యూటర్న్‌ ఉపదేశాలు

యూటర్న్‌ ఉపదేశాలు

రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్లు 2 వేలకు పెంచాం..

మళ్లీ అధికారంలోకి వస్తే మరో వెయ్యి పెంచుతాం..

ఆడపడుచులకు పసుపు, కుంకుమ ఇచ్చాం..

మళ్లీ అధికారంలోకి వస్తే నాలుగో విడత, ఐదో విడత చెక్కులు కూడా ఇస్తాం..

నిరుద్యోగులకు 2 వేలు భృతిగా ఇస్తున్నాం..

రైతులకు 9 వేలు ఇస్తున్నాం..

అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాం..

చంద్రన్న బీమా ఇస్తున్నాం..

ఇంకా ఎన్నో ఇచ్చేవాడిని..

కానీ మోదీ నాకు ఇవ్వడం లేదు..

ఇవీ తనను తాను గొప్ప ఆర్థికవేత్తగా చెప్పు కుంటున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పే మాటలు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లకాలంలో సైబరాబాద్‌ నిర్మించానని కాసేపు, హైదరాబాద్‌ కట్టానని కాసేపు, కాదు కాదు హైటెక్‌ సిటీ నిర్మించానని కాసేపు చెప్పుకుంటారాయన. హైదరాబాద్‌లో ఎన్నో చేశానని చెప్పుకుంటుంటారు. ఇందులో నిజం కొంతైనా ఉన్న మాట వాస్తవమే. అందుకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజనకు గురైన సమయంలో రాష్ట్ర ప్రజలు తమకు జాబు కావాలన్నా, తమ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా గొప్ప ఆర్థికవేత్త, పరిపాలనా దక్షుడుగా పేరుపడ్డ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని భావించారు. అధికారం అప్పచెప్పారు. కాని అంత గొప్ప ఆర్థికవేత్త ఐదేళ్ల పరిపాలన తరువాత తాను చేసినట్లుగా ఎన్నికలలో చెప్పుకుంటున్నవి కేవలం అరకొర సంక్షేమ పథకాల గురించి. అవికూడా గత ఐదేళ్ల నుండీ అమలవుతున్న పథకాలా అంటే అది కూడా కాదు. జస్ట్‌ ఎన్నికలకు ముందు మాత్రమే వాటిని ప్రకటించారు. అవికూడా ప్రతిపక్ష నేత ప్రకటించిన పథకాల నుండి కాపీ కొట్టినవి. ప్రతిపక్ష నేత ప్రకటించి, ప్రజలలో ప్రాచుర్యం పొందిన తరువాత మాత్రమే వృద్ధాప్య పింఛన్‌ వెయ్యి నుండి 2 వేలకు పెంచారు. బడిలో తమ పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి సంవత్సరానికి 15 వేలు ఇస్తానని ప్రతిపక్ష నేత చెప్పిన తరువాతే చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో పదివేలు ప్రకటించారు. అది కూడా అందరు మహిళలకు కాక, కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే. డ్వాక్రాలో లేని వారు మహిళలు కారా? వారు పసుపు-కుంకుమకు అర్హులు కారా? అని మిగతా ఆడపడుచులు ప్రశ్నించుకుంటున్న మాటలు బాబుకు వినిపించటం లేదేమో?

గొప్ప ఆర్ధికవేత్తగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలన తరువాత ఎన్నికలలో సంక్షేమ పథకాల గురించి మాత్రమే చెప్పుకునే దుస్థితిలో ఉన్నారంటే అది ఆయన వైఫల్యమే తప్ప మరొకటి కాదు. అంటే రాష్ట్ర ప్రజలను తన పాలనలో సంక్షేమ పథకాలకు ఆశపడే స్థాయికి దిగజార్చారన్నమాట. రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రజల జీవధార పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం అందులో ముఖ్యమైనవి. ఇంకా విద్య, వైద్యం వంటి ఎన్నో మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది. వీటికోసం నిజాయితీగా కష్టపడితే ఇవ్వాళ బాబు వెయ్యి, 2 వేల రూపాయల సంక్షేమ పథకాల గురించే చెప్పుకోవాల్సిన దుస్థితి ఎదుర్కొనేవారు కాదు.

ఇవన్నీ అడిగితే బాబు ఠక్కున చెప్పే సమాధానం ఒకటే. అది ‘మోదీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు’ అని. ఇందులో కూడా కొంత వాస్తవం ఉంది. మోదీ బాబు అడిగినంత ఇవ్వలేదు. బాబు అడిగినవాటిలో కొన్ని చేయలేదు. అందుకే బాబు మోదీని దుమ్మెత్తి పోయటం మొదలుపెట్టారు. పోలవరం అంచనాలను బాబు 16 వేల కోట్ల నుండి 58 వేల కోట్లకు పెంచారు. పెంచిన అంచనాలకు మోదీ ఒప్పుకోలేదు. రాజధాని అమరావతి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2018 భూ అధిగ్రహణం ఆర్టినెన్స్‌ను గవర్నర్‌ నరసింహన్‌ తిప్పి పంపారు. ఆమోద ముద్ర వేయలేదు. దీనివల్ల గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్యదూరం పెరిగింది. గవర్నర్‌ను రీకాల్‌ చేయమని బాబు మోదీని కోరారు. మోదీ దానికీ ఒప్పుకోలేదు. కానీ పోలవరానికి వాస్తవ అంచనాల ప్రకారం 7 వేల కోట్లను మోదీ అందించారు. ముంపు ప్రాంతాల విషయంలో తెలంగాణతో వివాదం రాకుండా వాటిని ఆంధ్రలో కలిపారు. నిర్మాణ బాధ్యతను బాబు అడిగితే అప్పగించారు. అలాగే మోదీ రాజధానికి మొదటి విడతగా 15 వందల కోట్లు ఇచ్చారు. లేఅవుట్‌, మొత్తం అంచనాలు స్పష్టంగా ఇస్తే పనుల వేగాన్ని బట్టి మరిన్ని నిధులను వెంటవెంటనే ఇవ్వగలమని హామీ ఇచ్చారు.

చంద్రబాబు అడగనివి కూడా కొన్ని మోదీ చేశారు. అవి తను ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడగటం. పోలవరానికి, అమరావతికి ఇచ్చిన నిధుల లెక్కలను మోదీ అడగటం మొదలుపెట్టారు. ప్రతిదానికీ రశీదులు చూపించమని అంటున్నారు. తాను అడిగినది చెయ్యకుండా పైగా తనకు ఇచ్చిన డబ్బులకే లెక్కలు అడుగుతారా? తన గురించి ఏమనుకుంటున్నారు, తాను 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను అని బాబుకు కోపం వచ్చింది. వెంటనే ఎన్‌డిఎ నుండి బయటికొచ్చారు. వచ్చే ఎన్నికలలో మోదీని గద్దె దించితే కానీ తన పనులు సాగవని నిర్ణయించుకున్నారు. మోదీని గద్దె దించటం కోసం మరో జాతీయపార్టీ, తన పార్టీకి బద్దశత్రువైన కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. అంతేకాదు, కాంగ్రెస్‌తో మిగతా పార్టీలు కలిసొచ్చేలా యోజనలు చేశారు. కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. చివరకు ఎన్నికలు ముంచుకురావడంతో పింఛన్లు, నిరుద్యోగభృతి, అన్న క్యాంటీన్లు, పసుపు కుంకుమ వంటి అరకొర ఆకర్షక పథకాలు ప్రకటించారు. ఇదీ తనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్పగించిన ఐదేళ్లలో గొప్ప ఆర్థికవేత్త చంద్రబాబు చేసిన ఘనమైన అభివృద్ధి పనులు.

కొన్నాళ్లు విశాఖ రైల్వే జోన్‌ విషయంలో మోదీ మోసం చేశారని బాబు ఊదరగొట్టారు. అది ఇచ్చిన తరువాత తమకు ఆదాయం రాకుండా చేశారని మొత్తుకోవటం మొదలుపెట్టారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వలేదని కొన్నాళ్లు గొడవ చేశారు. దానికి తగిన భూమిని చూపించడంలో బాబే ఆలస్యం చేశారని కేంద్రం చెప్పటంతో బాబు మిన్నకుండిపోయారు. ఇవన్నీ మోదీని తిట్టిపొయ్యటానికి, ఆయనను ఆంధ్రప్రజలలో చులకన చేయటానికి బాబు వేస్తున్న జిమ్మిక్కులు.

మోదీకేం తెలుసు పాలన అంటే..

రాజధాని అడిగితే మట్టి, నీళ్లు ముఖాన కొట్టారు..

వ్యవస్థలను నాశనం చేశారు..

ఆంధ్ర ప్రజలను అన్యాయం చేశారు..

హోదా ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు..

ఇవి కూడా బాబు మాటలే. తాను అడిగినవి చెయ్యలేదనే కోపంతో బాబు ఏకంగా ప్రధాని మోదీపై అనేక ఆరోపణలూ, అభాండాలూ వేశారు. ‘అసలు మోదీ ఎవరు ఆంధ్రకు రావడానికి ? ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారు ? హామీలు నెరవేర్చిన తరువాతే ఆయనిక్కడికి రావాలి’ అంటూ దేశ ప్రధానిని తూలనాడారు.

కానీ మోదీ ఆంధ్రకు ఎన్నో చేశామని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. గత వారంలో ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, రాజమండ్రి ఎన్నికల సభలలో పాల్గొన్నప్పుడూ చెప్పారు. కర్నూలు సభలో మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఐదేళ్లలో ఇచ్చిన విద్యాసంస్థలు, ఇతర జాతీయ సంస్థలు, నిధులు గురించి పూస గుచ్చినట్టు అన్నిటినీ వివరంగా చెప్పారు. ఇవన్నీ చెప్పటానికి ఆయనకు కనీసం అరగంట సమయం పట్టింది. అయినప్పటికీ ఆయన చెపుతున్న లిస్టు పూర్తి కాలేదు. మోదీ ఆంధ్రకు ఇచ్చినట్లుగా చెప్పిన వాటిలో ఐఐఎమ్‌, ఐఐటి, ఐఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఐటిడిఎం, సెంట్రల్‌ యూనివర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్‌సిఇఆర్‌టి వంటి విద్యాసంస్థలు; ఎయిమ్స్‌ వంటి వైద్య సంస్థలు; నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధారిటీ, ఎన్‌ఎసిఇఎన్‌ వంటి కేంద్ర సంస్థలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ, ఎంఎస్‌ఎమ్‌ఇ టెక్నాలజీ సెంటర్‌, సిఐపిఇటి, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలనరీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఉపాధి కల్పించే సంస్థలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ వంటి వ్యాపార శిక్షణ సంస్థలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటితో పాటు పోలవరం, రాజధాని, రైల్వే జోన్‌, 4 స్మార్ట్‌ సిటీలు, ఇళ్లు లేని వారికి 12 లక్షల ఇళ్లు, సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు మొదలైన అభివృద్ధి పథకాలు మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ వరుసగా చెప్పటానికి ప్రధానికే అరగంటకు పైగా సమయం పట్టింది. ఇంకా రకరకాల పనులకు అనేక వేల కోట్ల నిధులు ఇచ్చినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఇటుపక్క బాబు తన ప్రసంగంలో తాను చేసినట్లుగా చెప్పుకునే అభివృద్ధి పనులేవీ కనబడవు. మొదటి పదినిమిషాలు మాత్రం వెయ్యి, రెండు వేలు లబ్దిని చేకూర్చే అరకొర సంక్షేమ పథకాల గురించి చెపుతారు. ఇక మిగిలిన సమయమంతా మోదీ, ఇతర విపక్షాలపై దుమ్మెత్తిపొయ్యటానికే సమయం కేటాయిస్తారు. ఈ ఐదేళ్లలో తాను నిలబెట్టుకోలేక పోయిన హామీల గురించి ఎత్తితే చిర్రుబుర్రు లాడతారు. పైగా మోదీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, పైసా ఇవ్వలేదని పచ్చి అబద్దాలు చెపుతారు. ఇలా కుండబద్దలు కొట్టినట్లు అబద్ధాలు చెప్పడం బాబుకే చెల్లింది. తన ఈ అబద్ధాలను ప్రజలు గమనిస్తు న్నారనే మాటను మాత్రం బాబు గమనించటం లేదు. తాను ఏది చెపితే దానిని ప్రజలు వందశాతం నమ్ముతారని బాబు భావిస్తున్నారేమో! సమాచార విప్లవం వచ్చిన ఈ రోజుల్లో ఇటువంటివి చెల్లు తాయని ఆయన ఎలా భావించారో..!

మోదీ వ్యవస్థలను నాశనం చేశారు..

ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు..

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు..

అంటూ బాబు మోదీని పనిగట్టుకుని విమర్శి స్తారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధానిని ఎన్నుకుంటా మంటూ మాట్లాడిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా తండ్రి, అదే పార్టీకి చెందిన వేర్పాటు వాద మద్దతుదారుడు ఫారూక్‌ అబ్దుల్లాతో కలిసి తిరుగుతారు. అబ్దుల్లాతో ఆంధ్రలో ప్రచారం చేయిస్తారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను ప్రశ్నించిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ వంటివారిని తీసుకొచ్చి సభలలో మాట్లాడిస్తారు. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తన రాష్ట్రంలోకి రావద్దని హుకుం జారీ చేస్తారు. ఎన్నికల సమయంలో ఇసి జారీ చేసిన ఆజ్ఞలను ధిక్కరిస్తారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఈయనే కొన్ని జీవోలు జారీచేస్తారు. చివరికి కోర్టులు తను చెప్పినట్లు నడుచుకుంటాయని భావిస్తారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని మోదీపై విరుచుకుపడే బాబు తన రాష్ట్రంలో ప్రజాప్రతి నిధులుగా ఎన్నికైన గ్రామ పంచాయితీలను కాదని తను సొంతంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలకు అధికారాలను బదలాయిస్తారు. జన్మభూమి కమిటీ మెంబర్లు చెప్పిన వారికే వృద్ధాప్య పింఛన్లు ఇస్తారు. కమిటీలు నిర్ణయించినవారికే ఉద్యోగ పెన్షన్లు మంజూ రవుతాయి.

నిజానికి విభజనకు గురైన రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ముందుగా రాజధానికి ఒక లే అవుట్‌ వెయ్యాలి. దానిని భవిష్యత్‌ పది తరాల అవసరాలను తీర్చగలిగేలా సక్రమంగా నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఎంతో పెద్ద పని. తరువాత పోలవరం వంటి నీటి ప్రాజెక్టులు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు వంటి వారందరికీ వారికి అవసరమైన మద్దతు ధరలు, పంట సౌకర్యాల కల్పన, నైపుణ్యాలు పెంచడం, ఉపాధికి అనువైన పథకాలు ప్రకటించడం వంటి ఎన్నో పనులున్నాయి. బాబు ఇవేమీ చేయకుండా ఐదేళ్ల పాటు కాలం గడిపేశారు. రాజధాని నిర్మాణం కోసమంటూ సింగపూర్‌, జపాన్‌, దుబాయ్‌ వంటి దేశాలను ప్రభుత్వ ఖర్చులతో చుట్టబెట్టారు. వాటివల్ల వచ్చిన రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదు. దానికి బాబు మోదీని, ఇతర పక్షాలను బాధ్యులను చేస్తారు. పైగా మరోసారి నాకు అధికారమిస్తే ఇవన్నీ చేస్తాను, నన్ను నమ్మండి అంటారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో బాబు చేస్తున్న జిమ్మిక్కులే. గత ఐదేళ్లలో ఆయన ఇటువంటివి ఎన్నో జిమ్మిక్కులు చేసారు. గత ఐదేళ్లలో ఏమీ చేయకుండా వచ్చే ఐదేళ్లలో చేస్తానంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అనేది ఆయన తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *