కర్షకులకు కనీస ఆదాయం – కేంద్రం యోచన

కర్షకులకు కనీస ఆదాయం – కేంద్రం యోచన

2016-17 ఆర్థిక సర్వే ప్రతిపాదించిన రైతులకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. 2022 నాటికి అన్న దాతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అందుకో డానికి వ్యవసాయ రంగానికి అందించే రాయితీలను నేరుగా వారికే అందించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.

2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో నిధుల దుబారాను అరికట్టింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రుణమాఫీ వంటి ప్రజాకర్షక చర్యలు శాశ్వత పరిష్కారం చూపలేవని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపినాథ్‌ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో తీవ్ర స్థాయిలో సంక్షోభం నెలకొని ఉందని, దీనికి రైతులకు నగదు బదిలీ చేయడమే మెరుగైన పరిష్కారమని గీత తెలిపారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యపంటలకు మద్దతు ధరను 50 శాతం మేర పెంచింది. దేశ వ్యాప్తంగా మార్కెట్లను అనుసంధానం చేసి రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చేసింది. యూరియా దుబారాను అరికట్టడానికి వేపనూనె పూసిన యూరియాను అందిస్తోంది. దీని వల్ల యూరియాను నల్ల బజారుకు తరలించి పరిశ్రమల్లో వాడే వారికి అడ్డుకట్ట పడింది. ప్రభుత్వం ఇలాంటి రైతు అనుకూల చర్యలను చాలానే చేసినా మార్కెట్‌ ఒడిదుడుకులు, వాతావరణ పరిస్థితుల మూలంగా రైతాంగం సమస్యల్లోనే కూరుకొనిపోయింది.

ఇటీవల రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాల పనితీరు బాగానే ఉన్నా రైతులకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌ హామీలతో ఓటర్లు ఆ వైపు మొగ్గు చూపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2014లో రుణమాఫీ ప్రధాన అంశంగా ఎన్నికలు జరిగాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రైతు రుణాలు మాఫీ చేసినా దాని ప్రయోజనాలు ఆశించినంతగా లేవు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా అందిస్తోన్న మొత్తం సగటున ఎకరానికి 15 వేల రూపాయలుగా ఉంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోకే పంపితే మరింత ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2017 ఆర్థిక సర్వేలో అప్పటి కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ ‘సార్వత్రిక కనీస ఆదాయం’ గురించి ప్రస్తావించారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా తొలగించడానికి యూబీఐ (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌) మెరుగైన పరిష్కారమని అరవింద్‌ తన నివేదికలో తెలిపారు. ఇటీవల తాను విడుదల చేసిన ‘ఆఫ్‌ కన్సోల్‌’ పుస్తకంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని 2022లో జరుపుకోనుంది. అప్పటికి భారత ఆర్థికవ్యవస్థను మరింత బలమైనదిగా చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలతో నీతి ఆయోగ్‌ ‘నవ భారతదేశం’ పేరుతో వ్యూహపత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. దీంట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రస్తావించింది. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో రైతుల వ్యతిరేకత బహిర్గతం కావటంతో ఈ వ్యూహాలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాల్సి వస్తోంది. రుణమాఫీలు పెద్దగా ప్రయోజనం చూపకపోవడంతో నగదు బదిలీ గురించి కేంద్రం ఆలోచన చేస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచేందుకు మద్దతు ధర పెంపుతో పాటు మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, ధాన్యం నిల్వ చేసుకోవడానికి అదనపు గిడ్డంగుల నిర్మాణం వంటి పలు చర్యలను కేంద్రం చేపట్టినా అవి అంతగా ఫలితాలను ఇవ్వలేదు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం సత్ఫలితాలను ఇస్తోంది. ఇది కూడా సార్వత్రిక కనీస ఆదాయ పథకమే. సంవత్సరానికి రెండుసార్లు ఖరీఫ్‌, రబీల్లో 58.3 లక్షల మంది రైతులకు ఎకరానికి 4000 రూపాయల చొప్పున అందించింది. ఏడాదికి ఎకరాకు 8000 రూపాయలు లభిస్తోంది. ఇటీవల ఈ మొత్తాన్ని 10 వేలకు పెంచారు. ఒడిశా ప్రభుత్వం కూడా ప్రస్తుత సీజన్‌ నుంచి ప్రతి రైతుకు సీజన్‌కు 5వేల చొప్పున, సంవత్సరానికి 10వేల రూపాయలు చెల్లించనుంది. ఒడిశాలో మొత్తం 30.2 లక్షల మంది రైతులు ఉండగా వారికి 10 వేల చొప్పున చెల్లించడానికి 2016 కోట్ల రూపాయలు ఖర్చుకానుంది. ఇంకా 10లక్షల మంది భూమిలేని కుటుంబాలకు వ్యవసాయ అనుబంధ వత్తుల్లో జీవనాధారం కోసం కుటుంబానికి 12,500 రూపాయలు చెల్లిస్తారు. అందుకు ఏటా 1250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలకు 10 వేల చొప్పున చెల్లించడానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణలో ఎకరానికి 4000 చొప్పున కోటి ఎకరాలకు గానూ సీజన్‌కు 4000 వేల కోట్ల రూపాయలు అందించారు. ఈ ఏడాది 5 వేల చొప్పున 10 వేల కోట్లు రైతులకు అందించనున్నారు.

దీంట్లో కొన్ని లోపాలను మనం గుర్తించవచ్చు. కౌలు రైతులు, వ్యవసాయకూలీలను ఈ పథకం పరిగణలోకి తీసుకోలేదు. భూస్వాములకే ఎక్కువ లబ్ధిచేకూరింది. పేద రైతులు ప్రయోజనం పొందలేకపోయారు. అయితే ఒడిశా అనుసరించిన విధానం కొంతమేర అందరిని పరిగణలోకి తీసుకుంది.. కానీ అది పూర్తిగా సమస్య పరిష్కారానికి పనికిరాదు. ప్రతి రైతుకు రూ. 4000లకు బదులు ఎకరానికి 4000 రూపాయలు.. 5 ఎకరాల గరిష్ఠ సీలింగ్‌తో ప్రతి ఒక్కరికీ అందిస్తే బాగుంటుంది.

తెలంగాణ, ఒడిశా పథకాలు ఆచరణలో సత్ఫలితాలను ఇస్తుండటంతో మిగిలిన రాష్ట్రాలూ ఈ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పంటలకు సుస్థిర ఏకీకత జాతీయ విపణిని ఏర్పాటు చేయడం ఉత్తమ పరిష్కారం. దీని వలన రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. మార్కెటింగ్‌ వ్యవస్థలో వైఫల్యాల వలన వినియోగదారులు కిలో టమాటాకు రూ. 40 చెల్లిస్తున్నా రైతులకు ఒక్క రూపాయే దక్కుతోంది. రైతుల ఆదాయం పెంచాలంటే, వారు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకునేలా మార్కెట్‌ను సంస్కరించాలి.

తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సార్వత్రిక కనీస ఆదాయం పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం అధ్యయనం చేసి దేశ వ్యాప్తంగా ఇలాంటి నగదు బదిలీ పథకం ప్రవేశ పెట్టాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికి ఆర్థికవేత్తలు మద్దతు పలికారు. దేశంలో పేదరికాన్ని తొలగించడానికి ఇలాంటి పథకాలు ఎంతగానో తోడ్పడతాయని వారు చెబుతు న్నారు. ఇటీవల మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకొని మోదీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జన్‌ధన్‌ ఆధార్‌ మొబైల్‌ లింకేజీ ద్వారా రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే జమ చేస్తున్నారు. దీని వల్ల అవినీతి తగ్గి దుబారాను చాలా వరకు అరికట్టగలిగారు.

రుణమాఫీ రైతు సమస్యలకు పరిష్కారం చూపకపోగా ఆర్థిక వ్యవస్థకు సమస్యగా మారుతోంది. 2017 ఏప్రిల్‌ నుంచి దేశంలోని 8 రాష్ట్రాలు రుణమాఫీ ప్రకటించాయి. ఈ మొత్తం విలువ 1.9 లక్షల కోట్ల రూపాయలు. దీని ద్వారా పెద్ద రైతులు, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న ధనవంతులైన రైతులే లబ్ధి పొందారు. చిన్న, సన్నకారు రైతులు తమ రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉంటారు. కాబట్టి వారి బాకీలు బ్యాంకుల్లో పేరుకుపోవు. మరోవైపు కౌలు రైతులు ప్రయివేటు వ్యాపారవేత్తల వద్ద రుణాలు తీసుకొని పంటచేతికి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర లేకుండానే బాకీల కింద అదే వ్యాపారులకు పంటను అమ్ముకుంటారు. జూలై 2015-జూన్‌ 2016 మధ్య కేవలం 43.5 శాతం మంది రైతులే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు నాబార్డ్‌ గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో సంస్థాగత రుణాలు తీసుకున్నవారు 69.7 శాతం మంది మాత్రమే. కేంద్రం రుణమాఫీ అమలు చేస్తే కేవలం 30 శాతం మంది రైతులకే లబ్ధి చేకూరుతుంది. రుణమాఫీ వలన దేశ రుణ సంస్కతికి విఘాతం కలుగుతుంది. రుణ గ్రహీతలు చెల్లించవలసిన అవసరం ఉండదు కనుక వారు ఎలాంటి నైతిక బాధ్యత వహించరు. ఇది ప్రజల నైతికతను దెబ్బతీస్తుంది.

ప్రస్తుతం రాయితీలు, రైతు మద్దతు పథకాలకు కేంద్రం 98,100 కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. పంటల బీమా, ఎరువుల రాయితీలు, తక్కవ వడ్డీకి రుణాలు ఇందులో ఉన్నాయి. దేశంలో దాదాపు 14.6 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం నగదు బదిలీ చేస్తే వీరిలో నేరుగా 10 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరవచ్చు. దీనికి లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయింపులు అవసరం. దేశ వ్యాప్తంగా భూరికార్డుల డిజిటలైజేషన్‌ పూర్తి కాలేదు. కనుక నిజమైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాను రైతులు ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. పంటల బీమా విషయమే తీసుకుంటే దేశంలోని మొత్తం 14.5 కోట్ల మంది రైతుల్లో పంటల బీమాను ఉపయోగించు కుంది కేవలం 35 శాతం మందే. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, పెట్టుబడులు పెంచడం, సుస్థిర ధరల విధానాన్ని అమలు చేయడం వంటి వాటి ద్వారా వ్యవసాయరంగంలో మార్పులు తీసుకు రావాలని ఆర్థికరంగ నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు.

మోదీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు సంబంధించి కూడా పలు పథకాలు అమలు చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తోంది. వద్ధులు, వికలాంగులు, ఇతర బలహీన వర్గాల వారికి పెన్షన్లు అందిస్తోంది. ఇలాంటి పథకాలను అన్నింటినీ సమ్మిళితం చేసి సార్వత్రిక కనీస ఆదాయం కిందికి తీసుకువచ్చి నేరుగా లబ్ధిదారులకే నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017లోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసింది. అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ గాంధీజీ కలలుగన్న నవ భారత నిర్మాణానికి కనీస ఆదాయ పథకం ఉపయోగ పడనుందని పేర్కొన్నారు. అయితే ఈ పథకాన్ని తమ పథకంగా మార్చుకోడానికి రాహుల్‌గాంధీ తీవ్రంగా కషి చేస్తున్నారు. రుణమాఫీ హామీతో కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ యూబీఐపై కన్నువేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ కనీస ఆదాయ పథకాన్ని చేరుస్తామని రాహుల్‌ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో కనీస ఆదాయానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమౌతున్న తరుణంలో వాటిని తమ పథకాలుగా చెప్పుకోడానికి రాహుల్‌ ఈ చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. దీనిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.

దేశంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధాపడి జీవిస్తున్నారు. వారికి కనీస ఆదాయాన్ని అందిస్తేనే భారతదేశంలో పేదరికం పూర్తిగా తగ్గడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరువలో ఉన్న భారత జీడీపీ ఈ ఏడాది బ్రిటన్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకోనుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ (పీడబ్ల్యూసీ) తన తాజా నివేదికలో తెలిపింది. 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్‌ను అధిగమించి భారత్‌ ఆరో స్థానానికి ఎగబాకింది. వద్ధి రేటు 7 శాతానికి పైగా కొనసాగితే రానున్న పది పదిహేను సంవత్సరాల్లో భారత్‌ చైనా సరసన నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి చైనా, అమెరికాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

– రామచంద్రారెడ్డి ఉప్పల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *