జన జాగృతి

జన జాగృతి

అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి!

తెలుగు రాష్ట్రాల్లో కేబుల్‌ ఆపరేటర్ల తీరుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కేబుల్‌ చార్జీలు ఇష్టా రీతిగా పెంచుతున్నారు. ఇటీవల టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కేబుల్‌ చార్జీలను భారీ ఎత్తున తగ్గించి వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. కేబుల్‌ ఆపరేటర్లు, ఇతర డిటిహెచ్‌ సంస్థలు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేబుల్‌ ఆపరేటర్లు మాత్రం ఆ మార్గదర్శకాలను ఏమాత్రం పాటించకుండా వినియోగదారుల నుంచి అక్రమంగా ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా ట్రాయ్‌ నూతన గైడ్‌ లైన్స్‌ ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కేబుల్‌ వినియోగదారులకు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

– రమణ, ఆదిలాబాద్‌

అసత్య ఆరోపణలు దేశ ప్రతిష్టకు భంగం!

ఎన్డీయే ప్రభుత్వం ఈవీఎంల ట్యాంపరింగ్‌కి పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఇటీవల ఓ వింత వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. అంతేకాకుండా ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కూడా చెబుతున్నాయి. ఇక్కడ మనం ఒక సంగతి గమనించాలి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల (చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్‌) శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. అంటే, అక్కడ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందనే అనుకోవాలా! భారత ఎన్నికల సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే ప్రజాస్వామ్య ప్రతిష్టకే భంగం వాటిల్లే ప్రమాదం ఉంది.

– రాకేష్‌, విజయవాడ

అన్నదాతల గోడు పట్టదా?

తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూమి యాజమాన్య హక్కులకు సంబంధించి చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల ప్రక్షాళన విఫలమైందనే చెప్పాలి. ఈ విధానంతో భూ వివాదాలు తీరకపోగా, మరింత తీవ్రతరం అయ్యాయి. పట్టాదారు పాసు పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఎందరో రైతుల పట్టా నంబర్లను రికార్డుల నుంచి తొలగించారు. గ్రామస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులకు సాంకేతిక అవగాహన లేకపోవడంతో పాసుపుస్తకాల్లో ఎన్నో తప్పులు దర్శనమిస్తున్నాయి. తప్పుల్ని సరిచేయాలని రైతులు పనులు మానుకొని తహసీల్దార్‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టిసారించి వీఆర్వోలు, వీఆర్‌ఏలకు సంబంధిత శిక్షణ ఇప్పించాలి. ప్రతి గ్రామంలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దాలి.

– జల, కరీంగనర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *