మార్పుకు నిదర్శనం !

మార్పుకు నిదర్శనం !

గిలానీ ప్రభావం ఇక్కడ చాలా ఉంటుందన్నది ఏళ్ల తరబడి వింటూ వస్తున్నాం. ఈ జిల్లాలోనే కశ్మీరీ యువకులు బుర్హన్‌ వానీ, జాకిర్‌ ముసా వంటి ఉగ్రవాదుల పోస్టర్లను చించిపారేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తోంది.

ఇటీవల కశ్మీర్‌ సహా మొత్తం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అందులో ఓటింగ్‌ 74శాతం నమోదైంది. జమ్మూలో 83.5 శాతంగా ఉంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కశ్మీర్‌ లోయలో 41 శాతం నమోదైంది. 2017 ఏప్రిల్‌లో శ్రీనగర్‌ పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు ఓటింగ్‌ శాతం కేవలం 7.4. అనంతనాగ్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికలే జరగలేదు. గతేడాది మున్సిపల్‌ ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలో 4.27 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగింది. దీనితో పోలిస్తే గ్రామ పంచాయ తీలకు నిర్వహించిన ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్‌ జరగడం మామూలు విషయం కాదు. ప్రజలు తుపాకుల భయాన్ని, ఉగ్రవాదుల బెదిరింపులను లెక్క చేయకుండా ముందుకు వచ్చి ఓటు వేశారు. ఉగ్ర వాదులు నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చేవారు తమ తమ కఫన్‌ (మత్యు వస్త్రాలను)లను కూడా వెంట తెచ్చుకోవాలని బెదిరింపు ప్రకటనలు చేసినా రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేశారు.

జమ్మూ, లడాఖ్‌లలో 80 శాతానికి మించి పోలింగ్‌ జరగడం అక్కడ వేర్పాటువాదం ప్రభావం లేదని చెప్పకనే చెప్తోంది. సమస్య ఏదైనా ఉంటే అది కేవలం కశ్మీర్‌ లోయకు మాత్రమే పరిమితం అని ఈ ఓటింగ్‌ శాతం తేటతెల్లం చేసింది. నిజానికి కశ్మీర్‌లో వస్తున్న మార్పుకు ఇది నిదర్శనం.

గత నెల కశ్మీర్‌ లోయ, ముఖ్యంగా వేర్పాటు వాదుల కంచుకోటగా పేరొందిన దక్షిణ కశ్మీర్‌లో 257 మంది యువకులు జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ ఫాంట్రీ దళంలో భర్తీ అయ్యారు. శ్రీనగర్‌లోని రంగ్‌ రేత్‌లో వీరు ఏడాదిపాటు శిక్షణ పొంది, ఆ తరువాత సైన్యంలో విధులు నిర్వహిస్తారు. వీరిని ముంబైకో లేక అసొంకో పంపకుండా స్థానికంగానే ఉంచుతూ, వారికి శ్రీనగర్‌ నడిబొడ్డున శిక్షణ ఇవ్వడం గమనార్హం. పరిస్థితులు బాగుపడకపోతే వీరిని స్థానికంగానే ఉంచి శిక్షణనివ్వడం సాధ్యం కాదు.

దక్షిణ కశ్మీర్‌లోని సోపోర్‌ వేర్పాటువాదానికి కంచుకోట! సయ్యద్‌ అలీషా గిలానీ ప్రభావం ఇక్కడ చాలా ఉంటుందన్నది ఏళ్ల తరబడి వింటూ వస్తున్నాం. ఈ జిల్లాలోనే కశ్మీరీ యువకులు బుర్హన్‌ వానీ, జాకిర్‌ ముసా వంటి ఉగ్రవాదుల పోస్టర్లను చించిపారేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తోంది. తమకు పాక్‌ సమర్థిత జీహాదీ ఉగ్రవాద ఉన్మాదంతో ఎలాంటి సంబంధమూ లేదని ఈ యువకులు చెప్పక చెబుతున్నారు.

గత ఒక్క ఏడాదిలోనే 238 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. రాళ్లు విసిరే సంఘటనలూ గణనీ యంగా తగ్గాయి. అయితే గత ఆరేడు నెలల్లో దాదాపు రెండు వందల మంది యువకులు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపారన్నదీ నిజమే. వారు కశ్మీర్‌ వదిలి పాకిస్తాన్‌కు చేరుకుని అక్కడ జీహాదీ ఉగ్రవాద శిక్షణ పొందుతున్నారు. మరోవైపు కశ్మీర్‌ లోయకే చెందిన ఐఏఎస్‌ టాపర్‌ షా ఫైసల్‌ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి, వేర్పాటువాద రాజకీయాల్లో పాల్గొని, ముస్లింల హక్కుల కోసం ఉద్యమిస్తానని ప్రకటించారు. పాలన కన్నా పాలిటిక్స్‌ చేయడం మంచిదని నిర్ణయించి ఆయన రంగంలోకి దూకారు. ప్రస్తుతం ఆయన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రాజకీయంగా తాను నమ్మిన విషయం కోసం పోరాడితే ఎవరికీ అభ్యం తరం ఉండకూడదు. ఆయన కూడా ఉగ్రవాదం వైపు వెళ్లడం లేదన్నది గమనార్హం. ఆయన ఉగ్రవాదుల్లో చేరలేదు. ఉగ్రవాదాన్ని సమర్థించలేదన్నది గుర్తుంచుకోవడం అవసరం. ఇంకో వైపు రాళ్లు విసిరేవాళ్లని మిలటరీ, రాష్ట్రీయ రైఫిల్స్‌, పోలీసులపై దాడులు చేయించేందుకు వేర్పాటువాదులు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. భద్రతాదళాల ఆపరేషన్లకు అడ్డం తగిలేందుకు యువతను ఎగసన తోస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ తరహా సంఘటనలు క్రమేపీ తగ్గుతున్నాయి.

నిజానికి ఇప్పుడు కశ్మీర్‌ పరిస్థితి సగం నీరున్న గ్లాసులా ఉంది (మిగతా సగం ఖాళీ). అల్లర్లు, అలజడులు కొనసాగాలని భావించే ఒక వర్గం మాత్రం ఇప్పటికీ ఖాళీ గ్లాసును మాత్రమే చూపించి కథనాలు రాస్తోంది. ఉగ్రవాదాన్ని ఏరివేయడం, స్థానికుల ఆకాంక్షలను గుర్తించి వారికి వనరులు, వసతులు కల్పించడం, వారి కనీస అవసరాలను తీర్చడం ఇప్పుడు కశ్మీర్‌లో చాలా అవసరం. ఇది మరింత వేగవంతంగా జరగాలి!

– రాకా సుధాకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *