మానవ హక్కులు కొందరికేనా?

మానవ హక్కులు కొందరికేనా?

ఉగ్రవాదులతో హోరాహోరీ కాల్పులు జరుపుతున్న సమయంలో ఉగ్రవాదులకు అనుకూలంగా రాళ్లు విసిరేవారి పట్ల భద్రతాదళాలు ఎలా స్పందించాలి? ఆ అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈ విషయంలో హక్కుల పేరిట వాదించేవారు, ఉగ్రవాదుల మద్దతుదారులు రాళ్లు విసిరే వారి ‘మనోభావాలు’, వారి ‘న్యాయసంగతమైన వాదనలు’ వినాలని, వాటిని మానవీయ కోణంలో పరిశీలించి, అర్థం చేసుకోవాలని అంటారు. రాళ్లు విసిరే మూకల నుంచి ఎన్నికల సిబ్బందిని కాపాడేందుకే ఆ మధ్య శ్రీనగర్‌ లోకసభ స్థానం ఉప ఎన్నికల్లో మేజర్‌ లిటుల్‌ గొగోయ్‌ ఒక రాళ్లు విసిరే వ్యక్తిని తన వాహనం ముందు కట్టేసి తీసుకెళ్లాడు. దీనిపై ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో పాల్గొనే భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొన్ని వర్గాలు ఎలా వాదిస్తాయో తెలియనిది ఎవరికి? రాళ్లు విసిరే మూకలపై హెచ్చరికలు, లాఠీ చార్జీలు, బాష్పవాయువులు విఫలమైన తరువాతే పెల్లెట్‌ గన్స్‌ ఉపయోగిస్తారన్నది అందరికీ తెలిసినదే. పెల్లెట్‌ గన్స్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకం కాని ఆయుధాల జాబితాలో ఉన్నాయన్నదీ బహిరంగ రహస్యమే. ప్రపంచమంతా ఈ గన్స్‌ని వాడతారన్నదీ అందరికీ తెలుసు. అయినా దానిపై వివాదం చేస్తూనే ఉంటారు కొందరు.

ఇలా వాదించేవారు ఇటీవల జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫారూఖ్‌ అబ్దుల్లా ఇంట్లోకి ఓ అగంతకుడు చొరబడితే అతడిని భద్రతాదళాలు కాల్చి చంపేసినప్పుడు మాత్రం ఒక్క ప్రశ్నా లేవనెత్తలేదు. ‘అయ్యో తప్పు జరిగింది’ అని ఎవరూ అనడం లేదు. అతడిని ముందు హెచ్చరించి, ఆ తరువాత లాఠీ చార్జి చేసి, తదనంతరం భాష్పవాయువు ప్రయోగించి, అవన్నీ విఫలమైన తరువాతే కాల్పులు జరపాలని, అందునా ముందు కాళ్లపై గురి పెట్టాలని, ఆ తరువాతే ఇంకేదైనా చేయాలని ఎవరూ వాదించలేదు. మానవ హక్కుల హననం గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆ యువకుడి ‘ఆత్మ వేదన’ను అర్థం చేసుకుని, అతని ‘న్యాయ సంగతమైన’ వాదనలను వినాలని ఎవరూ చెప్పడం లేదు.

ఫారూఖ్‌, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఉమర్‌ అబ్దుల్లాలు ఉంటున్న భవనంలోకి మూర్తజా అనే పాతికేళ్ల వ్యక్తి తన కారుతో సహా చొరబడి బీభత్సం సష్టించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతడిని నిలువరించే ప్రయత్నంలో ఒక పోలీసు జవాన్‌ గాయపడ్డాడు. ఆ తరువాత అతను పోర్టికోలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ఫారూఖ్‌ బెడ్‌ రూమ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అందుకే భద్రతా దళాలు సైతం స్పందించాల్సిన విధంగానే స్పందించాయి. తక్షణం అతనిని మట్టుపెట్టాయి.

మూర్తజాను మట్టుపెట్టడంపై జమ్మూ కశ్మీర్‌లో, మిగతా భారతదేశంలో ఏ హక్కులవాదులూ స్పందించడం లేదు! ఎవరూ ఈ విషయంలో తమ వాదనలు వినిపించడం లేదు! పైగా మూర్తజా ఖచ్చితంగా ఉగ్రవాది కాడన్నది సుస్పష్టం. అతను జమ్మూలోని ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి లైసెన్స్‌డ్‌ అయుధాల వ్యాపారం చేస్తూంటాడు. జమ్మూలోని బాణ్‌ తాలాబ్‌ ప్రాంతంలో ఆ కుటుంబం ఉంటుంది. వారికి గతంలో ఉగ్రవాద సంస్థలతో సాన్నిహిత్యం కానీ, సంబంధం కానీ ఉన్నట్టు దాఖలాలు లేవు.

కానీ ఎవరూ ఈ విషయంలో మానవ హక్కుల ప్రస్తావన తేవడం లేదు. ఎవరూ గుండెలు, గొంతులు చించుకోవడం లేదు. ఆ సంఘటన జరిగిన రెండు రోజులకు జమ్మూ కశ్మీర్‌లోని రామ్‌ బన్‌లో సరిహద్దుల్లో సందేహాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిపై భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఇందులో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి పేరు మహ్మద్‌ రఫీక్‌ గుజ్జర్‌. మరొక వ్యక్తి గాయపడ్డాడు. అతనిపేరు షకీల్‌ అహ్మద్‌. వారు కాల్పులు జరిపితేనే భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ సంఘటన తెల్లవారు జాము నాలుగు గంటలకు జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. వారు ఇప్పుడు గస్తీ తిరగడం మానేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఫారూఖ్‌ ఇంట్లోనూ అనుమానంపై మాత్రమే కాల్పులు జరిపారు. ఈ సంఘటనలోనూ అదే జరిగింది. దేశ భద్రతకోసం రాత్రింబవళ్లు నిద్ర మాని పని చేసే సాధారణ జవాను విషయంలో ఒక విధానం, వీఐపీల విషయంలో ఇంకొక విధానం ఎందుకు? ఫారూఖ్‌ అబ్దుల్లా విషయంలో ఒక్క ప్రశ్నా ఎందుకు తలెత్తదు? సగటు జవాను ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నప్పుడు మాత్రం అన్ని అనుమానాలూ ఎందుకు తలెత్తుతాయి? మానవ హక్కుల ప్రశ్నలు మామూలు జవాన్లకేనా? వీఐపీలకు కాదా?

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *