గాంధీజీ… మీరు కూడా !

గాంధీజీ… మీరు కూడా !

దక్షిణాఫ్రికా అంటే మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీని ఉద్యమకారునిగా మలచిన నేలగా భారతీయులు భావిస్తారు. జాతి వివక్ష మీద, అణచివేత మీద జరిగే పోరాటంలో సాధారణ ప్రజలను భాగస్వాములను చేయగలిగిన కొత్త వ్యూహానికి జన్మనిచ్చిన గడ్డగా ప్రపంచ ప్రజలు కూడా గౌరవిస్తారు. యుద్ధాలు, సాయుధ పోరాటాలతో, జాత్యహంకార ప్రభుత్వాలతో, వాటి అణచివేతతో చాలా దేశాలు కునారిల్లి పోతున్న కాలంలో ఆ వ్యూహం ఒక ఆశాకిరణ మైంది కూడా. ఇదంతా గాంధీజీ కేంద్రంగా సాగినదే. గాంధీజీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష ప్రిటోరియా ప్రభుత్వం మీద చేసిన అహింసా యుత పోరాట పంథానే భారత స్వాతంత్య్రోద్య మానికి కూడా వర్తింప చేశారు. కానీ ఎక్కడైతే జాతి వివక్ష మీద గాంధీజీ పోరాడారో, ఇప్పుడు ఆ నేలే ఆయన మీద ‘జాత్యంహకారి’ ముద్ర వేయడం ఒక చారిత్రక వైచిత్రి. గాంధీజీ సిద్ధాంతాలను మా మీద రుద్దడం ఇకనైనా ఆపండి అన్న రీతిలో ఆఫ్రికా ఖండ నల్లజాతీ యులు గళం ఎత్తుతున్నారు.

పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో ఈ డిసెంబర్‌ 12న జరిగిన ఒక ఘటన ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఆ దేశ రాజధాని అక్రా. అక్కడ ఉన్న ఘనా విశ్వవిద్యాలయంలో రిక్రియేషన్‌ క్వాడ్రాంగిల్‌లో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని ఆ రోజున అక్కడ నుంచి తొలగించారు. ఇదేదో కొందరు దుందుడుకువాదులు చాటుమాటుగా చేసిన పనికాదు. రెండేళ్లుగా ఆ విగ్రహం అక్కడ ఉండరాదని అదే విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, కొందరు విద్యార్థులు కోరుతూనే ఉన్నారు. 2016లో ఈ విగ్రహాన్ని నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించారు. నిజానికి ఆ విగ్రహం ఆవిష్కరించా లన్న ఆలోచన జరిగినప్పుడే అక్కడ నిరసనధ్వనులు కూడా మొదలైనాయి. అయినా ఆవిష్కరించారు. ఈ రగడ ఆరంభంలోనే ఘనా ప్రభుత్వం కూడా ఆ విగ్రహాన్ని వేరే చోటికి తరలించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇంతకీ ఎందుకు గాంధీజీ విగ్రహాన్ని వారు అక్కడ ఉంచరాదని వాదిస్తున్నారు? ఇందకు వారి నుంచి వచ్చిన సమాధానం- గాంధీజీ ‘జాత్యహంకారి’. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. గాంధీజీకి సంబంధించి సేకరించిన రచనలలోని ఒక లేఖను, కొన్ని వ్యాఖ్యలను వారు ఇందుకు సాక్ష్యంగా ఉదాహ రిస్తున్నారు. ఘనా నల్లజాతీయులు తీవ్రంగా పరిగణిస్తున్న అంశం- గాంధీజీ దక్షిణాఫ్రికా నల్లవారిని ఉద్దేశించి ప్రయోగించినట్టు చెబుతున్న ‘కాఫిర్‌’ అన్న పదం. కాఫిర్‌ అంటే నీగ్రో, నిగ్గర్‌ అన్న పదాల కంటే అవమానక రమైనదని ఘనా ఉద్యమకారుల వాదన. అలాగే తాము నివశిస్తున్న చోట, చుట్టుపక్కల నల్లవారు ఉండడం తమకు అవమానకరంగా ఉందనీ, తమ పిల్లల చదువు కూడా సాగడం లేదని గాంధీజీ బ్రిటిష్‌ అధికారు లకు రాసిన రేఖను కూడా వారు చూపుతున్నారు. గాంధీ విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ వారు రెండువేల సంతకాలను సేకరించారు.

గాంధీజీ వ్యక్తిత్వం మీద, చరిత్ర మీద ఆరోపణలు రావడం కొత్తకాదు. కానీ ఈ ఆరోపణలు తీవ్రమైనవే. నిజానికి గాంధీజీలోని ఈ కోణం గురించి నెల్సన్‌ మండేలాకు కూడా బాగా తెలుసునని, 1995లోనే ఆయన రాసిన ఒక వ్యాసంలో ఈ సంగతి ప్రస్తావించారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈఎస్‌ రెడ్డి ‘ది వైర్‌’కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈఎస్‌ రెడ్డి ఐక్యరాజ్యసమితి వర్ణ వివక్ష వ్యతిరేక కేంద్రంలో పనిచేశారు. కానీ గాంధీజీ అలాంటి అభిప్రాయాలను ఏర్పరుచుకున్న కాలాన్ని పరిగణనలోనికి తీసుకుని, ఆ తరువాత ఆ వ్యాఖ్యల మీద ఒక దృక్పథం ఏర్పరుచుకోవాలని మండేలా అభిప్రాయపడడం విశేషం. ఈ మధ్యనే జోహెన్నెస్‌బర్గ్‌, వాజూలు నటాల్‌ విశ్వవిద్యా లయాలలో పనిచేస్తున్న ఆచార్యులు అశ్వినీ దేశాయ్‌, గులాం వాహెద్‌ వెలువరించిన పుస్తకంలో గాంధీజీని విపరీతమైన జాత్యహంకారిగా పేర్కొన్నారు. ఆయన నల్లజాతీయులను కాఫిర్లు అనేవారని ఆ ఇద్దరు కూడా వెల్లడించారు. అలాగే గాంధీజీ కొన్ని చోట్ల నల్ల జాతీయులు వెళుతున్న ద్వారాల గుండా భారతీయులు వెళ్లడం సాధ్యంకాదని చెప్పడంతో వీరికి వేరే ఏర్పాట్లు చేశారు.

వాస్తవానికి ఇప్పుడు ఆఫ్రికాలో ‘గాంధీ మస్ట్‌ ఫాల్‌’ ఉద్యమం నడుస్తున్నదని చెప్పవచ్చు. అంటే గాంధీ పతనమై తీరాలి. విస్తృతార్థంలో గాంధీ అభిప్రాయాలు కాలగర్బంలో కలసిపోవాలి. ఇదే ఆ ఉద్యమం లక్ష్యం. 2015లోనే దక్షిణాఫ్రికాలో గాంధీ విగ్రహం ముఖానికి రంగు పూసి అవమానించిన సంఘటన జరిగింది. ఆ సంవత్సరమే మరొక ఘటన కూడా జరిగింది. కేప్‌ టౌన్‌లో ఉన్న సిసిల్‌ రోడ్స్‌ విగ్రహాన్ని నల్లజాతీయులు నేలమట్టం చేశారు. అది కూడా అక్కడి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే ఉండేది. గని యజమాని అయిన రోడ్స్‌ జాతి వివక్ష వ్యాఖ్యలకు ప్రతీతి. ఇతడు 1902లో చనిపోయాడు. తమను, తమ జాతీయతను, పుట్టుకను చరిత్రలో ఏ బిందువు దగ్గర, ఎప్పుడు అవమానించినా సరే, దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతున్నది. దీనిని ఆత్మగౌరవం కోసం నల్లజాతి చేస్తున్న ఉద్యమంలో భాగంగా వారు భావిస్తున్నారు కూడా.

ఘనా విశ్వవిద్యాలయం నుంచి గాంధీ బొమ్మను ఈ డిసెంబర్‌ 13న తొలగించారు. నిజానికి నవంబర్‌ మాసంలో ఆయన ప్రతిమను ఏర్పాటు చేయడానికి మలావిలో జరిగిన ప్రయత్నం కూడా ఇదే రీతిలో భగ్నమైంది. నిజానికి ఆ ఘటన గాంధీజీ ప్రతిష్టకు సంబంధించి ఘనాలో జరిగిన దానికి మించి అవమాన కరమైనది. గాంధీ మస్ట్‌ ఫాల్‌ ఉద్యమం ఇక్కడే ఆరంభమైంది. మలావి తూర్పు ఆఫ్రికా దేశం. అక్కడ ఈ నవంబర్‌ 4న గాంధీజీ విగ్రహాన్ని (బస్ట్‌) ఆవిష్కరించడానికి ఆ దేశ ఆర్థిక రాజధాని బ్లాంటీర్‌ సిటీలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. అక్కడ 1970లోనే ఒక మార్గానికి గాంధీ పేరు పెట్టారు కూడా. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మూడు ఆఫ్రికా దేశాల (బోట్స్‌వానా, జింబాబ్వే, మలావి) పర్యటన సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పా టయింది. కానీ సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ ఆవిష్కరణోత్స ఏర్పాట్లను నిలిపివేయలసిందిగా ఆదేశిస్తూ మలావి హైకోర్టు స్టే మంజూరు (అక్టోబర్‌ 30) చేసింది. ఈ విగ్రహం ప్రతిష్టవద్దని తాము ఎందుకు వాదిస్తున్నదీ చెబుతూ పిటిషనర్లు 18 కారణాలను పేర్కొన్నారు. దీనితో న్యాయమూర్తి మిషెల్‌ టెంబో స్టే ఇచ్చారు. మలావి బిజినెస్‌ ఇన్‌క్యుబేషన్‌ కేంద్రం, ఇండియా ఆఫ్రికా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థలో ఈ ప్రతిమను ఆవిష్కరించ డానికి ఏర్పాట్లు జరిగాయి. ఇదంతా గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటయింది. మలావి ప్రతిమ కోసం భారత్‌ పది లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చింది. 1964లోనే ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఆరంభ మైనాయి. భారత్‌ నుంచి విరాళాలు పొందుతున్న దేశాలలో మలావి ఒకటి.

పెంఫోరొ పాండి, కొటొమ కాటెంగకౌండా గాంధీ బొమ్మ ఆవిష్కరణకు వ్యతిరేకంగా మలావి హైకోర్టును ఆశ్రయించారు. నల్లజాతీయుల కంటే భారతీయులు ఎప్పటికీ అధికులేనని గాంధీజీ వ్యాఖ్యానించారని ఆ ఇద్దరు తమ పిటిషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు. ‘గాంధీ జాత్యంహకారి కాబట్టి ఆయనను ఇక్కడ గౌరవించవలసిన అవసరం లేదు’ అని స్టే మంజూరైన తరువాత ఫాండి వ్యాఖ్యా నించారు. ఘనాలో వలెనే ఇక్కడ కూడా గాంధీ ప్రతిమ ఆవిష్కరణకు వ్యతిరేకంగా 3000 సంతకాలు సేకరించి, వాటిని మలావి, భారత ప్రభుత్వాలకు ఉద్యమకారులు పంపించారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము ఆవిష్కరణకే కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.

గాంధీజీ ప్రతిమను ఆవిష్క రించడం ద్వారా ఆయన ప్రవచించిన విలువలు, నిరాడం బరత, సామాజిక రుగ్మతల మీద ఆయన జరిపిన పోరాటం మలావి ప్రజలకు ఆదర్శంగా నిలబడ తాయని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి రిజాయిస్‌ షంబు అన్నారు. కానీ ఇలా ప్రతిమలను నిలబెట్టడం, ఆయన సిద్ధాంతాలను గొప్పవంటూ వీరు ప్రచారం చేయడం వంటి చర్యలను ప్రజలు గాంధీ సిద్ధాంతా లను బలవంతంగా రుద్దడంగా భావిస్తున్నారు. కొద్దిమంది చదువుకున్నవారి కోసం మలావి సాధారణ ప్రజల అవసరాలను, అభిప్రాయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని గాంధీ మస్ట్‌ ఫాల్‌ ఉద్యమకారుడు ఫాంబిరా అబ్రే కాంబేవా అంటున్నారు. దక్షిణాఫ్రికాలో పలుచోట్ల గాంధీజీ విగ్రహాల తొలగింపునకు ఉద్యమాలు జరుగుతున్న విషయాన్ని ‘ది నేషన్‌’ పత్రిక ప్రచురించింది. ‘మౌలిక వసతుల కల్పన కోసం గాంధీజీ ప్రతిమను ఆవిష్కరించా లంటూ భారత్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆపాలి’ అని కూడా ఆ పత్రిక ప్రచురించిన వ్యాసంలో పేర్కొనడం విశేషం.

ఘనా విశ్వవిద్యాలయంలో గాంధీ విగ్రహాన్ని తొలగించిన తరువాత అక్కడే న్యాయశాస్త్రం చదువుతున్న నానా అడోమా సేరే అడి చేసిన వ్యాఖ్య ఇలా ఉంది. ‘ఈ విగ్రహం ఇక్కడ నిలిచి ఉన్నదీ అంటే ఆయన నమ్మిన ప్రతి అంశాన్ని మనం నిలబెట్టుకుంటున్నట్టే లెక్క. అందుచేత ఆయన జాత్యహంకార భావాలు కలిగి ఉన్నట్టయితే మా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆ విగ్రహం ఉండవలసిన అవసరం ఎంత మాత్రం లేదని నేను అనుకుంటున్నాను.’

ఈ ఘటనలను ఎవరు ఎలా పరిగణించినా, దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివసించిన కాలాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన సిద్ధాంతాన్ని ఔదలదాల్చే వారు చెబుతున్నారు. కొన్ని వాస్తవాలు బయటపడిననప్పుడు వినడానికి చేదుగానే ఉంటుంది. కానీ ఆ కాలాన్ని అర్థం చేసుకుంటూ ఆ వ్యక్తుల సేవను అంచనా వేయాలి. అమెరికా రాజ్యాంగంలో ఎంతో విశిష్టమైన హక్కుల పత్రాన్ని థామస్‌ జఫర్సన్‌ రాశారు. ఆ సమయంలో ఆయన దగ్గర వందమంది నల్లజాతీయులు బానిసలుగా ఉన్నారు. ఆయన హక్కుల పత్రం గొప్పదే. అలాగే ఆయన ఇంట బానిసలు ఉండడం చేదు నిజమే. రెండింటినీ అంగీరించడానికి ప్రయత్నించాలి. గాంధీజీని వ్యతిరేకించడానికి నల్లజాతీయులు చెబుతున్న కారణాలు ఎలా ఉన్నా, ఆయన ప్రతిమలను తొలగించడానికి వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం మర్యాదగా ఉండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *