శాంతిభద్రతలకు ‘విఘాతం’

శాంతిభద్రతలకు ‘విఘాతం’

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు లోపించా యనడానికి ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన అధికార పార్టీ శాసనసభ్యుడు సర్వేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు సోమ హత్యలే ఉదాహరణ.

రాష్ట్రంలో తిరిగి మావోయిస్టులు విజృంభించా రని ఈ ఉదంతం చెప్పకనే చెప్పింది. కొంతమంది నక్సలైట్లు పట్టపగలే వీరు ప్రయాణిస్తున్న జీపును ఆపి పక్కకు తీసుకెళ్లి, అరగంట చర్చల తరువాత మరీ కాల్చి చంపారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ ఏ విధంగా విఫలం అయిందో అర్థం చేసుకోవచ్చు.

సర్వేశ్వరరావు, సోమల హత్యలకు కారణం అక్రమ బాక్సైట్‌ గనుల తవ్వకం కాదని మావో యిస్టులు చెప్పినట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వవర్గాలు మాత్రం అదే నిజమని భావిస్తున్నాయి.

అయితే నక్సలైట్ల బృందం సర్వేశ్వరరావుతో జరిపిన చర్చలలో గనుల తవ్వకం ప్రధానమైన విషయమని ప్రత్యక్ష సాక్షుల కథనం. వారి మధ్య జరిగిన చర్చలలో కొంత సయోధ్య కుదిరినప్పటికి మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారు చెబుతున్నారు.

అయితే అసలు విషయాన్ని పూర్తిగా మరుగున పరచి ప్రజల్ని పక్కదోవ పట్టించాలనుకోవడం ప్రభుత్వ అసమర్థ చర్యే అవుతుంది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఇది ఇంటిలిజెన్స్‌, పోలీసుల వైఫల్యమని అంగీకరించారని మరికొంత మంది ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యమంతి మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారు.

సర్వేశ్వరరావు, సోమ కేవలం పోలీసుల రక్షణ వ్యవస్థల పైనే ఆధారపడలేదనేది నిర్వివాదాంశం. వారికి ప్రత్యేకమైన, సొంత రక్షణ వ్యవస్థ ఉంది. వీరికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలల్లోని ప్రజలతోను, చివరకు నక్సలైట్లతోను సంబంధాలు ఉన్నాయనేది అనుమానం లేని విషయం. వారు ఎప్పటికప్పుడు సమాచారం అందించేవారు. అందుకే వీరు నియోజకవర్గంలో నిర్భయంగా తిరిగేవారు. కాని మొన్న దాడి చేసింది వేరే ప్రాంతం నుండి వచ్చిన 60 మంది మావోయిస్టుల బృందం. అందుకే వీరికి సరైన సమాచారం అందలేదు.

చాలా సంవత్సరాలుగా మావోయిస్టులకు, వీరికి ఈ విధమైన సంబంధాలు కొనసాగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ మావోయిస్టుల సమాచారం ఎందుకు సేకరించలేకపోయింది? సర్వేశ్వరరావును, సోమను ఎందుకు హెచ్చరించలేదు? ఇన్నాళ్లుగా తెగబడని మావోయిస్టులు ఇప్పుడే ఎందుకు దాడులకు దిగారు? అంటే తెలుగుదేశం పార్టీకి, మావోయిస్టులకు మధ్యనున్న రహస్య సంబంధాలు ఇప్పుడేమైనా బెడిసి కొట్టాయా? లాంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో కాల్చి చంపటం ఇప్పటికీ అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలలో జరుగుతోంది. గతంలో ఇద్దరు జిల్లా పరిషత్‌ వైస్‌ఛైర్మన్లను, మండల పరిషత్‌ సభ్యులను కూడా నక్సలైట్లు హతమార్చారు.

ఆంధ్ర-ఒరిస్సా బోర్డరు నుండి 60 మంది మావోయిస్టుల బృందం ఇద్దరు నేతలను హతమార్చ టానికి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చారంటే మన నిఘా వ్యవస్థ ఎలా ఉందో అర్ధం అవుతోంది. దాడి జరిగిన 2 గంటల తరువాత గానీ.. పోలీసు బలగాలు అక్కడికి చేరుకోలేకపోయాయి.

ప్రతి చిన్న విషయానికి కేంద్రాన్ని విమర్శించే చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎందుకు మాట్లాడటంలేదు? దాడి చేసిన తరువాత మావోయిస్టులు తాపీగా నడుచుకుంటూ వెళ్లారని మరికొందరు భావిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ చంద్రబాబు శాంతిభద్రతల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పక పోవడం ఆశ్చర్యాన్ని కలగచేస్తోంది.

బాక్సైట్‌ గనుల తవ్వకం గత ప్రభుత్వాల (వైఎస్సార్‌ ప్రభుత్వం) నిర్ణయమని, దాన్ని తాను రద్దు చేసానని, అయినప్పటికి దాడి ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించిందెవరిని? ప్రజలనా? మావోయిస్టులనా? అర్థంకాలేదు.

ఒకవేళ అక్కడ బాక్సైట్‌ గనుల తవ్వకం జరగకపోతే నక్సలైట్లు వారిని ఎందుకు చంపారు? ఇందులో వేరే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు ప్రజల్ని వేధిస్తున్నాయి.

అరకు ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు గనుల అక్రమ తవ్వకానికి, రంగురాళ్ల తవ్వకానికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నాయి. వీటి గురించి ప్రభుత్వం దర్యాప్తు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు.

ఇద్దరు గిరిజన నాయకులను మావోయిస్టులు కాల్చి చంపితే మన అర్బన్‌ నక్సల్స్‌, మానవ హక్కుల నాయకులు పెదవి విప్పలేదు.

ఛత్తీస్‌ఘడ్‌లో పోలీసుల పైన దాడులు జరిగిన వెంటనే అక్కడి పోలీసులు ఎదురుదాడులు జరిపి ఒకరిద్దరు మావోయిస్టులను పట్టుకోవడం పరిపాటి. ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయనే చెప్పాలి.

– వైష్ణవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *