రోడ్డు భద్రత – పెట్రోల్‌ భారం

రోడ్డు భద్రత – పెట్రోల్‌ భారం

రోడ్డెక్కిన వాడు తిరిగి వచ్చే వరకూ సురక్షితంగా ఉంటాడనే భరోసా ఇప్పుడు పూర్తిగా లోపించింది. అసలు ప్రాణాలకే భద్రత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో పెట్రోలు లేదా డీజిల్‌ ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. ఇది నేటి సమాజంలో సగటు పౌరుడు అనుభవిస్తున్న పెను సమస్యలు. ఒక సౌలభ్యం మరో సమస్యకు కారణమవుతోంది. మరొక రవాణా సాధనంపై ఆధారపడవలసిన అవసరాన్ని తప్పించే ప్రయత్నంలో మోటారు సైకిళ్లు, కార్లు ఇతర వాహనాలు వచ్చాయి. సామూహిక ప్రయాణాల కోసం ఆటోలు, బస్సులు కూడా రోడ్లపై తిరుగు తుంటాయి. గతంలో గుర్రాలు, ఎడ్ల బండ్లపై ప్రయాణించిన రోజుల్లోనూ ప్రమాదాలు జరిగాయి. కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. అయితే వ్యక్తిగత/ప్రజారవాణా లేదా ఆటోల వంటి వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రమాదాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్య కారణం మన నిర్లక్ష్యమే. రోడ్డుపై వాహనం నడుపుతున్న సమయంలో మరెన్నో వాహనాల రాకపోకలకు కూడా ఆ రోడ్డుపై ప్రయాణించే హక్కు ఉన్నదనే విషయం మరచి పోతున్నాం.చిన్నప్పుడు సివిక్స్‌లో రోడ్డుకు ఎటు వైపు నడవాలో, ఎప్పుడు రోడ్డును దాటాలో పాఠాలు చదివాం. వాటిని అప్పుడే సిగ్గుతో పాటు విసిరిపారేశాం. ప్రమాదాలకు ఏకైక కారణం మన దూకుడే. నేను నెమ్మదిగానే వెడుతున్నాను అనే వాదన ఎవరి మటుకు వారు చెప్పుకునే సమాధానం మాత్రమే. ఎడమ వైపునకు తిరగవలసిన వాహనదారు తన వాహనాన్ని ముందు ఓవర్టేక్‌ చేయడం ఎందుకు? ఆపై ఎడమవైపునకే హఠాత్తుగా తిరగడం ఎందుకు? ఇది మనం ఓవర్‌ టేక్‌ చేసిన వాహనదారుకు ఇబ్బంది కలిగించడమే కదా. ఈ ఓవర్టేక్‌ నియమాలు ఎవరికీ అసలే గుర్తుండడం లేదు. రోడ్డు మీద ఉన్న ప్రతీ వాహనానికీ కుడివైపు ఓ బారు, ఎడమ వైపు మరో బారు వాహనాలు వాటికి సాధ్యమైన వేగంతో పరుగులు పెడు తుంటాయి. మనం వెళ్లాల్సిన చోటికి చేరాలంటే అర కిలోమీటరు దూరం నుంచి జాగ్రత్త పడితే తప్ప సాధ్యం కాదు. నా బండికి బ్రేకులు ఎప్పుడైనా వేస్తా… నన్ను చూడగానే లేదా నేను చెవులు బద్దలయ్యేలా హారన్‌ మోగించగానే ఎవరైనా సరే దారి ఇవ్వాల్సిందే.. అన్న తీరు వాహనా లను నడిపే వాళ్లలో ఎక్కువయింది.

పాపం పాదచారులు..

వారికి ఎక్కడ నడవాలో అర్థం కాని అయోమయం. రోడ్డు ఉంటుంది. రోడ్డుకు రెండు ప్రక్కలా ఉండవలసిన పాదచారుల మార్గం మాత్రం ఉండదు. దానికి అడ్డంగా ఏ దుకాణాదారుడో సగానికి పైగా ఆక్రమించేసి తన సరుకు ప్రదర్శన ఇస్తుంటాడు. ఎక్కడైనా అలాంటి దుకాణం లేకపోతే దానిపై అడ్డంగా సరుకులు పరిచేసి అమ్ముకునేందుకు సిద్ధంగా ఉంటాడు మరో బడుగు వ్యాపారి. ఇంకా పెడస్టియన్‌ మార్గం మీదే చెట్లు ఉంటాయి. స్థంభాలు ఉంటాయి. టెలిఫోన్‌ బాక్సులు ఉంటాయి. ఎలాగో అలా రోడ్డుకు సాధ్యమైనంత ఎడమవైపున నడుద్దా మనుకుంటే అక్కడే తోపుడు బండ్ల వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. దాంతో రోడ్డు మీద నడిచే వాళ్లంతా అటూ ఇటూ వంకరలు తిరుగుతూ, వెనకా, ముందూ చూసుకుంటూ ఎలకలా అడుగులో అడుగేసుకుంటూ ముందు కెళ్లాల్సిందే.

మరి మన పాదచారులు రూల్స్‌ పాటిస్తారా? అబ్బే అలాంటిదేం లేదు. మాకు కనిపించిన ఖాళీ ప్రదేశంలో అడుగులు వేస్తాం. వాహనాల వాళ్లు ఎన్ని వంకరలు తిరుగుతూ అయినా సరే వాళ్లని తప్పించుకుంటూ రోడ్డు మీద వెళ్లాలి, రోడ్‌ క్రాస్‌ చేసేందుకు ప్రభుత్వం కొన్ని జీబ్రా మార్కులు రోడ్డు మీద వేసే ఉంచుతుంది. అవి కాలంతో పాటు కనుమరుగవుతాయి తప్ప వాటిని గమనించి ఉపయోగించే వాళ్లని వేళ్లలో లెక్కపెట్టవచ్చు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్‌ చేయడమే. సిగ్నల్స్‌ దగ్గర కూడా అటో ఇటో వస్తున్న వాహనాలను చూసీ చూడనట్టుగా వారు క్రాస్‌ చేస్తుంటే వాహనాలు విన్యాసాలు చేయాల్సిందే. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసులు ఉంటే వారి బాధ వారిదే. పోలీసు ఒకవైపు చూస్తుంటే మరో వాహనాన్ని పక్కనుంచి సిగ్నల్స్‌ ఉల్లంఘించే వాళ్లు ప్రతి అయిదు నిముషాల్లో దాదాపు పది పాతిక మంది ఉంటారు. సీసీ కెమెరాలు ఎక్కువ భాగం హెల్మెట్‌ లేని వాళ్లని ఫొటో తీయడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. జరిమానాలు ఆన్‌లైన్‌లో… ఎక్కడైనా పోలీసు పట్టుకుంటే వాటాల పద్ధతి ఉండనే ఉంది. ఆన్‌లైన్‌ జరిమానా చెల్లించేందుకు అధికారిక రికార్డులో ఉన్న చిరునామా ఎప్పుడో మారిపోయి ఉంటుంది. అంటే పోలీసుల నోటీసులు వాళ్లకి చేరవు. వాళ్లు ఆన్‌లైన్‌లో చూసుకోరు. చూసినా పట్టించుకోరు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌…

ఈ మధ్య పోలీసులు ఈ అంశంపై జోరుగానే కన్నేస్తున్నారు. ఎందుకు అనే ప్రశ్నలో అలాంటి వారి వల్ల ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశం అధికారిక మైనది. పట్ట పగలు ఆఫీసులకి వెళ్లే సమయంలో తాగి నడిపే వారి సంఖ్య ఎంత ఉండవచ్చు? సాయం కాలం వంద మంది ఉంటే పగలు పది మంది ఉంటారేమో? పగటి వేళ ప్రమాదాలకి ప్రధానమైన కారణం ఆలస్యంగా ఇంటి నుంచి బయలుదేరి అతి వేగంగా ప్రయాణించి గమ్యం చేరుకోవాలనే తాపత్రయమే. నిజానికి ఇది సమయపాలనలో మన నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పోలీసుల గణాంకాల ప్రకారం 2018లో జూన్‌ వరకు పట్టుబడిన కేసులు 14,440. వాటిలో జైలు శిక్షలు పడిన కేసులు కేవలం 2503. ఇదే కాలంలో పోలీసులు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి నుంచి వసూలు చేసిన జరిమానా మొత్తం రూ.3కోట్లకు పైనే. ఇదే సంవత్స రంలో జూన్‌ వరకూ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1221కాగా, గాయపడినవారి సంఖ్య ఊహించుకోవచ్చు.

పరిష్కారం మన చేతుల్లోనే..

నిజానికి ఈ అంశం సగటు జీవికి ఇబ్బంది గానే ఉంది. కానీ దీని మీద పెడబొబ్బలు పెడుతు న్నది మాత్రం రాజకీయ పార్టీలే. ఎందుకంటే మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ వాడకం చాలా ఎక్కువే. ఆశ్చర్యంలేదు, అభివద్ధి దిశగా పరుగులు తీస్తున్న వ్యవస్థలో రకరకాలుగా వాహనాలు, వాటి ఇంధనం వినియోగం రోజురోజుకీ పెరిగే మాట వాస్తవం. ఇక పెట్రోలు ఉత్పత్తుల ధరలు పెరగడానికి ముఖ్య కారణం వాటి వినియోగంలో విపరీతపు పోకడలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఖార్సయిన ఆదాయం కోసం వీటిపై విధిస్తున్న పన్నులు, సుంకాలు. ప్రభుత్వాల ఆశ తీరు ఎలా ఉందంటే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే కేంద్రానికి రూ. 25,318 కోట్లు పెట్రోల్‌ ద్వారా, 46,548 కోట్లు డీజిల్‌ ద్వారా ఆదాయం వచ్చింది. పదే పదే పేపర్లు చెబుతూనే ఉన్నాయి-అంతర్జాతీయ మార్కెట్‌ ధరవరలతో సంబంధం లేకుండా ధరలు పెరిగి పోతున్నాయని, ఇక్కడ గమనించవలసిన విషయం – ఆదాయమే పరమావధిగా పెరిగిపోతున్న ప్రభుత్వాల అత్యాశకు కత్తెర వేయడానికి మన దగ్గర కొన్ని మార్గాలున్నాయి. అవి మనం ఇంధనం వాడకాన్ని తగ్గించుకోవడమే. ఇదెలా, అంటే పోలీసులే మార్గం కూడా చూపిస్తున్నారు, ఒకే చోటికి, ఒకే సమయానికి వెళ్లే వారంతా వాహన సదుపాయాన్ని షేర్‌ చేసుకుంటే ట్రాఫిక్‌ సమస్యా పరిష్కారమవుతుంది. ఇంధనాల వినియోగం తగ్గుతుంది. వాళ్లే చెప్పే మరో ప్రత్యామ్నాయం… సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ రవాణాను ఉపయో గించుకోవడం. ఈ రెండింటికీ మన మానసిక దక్పథమే అడ్డంకిగా ఉంది. కాస్త ఆదాయం ఉన్న వాడు ఇతరులతో షేర్‌ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడు. కనాకష్టంగా ఉన్నా తన తిప్పలేవో తానే పడదామని అనుకునే ఓ మోస్తరు సంసారి. ఫలితం ఆఫీసుకెళ్లాలన్నా వాహనం, స్కూలుకు, కాలేజీకి వెళ్లాలన్నా వాహనం, మార్కెట్‌ కెళ్లాలన్నా వాహనం. ఒక్క ముక్కలో చెప్పాలంటే సందు చివర ఉన్న షాప్‌ దగ్గరికి కూడా నడవడం నామోషీగా మారింది. ఇది పెట్రోల్‌ లేదా డీజిల్‌, లేదా విద్యుత్‌ వినియోగంలో విచ్చలవిడి తనాన్ని తగ్గిస్తే.. ఫలితం మన చేతిలోనే మిగులుతుంది.

– సూరంపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *