‘న్యాయ్‌’ పథకం వాస్తవాలు

‘న్యాయ్‌’ పథకం వాస్తవాలు

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూండటంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే తపనతో ఉన్న కాంగ్రెసు పార్టీ అలవికాని హామీలతో అమాయక ఓటర్లకు గాలం వేసేపనిలో పడింది. దేశంలోని పేదలందరికీ నెలకు ఆరువేల చొప్పున సంవత్సరానికి 72 వేల రూపాయలను అందించే ‘న్యాయ్‌’ పథకాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 25 మార్చి 2019న ప్రకటించారు. దీనిపై ఎలాంటి అధ్యయనం చేయకుండా కేవలం ఎన్నికల ఎత్తుగడగా రాహుల్‌ దీన్ని ప్రకటించారు. అధ్యయనం చేయలేదనే విషయం విలేకరుల సమావేశంలో ఆయనే చెప్పారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను ఎలా సేకరిస్తారు? అర్హులను ఎలా గుర్తిస్తారు? ఎంత మందికి చెల్లిస్తారు? వంటి కసరత్తులు ఏమీ చేయకుండా ఉన్నపళంగా ఎన్నికల సభలో రాహుల్‌ ఈ పథకాన్ని ప్రకటించివేసారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలను కనీసం అధ్యయనం చేయకుండా దీన్ని ప్రకటించడంతో ప్రజలు, ఆర్ధికవేత్తలు దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెసు అనుకూల నకిలీ లౌకిక ప్రజాస్వామ్యవాదులు రాహుల్‌ను అభినవ ఆర్థికవేత్తగా వర్ణిస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినపుడు ‘ఇది సాధ్యం కాదు, ఈ పథకం రైతులను సోమరిపోతులను చేస్తుంది’ అని విమర్శించిన ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ న్యాయ్‌ పథకం బ్రహ్మాండంగా ఉందని, దీనికి నిధులను సేకరించడం పెద్ద సమస్య కాదంటూ రాహుల్‌ను భుజాలకు ఎత్తుకుని మోస్తున్నాడు. ఈయన తనను తాను ప్రపంచ మేధావిగా భావిస్తుంటాడు. దేశంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడితే తాను ఆర్థికమంత్రిగా ఈ వ్యవహారాన్ని చిటికెలో చక్కబెడతానని తన మనసులో ఉన్న కోరికను కూడా బయటపెట్టాడు. ప్రపంచ మాంద్యాన్ని తాను ముందే పసిగట్టినట్లుగా చెప్పుకునే ఈ అపర మేధావికి ఈ పథకానికి నిధులు ఇవ్వడం సాధ్యం కాదని తెలియదా! తెలియక కాదు. ఈ బృందానికి అన్నీ తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టి ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని భావించి, ఇటువంటి అనేకరకాల జిమ్మిక్కులను ప్రదర్శిస్తోంది.

అమలు సాధ్యం కాదు

భారతదేశంలో గ్రామీణ పేదలను గణించడానికి చేసిన మొదటి ప్రయత్నంగా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని 2015 జూలైలో విడుదల చేసిన ‘సామాజిక ఆర్థిక గణన 2011’ ను పేర్కొనవచ్చు. ఈ గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే భారత దేశంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య మొత్తం 17.91 కోట్లు. వీరిలో 31.26 శాతం పేదరికంలో ఉన్నారని, వారి సంఖ్య 27.5 కోట్లుగా ఉందని ఈ గణాంకాలు తేల్చాయి. గ్రామీణ జనాభాలో నెలకు 5000 రూపాయల కంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలు 74.5 శాతం ఉంటే, 10 వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలు 92 శాతం ఉన్నాయని ఈ సామాజిక ఆర్థిక గణన తెలిపింది.

జాతీయ శాంపిల్‌ సర్వే 68వ రౌండ్‌ ప్రకారం 2011-12 నాటికి పేదరిక గీతకు దిగువ ఉన్న జనాభా 21.9 శాతంగా ఉందని అంచనా వేసింది. రంగరాజన్‌ నేతత్వంలో ఏర్పాటు చేసిన ఒక కమిటీ పేదరిక గీతను పునర్‌నిర్వచించి, ఆ జనాభా 2011-12లో 29.5 శాతంగా లెక్కగట్టింది. అదేవిధంగా పౌరుల కొనుగోలు సామర్థ్యం, ధరలను పరిగణనలోకి తీసుకుని భారతదేశంలో 2011 జనాభాను అనుసరించి ప్రపంచ బ్యాంకు లెక్కగట్టిన పేదరిక జనాభా 21.2 శాతం.

పై మూడింటిలో ఏ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ప్రస్తుతం దేశంలో ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు 25 కోట్లకు పైనే ఉంటారు. ఈ 25 కోట్ల మందికి నెలకు 6 వేల చొప్పున, సంవత్సరానికి 72 వేల చొప్పున ఇవ్వాలంటే సంవత్సరానికి 18 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇది మనదేశ బడ్జెట్‌లో దాదాపు 70 శాతం. 2019-20 మధ్యంతర బడ్జెట్‌ను పరిశీలిస్తే మొత్తం 27,84,200 కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్‌ను ఆమోదించారు. రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన ఈ న్యాయ్‌ను అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్‌లో సగానికి పైగా ఈ పథకానికే ఖర్చు చేయాలి. 18 లక్షల కోట్ల రూపాయలు కావాలి అంటే కేంద్రం వివిధ సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులను, రక్షణ నిధులను, ఉద్యోగులకు ఇస్తున్న జీతాలను ఈ పథకానికి మరల్చాల్సి ఉంటుంది. ఇలా మొత్తం నిధులను న్యాయ్‌కే వెచ్చిస్తే దేశం నడిచేదెలా? అందుకే ఇది సాధ్యమయ్యే పనికాదు.

మరోపక్క ఈ పథకం గురించి రాహుల్‌గాంధీ ఒకసారి మనిషికి 6 వేలు అని మరోసారి కుటుంబానికి 6 వేలు అని అంటున్నారు. అంటే పథకం గురించి ఆయనకే ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ కుటుంబానికి 6 వేలు అనుకున్నప్పటికీ 6.25 కోట్ల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలి. అప్పుడైనా సంవత్సరానికి 4 లక్షల 50 వేల కోట్లు ఖర్చవుతాయి. ఇది కూడా దేశ బడ్జెట్‌లో దాదాపు 16 శాతం. వీటిని కూడా ఎలా సర్దుబాటు చేయగలరనేది ఎక్కడా చెప్పటం లేదు. దీనిని కేవలం అధికారం కోసం కాంగ్రెస్‌ చేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది రాహుల్‌గాంధీ అపరిపక్క మనస్తత్వానికి మరో మచ్చుతునక.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు రాయితీల రూపంలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా ఆహార సబ్సిడీ, ఇంధన సబ్సడీలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ఒక్క ఉపాధి హామీ పథకానికే సంవత్సరానికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇలాంటి నిధులన్నింటిని న్యాయ్‌ పథకానికి మళ్లించినా నెలకు 4000 రూపాయలు ఇవ్వడం కూడా కష్టమే. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్‌ నాయకులు ఈ పథకం ప్రకటించారంటే అది కేవలం అధికారం పట్ల ఆరాటం తప్ప ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం కాదు.


అధికారం లేకపోతే ఉండలేరు

ఈ దేశాన్ని అరవై ఏళ్లపాటు పాలించిన పార్టీ కాంగ్రెస్‌. ఆ పార్టీకి ఒక ప్రాథమిక దుర్లక్షణం ఉంది. అధికారానికి దూరంగా ఉండలేకపోవటమే ఆ దుర్లక్షణం. మొదట 1977లో మొరార్జీదేశాయ్‌ కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెట్టారు. ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ అనేక ఇబ్బందులకు గురిచేసింది. కుట్రలు, కుతంత్రాలు పన్ని లోక్‌సభ సభ్యులలో అనేక చీలికలు తెచ్చింది. రెండేళ్లకే ప్రభుత్వాన్ని కూల్చింది. రెండవసారి 404 సీట్ల బలమున్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి, భాజపా మద్దతుతో విపి సింగ్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. రిజర్వేషన్ల పేరుతో గొడవలు సృష్టించి కాంగ్రెస్‌ ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. చంద్రశేఖర్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చి, సీట్ల బలం లేకున్నా అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. మూడవసారి 1996 ఎన్నికలలో ఘోర పరాజయం పొందింది. భాజపాను అతి పెద్ద పార్టీగా ప్రజలు నిలబెట్టారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ అధికారాన్ని వదులుకోవటం ఇష్టం లేక ప్రాంతీయ పార్టీల కూటమి యునైటెడ్‌ ఫ్రంట్‌కి మద్దతిచ్చి ఏదోవిధంగా అధికారం అనుభవించింది. 1998లో వాజ్‌పేయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని పదమూడు నెలలకే అవిశ్వాసం పెట్టి ఒక్క ఓటు తేడాతో కుప్పకూల్చింది. ఆ తరువాత 2004 నుండి 2014 వరకు అప్రతిహతంగా పదేళ్లపాటు అధికారం అనుభవించింది. అనేక అవినీతి స్కాములతో దేశాన్ని మునుపెన్నడూ లేనంతగా లూటీ చేసింది. 2014 ఎన్నికలలో చరిత్రలోనే అత్యంత ఘోరంగా ఓటమి చవిచూసింది. ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. అధికారానికి దూరంగా ఉండటం ఇష్టం లేని కాంగ్రెస్‌ మళ్లీ తన దుర్బుద్ధిని బయట పెట్టుకుంది. కుట్రలకు తెరలేపింది. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు పెద్దఎత్తున చేసింది. అవార్డు వాపసీ, వంటి అనేక రకాల గొడవలు సృష్టించి అసహనం ప్రదర్శించింది. చివరికి టిడిపి వంటి తోక పార్టీలను వెంటేసుకుని అవిశ్వాసమూ పెట్టింది. అందులో నెగ్గలేక పోవటంతో ప్రస్తుత అనాలోచిత పథకానికి కాంగ్రెస్‌ పార్టీ తెరతీసింది. ఏదోవిధంగా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుత ఎన్నికలలో ఎవరికి అధికారం కట్టబెట్టాలో ప్రజలకు తెలుసు.


ఎన్నికల ఎత్తుగడ మాత్రమే

దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోదీ నేతత్వంలోని భారతీయ జనతా పార్టీ జిఎస్‌టి ప్రవేశపెట్టి ప్రజల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే రాహుల్‌గాంధీ తన అనాలోచిత ప్రకటనలతో, కేవలం అధికారమే లక్ష్యంగా దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు. న్యాయ్‌ పథకాన్ని కాంగ్రెస్‌ మేధావులు పీఎం కిసాన్‌ పథకంతో పోల్చి చూపుతున్నారు. అయితే పీఎం కిసాన్‌ పథకానికి సంవత్సరానికి కేవలం 75 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ‘జన్‌ధన్‌ ఆధార్‌ మొబైల్‌’ అనుసంధానంతో వివిధ ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందుతున్న అనర్హులను గుర్తించి, వారిని తొలగించటంతో ఆదా అయిన డబ్బును దీనిని కేటాయిస్తున్నారు. ఇలా మోదీ ప్రభుత్వం దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా తమ కర్తవ్యాలను నెరవేరుస్తూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే పీఎం కిసాన్‌ పథకానికి, న్యాయ్‌ పథకానికి పోలిక పెట్టడానికి కుదరదు. న్యాయ్‌ కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి.

కాంగ్రెస్‌ పార్టీ గత నాలుగు తరాలుగా పేదరిక నిర్మూలన (గరీభీ హఠావో) నినాదంతోనే ప్రజలను మభ్యపెడుతూ గద్దెనెక్కుతోంది. నెహ్రూ నుండి నిన్నటి సోనియా గాంధీ వరకు ఇప్పటికి 4 తరాలు దేశాన్ని 60 ఏళ్లపాటు పాలించినా పేదరికాన్ని నిర్మూలించటం వారి వల్ల కాలేదు. అప్పటి నుండి పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదంతోనే నెట్టుకొస్తున్నారు. మధ్యలో జాతీయవాద ప్రభుత్వాలు వచ్చి చేసిన అభివృద్ధిని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెడగొట్టే ప్రయత్నాలు చేసి, లూటీ చేస్తున్నాయి. ఇప్పుడు నెహ్రూ కుటుంబం 5 తరం వారసుడైన రాహుల్‌గాంధీ ప్రజలను మరోసారి వంచించడానికి ముందుకు వస్తున్నారు. అలవికాని హామీలు ప్రకటిస్తూ అధికారమే లక్ష్యంగా మరోమారు భారత ప్రజలను మోసంచేయాలని చూస్తున్నారు. దీనిని భారతప్రజలు గుర్తించాలి.

మోదీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడింది. మొదటిసారి దేశంలో సొంత ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించే దిశలో ముందుకు వెళుతోంది. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు నిర్మించే దిశగా తీవ్రంగా శ్రమిస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో అన్ని ప్రధాన పంటల మద్దతు ధరలను భారీగా పెంచింది. రైతులకు పంటల బీమాతో పాటు పెట్టుబడి సాయాన్నీ అందిస్తోంది. స్వచ్చభారత్‌లో భాగంగా దేశంలోని గ్రామాలన్నింటిని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మారుస్తోంది. ప్రజలందరికీ త్రాగునీరు అందించే దిశగా ముందుకు వెళుతోంది. మోదీ ఎంతో కష్టపడి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి జీఎస్టీని తీసుకువచ్చి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు. పన్నుల పరిధి పెంచారు. ఈ ఐదేళ్లలో అదనంగా ఒక్క రూపాయి పన్నూ ప్రజలపై మోపలేదు. ఇది కాదా అచ్చేదిన్‌ అంటే! మోదీ 60 నెలల పాలనలో చెప్పుకోవటానికి ఎన్నో అంశాలున్నాయి. కాని కాంగ్రెస్‌ 60 ఏళ్ల పాలనలో పేదరికం పెరగటం తప్ప చెప్పుకోవటానికి మరేమీ కనబడటం లేదు.

కాంగ్రెసు వారు మొదటినుంచి పేదలను బిక్షగాళ్లను చేశారు. పనికి మాలిన పథకాలతో వారి జీవితాలతో ఆటలాడుకున్నారు. వారి 60 ఏళ్ల పాలనలో విద్య, వైద్యం వంటి ప్రాథమిక అంశాలకు వారు ఇచ్చిన ప్రాధాన్యం శూన్యం. ప్రజలను తరతరాలుగా వంచిస్తూ మరోమారు కూడా అలానే మోసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో కొత్త సీసాలో పాత పథకాన్ని నింపి మళ్లీ జనం ముందుకు తీసుకువస్తున్నారు. దేశం కోసం ఎవరు నిరంతరాయంగా శ్రమిస్తున్నారో ప్రజలకు తెలుసు. మాల్య, నీరవ్‌, ఛోక్సీలకు ఎవరు ఇబ్బుడి ముబ్బడిగా బ్యాంకు లోన్లు ఇచ్చి వారిని దేశం దాటించారో అందరికీ తెలుసు. దీనికి మోదీని బాధ్యుడిని చేస్తూ బురద జల్లే పని చేస్తున్నా ప్రజలు దీన్ని హర్షించడం లేదు. ఒకవైపు వీర సైనికుల త్యాగాలను మరచి మరోవైపు శత్రు దేశం పాక్‌కు వంత పాడుతుండటాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు. దేశం అగ్రరాజ్యంగా అవతరిస్తుందన్న అంశాన్ని పట్టించుకోకుండా ఈ క్రెడిట్‌ మోదీకి, బీజేపీకి దక్కకూడదనే నెపంతో దేశాన్ని దూషిస్తు రాహుల్‌ గాంధీ సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకుంటున్నారు.

ఏ కోణంలో చూసినా న్యాయ్‌ పథకం ప్రజలను మోసం చేయడానికే ముందుకు తెచ్చిన ఎన్నికల ఎత్తుగడ. అది ప్రజలను వంచించడానికి చేసిన ప్రకటన. దేశానికి నిజమైన కాపలాదారు ఎవరో ప్రజలకు తెలుసు.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *