‌భాగ్యనగరం: రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వాలు లాభసాటి ధరకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ (‌బీకేఎస్‌) అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్‌ ‌మిశ్రా అన్నారు.

నవంబర్‌ 13‌న సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో జరిగిన ‘రైతు గర్జన’ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సభకు భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ ‌తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జోగినపల్లి రంగారావు మార్గదర్శనం చేశారు.

ఈ సందర్భంగా మోహన్‌ ‌మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంజాబ్‌, ‌హర్యానాల్లోని రైతుల మీద ప్రేమ ఉంది. కానీ సొంత రాష్ట్ర రైతుల మీద లేదని అన్నారు. రాష్ట్రంలో పాలనంతా ఒక్క కేసీఆర్‌ ‌కుటుంబం చేతిలోనే ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు వ్యతిరేకి అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్‌ ‌వడ్లకు 10 కేజీలు వేస్టేజ్‌ ‌పేరుతో రైతుల్ని నష్టపరుస్తోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి పెంపు, వ్యవసాయ ఇన్‌పుట్స్‌పైన జీఎస్‌టీని తొలగించడమే లక్ష్యంగా డిసెంబర్‌ 16‌న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన ‘కిసాన్‌ ‌గర్జన’కు ఈ సందర్భంగా బీకేఎస్‌ ‌పిలుపునిస్తున్నట్లు మిశ్రా పేర్కొన్నారు.

బీకేఎస్‌ ‌రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పర్యాద అంజిరెడ్డి మాట్లాడుతూ.. కూరగాయలు అమ్ముకునేవాళ్లకు వచ్చే ఆదాయం.. వాటిని పండించిన రైతులకు రావడం లేదని విచారం వ్యక్తంచేశారు. ఏదిఏమైనా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి అమ్ముకోవద్దని సూచించారు. గత మూడేళ్లు రుణమాఫీ చేయని కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతుల్ని అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు.

దేశంలో అన్ని వృత్తుల వాళ్లు సుఖంగా ఉన్నారు. ఒక్క రైతు మాత్రం కష్టం, దుఃఖం, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడని అంజిరెడ్డి వాపోయారు. ఎన్నిక ఏదైనా అన్నదాత అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని రైతుల్ని కోరారు. రైతులందరూ ఐక్యంగా ఉండటం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించేందుకు, వారి హక్కుల సాధన కోసమే భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ అహర్నిశం పనిచేస్తోందన్నారు.

జాతీయ కార్యదర్శి కొండెల సాయిరెడ్డి మాట్లాడుతూ భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌కి ఏ పార్టీతో సంబంధం లేదని, రైతు సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అన్నారు.

కార్యక్రమంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి దోనూరు రాము, అఖిల భారతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ ప్రభారి నానా ఆక్రే, నాగపూర్‌, అఖిల భారతీయ కార్యవర్గ సభ్యులు ముదుగంటి శ్రీధర్‌ ‌రెడ్డి, అఖిల భారతీయ ఎఫ్‌పీఓ ప్రముఖ్‌ ‌జె. కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల వెంకటరెడ్డి, గైని నాగేశ్వర్‌, ఉడుముల లావణ్య, కోశాధికారి ఎల్‌. ‌మాణిక్‌ ‌రెడ్డి, కార్యదర్శులు, అంబీర్‌ ఆనందరావు, బోరంపేట మల్లారెడ్డి, డబ్బా రవి, ప్రచార ప్రముఖ్‌ ‌త్యాగల శ్రీనివాస్‌, ‌కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి సుమారు ఇరవై వేలమంది  రైతులు ఈ సభకు హాజరయ్యారు.

About Author

By editor

Twitter
Instagram