అతనే పెద్ద రేపిస్టు..

అతనే పెద్ద రేపిస్టు..

నిజం నిప్పు లాంటిది. దాన్ని జేబులోనో, గుప్పెట్లోనో దాచలేము. అలాంటిదే తాలిబ్‌ హుస్సేన్‌ ఉదంతం. అతను ఎవరన్నది దేశంలో చాలా మందికి తెలియదు. కానీ ఒంటి చేత్తో కథువా రేప్‌ కేసును దేశవ్యాప్తంగా సంచలన వార్తగా మార్చాడు. ఎక్కడో జమ్మూ ప్రాంతం కథువాలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక సంఘటనకు దేశమంతటా ప్రచారం కల్పించడంలో, దేశవ్యాప్తంగా ‘సేవ్‌ ఆసిఫా’ ఉద్యమాన్ని నడిపించడంలో తాలిబ్‌ హుస్సేన్‌దే కీలక పాత్ర.

ఈ యువ లాయర్‌ పత్రికలు, టీవీ ఛానెళ్లతో మాట్లాడటమే కాకుండా, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వంటి అనేక కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో సమావేశాలు నిర్వహించాడు. ఒక పెద్ద హీరోలా వామపక్ష, మైనారిటీ యువత ముందు నిలిచాడు. కానీ తరువాత కొంత కాలానికే జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఒక మహిళను రేప్‌ చేసి పట్టుబడ్డాడు. అయితే.. అప్పట్లో ఉదారవాదులుగా చెప్పుకునే చాలా మంది ఈ కేసును కట్టుకథగా భావించారు. హిందూ సంస్థలు చేస్తున్న విషప్రచార మనే నమ్మారు. సుప్రసిద్ధ లాయర్‌ ఇందిరా జైసింగ్‌ ఆయన పక్షాన వాదించేందుకు ముందుకువచ్చారు. ఆ తరువాత తాలిబ్‌ హుస్సేన్‌ భార్య ఆయన శాడిస్టు అని, తనను, తన పిల్లలను వదిలేశాడని కేసు పెట్టింది. దీనిని కూడా చాలా మంది నమ్మలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఆందోళనలో భాగంగా చాలా మంది మహిళలు తమపై జరిగిన అత్యాచారాలను వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ముస్లిం యువతి తాలిబ్‌ హుస్సేన్‌ తనను రేప్‌ చేశాడని ‘ఫస్ట్‌ పోస్ట్‌’లో కథనాన్ని ప్రచురించింది. తనను వెంబడించి, వెన్నాడి, బలవంతంగా లోబర చుకుని రేప్‌ చేశాడని ఆమె వెల్లడించింది. తనను ‘నికాహ్‌’ (పెళ్లి) చేసుకుంటానని కూడా నమ్మ బలికాడని ఆ యువతి చెప్పింది.

విషాదం ఏమిటంటే కథువా రేప్‌ పేరిట దేశమంతా అట్టుడుకుతున్న సమయం.. ఏప్రిల్‌ నెలలోనే తాలిబ్‌ ఆమెను రేప్‌ చేశాడు. కథువా విషయంలో ప్రసంగించేందుకు తాలిబ్‌ను ఆ యువతి, మరికొందరు ముస్లిం యువతులు జెఎన్‌యూకి ఆహ్వానించారు. వారిపైనే అత్యాచారం చేశాడు సదరు ప్రబుద్ధుడు. కథువా రేప్‌ కేసు నీరుగారి పోతుందన్న భయంతో అప్పుడు ఈ విషయాన్ని వెల్లడించలేదని ఆ యువతి తెలిపింది. తన లాగానే అనేకమంది ముస్లిం యువతులను తాలిబ్‌ రేప్‌ చేశాడని చెప్పింది. ఆమె స్వయంగా తాలిబ్‌ పేరు చెప్పకపోయినా ముస్లిం యువతులను బలాత్కరించిన వ్యక్తి తాలిబ్‌ హుస్సేన్‌ అన్నది సులువుగానే అందరికీ అర్థమైపోయింది. స్వయంగా కథువా సంఘటన విషయంలో దేశమంతటా ఉద్యమానికి ఆజ్యం పోసిన వ్యక్తే ఓ పెద్ద రేపిస్ట్‌, ఎలాంటి నైతికతా లేని కామాతురుడని ఇప్పుడు తేటతెల్లమైపోయింది. నీతిమంతుడిగా పోజులు కొట్టిన తాలిబ్‌ అనేక మంది ముస్లిం యువతులను రేప్‌ చేయడం నీతిమాలిన తనానికి, దివాలాకోరు తత్వానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో లాయర్‌ ఇందిరా సింగ్‌ తాలిబ్‌ పక్షాన ఇకపై వాదించబోనని, విచారణ నుంచి వైదొలగు తున్నానని కూడా ప్రకటించారు.

అయితే కొంతమంది కుహనా లౌకికవాదులు, నక్సల్‌ భావాలున్నవారు ఇంత జరిగినా తాలిబ్‌ హుస్సేన్‌ వంటి సీరియల్‌ రేపిస్టును సమర్థిస్తున్నారు. ఎంజే అక్బర్‌ వంటివారు చెడ్డ రేపిస్టులని, తాలిబ్‌ హుస్సేన్‌ వంటివారు మంచి రేపిస్టులని సూత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విడ్డూర, వితండ వాదనను ముందుకు తెస్తున్నవారిలో సుప్రసిద్ధ మార్క్సిస్టు ఫెమినిస్టు కవితా కష్ణన్‌ వంటివారు కూడా ఉండటం నిజంగా విషాదం. వారు తాలిబ్‌కు మద్ధతుగా, రేప్‌కు గురైన ముస్లిం యువతులకు వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరం. వారి వ్యవహార శైలిని చూస్తే అసలు కథువా రేప్‌ కేసులో తెరవెనుక చాలా పెద్ద కుట్రే ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

నిజానికి కథువాలో బాలిక చనిపోవడం విషాదకరమైన వాస్తవం. అయితే ఆ బాలిక రేప్‌కు గురైనట్టు ఇప్పటి వరకూ కచ్చితంగా రుజువు కాలేదు. బాలికను మందిరంలో బలాత్కరించారని తాలిబ్‌ హుస్సేన్‌ వంటివారు చెబుతున్నా మందిరానికి తలుపులు లేకపోవడం, ఇనుప ఊచలతో కూడిన కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉండటంతో రేప్‌ జరగడానికి ఆస్కారం లేదని స్థానికులు వాదిస్తున్నారు. కథువాలో స్థానికులు సీబీఐ విచారణను డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం, పోలీసులు కేసుకు న్యాయం చేయరని, నిజానిజాలను బయటకు రానీయరని స్థానికులు వాదించారు. దాంతో ఈ కేసు పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కి బదలాయించారు.

అయితే.. ఈ మొత్తం ఉద్యమాన్ని నిర్వహించిన పెద్దమనిషే రేపిస్టు అని ఇప్పుడు తేలింది. ఆయన ఘాతుకాలకు బలైపోయింది ముస్లిం యువతులే. ఆసిఫా గురించి గొంతులు చించుకున్నవారు ఈ తాలిబ్‌ హుస్సేన్‌ ఆచరణను ఏ కొలబద్ధతో కొలుస్తారు?

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *