పంచ్‌

పంచ్‌

‘మోదీ, రాహుల్‌ వస్తారు, వెళతారు. కానీ తెరాస ఎప్పటికీ ఉంటుంది.’

– ఎంపీ కల్వకుంట్ల కవిత

ఆ కవిగారి కవితాత్మని కవితమ్మగారు ఎంత లాఘవంగా క్యాచ్‌ చేశారో కదా! ఇందులో వింతేం లేదు. ఎవరు ఏది క్యాచ్‌ చేయాలో అదే చేస్తారు. మనుషులు వస్తారు, పోతారు.. నేను మాత్రం ఎప్పటికీ ఉంటానంటుంది ఆ కవితలో ప్రవాహం. కవితమ్మ మనసులోని భావం స్వచ్ఛమైన నీటిలాగే ఉంది- ఎప్పటికీ తెరాసయే ఏలాలని. నిజమే కదా! ప్రస్తుతం కేసీఆర్‌గారి పాలన నడుస్తోంది. వరసలో కేటీఆర్‌ ఉన్నారు. ఆపై కవితగారు రాజకీయ పరిణతితో వెలుగొందుతారు. ఈ మధ్యలో అవకాశం కనుక ఇస్తే హరీశ్‌రావు కాదంటారా? ఆ తరువాత కేటీఆర్‌ కుమారులకీ సేవాభావం అంకురిస్తుంది. అన్నట్టు కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్టు సంతోష్‌ అనే కేసీఆర్‌ సమీప బంధువూ ఉన్నారు. తెలంగాణకీ, ఇక్కడి ప్రజలకీ తమ వంతు సేవ చేసుకుని అవకాశం వీరెల్లరకూ రావాలంటే తెరాస ఎప్పటికీ (షరా: అధికారంలో) ఉండాలి కదా!

‘పీపుల్స్‌ ఫ్రంట్‌ ఓడినా, గెలిచినా అందుకు నేనే బాధ్యత వహిస్తాను’

– ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్‌ నినాదం ఇచ్చిన ఉత్తమ్‌గారు ఇప్పుడు ఇలా రెండు అవకాశాలూ తానే వినియోగించుకోగలనని జబ్బ చరచడం బొత్తిగా అప్రజాస్వామికం. స్వార్థం. చివరికి తనతో సహా ఈ నినాదాన్ని టీ.కాంగ్రెస్‌ వారు మూకుమ్మడిగా, ఏకాభిప్రాయంతో, దిగ్విజయంగా తుస్సు మనిపించారు. అది వేరే విషయం. ఇంత జరిగిన తరువాత కూడా ఉత్తమ్‌ గారికి కాంగ్రెస్‌ సంస్కృతి అర్థం కాలేదా ఏమిటి? ఫ్రంట్‌ ఓడిపోతే అందుకు బాధ్యత వహించే సదవకాశాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిస్సంకోచంగా ఉత్తమ్‌గారికే ఇస్తుంది. సందేహం లేదు. తీరికగా చింతించే అవకాశం కూడా ఇస్తూ పీసీసీ బాధ్యత కూడా లాగేసుకో వచ్చు. కానీ గెలిస్తే మాత్రం ఆ సంతోషాన్ని ఆయన తట్టు కుంటారో లేదోనని, ఆయన శ్రేయస్సు కోరి ఆ బాధ్యతను అధిష్టానమే సవినయంగా స్వీకరిస్తుంది. గుర్తుంచు కోండి.

‘కాంగ్రెస్‌ మోసం చేసింది.’

– ప్రొ. కోదండరామ్‌

ఆయన పొలిటికల్‌ సైన్సు ప్రొఫెసరే కావచ్చు. కానీ ఆయన ‘అభిమాన’ సిద్ధాంత గ్రంథాలతో పాటు ఎప్పుడైనా కాంగ్రెస్‌ గురించి కూడా ఓ నాలుగు వాక్యాలు చదివితే ఆ సంగతి ఆచార్యుల వారికి అలనాడే తెలిసేది. మోసం కాంగ్రెస్‌ పార్టీ నైజం కదా ! ఇంతకీ తెజసకు జరిగిన మోసం ఏమిటి ? మహా కూటమి భాగస్వామి అయిన తెజసకు ఎనిమిది స్థానాలు కేటాయిస్తాం అందట కాంగ్రెస్‌. ఆఖరికి నాలుగు ప్రసాదించిందట. అందులో రెండు తెజస త్యాగం చేసిందట. మిగిలిన రెండైనా దక్కాయా? దక్కాయి. కానీ అక్కడ కాంగ్రెస్‌తో స్నేహపూర్వక పోటీ ఉన్నదట. నిజమే పాపం, సీపీఐ, తెజస సీట్ల వాటాకి కాంగ్రెస్‌ పెట్టిన కోతని చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది. తక్కెడలోని రెండు పళ్లేలలోని రొట్టె ముక్కలనీ పంపకం పేరుతో కొంచెం కొంచెంగా కోతి ఆరగిస్తున్న దృశ్యం గుర్తుకు వస్తోంది. అందుకే గిరీశం అన్నాడు, ‘ఆత్మానుభవం అయితే గానీ తత్వం బోధపడదు’ అని. ఆచార్యులు వారికి ఇప్పుడు అలాంటి తత్వం ఏదో బోధపడుతున్నట్టే ఉంది.

‘సభలకైతే సరే, ప్రచారానికి రాలేం!’

– కిరాయి కార్యకర్తలు

‘వెయ్యి రూకలు పోసినా సరే, ప్రచారానికీ, ప్రదర్శనలకీ మాత్రం రాలేం, రాలేమంటే రాలేం’ అంటున్నారట అద్దె కార్యకర్తలు. ఈ మధ్య కిరాయి కార్యకర్తలకి బాగా గిరాకీ పెరిగిపోయిందట. షిఫ్టుల ప్రకారం పని చేసుకుంటూ సర్దుకుంటున్నారట. ఉదయం ఒక పార్టీ తరఫు కార్యకర్త అవతారం ఎత్తితే, మధ్యాహ్నం మరో పార్టీ కార్యకర్త వేషం వేస్తున్నారట పాపం. ఇదైనా సభల వరకే. అదే ప్రచారానికి రమ్మంటే మాత్రం ససేమిరా అంటున్నారట. ఎక్కడొస్తాం. కాళ్లరిగిపోయేటట్టు నడవాలి. గొంతెండి పోయేటట్టు అరవాలి. ఇవన్నీ ఎందుకు? సభలకైతే రెడీ అంటున్నారట అద్దె కార్యకర్తలు. అయినా ఈ మధ్య చాలా రాజకీయ పార్టీలకి కేడర్‌ కొరత తీవ్రంగా ఉందట. దానిని కిరాయి కార్యకర్తలతో భర్తీ చేసుకుంటూ నెట్టుకువస్తున్నారు. ఈ ఎన్నికలేమోగానీ చెరకు కొట్టడానికి కూలీలు దొరకడం లేదు మొర్రో అంటున్నాడు నారాయణఖేడ్‌ రైతు ఒకరు.

‘కాంగ్రెస్‌ పాల్తొనే వేదికలను పంచుకోబోమని సీపీఎం చెప్పడం సబబుగా లేదు. వామపక్షాల్లో ఐక్యత లేదు. సీపీఎం చేస్తున్న గ్లోబెల్‌ ప్రచారం లెఫ్ట్‌ల మధ్య దూరం పెంచుతుంది.’

– సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి

సీపీఎం వారికి తెలంగాణ కాంగ్రెస్‌ కంటే ఢిల్లీ స్థాయి కాంగ్రెస్‌లోనే సెక్యులరిజం చిక్కగా కనిపించి ఉండాలి. అయినా రాహుల్‌తో కలసి ఫోటో దిగితే ఆ వెలుగే వేరు. ఉత్తమ్‌తోనో, రేవంత్‌తోనో ఫొటో దిగితే టాబ్లాయిడ్‌లకే పరిమితం కదా! అదలా ఉంచుదాం. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందని, ఇప్పుడు ఈ వామపక్షాలు ఏకమైతే ఈ దేశానికి ఒనగూడే ప్రయోజనం ఒక్కటైనా ఉందా? వామపక్షాల్లో ఐక్యత కాగడా వేసి వెతికినా దొరకదనీ, ఇక రాదనీ యాభయ్‌ ఏళ్లుగా దేశమంతా కోడై కూస్తుంటే అదేదో కొత్త విషయమన్నట్టు చాడాజీ ఇప్పుడు చెప్పడం వింతల్లోకెల్లా వింత కదా! మరీ చిత్రం- వారికి సీపీఎం మాటల్లో కూడా గోబెల్స్‌ దర్శనమిచ్చాడు. కాబట్టి ఆ మాట బీజేపీవారిని అంటే పెద్దగా బాధ పడక్కరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *