ఈ గుడి గురించి తెలుసా ?

ఈ గుడి గురించి తెలుసా ?

తలపై కుంపటి.. చేతుల్లో వరదరాజ పెరుమాళ్‌ దేవతా మూర్తి.. ఆ కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలు.. అయినా పెరుమాళ్లు పంతులు కళ్లలో మాత్రం మిలమిలలాడే కృతసంకల్పం, తళతళలాడే దృఢనిశ్చయం మాత్రమే కనిపిస్తున్నాయి.

జనం వేల సంఖ్యలో పోగై పెరుమాళ్‌ను, ఆయన చేతుల్లోని పెరుమాళ్‌స్వామిని చూస్తున్నారు. భక్తితో జోతలు చేస్తున్నారు. పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు. అక్కడ నవాబు సైన్యం మొహరించింది. జాగీర్దారు వచ్చి ఓ కుర్చీపై కూర్చున్నాడు.

కంచికి వెళ్లి వరదరాజ పెరుమాళ్‌ని దర్శించు కొని వస్తూ నా ఊరిలోనూ వరదరాజ పెరుమాళ్ల గుడి కట్టుకుంటానని గూడ పెరుమాళ్లు పంతులు అనుకున్నాడు. అనుకోవడమేమిటి విగ్రహాన్ని చేయించుకుని, అపార భక్తి శ్రద్ధలతో, అనంత పారవశ్యంతో తలపై మోసుకొస్తున్నాడు. సరిగ్గా మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలానికి వచ్చే సరికి నవాబు సైనికులు ఆగమన్నారు.

విగ్రహాన్ని పెట్టడాన్ని, గుడి కట్టడాన్ని ఒప్పుకునేది లేదని దబాయించారు. ‘నా దేవుడి గుడిని నేను కట్టు కుంటాను. నన్నూ నా దేవుడిని వదిలేయండి’ అని పెరుమాళ్లు పంతులు వేడుకున్నాడు. అది విని నవాబు సైనికులు పగలబడి నవ్వారు. తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు అనుమతిస్తానన్నాడు జాగీర్దారు. పెరుమాళ్లు పంతులు అంతే పట్టుదలగా ‘నా పెరుమాళ్లుకి ఈ పెరుమాళ్లు భక్తుడు. నా భక్తే నిజమైతే నడవటం ఏమిటి? పరిగెడతాను కూడా!’ అన్నాడు.

‘అయితే ఒక షరతు. కుంపట్లో బొగ్గు మసి కాకూడదు. నీకు వేడి తగలకూడదు’

‘నా పెరుమాళ్లు ప్రహ్లాదుడిని రక్షించాడు. గజేంద్రుడిని కాపాడాడు. నన్నూ కాపాడతాడు’.

‘పాగల్‌ బొమ్మన్‌’ పగలబడి నవ్వాడు జాగీర్దారు.

‘నాదీ ఒక షరతుంది ఒప్పుకుంటావా జాగీర్దార్‌ సాబ్‌’

పెరుమాళ్లు గొంతు పెనుసింహం గర్జనలా ఉంది.

‘నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంత మేర భూమిని నాకిచ్చేయాలి. నా దేవుడికి గుడి కట్టుకునేందుకు’.

సరే కానిమ్మన్నాడు జాగీర్దార్‌.

జాగీర్దార్‌ది హిరణ్య కశిపుడి అహంకారం.

పెరుమాళ్లుది ప్రహ్లాదుడి భక్తి.

పెరుమాళ్లు రోజు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. అలసట లేదు. ఆయాసం లేదు. ఆగలేదు… అమ్మా అనలేదు. అయ్యా అనలేదు. వరదరాజ స్వామి వరద హస్తం తలపైనుందో లేక నరసింహుడే ఆవహించాడో తెలియదు కానీ పదిహేను వందల ఎకరాలు చుట్టి వచ్చి, జాగీర్దార్‌ ముందు కుంపటి దించాడు. బొగ్గు బూడిద కాలేదు. కణకణ మండుతూనే ఉంది. పెరుమాళ్లు తలపై కనీసం మాడినట్టుగా మచ్చ కూడా లేదు.

ఖంగుతిన్న జాగీర్దార్‌ ‘తూ జీత్‌ గయారే బొమ్మన్‌’ అని గుడి కట్టుకోవడానికి అనుమతిచ్చాడు. అంతేకాదు పదిహేను వందల ఎకరాలూ వదులు కున్నాడు.

ఆ పదిహేను వందల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా తన కోసం దాచుకోలేదు పెరుమాళ్లు పంతులు. మొత్తం గుడి కట్టించాడు. సువిశాలమైన గుడి, బృహదాకారపు కోనేరు, వసతి గృహాలు, మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజ గోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం.. వీటన్నిటిని చూస్తే పెరుమాళ్లు పంతులు సమర్పణ భావం కనిపిస్తుంది. తన సంపదను దేవుడికి ఇచ్చాడు. నగలు, కిరీటాలు, వడ్డాణాలు, యజ్ఞోప వీతాలు చేయించాడు. పదహారు మంది పూజారుల్ని నియమించాడు. పండగలు, పబ్బాలు, జాతరలు, తీర్థాలకు లోటు లేకుండా చేశాడు. వరదరాజుల వారికి రక్షణగా ఊరి మొదట్లో అంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాడు. ఊళ్లో గుడి వెలియలేదు. గుడి చుట్టూ ఊరు వెలిసింది.

వరదరాజ స్వామి పేరిట వరదరాజపురం ఏర్పాటైంది. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలో వరదరాజు ఇప్పటికీ ఉన్నాడు. పెరుమాళ్లు పంతులు వారసులు నాలుగువందల యాభై ఏళ్లుగా సేవలంది స్తూనే ఉన్నారు. పరంపరాగత ధర్మకర్తలుగా కొనసాగు తూనే ఉన్నారు. అలనాటి పూజారుల వారసులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దేవుడిని నమ్ముకుని పూజలు చేస్తూనే ఉన్నారు.

ఇది నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం సంగతి. ఇదంతా కట్టుకథ అనుకునేవాళ్లు, స్థానిక జన సందోహం చేసిన ధార్మిక విప్లవానికి ముస్లిం నవాబు తలొగ్గాడని టీకా చెప్పుకోవచ్చు. రామదాసు భద్రాచలం గుడి కట్టడం హైందవ జన చైతన్యానికి ఎలా ప్రతీకో, వరదరాజపురం గుడి కూడా అలాగే ఒక ధార్మిక జన విప్లవ ప్రతీక.

అయితే ఇప్పటి తరానికి ఈ గుడి కథ తెలియదు. దీని గొప్పదనం తెలియదు. ఎప్పుడైనా రాత్రి నిద్ర చేయాల్సి వస్తే మాత్రం పది ఊళ్లకి వరదరాజస్వామే దిక్కు.

టాల్‌స్టాయ్‌ కథ ఒకటుంది. ఓ రైతు రోజంతా ఎంత మేర నడిస్తే అంత భూమి ఇస్తానని జమీందారు చెపుతాడు. అయితే మొదలుపెట్టిన చోటుకి తిరిగి రావాలని షరతు పెడతాడు. ఆశ, ఆత్రం కలగలిసి రైతు పరుగు పెట్టి పెట్టి చివరికి గమ్యం చేరకుండానే చనిపోతాడు.

వరదరాజపురంలో పెరుమాళ్లు పంతులు కూడా రోజంతా తిరిగాడు. అదీ తలపై కుంపటి పెట్టుకుని. ఈయన చనిపోలేదు. ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాది రాయిలో ఇంకా బతికే ఉన్నాడు. తన కోసం చేసుకునే దానికి, ధర్మం కోసం చేసే దానికి ఉన్న తేడా అది.

వీలైతే ఒక్కసారి వరదరాజపురం వెళ్లండి. వరాలిచ్చే వరదరాజుని దర్శించుకోండి. తరతరాలుగా గుడిని నమ్ముకుని బతుకుతున్న పూజారికి దక్షిణ ఇవ్వండి. శతాబ్దాలుగా గుడికి పోషకులుగా ఉన్న గూడ పెరుమాళ్లు వారసుల ఫోటోలను చూసి దండం పెట్టుకోండి.

ఎలా వెళ్లాలి?

ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్‌ నుంచి కుశాయిగూడా, కీసర గ్రామాలు దాటి అంకిరెడ్డిపల్లె చౌరస్తాకి వెళ్లాలి. అక్కడ నుంచి మూడు చింతల క్రాస్‌రోడ్‌ చేరుకుని, కరకపట్ల ఊరు దాటాలి. ఆ తరువాత ఎనిమిది కి.మీ. వెళ్తే వరదరాజుపురం వస్తుంది. దాదాపు నలభై కిలోమీటర్ల ప్రయాణం. లేదా షామీర్‌పేట దాటి ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా వెళ్లి, అక్కడ కుడి వైపుకి తిరిగి పన్నెండు కి.మీ. వెళ్తే వరదరాజపురం చేరుకోవచ్చు. ఈ దారిలో సిద్ధిపేట-భోనగిర్‌ బస్సులు కూడా వెళ్తాయి.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *