స్వయంసేవకులు అన్ని రంగాల్లోనూ పనిచేయాలి

స్వయంసేవకులు అన్ని రంగాల్లోనూ పనిచేయాలి

విశాఖ సాంఘిక్‌లో మోహన్‌ భాగవత్‌

ఆరెస్సెస్‌ సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ విశాఖ పర్యటన సందర్భంగా, ఆగస్టు 8 న మహానగర సాంఘిక్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో 17 నగరాలు, 2 ఖండల నుండి మొత్తం 1447 మంది స్వయంసేవకులు పూర్తి గణవేష్‌ ధరించి పాల్గొన్నారు. స్వయంసేవకులను ఉద్దేశించి మోహన్‌ భాగవత్‌ ప్రసంగిస్తూ సంఘం స్వయంసేవక్‌ బట్టే సంఘాన్ని సమాజం అర్థం చేసుకుంటుందని అన్నారు.

వారి ప్రసంగం క్లుప్తంగా పాఠకుల కోసం..

సంఘం గత 92 సంవత్సరాలుగా పనిచేస్తున్నది. సంఘం పేరు అందరికి తెలుసు. సంఘ స్వయం సేవకులు ఏమేం చేస్తుంటారో కూడా కొంతవరకూ ప్రజలకి తెలుసు. చూస్తున్నవాళ్ళకి సంఘం చాలా మంచి పని చేస్తోందని తెలుస్తుంది. అలా సంఘం మంచిదని నిర్థారించుకుంటారు. కాని నిజానికి సంఘం ఎలాంటిదని తెలుసుకునే ప్రయత్నం వారు చెయ్యరు. ఇది కేవలం సంఘానికి బయట ఉన్న వారికి మాత్రమే వర్తించదు. మనం స్వయం సేవకులం కూడా దీనిని గురించి ఆలోచించవలసి ఉంది. సంఘ స్వయంసేవకులు చాలా మంచి పని చేస్తారు, నేను కూడా అలాగే చేయాలను కుంటున్నాను, అందుకే సంఘ స్వయంసేవక్‌ని అయ్యాను. నేను సంఘ స్వయంసేవక్‌ అవ్వాలి. ఒక గటకునిగా, భాగస్వామిగా కావాలంటే నేను సంఘానికి ప్రతిరూపంగా తయారవ్వాలి అని ప్రతి స్వయంసేవక్‌ అనుకోవాలి. అంటే సంఘం గురించి తెలుసుకోవాలనే కోరిక పెరగాలి. మనఃస్థితి ఎలా ఉంటుందంటే – రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి తోటి ప్రయాణికుడిని ఎక్కడకు వెళుతున్నారని అడిగాడు? ఆయన నేను విజయవాడ వెళుతున్నానని చెప్పాడు. నిజానికి ఆయన వెళ్ళడం లేదు. రైలు వెళుతోంది. దానిలో కూర్చున్న ప్రయాణికుడు రైలుతోపాటు వెళతున్నాడు. అలాగే సంఘం కూడా రైలు వంటిది. చూస్తున్నవారు సంఘం నడుస్తోందని నిర్ధారించు కుంటారు. స్వయంసేవకులైన మనం కూడా సంఘం నడుస్తోంది కాబట్టి మనం నడుస్తున్నామని అనుకుంటుంటాము. వాస్తవం అది కాదు. ఇది సంఘమనే రైలు. దాని ప్రత్యేకత ఏమిటంటే అది స్వయంసేవకుల ఆధారంగా నడుస్తోంది. ఎంత ఎక్కువ మంది స్వయంసేవకులు నడిస్తే సంఘం అంత వేగంగా నడుస్తుంది. సంఘ స్వయంసేవకులు లక్షల్లో ఉన్నారు. కానీ నిరంతరం పని చేసేవారు ఎంతమంది ఉన్నారు ? మనం అటువంటి ప్రయత్నం చేస్తున్నామా? దీనిని మనం రోజు మననం చేసుకోవాలి. మనం సంఘంలోకి వచ్చాము. సంఘం మనలోకి ఎంత వచ్చిందని గురూజీ ఒకసారి అడిగారు.

వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక జీవనంలో నేను స్వయంసేవక్‌గా ప్రవర్తిస్తున్నానా అనేది ఆలోచించవలసి ఉంది. మన పని తోటి మనిషి ఆచరణలో మార్పు తీసుకురావడం. సంపూర్ణ సమాజాన్ని ఆత్మీయతతో ఒకే సూత్రంలో కట్టడం మన పని. మన దేశ అదష్టానికి, దురదష్టానికి కారణం మన మంచి, చెడు ప్రవర్తన మాత్రమే. భవ్యమైన పరంపర కలిగిన హిందూ సమాజం మనది. కానీ ఈ పరంపరని మరవడంతో అది ప్రమాదంలో పడుతున్నది.

మన వ్యక్తిగత ఆచరణలో మార్పు చేసుకునేందుకు ప్రతి వ్యక్తికీ రెండు సాధనలున్నాయి.

మొదటి సాధనం : సంఘ స్వయంసేవక్‌ స్వచ్ఛంగా జీవిస్తూ, ఆత్మావలోకన చేసుకుంటూ, నిత్యం తన అలవాట్లలలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ప్రతి స్వయంసేవక్‌ తన జీవితంలో ఈ సాధన నిరంతరం చేస్తూండాలి. సంఘానికి రాక పూర్వం అలవాట్లు, సంఘానికి వచ్చిన తర్వాత అలవాట్లలో తేడా కనబడాలి. ఉదాహరణకు డాక్టర్జీకి వంశపారంపర్యంగా వచ్చిన గుణాలలో కోపం ఒకటి. సంఘం ప్రారంభానికి పూర్వం ఆయన విప్లవ సంస్థలతో కలసి పనిచేసారు. వాళ్ళతో కలసి పనిచేయడం వారి స్వభావానికి చాలా దగ్గరగా ఉండేది. కానీ సంఘం ప్రారంభించిన తర్వాత తన కోప స్వభావం సంఘ పనికి పనికిరాదని తెలుసుకుని, ప్రయత్నపూర్వకంగా కోపం తగ్గించుకున్నారు. స్వయంసేవకులతో ఆత్మీయంగా, ప్రేమగా మాట్లాడడం అలవరచుకున్నారు. అలా మనం కూడా మన మనస్సులో సంకల్పం చేసుకుని, ఆ సంకల్పం సాధ్యపడే విధంగా మన గుణాలలో వద్ధిని పెంచుకోవటం, దోషాలను తగ్గించుకునే పనిని ప్రతి రోజు జాగరూకతతో చేయాలి.

రెండవ సాధనం : స్వయంసేవక్‌ శాఖా కార్యంలోను, సమాజ కార్యంలోను శ్రద్ధతో పనిచేసినట్లయితే అతనికి వ్యక్తిగతంగా సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. సంఘంలో వ్యక్తిపూజ లేదు. వ్యక్తిగత ప్రయోజనాలకు సంఘంలో తావులేదు.

పెద్ద సంఘ కార్యక్రమాలు జరిగినప్పుడు సమాజంలోని శిశువు నుండి 60 సంవత్సరాలు పైబడినవారు కూడా శాఖా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. స్వయంసేవకులు తమకు అప్పచెప్పిన సంఘపనులను చక్కగా చేస్తున్నారు. అలాగే స్వయంసేవకులు సమాజంలోని ఆర్థికరంగం, సేవారంగం, రాజకీయరంగం మొదలైన అన్ని జీవనరంగాలలో పనిచేయటానికి సిద్ధపడాలి.

సమాజానికి ఎవరైతే మంచి పనులు చేస్తారో వారిని సమాజం విశ్వసిస్తుంది. కళాశాల విద్యార్థి స్వయంసేవకులు ఉన్నత విద్యలు చదువుకోవాలి. శాఖకు ప్రతీరోజూ వెళ్లాలి. శాఖలో నేర్పే శారీరిక్‌, బౌద్ధిక్‌ విషయాలను శ్రద్ధతో నేర్చుకోవాలి. వారు తమను తాము ఉత్తమ విద్యార్ధులుగా తీర్చిదిద్దుకోవాలి. తమ బస్తీలలో శాఖలు నడపాలి. అప్పుడే సమాజంలోని అనేకమంది యువకులు సమాజ సేవచేయడానికి ముందుకు వస్తారు.

తరుణ స్వయంసేవకులు దేశభద్రత, దేశభక్తికి సంబంధించిన విషయాలపై సమాజంలో చర్చలు నిర్వహించి అందరికీ విషయాలు అర్థమయ్యేటట్లు తెలియజేయాలి.

తరుణ ఉద్యోగి స్వయంసేవకులు తోటి సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నించాలి. దేశంలో మాటలు చెప్పేవారు ఎక్కువ, పనులు చేసేవారు తక్కువ. వీరికి సంఘం పని పూర్తిగా అర్థం అయ్యేటట్లు చెయ్యాలి. ఇటువంటివారు సామాజిక సమరసత వంటి సమాజహితమైన పనుల గురించి ఆలోచన చేయాలి.

సమాజంలో ప్రస్తుతం పర్యావరణం, గోరక్షణ, జల సంరక్షణ, సామాజిక సమరసత, ధర్మజాగరణ, కుటుంబ ప్రబోధన్‌, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి శాఖలలో తయారైన క్రియాశీల ప్రౌఢ స్వయంసేవకుల అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రౌఢ శాఖల ద్వారా క్రియాశీల స్వయంసేవకులను గుర్తించి, వారికి సరైన శిక్షణిచ్చి పై పనులలో నియుక్తి చేయాలి. శిక్షణ పొందిన స్వయంసేవకులు సామాజిక మార్పుకోసం నిరంతరం ప్రయత్నిస్తుండాలి. మన కళ్ళతో ఈ దేశ పరమవైభవాన్ని చూసేలా సంకల్పిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *