రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

నిర్లక్ష్యానికి 10మంది అమాయకుల బలి

మైనింగ్‌ అధికారుల నిర్లక్ష్యానికి 10మంది క్వారీ కూలీలు బలయ్యారు. దూరప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన వీళ్లంతా క్వారీ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆగస్టు 4వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది. క్వారీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు వారి ప్రాణాలను హరించివేశాయి. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురై ఎగిరిపడ్డాయి. పేలుళ్ల అనంతరం మంటలు ఎగసిపడటంతో క్వారీ సమీపంలో ఉన్న షెడ్డు పూర్తిగా దగ్ధమైంది. విస్ఫోటనం ధాటికి రెండు లారీలతోపాటు మూడు ట్రాక్టర్లు కాలి బూడిదయ్యాయి. మృతి చెందినవారిలో ముగ్గురిని ఒడిశాకు చెందినవారిగా, ఏడుగురిని ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్‌ కార్డుల ఆధారంగా మృతులను గుర్తించినట్లు తెలుస్తోంది.

భద్రతను గాలికొదిలేయడం, అవసరానికి మించి భారీగా పేలుడు పదార్థాన్ని నిల్వ చేయడం, చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు కళ్లు మూసుకోవడమే ఈ క్వారీ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. పేలుడు పదార్థాల ధాటికి శ్రామికుల శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మంటల్లో కాలిపోయాయి. మృతులంతా 30 సంవత్సరాల లోపువారే. దుర్ఘటన జరిగిన సమయంలో ఎంతమంది పనిలో ఉన్నారనే వివరాలు ఇంకా తెలియలేదు. పరారీలో ఉన్న క్వారీ యజమానులపై పేలుడు నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం హత్తిబెళగల్‌ గ్రామానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. లీజు ప్రదేశాల్లో పేలుడు పదార్థాల నిల్వలు ఉంచడానికి గనుల భద్రతా అధికారులు నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. యజమాని క్వారీకి దూరంగా వేరే ప్రదేశంలో పేలుడు పదార్థాలు నిల్వ చేయాలంటే కలెక్టర్‌ ఎన్‌ఓసీతోపాటు పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ అనుమతి తప్పనిసరి. ఇవేమీ లేకుండానే ఓ ప్రైవేట్‌ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజే కూలీలు నివాసం ఉండే షెడ్డు వద్దకు పేలుడు సామాగ్రి లోడు తమిళనాడు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరానికి మించి భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వల్లనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇతర ప్రదేశాల్లో నిల్వ చేయడానికి అనుమతుల్లేవని అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గనుల శాఖ మంత్రికి స్థానికులు ఫిర్యాదు చేశారు.

కర్ణాటక

ఐక్య కర్నాటకే మేలు

‘ఉత్తర కర్ణాటక’ ప్రత్యేక రాష్ట్ర అభిలాష ఈ ప్రాంత ప్రజల్లో నామమాత్రంగానే కనపడుతోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల పాక్షికంగా జరిగిన బందేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఉత్తర కర్ణాటక’ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆగస్టు 2న చేపట్టిన బంద్‌కు అన్నిచోట్లా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రత్యేక రాష్ట్రం కంటే అఖండ కర్ణాటకే మేలంటూ బంద్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాల్లో ఏ ఒక్కచోటా బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించకపోవడాన్ని విశేషంగానే చెప్పుకోవచ్చు. పలుచోట్ల ఆందోళనాకారులు జిల్లా అధికారుల కార్యాలయాల వద్ద శాంతియుత నిరసనలకే పరిమితమయ్యారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ మొదలైన హుబ్బళ్లి-ధార్వాడతోపాటు కలబురిగి, రాయచూర్‌, హవేరీ జిల్లాల్లో బంద్‌ రోజున ఉదయం సాధారణంగానే జనజీవనం ప్రారంభమైంది. బంద్‌కు మద్దతుకంటే వ్యతిరేకత ప్రదర్శిస్తూ కర్ణాటక రక్షణ వేదిక వంటి సంఘాల కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందిస్తూ ఐక్యతకు సహకరించాలని కోరారు. అయితే జిల్లా కేంద్రాల్లో ఉత్తర కర్ణాటక వికాస వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. బెళగావి, కుందాపుర, చిక్కోడి, గదగ్‌, అథణి తదితర ప్రాంతాల్లో మాత్రం బంద్‌ ప్రభావం పాక్షికంగానే కనపడింది. బంద్‌కు వ్యతిరేకత రావడం కర్ణాటక సమగ్ర అభివృద్ధికి సూచికగా సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హామీల పట్ల విశ్వాసం ఉంచిన ఉత్తర కర్ణాటక ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దారి తప్పించే సంఘాలు, ప్రజల మనోభావాలను చెదరగొట్టే ఆందోళనాకారులను నమ్మరాదని హితవు పలికారు. ప్రత్యేక రాష్ట్ర అంశంపై సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షం కాంగ్రెస్‌ తటస్థంగా ఉంది.

ఢిల్లీ

లంచం ఇస్తే ఇక జైలే

లంచం ఇచ్చేవారికి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన నూతన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. రాజకీయ నాయకులు, అధికారులు, బ్యాంకర్లు తదితరులకు ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ)-1988’ కొంతమేర రక్షణ కల్పిస్తుంది. విశ్రాంత ప్రభుత్వోద్యోగులకూ ఇది వర్తిస్తుంది. ఇలాంటి వారిపై ఏదైనా విచారణ చేపట్టాలంటే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తగిన అధికార వర్గాల నుంచి ముందుగా ఆమోదం తీసుకోవలసి ఉంటుంది.

ఇలాంటి ఆమోదం లేకుండా పోలీసు అధికారులెవరూ ప్రభుత్వో ద్యోగులపై దర్యాప్తు, విచారణ చేపట్టడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. తనకోసం, లేదా ఇతరుల తరపున అయాచిత ప్రయోజనాలను స్వీకరిస్తూ ఘటనా స్థలంలోనే దొరికిపోయిన కేసుల్లో మాత్రం ముందస్తు అనుమతి అవసరం లేదు. బలవంతపు పరిస్థితుల్లో లంచాలు ఇవ్వాల్సిన వారిని రక్షించేలా చట్టంలో ఓ నిబంధన చేర్చారు. ఇలాంటివారు సంబంధిత దర్యాప్తు సంస్థలకు వారం రోజుల్లోగా వివరాలు నివేదించాల్సి ఉంటుంది. లంచం పుచ్చుకునేవారికి కనీస కారాగార శిక్షను మూడేళ్లుగా నిర్ణయించారు.

దీనికి అదనంగా జరిమానాను కూడా విధించవచ్చు. ప్రజాప్రతినిధులకు అనుచిత లబ్ధి కలిగించేలా ఏదైనా వాణిజ్య సంస్థ లంచం ఇచ్చినా, ఇచ్చేందుకు హామీ ఇచ్చినా శిక్ష తప్పదు. అవినీతి సంబంధిత కేసులను రెండేళ్లలోగా కొలిక్కి తీసుకురావలసి ఉంటుంది.

ఝార్ఖండ్‌

సైబర్‌ నేరగాళ్లపై ఈడీ కేసులు

ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు సైబర్‌ నేరగాళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు నమోదు చేసింది. ఫోన్‌కాల్స్‌ ద్వారా మోసగిస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్న ప్రదీప్‌కుమార్‌ మండల్‌, యుగల్‌ మండల్‌, సంతోష్‌ యాదవ్‌ అనే వ్యక్తులు, వారి సహాయకులపై అభియోగాలు మోపింది. ముగ్గురు నిందితులూ రూ.కోటి చొప్పున ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. ఝార్ఖండ్‌లో సైబర్‌ నేరాలకు సంబంధించి కేసులను ఈడీ చేపట్టడం ఇదే తొలిసారి. నిందితుల ఆస్తులను జప్తు చేసే ఉద్దేశంతో అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఫోన్‌చేసి ఆర్‌బీఐ, సెబీ బ్యాంకుల అధికారులుగా నిందితులు పరిచయం చేసుకునేవారని వివరించారు. ‘ఖాతాలు నిలిచిపోతాయని భయపెట్టి…ఖాతాదారుల నుంచి కీలకమైన వివరాలను, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను తెలుసుకునేవారు…నకిలీ వివరాలతో తెరిచిన తమ ఖాతాల్లోకి…సొమ్మును మళ్ళించుకునేవారు’ అని పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్లపై కూడా ఈడీ కేసులు నమోదు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు

రుణానిధి కన్నుమూత

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి (94) ఆగస్టు 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6.10గంటలకు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశాయి. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజుల క్రితం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే.

ముత్తువేల్‌ కరుణానిధి పూర్తి పేరు. కరుణానిధి, అతని మిత్రుడు ఎంజీఆర్‌ కలిసి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీని స్థాపించారు. 1967లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్నాదురై మంత్రి వర్గంలో పీడబ్ల్యూడీ మంత్రిగా కరుణానిధి పనిచేశారు. 1969లో అన్నాదురై క్యాన్సర్‌ వ్యాధితో మరణించగా, వారసత్వం కోసం కరుణానిధి, నెడుంజెళియన్‌ పోటీ పడిన సమయంలో ఎంజీఆర్‌ మద్దతు కరుణానిధికి లభించింది. దీంతో కరుణానిధి సీఎం అయ్యారు.

కరుణానిధి డీఎంకే అధినేతగా 50 సంవత్సరాలు కొనసాగారు. ఇన్నేళ్ల సారథ్యంలో పార్టీలో ఆయన నాయకత్వంపై ఎలాంటి అసంతప్తి లేకపోవడం గమనార్హం. వాస్తవానికి డీఎంకేను నెలకొల్పిన సమయంలో పార్టీకి అధ్యక్షుడు ఉండేవారు కాదు. సీఎమ్‌ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అన్నాదురై సీఎంగా ఉన్న సమయంలోనే కన్నుమూశారు. దీంతో పార్టీ పగ్గాలను కరుణానిధి అందుకున్నారు. 1969లో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఉన్న కార్యదర్శి సంప్రదాయాన్ని కాదని అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినా ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఎవరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు.

కరుణానిధి అనేక సందర్భాల్లో హిందుత్వాన్ని, హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిని వ్యతిరేకించి వార్తల్లోకెక్కారు.

1924 జూన్‌ 3న జన్మించిన కరుణానిధి 1969, 1971, 1989, 1996, 2006 సంత్సరాల్లో మొత్తం ఐదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు.

జమ్మూ కశ్మీర్‌

ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతంకాగా పలుప్రాంతాల్లో తలెత్తిన ఘర్షణల్ల్లో ఓ పౌరుడు మృతిచెందాడు. కిలోరా ప్రాంతంలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆగస్టు 3న ఒకరు, 4న నలుగురు స్థానిక ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారి తెలిపారు. ఈ జిల్లాలోనే గనౌపోరాలో ఉగ్రవాదులు దాడికి దిగడంతో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ బిలాల్‌ అహ్మద్‌ఖాన్‌ అనే పౌరుడు మృతిచెందాడు. ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఓ ఉగ్రవాది అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గత ఫిబ్రవరిలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాది నవీద్‌జట్‌ నాటకీయంగా అక్కడ కనిపించిన నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. అయితే రాళ్లు రువ్విన ఆందోళనాకారులపై భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లోనే బిలాల్‌ మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కిలోరా గ్రామరలో ఎదురుకాల్పుల ఘటనాస్థలి వద్ద గుమికూడిన ఆందోళనాకారులు భద్రతాదళాలపైకి ఆగస్టు 4న రాళ్లు రువ్వారు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు భద్రతాసిబ్బంది పెల్లెట్లు ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *