నువ్వా..! నేనా..!

నువ్వా..! నేనా..!

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి తుది దశకు చేరింది. తొలి విడతలో 4,468 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటి వరకు 39,616 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య భారీ మొత్తం. కొన్ని చోట్ల పదికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు అధి కారాలను పెంచడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తొలిదశ పోలింగ్‌ ఈ నెల 21న జరగనుంది.

బుజ్జగింపులు.. బెదిరింపులు..

మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అయిన 13న గెలిచే అవకాశాలున్న నేతలు ఇతర అభ్యర్థుల బుజ్జగింపులకు తెరలేపారు. ఎంతో కొంత డబ్బు తీసుకొని నామినేషన్‌ను వెనక్కి తీసుకొని, తన గెలుపుకు సహకరించాలని కోరారు. అయితే ఇందుకు బరిలో నిలిచిన కొంతమంది అభ్యర్థులు మాత్రం ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. కొందురు లక్షలు ఎరవేసి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే.. మరికొందరు నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్‌ పదవికి పోటీ చేయాలనుకున్న ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహ రించుకుపోయిన సంఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరోవైపు పంచాయతీకి ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న చోట అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సైతం వెనకాడటం లేదని తెలుస్తోంది. అధికార తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందినవారు ఎన్నో చోట్ల పోటీ పడు తోండటంతో కొన్ని చోట్ల బుజ్జగింపులకు నియోజక వర్గ ఎమ్మేల్యేలు, ఆయా పార్టీల ఇంఛార్జీలు సైతం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

ఏకగ్రీవాలకు వేలంపాటలు..

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు నజరానా ప్రకటించడంతో అభ్యర్థులందరూ గ్రామాల్లో వివిధ కుల సంఘాలతో, యువజన సంఘాలతో సమా వేశమై తన ఎన్నికను ఏకగ్రీవం చేయాలని పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మారుమూల గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం యథేచ్ఛగా వేలంపాటలు కొనసాగాయి. కొన్ని చోట్ల మాత్రం నిజాయితీ గల నాయకులను ఏకగ్రీవంగా నిలబెడుతున్న పంచాయతీలూ ఉన్నాయి.

కొత్త చట్టం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త పంచాయ తీరాజ్‌ చట్టం- 2018కి శ్రీకారం చుట్టింది. గ్రామా లను బలపేతం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చి నట్లు కేసీఆర్‌ గతంలో చెప్పారు. దీని ప్రకారం పంచాయతీలకు విరివిగా అధికారాలు కట్టబెట్టారు. ఇందులో భాగంగా 4,380 నూతన గ్రామ పంచాయ తీలు ఏర్పాడ్డాయి. ఐదు వందల కంటే ఎక్కువ జనాభా కలిగిన గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కి చేరింది. అత్యధిక గిరిజన జనాభా కలిగిన ప్రాంతాల్లో వారికే రిజర్వేషన్లు కల్పించారు.

మహిళలకు పెద్దపీట

ఈ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం లభించిందనే చెప్పాలి. రాష్ట్రంలోని 6,378 పంచా యతీల్లో ఈసారి మహిళలే సర్పుంచులుగా ఎన్నిక కాబోతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మహిళా సర్పంచులు అధికంగా గల రాష్ట్రాల్లో తెలంగాణకు ఐదో స్థానం దక్కనుంది. ఈ దఫా పంచాయతీల సంఖ్య భారీగా పెరగడమే మహిళలకు ప్రాతినిథ్యం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు. ఈ రిజర్వేషన్లు పదేళ్లపాటు కొనసాగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 1/3 స్థానాలను తప్పక కేటాయించా లని రాజ్యాంగంలోని 243డి చెబుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా 19 రాష్ట్రాలు మహిళలకే కేటాయిస్తున్నాయి. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు అయిన స్థానాలతో పాటు ఎవరికీ రిజర్వు కాని చోటా సగం స్థానాలు ఈసారి మహిళలకు లభించాయి.

భలే డిమాండ్‌!

ఈ ఎన్నికల్లో ఉపసర్పంచ్‌ పదవికీ భారీగా డిమాండ్‌ కనబడుతోంది. గతంలో ఉపసర్పంచ్‌ గ్రామ పంచాయతీలో కేవలం నామమాత్రపు సభ్యుడి గానే ఉండేవాడు. పంచాయతీ నిధుల విషయంలో, బిల్లుల విషయంలో ప్రత్యక్షంగా పాలుపంచు కోవడానికి అవకాశం ఉండేదికాదు. అయితే నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామాభివృద్ధి పనుల చెక్కులపై సంతకం చేసే అధికారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కీ లభించనుంది. దీంతో రిజర్వేషన్లు అనుకూలించని నేతలంతా ఉపసర్పంచ్‌గా ఎన్నికై గ్రామంలో చక్రం తిప్పాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సర్పంచ్‌ ఎన్నిక రోజే పోటీలో గెలుపొందిన వార్డు సభ్యులందరూ కలసి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఉపసర్పంచ్‌ బరిలో ఉన్నవారు వార్డుమెంబర్‌కి పోటీ చేసే అభ్యర్థులతో సత్సంబంధాలు కొనసాగిస్తు న్నట్లుగా తెలుస్తోంది.

అభ్యర్థుల ఖరారు వారి చేతుల్లోనే!

కొన్నిచోట్ల ఎమ్మెల్యేలే సర్పంచ్‌ అభ్యర్థుల్ని ఖరారు చేశారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగియడం.. ఆ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వారు సర్పంచ్‌ పదవులను ఆశించడంతో తమ గెలుపుకు సహకరించిన వారినే బరిలోకి దింపేందుకు ఏకంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకోవాలని కేటీఆర్‌ పిలుపునివ్వడం ద్వారా అధికార పార్టీ సైతం ఈ ఎన్నికలను కీలకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

– హరీష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *