ప్రదక్షిణం

ప్రదక్షిణం

పుల్వామా సంఘటనకి ప్రపంచం నిర్ఘాంత పోయింది. దేశం ఆవేశంతో ఉడికిపోయింది. ఉద్రేకంతో ఎదురుదెబ్బ తీయాలని పిడికిలి బిగించింది. హింసాకాండలో కన్నుమూసిన 40 మంది వీరుల అంత్యక్రియలను చూసి 24 గంటలలో కోట్లాదిమంది కన్నీరు కార్చారు. ఆవేశం కార్యసాధకుడి ఆయుధం కాదు. ప్రతీకారం పళ్లు కొరకదు. ఒకే ఒకమాట.. అదే మొదటి మాట.. మోదీగారన్నారు ‘ప్రాణాలర్పించిన వీరుల త్యాగం ఊరికే పోదు’ అని. ఈ వాక్యాన్ని ఒక చానల్‌ పదేపదే ప్రకటించింది. ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? చేశాక కానీ దేశానికి తెలియదు. చెయ్యడం పాకిస్తాన్‌కి తెలియదు.

నేను నటుడిని. కెమెరా ముందు సంవత్సరాల తరబడి నిలబడినవాడిని. కెమెరా నటనను పట్టు కుంటుంది. మరొకటి కూడా పట్టుకుంటుంది. నటుడి తాదాత్మ్యాన్నీ, మానసిక స్థితినీ, అంతరాంతరాల్లో పాత్రపట్ల అతని నిజాయితీని పట్టుకుంటుంది. ఇది దాచినా దాగని నిజం. ఈ నిజం ఒకప్పుడు తుపాకీ లాగా పేలుతుంది.

గుండెల్ని పిండి చేస్తుంది. నేను గతంలో చేసిన కొన్ని పాత్రల్ని చూసినప్పుడు ‘ఈ సన్నివేశంలో ఈ ఉద్రేకం ఇంత పండిందేమిటి’ అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి ఇంగ్లిష్‌లో ఒక పేరుంది.. పశీసవ body language. ఒక వ్యక్తి ‘జీవుని వేదన’. ఇది మరీ పెద్దమాట కనుక మొహమాట పడుతూ ఉటంకిస్తున్నాను. ఇది ప్రయత్నించినా నటుడు సంధించలేడు. కానీ అతని నిజాయితీ, తాదాత్మ్యం అతను ప్రయత్నించకపోయినా విద్యుత్తు లాగా విస్ఫోటనమవుతుంది.

40 మంది వీరుల మృతదేహాలు ఢిల్లీ చేరాయి. అధికారగణం, మూడు సైనిక దళాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు త్రివర్ణ పతాకాలు చుట్టిన యువ సైనికుల దేహాల ముందు నిలబడ్డారు. అది అతి హృదయ విదారకమైన దృశ్యం. ఎంతటి వాడికయినా గుండె చెరువు అవుతుంది. వందల కెమెరాలు ఆ దృశ్యాన్ని చూపుతున్నాయి. ఒక్కరే.. ఒకే ఒక్కరు.. ఆ మూడ్‌లో లేరు. ఆయన పేరు రాహుల్‌గాంధీ. ఆయన మొబైల్‌ ఫోన్‌ సవరించుకుంటున్నారు. దేశమంతా ఆ దృశ్యాన్ని చూస్తోంది.

ఎదురుగా అతి గంభీరంగా, నిశ్చలంగా ఆవేశాన్ని పూరించిన ముఖంతో ఒకాయన నిలబడి ఉన్నారు.. మోదీ. Last post మోగింది. మహావీరు లకు జరిపే అంతిమ సైనిక వందనమది. ప్రయ త్నించినా కళ్లు వర్షించకుండా ఆగని సందర్భమది. ఆ సందర్భంలో మోదీ ‘ప్రతీకార వాంఛ’, ‘కోపం’, ‘నిస్సహాయత’ నిప్పు అక్కరలేకుండా కార్చిచ్చుని లేపగలదు.

సైనిక మర్యాద అయిపోయింది. ఇక ఆ మృతదేహాలు వారి వారి జన్మస్థలాలకు ప్రయాణం చేస్తాయి. అక్కడ వారికి నివాళి అర్పించే ఆత్మీయుల, ఆవేశపరుల సమూహాలు ఎదురుచూస్తున్నాయి. ఈ యువకులతో ఆఖరి ప్రమేయమది. ప్రధాని ‘మర్యాద’ ఓ క్షణం ముందు ముగిసింది. కానీ మోదీ ఆవేశం, ఆ యువవీరులతో పంచుకునే ఆఖరి సందేశం ముగియలేదు. మోదీ వెనక్కి వెళ్లలేదు. వందనంతో వైదొలగలేదు. ఆ 40 మంది చుట్టూ ప్రదక్షిణం.. గంభీరంగా ప్రదక్షిణ చేశారు. పేరు పేరునా ‘శపథం’ చేశారా? ఆఖరి సందేశం ఇచ్చారా? మూగగా ఆక్రోశించారా? ఎదురుగా ఉన్న ప్రముఖుల సమూహం నివ్వెరపోయింది. అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. మోదీ 40 మందినీ పేరుపేరునా పలుకరించే ఆఖరి ప్రదక్షిణ చూస్తూనే టీవీ ముందు నేను భోరుమన్నాను. పసివాడిలాగా ఏడ్చాను. తన ఆత్మీయుల్ని నష్టపోయిన ఓ కుటుంబ నాయకుని ఆక్రందనకి కార్యరూపమది.

ఈ చర్యకి ప్రోద్బలమూ లేదు. ప్రయత్నమూ లేదు. ప్రయత్నించి ఎవరూ చేయలేరు. జీవుని అంతరాంతరాళాలలో వేదనకి, ఆకస్మికమైన మాటలకు అందని కార్యరూపమది. దాని పేరే పశీసవ body language.
సైనిక వందనం తర్వాత అవనత శిరస్కుడై ప్రధాని అక్కడ నిలిచిపోయాడు. ఈ కాలమ్‌ ప్రధానమంత్రి గురించి కాదు. నరేంద్రమోదీ గురించి కాదు. నాలుగైదు సంవత్సరాల బిడ్డలున్న పాతికేళ్ల కుర్రాళ్లు.. ఇంకా పసుపు ఆరిపోని తాళిబొట్లున్న భార్యలు ఇళ్లల్లో ఎదురు చూస్తుండగా దౌర్జన్యకారుల దౌష్ట్యానికి శరీరాలు గుర్తుపట్టలేనంత ఛిద్రంకాగా, మరికొన్ని గంటల్లో వారి అవశేషాలు మంటల్లో ఆహుతి కానుండగా.. గుండెలు మండే ఆవేశంతో ఓ పెద్ద దిక్కు వారికి అంతిమ సందేశాన్ని, నివాళిని, ఊరటని, హామీని, మరొక్కసారి గుండెనిండా కర్తవ్యదీక్షని పూరించుకునే వ్యక్తిగత క్షణమది.

జీవుని వేదన తోసుకురాగా.. ఓ అగ్నిపర్వతం, ఓ మానవత్వపు మమకారం ఆ 40 మంది సమక్షంలో గుండెల్ని పూరించుకుంది. వారి రక్త తర్పణానికి కృతజ్ఞత తెలిపింది. ఆ జ్ఞాపకాన్ని తాను ముందు జరపబోయే చర్యకి మనస్సులో నిక్షిప్తం చేసుకుందా? ఆ క్షణం ఓ ఆర్ద్రమైన విషాదానికి ముగింపు. ఓ నిర్నిద్రమైన ఆవేశ దీక్షకి ప్రారంభం. ఆ క్షణంలో అతను ప్రధాని కాదు. అవును.

He is larger than life.

– గొల్లపూడి మారుతీరావు
(సాక్షి దినపత్రిక, 21 ఫిబ్రవరి సౌజన్యంతో..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *