అవును ! అన్నీ నిజాలే !

అవును ! అన్నీ నిజాలే !

దమ్మున్న ఛానల్‌ దగ్గుతూ, దగ్గుతూ నన్ను ఇంటర్వ్యూకు పిలిచింది. అందులో జరిగే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ పచ్చడి’ ఇంటర్వ్యూ మొదలైంది. అక్కడ పటపటా నా మీద కురిసిన ప్రశ్నల వర్షం, దానికి నేను టపటపా ఇచ్చిన సమాధానాలు అద్భుంగా ఉన్నాయి. ఆలకించండి!!

పచ్చడి 1వ ప్రశ్న : భారతదేశంలో ఇప్పుడు నియంతృత్వ పాలన నడుస్తోంది నిజమేనా?

జవాబు : అవును! పార్లమెంటుకు దండంపెట్టి ఈ రోజు వరకు విశ్రాంతి లేకుండా పనిచేసే వ్యక్తి నియంత కాక ఇంకెవరు? అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించాడా ? స్వంత కొడుకును రాజ్యాంగేతర శక్తిగా మార్చి దేశంపై వదలిపెట్టి, అతని వ్యవహారాలను అడ్డుకున్నందుకు మీడియాపై నిషేధం విధించలేదు కాబట్టి అతను నియంతే!?

2వ ప్రశ్న : దేశంలో అప్రజాస్వామ్య పాలన జరుగుతోందా?

జవాబు : అవును! మామ పార్టీని మాయచేసి లాగేసి వెన్నుపోటు పొడవడం గొప్ప ప్రజాస్వామ్యం! అ,ఆ లు రాని కొడుకును మంత్రిని చేయడం ప్రజాస్వామ్యం! 2 ఎకరాల నుండి లక్షల కోట్లు సంపాదించడం ప్రజాస్వామ్యం! ధర్నా చేసే నాయీబ్రాహ్మణులను బెదిరిస్తూ పబ్లిగ్గా ‘తోక కట్‌చేస్తా’ అనడం ప్రజాస్వామ్యం! దేశ ప్రధాని నా రాష్ట్రంలోకి రావద్దు అనడం ప్రజాస్వామ్యం! ఆడవాళ్లు నిరసన తెలిపితే ‘మీ అంతుచూస్తా’ అనడం ప్రజాస్వామ్యం! శహబాష్‌!

3వ ప్రశ్న : ఈ ఐదేళ్లలో భారత్‌లో పేదరికం పెరిగిపోయింది కదా!

జవాబు : అవును! అంతకుముందు ప్రతి ఇంట్లో కోడిగుడ్డంత బంగారం, ప్రతిమనిషి దగ్గర లక్ష రూపాయల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండేది. అలాగే మన దేశంలో ప్రతి మనిషి అంతకుముందు బంగారు, వెండి కిరీటాలు పెట్టుకొని తిరిగే వాళ్లు. ఈ ఐదేళ్లలో అవన్నీ పోయి పేదరికం వచ్చింది!?

4వ ప్రశ్న : ఈ ఐదేళ్లలో కాశ్మీర్‌ సమస్య దారుణంగా మారిపోయింది కదా?

జవాబు : అవును! అంతకుముందు ఈ దేశ ప్రధానులు ఢిల్లీలో ఈలవేస్తే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు ఆ చప్పుడుకే చచ్చిపోయేవారు. ఇక్కడి ప్రభుత్వాలను చూసి పాకిస్తాన్‌ ప్రధాని గజగజ వణికిపోయి భయపడి బంకర్లలోకి వెక్కి దాక్కునేవారు. ఇప్పుడేమో ముంబాయ్‌, ఢిల్లీ, సూరత్‌, మీరట్‌, హైదరాబాద్‌, కోయంబత్తూర్‌లలో తీవ్రవాదులు బాంబులు తెచ్చి ప్రజల్ని పటాకుల్లా పేల్చేస్తున్నారు!?

5వ ప్రశ్న : ప్రస్తుత దేశ ప్రధానికి ‘కుటుంబం’ విలువ తెలియదు? ఆయన సమర్థుడు కాడు? మీరేమంటారు?

జవాబు : అవును. ప్రస్తుత ప్రధాని అధికారంలోకి రాగానే ధనార్జన చేసి ఇంకో నాలుగు గుజరాత్‌లకు దోచిపెట్టే శక్తి లేని వ్యక్తి ఆయన. తన కుటుంబం వాళ్లకు, కులం వాళ్లకు పదవులిచ్చి బినామీ పేర్లతో కాంట్రాక్టులు ఇప్పించే శక్తిలేని వ్యక్తి ఈ దేశ ప్రధాని. రాష్ట్రానికో కుటుంబాన్ని తయారు చేసి, వాళ్ల చుట్టూ అధికారాన్ని తిప్పలేని అసమర్థుడు.

6వ ప్రశ్న : ఈ ఐదేళ్లలో పెట్రోధరలు భగ్గుమంటున్నాయి చూసారా?

జవాబు : అవును. ఈ ఐదేళ్లకు ముందు ఒక చాక్లెట్‌ కొంటే ఒక లీటర్‌ పెట్రోల్‌ ఉచితంగా పోసేవారు.

7వ ప్రశ్న : ఈ ఐదేళ్లలో ఇద్దరే ధనవంతులు అయ్యారు. ఒకరు ఆదానీ, ఇంకొకరు అంబానీ! అవునా కాదా?

జవాబు : అవును ! అంతకుముందు అంబానీ తండ్రి ముంబాయి వీధుల్లో పల్లీలు అమ్ముకొనేవారు. ఈ అంబానీ తండ్రికి బొగ్గులు సమకూర్చేవాడు. ఈ ఐదేళ్లలో ఒక్కసారిగా కోట్లకు ఎగబాగాకరు. ఇక ఆదానీ మన ‘నిప్పు’ కట్టిన హైటెక్‌ సిటీ దగ్గర పార్కింగ్‌ ఫీజు మసూలు చేసుకుని బతికేవాడు. ఈ ఐదేళ్లలో బిల్‌గేట్స్‌ను తలదన్నే కోటీశ్వరుడయ్యాడు.

 

అయ్యో ! కథ అడ్డం తిరిగింది !

రాఫెల్‌.. రాఫెల్‌.. అంటూ ఊగిపోతున్న రాహుల్‌కి ఫిబ్రవరి 26 నాటి మెరుపు దాడుల వార్త గులాంనబీ ఆజాద్‌ వచ్చి చెప్పగానే గబాలున గుండె ఆగినంత పనైపోయింది. ‘ఈ ఆర్నెల్లపాటు ఎంతో కష్టపడి కాంగ్రెస్‌ స్కూల్లో బట్టీ పట్టిన ఈ ఒక్క అబద్ధాన్ని మింగేసే స్ట్రోక్‌ను మోదీ ఇస్తాడని అనుకోలేదు మమ్మీ..’ అంటూ తల్లి సోనియాకేసి చూసాడు!?

‘మోదీ తెలుగు జాతికి అన్యాయం చేశాడు; తెలుగు జాతితో పెట్టుకొన్నవాడు..’ అంటుండగానే ‘డాడీ! డాడీ! సర్జరీ షాక్‌ జరిగిందట’ అని లోకేశం తండ్రి చెవిలో ఊదాడు. అది ‘సర్జీరీషాక్‌’ కాదురా మొద్దబ్బాయి. సర్జికల్‌ స్ట్రైక్‌ అన్నాడు తండ్రి. ‘చూసారా! తమ్ముళ్లూ ! నా నలభై ఏళ్ల అనుభవాన్ని ఎదుర్కోలేక మోదీ పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాడు. ఇది తెలుగువారిపై కక్షకాకపోతే ఇంకేమిటి అని అడుగుతున్నా? ఇదంతా మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి ఆడిన నాటకం తమ్ముళ్లూ!’ అన్నాడు.

ఇదే వార్త మమతకు తెలియగానే ‘ఈ మోదీ నియంత. ఒక్కమాట నాకు చెబితే నా దగ్గరున్న పోలీస్‌ కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను పంపి తీవ్రవాదుల పనిపట్టే దాన్ని కదా’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ ‘తీవ్రవాదులు చస్తే వారిని పోస్ట్‌మార్టమ్‌ చేసిన రిపోర్ట్‌ మాకు ఇవ్వాలి’ అంటూ వెళ్లిపోయింది. ఇక పవన్‌కళ్యాణ్‌ ‘ఇలాంటిది తప్పక జరుగుతుందని నాకు ముందే తెలుసు’ అని ట్వీట్‌ చేసాడు. ఇక సిద్ధూ ‘పాకిస్తాన్‌ ఆర్మీ మనకు అలాంటి అవకాశం ఇవ్వకపోతే మోదీకి అంత సీన్‌ లేదు. మన సైనికులకు అంత సీన్‌ అసలే లేదు’ అన్నాడు.

ఇక కమ్యూనిస్టులు ‘అభినందన్‌ను అంత బాగా అప్పజెప్పినందుకు ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం కోసం పాక్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసినట్లే, మనమూ తీర్మానం చేస్తేనే ఈ దేశంలో లౌకికవాదం నిలబడుతుంది’ అన్నారు. ఈ వార్తలను క్రోడీకరించి విశ్లేషించి విరిచేసి కరిచేసే మన పచ్చమీడియా ‘సర్జికల్‌ స్ట్రైక్‌ గతంలో ఎన్నోసార్లు జరిగింది. నక్సలైట్లపై చంద్రబాబు ఏనాడో సర్జికల్‌ స్ట్రైక్‌ చేసాడు. అసలు సర్జికల్‌ స్ట్రైక్‌లకు ఆద్యుడు చంద్రబాబే. అసలు ఆయన సలహా ఇస్తేనే ఆనాడు మిరాజ్‌ యుద్ధ విమానాలు కొన్నారు’ అంటూ ముగింపు పలికారు.

– కౌస్తుభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *