సంస్కార భారతి పూర్వ అఖిల భారత ఉపాధ్యక్షులు ఘనశ్యామల ప్రసాద్‌ అస్తమయం

సంస్కార భారతి పూర్వ అఖిల భారత ఉపాధ్యక్షులు  ఘనశ్యామల ప్రసాద్‌ అస్తమయం

జ్యేష్ట స్వయంసేవకులు, సంస్కార భారతి పూర్వ అఖిల భారత ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద్‌ (వయసు 79) 29-12-2016న రాజమండ్రిలో స్వర్గస్థులైనారు. 7 నవంబర్‌ 1937న ఘనశ్యామల ప్రసాద్‌ జన్మించారు. వారికి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ వి.భాగయ్య ఘనశ్యామల ప్రసాద్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. 30వ తేదీనాడు విజయవాడలో జరిగిన స్వర్గీయ నముడూరి రవి సంస్మరణ సభలో ప్రసంగిస్తూ – ”ఘనశ్యామల గారు శ్రీ గురూజీ ప్రసంగాలతో కూడిన ”బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌” అనే ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి పాంచజన్యంగా అనువదించడం అందరికీ తెలిసిన విషయమే. కాని ఆయన దేవీ ఉపాసకుడు అనే విషయం చాలా మందికి తెలియదు.

వారు ఆధ్యాత్మిక విషయాలలో అనేక పరిశోధనలు జరిపారు. ఆజీవనపర్యంతం వారు నిరాడంబరంగా జీవిస్తూ ఒక ఆదర్శవంతమైన స్వయంసేవక్‌గా ఉన్నారు అంటూ భాగయ్య నివాళి అర్పించారు.


 

 

సాహిత్యము, సౌజన్యముల కలబోత స్వర్గీయ ఘనశ్యామల ప్రసాదరావు

డిసెంబర్‌ 29, 2016 రాత్రి ఘనశ్యామలగారు తుదిశ్వాస విడిచారు. ఘనశ్యామలగారు లేరన్న వార్తతో పాటు, మా నాన్నగారి వదనంలోని విషాదం కూడా నన్ను ఎంతగానో కలచివేసింది. ఎందుకంటే మా నాన్నగారితోనే కాదు, మా కుటుంబంతో కూడా ఘనశ్యామలగారితో కొన్ని దశాబ్దాల ఆత్మీయాను బంధం ఉంది. వారి పూర్తి పేరు కొత్తపల్లి ఘన శ్యామల ప్రసాదరావు.

అమలాపురం ఎస్‌.కె.బి.ఆర్‌. కళాశాలలో ఘనశ్యామలగారు సంస్కృతోపన్యాసకులుగా పనిచేసారు. సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అగస్త్య పండితుడు వ్రాసిన బాలభారతంపై సమర్పించిన పరిశోధనపత్రంపై (పిహెచ్‌.డి.) వారికి స్వర్ణపతకం లభించింది. ఆధ్యాపకునిగా తమ జీవితాన్ని కొనసాగిస్తూనే సంఘకార్యానికి తనను సమర్పించుకున్నారు.

ఘనశ్యామలగారు దేవీ ఉపాసకులు. దేవీనవరాత్రులలో వారు పూర్తి ధ్యానముద్రలో గడిపేవారనీ, ఆ సమయంలో ఆయనకి అమ్మవారు కనిపించేవారనీ నేను విన్నాను. వారెప్పుడూ ఆ విషయం చెప్పుకోలేదు. అలాగే సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో గ్రహణకాలం పూర్తయ్యే వరకూ ఆయన ధ్యాన ముద్రలోనే ఉండేవారు.

సంఘ స్వయంసేవక్‌గా వారు అందించిన సాహిత్యం అమూల్యమైనది. సంఘ పాటలలో ఘనశ్యామలగారు రాసినవి కూడా కొన్ని ఉన్నాయనే విషయం చాలా తక్కువమందికే తెలుసు. ”శివో భూత్వా శివం యజేత్‌” అన్న వేదోక్తిని పట్టుకొని ఆయన ”శివుడే తానై శివుని కొలిచినటుల రాష్ట్రదేవతారాధనము” అన్న పాట వ్రాసారు.

1994లో తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సంఘ ప్రధమవర్ష శిక్షావర్గ జరిగింది. వర్గ సమారోప్‌లో సోముగారు ”అభినవ హైందవ అభ్యుదయోదయ ప్రభాతభేరి మ్రోగింది” అన్న పాట వైయక్తిక్‌ గీత్‌గా పాడారు. ఆ పాట ఘనశ్యామలగారు రాసిందేనని తరవాత తెలిసింది. ఎందరికో సుపరిచితమైన ‘జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనె కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం’ పాట వారి కలం నుండి జాలువారినదే.

మలికిపురం శిక్షావర్గలో వారు ‘మన ప్రాచీన విజ్ఞానశాస్త్రం’ అన్న అంశంపై ఒక కాలాంశం తీసుకున్నారు. ఆ ప్రసంగంలో ఒకమాట చెప్పారు. అదేమిటంటే ‘నేను కవిని అనుకోవడం గుర్తింపు. నేనూ కవినే అనుకోవడం అహంకారం. నేనే కవిని అనుకోవడం దురహంకారం’ అని. ఎలాంటి విషయాన్నైనా సరళంగా వివరించి చెప్పగలగడం వారి ప్రత్యేకత.

సంఘ ద్వితీయ సర్‌సంఘచాలక్‌ పూజ్యశ్రీ గురూజీ ఆంధ్రప్రాంత పర్యటనలలో వారి ప్రసంగాలకు ఘనశ్యామలగారు తెలుగు అనువాదం చేసేవారు. ఆ అనువాదాలలో వారెంత పండిపోయారంటే తరువాతి కాలంలో ‘ది బంచ్‌ ఆఫ్‌ ధాట్స్‌’గా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహగా పనిచేసిన కీ||శే|| హెచ్‌.వి. శేషాద్రిగారు సంకలనం చేసిన శ్రీగురూజీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించే బాధ్యతను ఘనశ్యామలగారికే అప్పగించారు స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు, స్వర్గీయ భండారు సదాశివరావుగారు. ఆ అనువాదము ‘పాంచజన్యం’గా మనకు మార్గదర్శనం చేస్తోంది.

‘భారతమాతృస్తవము’ పేరుతో భారతమాతను స్తుతిస్తూ ఘనశ్యామలగారు కొన్ని శ్లోకాలను రాసారు. శ్రీమతి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజుల నాటి పోరాట సంఘటనలను తెలుపుతూ ‘ప్రజాపోరాటం’ రాసారు. ఆంధ్రవీరులైన ముసునూరి నాయకుల గురించి కూడా పుస్తకం రాసారు.

పదిహేనేళ్ళకు పైగా వారు మన దేవాలయ వ్యవస్థపై లోతైన అధ్యయనము, పరిశోధన చేసారు. దాని ఫలితమే వారు రచించిన ‘భారతదేశంలో విగ్రహారాధన ప్రారంభ వికాసాలు’, ‘ధ్వంసమైన మన దేవాలయాలు’, ‘జీవించే దేవాలయం’ అన్న పుస్తకాలు. ఎన్నో గ్రంధాలయాల నుండి వారు అమూల్యమైన సమాచారాన్ని సేకరించారు. శ్రీరాంసాఠేగారు వ్రాసిన ‘భారతీయ చరిత్రమాల’, ‘హిందూ విజయదుందుభి’లకు వారు తెలుగు అనువాదం చేసారు. జగద్గురు శ్రీఆదిశంకరాచార్యులవారి జీవిత చరిత్రను వ్రాసారు. మన దేవాలయాలపై శిల్పాలను అవహేళన చేస్తూ తాపీ ధర్మారావు లాంటి వారు చేసిన రచనలకు సమాధానంగా ‘పరమపద సోపానాలు – దేవాలయాలపై బొమ్మలు’ అన్న పుస్తకం వ్రాసారు.

భారతీయ శిక్షణ మండల్‌ ధ్యేయగీతం ”మనిషిలో మాధవుని మలచాలి మనమూ” శ్రీఘనశ్యామలగారు వ్రాసినదే. దీనికి సంస్కృత గీతం కూడా వారే రాసారు. సంస్కారభారతి ధ్యేయగీతం కూడా రాసారు. మా అమ్మగారు శ్రీమతి డా.రమణమ్మగారు ‘ద్విపద భారత కావ్య పరిశీలనము’పై పిహెచ్‌.డి. చేసారు. దానిని పుస్తకంగా ముద్రించినప్పుడు ముఖచిత్ర రూపకల్పన చేసింది ఘనశ్యామలగారే.

ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సాహిత్య పరిషత్‌ సంస్థాపక కార్యదర్శిగాను, సంస్కారభారతి అఖిలభారత ఉపాధ్యక్షులుగాను వారు సేవలందించారు. 2001-2003 కాలంలో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సభ్యులుగా ఉన్నారు.

జాగృతి వారపత్రికతో ఘనశ్యామలగారికెంత అనుబంధముందంటే, ఆ పత్రిక స్వర్ణోత్సవ వేడుకలకు కొద్ది రోజులకు ముందే వారి కాలికి శస్త్రచికిత్స జరిగింది. అయినప్పటికీ హైదరాబాదులో జరిగిన ఆ స్వర్ణోత్సవ వేడుకలలో వారు పాల్గొన్నారు. సద్గురు శివానందమూర్తిగారితో ఘనశ్యామలగారికి మంచి సాన్నిహిత్యం ఉంది. శివానందమూర్తిగారితో కలిసి ఆయన ఈశాన్య భారతంలోని మారుమూల అటవీ ప్రాంతాలలోని పురాతన శిథిలాలను సందర్శించారు.

స్వర్గీయ కొవ్విరెడ్డి జగ్గారావుగారు భారతీయ శిక్షణ మండల్‌ జ్యేష్ఠ కార్యకర్త. వారు భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక, విజ్ఞాన, చారిత్రక విశేషాల గురించి వివరిస్తూ ఆరు పెద్ద గ్రంధాలను రాసారు. వాటిని ముద్రించక మునుపే ఆయన 2007లో స్వర్గస్థులయ్యారు. చాలాకాలం తరువాత వాటిని ముద్రించాలనే సంకల్పంతో మా నాన్నగారు ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరంగారు, డా. ఘనశ్యామలగారు ఆ గ్రంథాల పరిష్కర్తలుగా బాధ్యత వహించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే ఘనశ్యామలగారు ఆ ఆరు గ్రంధాల పనిని చూసారు. మొదటి పుస్తకం ముద్రణ పూర్తయ్యింది. డిసెంబరు 19, 2016న ఆ పుస్తకావిష్కరణ కూడా జరిగింది. తీవ్ర అనారోగ్యంలో ఘనశ్యామలగారు ఆ సభకు వచ్చి, ప్రసంగించారు. అదే వారి ఆఖరి ప్రసంగము.

సంఘ పెద్దలు ఒక కార్యకర్త ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వారి కుటుంబ పెద్ద వచ్చినట్లే అనిపించేది. వారు చెప్పే మంచిచెడులు తమ పెద్దలు చెప్పినట్లే అనిపించేది. ఘనశ్యామలగారు కూడా అలా ఎందరికో ఒక కుటుంబ పెద్ద.

– దుగ్గిరాల రాజకిశోర్‌, 8008264690

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *