నడిచే రామకోటి పుస్తకాలు

నడిచే రామకోటి పుస్తకాలు

కారడవిలో ఒంటరిగా పడున్నాడతడు. ముఖం చూస్తే ఏడ్చి ఏడ్చి సొలసినట్టు తెలుస్తోంది. కన్నీళ్ల చారికలు కనిపిస్తున్నాయి. అతను ఆహారం మానేసినట్టు బక్కచిక్కిన దేహం చెప్పకనే చెబుతోంది. అలా ఎన్ని రోజులు పడున్నాడో తెలియదు. అతని పెదవులు వణుకుతున్నాయి. కాదు కాదు కదులుతున్నాయి. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ‘రాం… రాం … రాం…’ మరో మాట లేదు. ఒక్క ‘రాం రాం రాం’ తప్ప.

అతని పేరు పరశురాం. ఊరు ఛపారా. రాయగఢ్‌ జిల్లా. రాముడంటే అతనికి ఎంతో ఇష్టం. రాముడే అతని దేముడు. కానీ రాముడి గుడిలోకి మాత్రం అతడిని రానీయరు. అందుకే పూజారులు, ఊరి పెద్దల మీద, ఊరి మీద కోపం వచ్చింది. అన్నం, నీళ్లు మానేసి అడవిలోకి వచ్చేశాడు. అతని నోట్లో, నాలుకపై, మనసులో, బుద్ధిలో, ఆత్మలో, నరనరాల్లో, ప్రతి రక్తకణంలో కేవలం ‘రాం… రాం… రాం…’

ఉన్నట్టుండి అతని ముఖంపై ఏదో తెలియని వెలుగు ఆవరించింది. కష్టం, క్లేశం, వేదన, రోదన ఎక్కడికో వెళ్లిపోయాయి. తెలియని ప్రశాంతత ముఖంపై కాంతిరేఖలు గీసింది. ఒళ్లంతా జలదరించినట్లు, ఏదో తెలియని శక్తి ఒక్క కుదుపు కుదిపినట్టు అయ్యింది. కళ్లు తెరిచాడు. తన హృదయాంతరాల నుంచి ఒకే మాట కేకలా వినిపించింది.

‘రాం….’

ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. లేచి పరుగులు తీశాడు. ‘రాం … రాం… రాం..’ అంటూ తోటి వనవాసుల దగ్గరికి వెళ్లాడు. ‘నాకు రాముడు కనిపించాడు..నాకు రాముడు కనిపించాడు…’ ఊరు ఊరంతా అతని దరి చేరింది. ‘గుడిలోకి పెద్దలు రానీయకపోతే కోపంతో అడవిలోకి వెళ్లిపోయాను. అక్కడే ‘రాం రాం’ అనుకుంటూ ఉండిపోయాను. రాముడు కలలోకి వచ్చాడు. ‘పరశురాం నీ మనసులో, బుద్ధిలో, ఆత్మలో, నరనరాల్లో, ప్రతి రక్తకణంలో నేనే ఉన్నాను కదా! అలాంటప్పుడు నీ తనువంతా రామనామం రాయించుకో. నీ దగ్గరే ఉంటాను. గుడిలో ఉన్నది ఉట్టి బండరాయి. నీ తనువంతా రామమయమే. నీ రోమరోమాల్లోనూ రామమయమే’ అన్నాడని చెప్పాడు.

పరశురాం ఒళ్లంతా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ముఖం, కనురెప్పలు, పెదవులు, చెవులు, చేతులు, ఛాతీ, అరచేయి, కాలు, వీపు అంతా రామమయమే.

అది 1894. పరశురాం ‘రామనామీ’ అయ్యాడు. ఊరురూ తిరగడం మొదలుపెట్టాడు. ఆయన్ని చూసినవారు ‘రాం రాం’ అన్నారు. క్రమేపీ చినుకులా మొదలైన రామనామ ఉద్యమం వరదగా మారిపోయింది. నేటి ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌, బిలాస్‌పూర్‌, రాజ్‌గఢ్‌, రాయపూర్‌ జిల్లాల్లోని గ్రామాల బడుగులందరూ రామమయమైపోయారు. వాళ్ల పలకరింపులు రామమయం. వారి శరీరం రామమయం. వారి దేవాలయంలోనూ రామ నామం తప్ప మరేమీ ఉండదు.

వారికి రామనామం పచ్చబొట్లు పొడిపించుకోవడమే ఏకైక మత కర్మ. పద్దెనిమిది రోజుల పాటు నియమనిష్ఠలతో ఈ పనిని చేస్తారు. వారికి పరిచయాలు అక్కర్లేదు. ఐడెంటిటీకి ఆధార్‌ కార్డులు అక్కర్లేదు. రామనామం ఒంటిపై ఉన్నవారంతా వారికి ఆత్మీయులే.

రాముడి గుడిలోకి రానీయని వాళ్లు సైతం ఆ భక్తులను రామనామీలు అని పిలవడం మొదలైంది. వారి పేరు రామనామీలైపోయింది. అలా రామనామీ సంప్రదాయం మొదలైంది. వాళ్లే రామనామీ తెగ వారయ్యారు.

ఆఖరికి రామ నామం ఒంటిపై పచ్చబొట్టు పొడింపించుకోవడానికి వీల్లేదని కొందరు కోర్టుకెక్కారు. కానీ 1911లో కోర్టు రాముడు అందరి వాడేనని తీర్పు చెప్పడంతో వాళ్లు తమ పోరాటానికి ‘రాం రాం’ చెప్పేశారు.

రామనామీలు వాళ్లని ఏమీ అనలేదు. కేవలం ‘రాం రాం’ అన్నారు. రాముడు మా సొంత అన్న వాళ్లకు రాయి మిగిలింది. రాముడు అందరి సొత్తు అన్న వాళ్ల తనువంతా రామకోటి పుస్తకమైపోయింది. తనువనే తంబూరాలోని శ్వాస అనే తీగ రామనామాన్ని జీవరాగంలా పలకడం మొదలుపెట్టింది.

ఎప్పుడైనా ఛత్తీస్‌గఢ్‌ వెళ్తే కొంచెం లోపలి గ్రామాలకు వెళ్లండి. అక్కడ మహానది ఒడ్డున ఉన్న గ్రామాలను చూడండి. రచ్చబండ మీద కూచునో, ఆవుల్ని మేపుతూనో, నాగలి దున్నుతూనో, అన్నం వండుతూనో అణువణువునా ప్రాణం ప్రవహిస్తున్న రామకోటి పుస్తకాలు కనిపిస్తాయి. వాటికి మనసు తీరా ‘రాం … రాం…’ చెప్పి రండి.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *