ఇప్పించారు. వందశాతం నిధులు భరించటానికి ముందుకు వచ్చారు. 7 వేల కోట్ల రూపాయలు మంజూరు కూడా చేశారు. నిర్మాణ బాధ్యత తీసుకున్న బాబు పనులను సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన నిధులను తన సొంత లాభాల కోసం పెట్టుబడులు పెట్టారని, అందుకే పనులు పూర్తి కాలేదని, ఇప్పుడు మోదీపై నిందలు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

హోదా హామీ విషయంలో కూడా మోదీ ఆధ్వర్యంలోని కేంద్రం రాష్ట్రం పట్ల సానుకూలంగానే స్పందించింది. హోదా అమలు సాంకేతికంగా సాధ్యం కాదని తెలిసిన తరువాత మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. దానికింద గత మూడేళ్లలో ఎన్నో నిధులు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే రాజధానికి కూడా 15 వందల కోట్లు ఇస్తే బాబు ఇంతవరకు దానికి ఒక లేఅవుట్‌ ఫైనల్‌ చేయలేకపోయారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. పైగా ఇచ్చిన 15 వందల కోట్లలో 770 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించినట్లుగా బాబు లెక్కలు చెపుతున్నారని, శాశ్వత నిర్మాణాలు చేపట్టాల్సిన నిధులను తాత్కాలిక నిర్మాణాలకు కేటాయించడానికి బాబుకు అధికారం ఎక్కడిదని నిలదీస్తున్నారు. ఇదంతా బాబు కమిషన్ల కోసం చేసిన పని అని స్పష్టం చేస్తున్నారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థలు, పరిశ్రమలు ఒక రికార్డు అని చెపుతున్నారు. ఇటువంటి రికార్డు చరిత్రలో ఇంతకుముందు ఏ రాష్ట్రం విషయంలో నమోదు కాలేదని, ఆ ఘనత పనిచేసే ప్రధాని మోదీదే అని స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు విశాఖ జోన్‌ ప్రకటించిన విషయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రానికి గల బాధ్యతగల మనస్తత్వమే కారణం అంటు న్నారు. ఈ విషయంలో బాబు సంతోషించటం మానేసి, విమ ర్శించటం, ప్రధాని వస్తే నల్ల నిరసన తెలపడం బాబులోని అతి విద్వేష మనస్తత్వానికి నిదర్శనం అనీ అంటున్నారు. జోన్‌ ప్రకటన అనంతరం బాబు చేస్తున్న విమర్శలు, ప్రకటించిన విద్వేషం చూసిన రాష్ట్ర ప్రజలు విశ్లేషకుల అభిప్రాయాలతో ఏకీభ విస్తున్నారు.

జోన్‌ ప్రకటనను కావాలనే కేంద్రం ఇంతకాలం ఆలస్యం చేసిందని, ఇప్పుడు ఎన్నికల ముందు ప్రకటించడం న్యాయం కాదని రాష్ట్ర పాలక పక్షం విమర్శించడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. ఎన్నికల ముందు బాబు ప్రకటించిన అన్న కాంటీన్లు, పసుపు కుంకుమ నిధులు వంటివి ఎన్నికల తాయిలాలు కాదా? అని చర్చించుకుంటు న్నారు.

ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలనే తపనతో భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న మాట వాస్తవం. భాజపా మొదటినుండి దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేస్తున్నది. ప్రధాని మోదీ కూడా అదే దృష్టితో ముందుకు వెళుతున్నారు. ఎన్నికల లోగా ఇచ్చిన హామీలన్నిటినీ పూర్తి చేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నారు. అందుకే విశాఖ జోన్‌ను ఎన్నికలకు ముందే ప్రకటించారు. అందులో తప్పేమీ లేదు. అయితే ఎన్నికలకు ముందు ప్రకటించినందువల్ల ఆ క్రెడిట్‌ భాజపాకు పోతుందని, తమకు ఏం లాభం లేదనేది రాష్ట్ర పాలకుల అంతరంగం. దానితో వారు జోన్‌ ఇచ్చినప్పటికీ ఆదాయం పోయిందని, లేటు అయిందని కుంటి సాకులు చెప్తూ కేంద్రంపై బురద చల్లుతున్నారని ప్రజలు గుర్తిస్తున్నారు.

ఇక ఆదాయం లేని జోన్‌ ఇచ్చారంటూ ఇక్కడి పాలకపక్షం గుప్పిస్తున్న విమర్శలు పస లేనివనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేక రైల్వే జోన్‌ వల్ల రాష్ట్రానికి ప్రత్యక్షంగా వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. రైల్వే జోన్‌ విషయంలో ప్రత్యక్ష లాభ నష్టాలన్నీ రైల్వే సంస్థకే చెందుతాయి. ఈ విషయంలో ఒక రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం రావడం, మరో రాష్ట్రం నష్టపోవటం ఉండదు. పైగా జోన్‌ వల్ల పరోక్షంగా రాష్ట్రానికి, ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఎన్నో లాభాలున్నాయి. ప్రత్యేక జోన్‌ వల్ల స్థానికంగా స్థిరాస్తుల ధరలు పెరుగుతాయి. హోటళ్లు, టూరిజం, పరిశ్రమలు వంటి సంస్థలు వస్తాయి. వీటి వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంతకుముందు రైల్వే ఉద్యోగాల కోసం ఇక్కడి స్థానికులు భువనేశ్వర్‌ వెళ్లాల్సివచ్చేది. అక్కడ లోకల్‌ సమస్య వెంటాడేది. దాంతో 30 శాతం ఉద్యోగాలకే మనవాళ్లకు అవకాశం ఉండేది. ఇప్పుడు విశాఖకే జోన్‌ రావడం వల్ల 70 శాతం రైల్వే ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. ప్రత్యేక జోన్‌ వల్ల ఇంకా కొత్త రైళ్లు, కొత్త మార్గాలలో రైల్వే లైన్తు పెరుగుతాయి. బోగీలు పెరుగుతాయి. పండుగలు, ఉత్సవాలు వంటి సందర్భాల్లో విశాఖ ప్రాంతంలో ఉండే రద్దీ తగ్గుతుంది. ప్రత్యేక జోన్‌ వల్ల వస్తు రవాణా, ఎగుమతి సౌకర్యాలు పెరుగుతాయి. మన ప్రాంతంలో జోన్‌ కేంద్రం ఉండటం వల్ల మన ప్రాంతంలోని ఉత్పత్తులను ఎగుమతి చేయటానికి ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న కాకినాడ, భీమునిపట్నం, విజయవాడ వంటి పోర్టులు వృద్ధిలోకి వస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి సౌకర్యాలు పెరుగుతాయి. ఇటువంటివి ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. ఇవన్నీ రాష్ట్రానికి పరోక్ష ఆదాయమే.

దీనినిబట్టి చూస్తే, ఆదాయం లేని జోన్‌ ఇచ్చారంటూ ఇక్కడి పాలక పక్షం చేస్తున్న విమర్శలు వట్టి బూటకమని, కేవలం కేంద్రంపై బురద చల్లటమే వాళ్ల లక్ష్యంగా కనపడుతున్నదని విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ జోన్‌లోని డివిజన్ల పట్ల రాష్ట్రానికి అభ్యంతరాలు ఉంటే వాటిని సానుకూల పద్ధతిలో కేంద్రానికి చెప్పొచ్చని, వాటిని కూడా కేంద్రం పరిశీలించి, తగిన రీతిలో న్యాయం చేయటానికి సిద్ధంగా ఉన్నదని ఇక్కడి కేంద్రప్రభుత్వ ప్రతినిధులు హామీ ఇస్తున్నారు. అంతేకాని అదేపనిగా విద్వేషం ప్రకటించడం వలన బాబుకే నష్టం అని కూడా హెచ్చరిస్తున్నారు.

దక్షిణ కోస్తా రైల్వే పేరుతో విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్‌ రావడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఇది కనీసం 3 దశాబ్దాల నాటి కల అని, దానిని నెరవేర్చిన ఘనత మోదీకి, భాజపాకే దక్కుతుందని చెప్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోన్‌ వల్ల ఇక తమ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దాంతో మరింత అభివృద్ధి జరుగుతుందని సంతోషిస్తున్నారు. అయితే ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రలోని ఒక డివిజన్‌ను వేరు చేయడం పట్ల వస్తున్న విమర్శలను కేంద్రం పరిశీలించి తగు నిర్ణయం వెలువరిస్తే మరిన్ని ప్రశంసలు పొందే అవకాశం ఉంది.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *