మాటల లొల్లి ‘షురు’

మాటల లొల్లి ‘షురు’

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీల వాగ్యుద్ధాలు మొదలయ్యాయి. ముందస్తు ముసురు పట్టుకుంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయ ప్రచార సభలు హోరెత్తుతున్నాయి.

నిరసన నిజమేనా?

రాష్ట్ర రాజకీయాలన్నీ టీఆర్‌ఎస్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధానంగా కేసీఆర్‌ రహస్య వ్యూహాలు అమలు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విపక్షాలను టార్గెట్‌ చేయడమే కాదు, సొంత పార్టీకి సంబంధించి కూడా గులాబీ అధినేత వైఖరిపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ మీటింగుల్లో ఘర్షణలు, నిరసనలు, సొంత పార్టీ నేతల జంపింగ్‌లే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

విపక్షాల నేతలపై కేసులు, ఐటీ దాడుల విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వమే ఉన్నా కేసీఆర్‌ ప్రమేయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని పలు పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

కావాలనే పక్కన పెడుతున్నారా?

టీఆర్‌ఎస్‌ పార్టీ విషయానికి వస్తే హరీశ్‌రావు అంశం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ ఆవిర్భ వించినప్పటి నుంచి కేసీఆర్‌ తర్వాత స్థానంలో ఉన్న హరీశ్‌ కొన్నేళ్లుగా వెనక్కి వెళ్లిపోయారు. ఆ స్థానాన్ని కేటీఆర్‌ ఆక్రమించేశారన్నది పార్టీ వర్గాల మాట. అయితే ఈ విషయంలో హరీశ్‌ ఎక్కడా బయటపడలేదు. కానీ ఇటీవల ఓ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో నిర్వేదం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకపంనలు పుట్టించింది. ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఈ అంశంపై చర్చ సాగింది. గులాబీ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.

తొలుత ప్రజా ఆశీర్వాద సభలకు తానే హాజరవుతానని ప్రకటించిన కేసీఆర్‌ కొంతకాలం ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్‌ ఆ పాత్ర పోషించారు. తర్వాత బహిరంగ సభల ప్రణాళికలు సిద్ధం చేసుకొని మరోసారి సభల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కేసీఆర్‌. అయితే మొదట ప్రకటించినట్లు 50 రోజుల్లో 100 సభల పరిస్థితి మాత్రం జవాబులేని ప్రశ్నగానే మిగిలింది.

టిక్కెట్ల చిచ్చు

పార్టీ టిక్కెట్ల విషయానికొస్తే హరీశ్‌రావు వర్గంగా పేరొందిన వాళ్లను పక్కన పెట్టారన్న విషయం బహిరంగ రహస్యమే అంటున్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు. హరీశ్‌ వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు ఇవ్వకుండా, ఒకవేళ అక్కడక్కడ ఇచ్చినా వారి స్థానాల్లో అసమ్మతి రేగేలా కేటీఆర్‌ ప్లాన్‌ చేశారని కొండా సురేఖ పార్టీ మారే సమయంలో మీడియాకు చెప్పడం కలకలం రేపుతోంది. తాము కూడా ఆయన వర్గం కాబట్టే దూరం పెట్టారని ఆరోపించారు కొండా దంపతులు. అంతేగాకుండా కేటీఆర్‌ని ముఖ్య మంత్రిని చేయడానికే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు.

కారుకు ‘బై’

కొండాసురేఖ దంపతులే కాదు టీఆర్‌ఎస్‌ ఆంధోల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌ కూడా పార్టీ మారారు. ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మరికొందరు ఈ బాటలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. వివిధ రాజకీయ పక్షాలు కూడా అలాంటివాళ్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలో విభేదాలకు చోటులేదు

హరీశ్‌రావుకు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని సందర్భం వచ్చినప్పుడల్లా కేటీఆర్‌ చెబుతు న్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు వీటికి భిన్నంగా ఉంటున్నాయని టీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు, ఇతర రాజకీయ నాయకులు కూడా అనుకుంటు న్నారు.

– సప్తగిరి.జి, 9885086126

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *