అప్పుడేం చెప్పారు ? ఇప్పుడేం చేస్తున్నారు ?

అప్పుడేం చెప్పారు ? ఇప్పుడేం చేస్తున్నారు ?

‘గత పదేళ్లుగా తెలుగు ప్రజల జీవితం కాంగ్రెస్‌ పాలనలో అతలాకుతలమైంది. పురోభివృద్ధి అనేదే లేకుండా పోయింది. పాలన దారితప్పి అంతా తిరోగమనమే. అవినీతి కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతాలు, స్వలాభాల కోసం ప్రజా జీవితాలను దుర్భరం చేశారు, వ్యవస్థలను పతనం చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో గత పదేళ్లలో జరిగిన అవినీతి కుంభకోణాలతో ప్రపంచం యావత్తూ నివ్వెర పోయింది. దాదాపు రూ.75 లక్షల కోట్లు విదేశాల్లో, విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో పేరుకు పోయాయి. అవినీతితోపాటు అధిక ధరలు, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజా జీవితాలను అతలాకుతలం చేశాయి. గత అయిదేళ్లలో దాదాపు రూ.15 లక్షల కోట్లు అవినీతి రూపంలో విదేశాలకు తరలించబడింది. ఆర్థిక నేరాలు, హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్‌ పెరిగిపోయాయి. 2జీ, కోల్‌గేట్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆదర్శ్‌, ఆట్రిక్స్‌ దేవాస్‌, అగస్టా హెలికాప్టర్‌ల కుంభకోణం.. చివరికి రక్షణ శాఖను కూడా అవినీతిలో ముంచారు. రాష్ట్రస్థాయిలో, దేశస్థాయిలో అదే దోపిడీ విధానం కొనసాగింది. ఆర్థిక నేరం హత్యకన్నా ప్రమాదకరమని, కొంత మంది స్వల్పకాలంలో వేలకోట్లు ఎలా సంపాదించా రని న్యాయమూర్తులే విస్తుపోయారు. న్యాయస్థానాల జోక్యంతో అవినీతి, అక్రమాలు బయటకు వచ్చి అనేకమంది కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు జైళ్లపాలయ్యారు. ఈ కుంభకోణాలకు, నేరమయ రాజకీయాలకు ఇకనైనా ముగింపు పలకాలి. ఎన్నికల సంస్కరణలు, న్యాయ సంస్కరణల ద్వారానే నేరమయ రాజకీయాలకు కళ్లెం పడుతుంది. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి, బలమైన లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం కృషి చేస్తాం’.

ఇవీ 2014 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు.

2004 నుండి 2014 మధ్య కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ జరిగిన కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి లేదని, ఎన్నో స్కాంలు జరిగి వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, వ్యవస్థలు పతనమయ్యాయని ఆ మేనిఫెస్టోలో బాబు స్పష్టం చేశారు. భాజపాతో స్నేహం చేసి అధికారంలోకి వచ్చారు. మరి అప్పుడు కాంగ్రెస్‌ పాలనను ఇంతలా తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు ఆ తరువాత కేవలం మూడున్నరేళ్లలోనే తన అభిప్రాయాలన్నిటిని మార్చుకుని కాంగ్రెస్‌తో స్నేహానికి తెరతీశారు. మరి అప్పటి కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి, దోపిడీ, స్కాంలు, వ్యవస్థల పతనం.. అన్నిటినీ బాబు మరిచిపోయారను కోవాలా లేక తన స్వలాభం కోసం వాటిని క్షమించే శారనుకోవాలా ?

మేనిఫెస్టోలో సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేలా, బలమైన లోక్‌పాల్‌ వ్యవస్థ తెచ్చేలా కేంద్రంపై వత్తిడి తెస్తామని బాబు పేర్కొన్నారు. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడమంటే.. నేర పరిశోధనలో సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించాలని, నేరస్తులను దేశంలో ఎక్కడైనా నేరుగా విచారించే వెసులుబాటు, అధికారం కలిగి ఉండాలనే కదా! అప్పుడు అలా భావించిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐని రానీయకుండా అడ్డుకుని, కేంద్రం రాష్ట్రాలపై కక్ష తీర్చుకోవడానికి సీబీఐని వాడుకుంటున్నదంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రంలోని నేరస్తులను రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ సమర్థంగా విచారించగలదని, తమ రాష్ట్రానికి సీబీఐ అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. సీబీఐ పట్ల ఈ నాలుగేళ్లలోనే బాబు తన అభిప్రాయాన్ని ఇంతలా ఎందుకు మార్చుకున్నారు ? కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో చేపట్టిన నేర పరిశోధన పట్ల ఆయనకు ఎందుకంత వ్యతిరేకత ? నేరం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఏదో ఒక నేరపరిశోధన సంస్థ విచారించవలసిందే కదా. ఆరోపణ నిజమైనప్పుడు కదా భయపడాల్సింది ? అసలు సీబీఐ దర్యాప్తుకు బాబు ఎందుకు భయపడుతున్నారు ? నిందితులను కాపాడాల్సిన అవసరం ఆయనకేమిటి ?

అప్పటి తన మేనిఫెస్టోలో ధరల పెరుగుదల గురించి చెపుతూ చంద్రబాబు ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గత పదేళ్లలో నిత్యావసరాల ధరలు 500% నుండి 1000% వరకు పెరిగి పోయాయి. పెట్రోల్‌ ధరను 35 సార్లు, డీజిల్‌ ధరను 27 సార్లు పెంచారు. గ్యాస్‌ ధర వంద రూపాయలు తగ్గిస్తామని చెప్పి రూ.1200 చేశారు. అటు రైతు, ఇటు వినియోగదారుడి పొట్ట కొట్టి దళారులను మేపారు’ అంటూ కాంగ్రెస్‌ పాలనను దుయ్యబట్టారు.

ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా హయాంలో గ్యాస్‌ ధర రూ.1200 నుండి రూ.500 లకు తగ్గింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100 నుండి మొదట రూ.60, రూ.50కి తగ్గాయి. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మొత్తం మీద పెట్రోల్‌ రూ.80 కి మించి, డీజిల్‌ రూ.70కి మించి పెరగలేదు. నిత్యావసరాల ధరలు భారీగా తగ్గాయని చెప్పవచ్చు. 2014లో భాజపా అధికారంలోకి వచ్చేనాటికి కందిపప్పు ధర రూ.180, పెసరపప్పు ధర రూ.160, మినప్పప్పు ధర రూ.180, పంచదార ధర రూ.60 నుండి రూ.80గా ఉండేది. తరువాత కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలతో నేడు పప్పులన్నీ రూ.50 నుండి రూ.80 మధ్యకు రాగా పంచదార ధర రూ.40 వద్ద కొనసాగుతోంది. ఇతర నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్‌ & ఎలక్ట్రికల్స్‌, ఇంకా ఎన్నో ప్రజోపయోగ వస్తువుల ధరలు భారీ వ్యత్యాసంతో పెరుగుతున్న దాఖలాలు ఈ ఐదేళ్లలో ఎక్కడా కనబడలేదు. ధరలు పెరుగుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్న సందర్భాలు లేవు.

మరి చంద్రబాబు ధరలు తగ్గించిన భాజపాతో ఎందుకు స్నేహం తెంచుకున్నారు ? కాంగ్రెస్‌ హయాంలో ధరలు పెరిగాయని దుయ్యబట్టిన బాబు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌తో ఎందుకు స్నేహానికి చేయి చాచారు ? అప్పటి కాంగ్రెస్‌ బాధ్యతారహిత పరిపాలనను ప్రజలు మరిచారని చంద్రబాబు భావించారా ? లేక తానే మరిచారా ? రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ప్రయోజనం జరుగుతుందని బాబు కాంగ్రెస్‌తో స్నేహం చేశారో ఆయనకే తెలియాలి.

2014లో రాష్ట్ర విభజన జరిగి, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు చంద్రబాబును పరిపాలనలో అనుభవజ్ఞుడుగా భావించారు, జాబు కావాలంటే బాబు రావాలని కోరుకున్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా బాబు కూడా అప్పటి తన మేనిఫెస్టోలో ‘ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ ప్రకటించి, నిర్ణీత సమయాలలో ఉద్యోగ నియమాకాలు జరిగేవిధంగా చర్యలు తీసుకుంటాం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విద్యా సంవత్సరం ఆరంభానికి 3 నెలల ముందే డిఎస్‌సి నిర్వహించి ఉపాధ్యాయుల నియామకాలు చేస్తాం’ అని ప్రకటించారు. అందుకే ప్రజలు ఆయనకు ఓటేసి అధికారం అప్పచెప్పారు. మరి ఈ ఐదేళ్లలో బాబు తాను ఇచ్చిన హామీలను ఎప్పుడైనా అమలు చేసే ప్రయత్నం చేశారా ? అంటే, లేదనే ప్రజల నుండి సమాధానం వస్తోంది. ఈ ఐదేళ్లలో గడిచిన 2018 డిశంబర్‌లో మొదటి డిఎస్‌సి పరీక్ష జరిగిందని, 2019 ఫిబ్రవరిలో ఫలితాలొస్తాయంటున్నారని, కానీ ఎప్పుడు వస్తాయో తెలియదని అభ్యర్థులు అంటున్నారు. ఇక ఇతర ఉద్యోగ ప్రకటనలేవీ గత నాలుగేళ్లలో రాలేదని, ఎన్నికలు దగ్గరపడిన ఈ సందర్భంలో పోలీసు, గ్రూప్‌, తదితర ఉద్యోగ ప్రకటనలు వచ్చాయని, వాటి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో, ఫలితాలు ఎప్పుడు వస్తాయో, ఉద్యోగ నియామకాలు ఎప్పుడు జరుగుతాయో, వాటికి ఇంకెంతకాలం పడుతుందోనని రాష్ట్రంలోని నిరుద్యోగులు వాపోతున్నారు. పైగా బాబు నిరుద్యోగు లకు భృతి ప్రకటించారు. 2014 మేనిఫెస్టోలోనే నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి నుండి రూ.2 వేల వరకూ నిరుద్యోగ భృతి కల్పిస్తామని మాటిచ్చిన బాబు లేటుగా ఎన్నికల సందర్భంలో 2018లో ప్రకటించడం గమనార్హం. ఇది కూడా అర్హులైన వారికి అందటం లేదని నిరుద్యోగ యువత వాపోతున్నారు.

దేవాలయ పూజారులకు రిటైర్‌మెంట్‌ లేదని మేనిఫెస్టోలో చెప్పిన బాబు తితిదే ప్రధాన పూజారి రమణ దీక్షితులను బలవంతంగా రిటైర్‌ చేయించారు. ఇది బాబు రెండు నాల్కల ధోరణి అని ప్రజలు తర్కించుకుంటున్నారు.

అప్పటి మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు అనేక వరాలను ప్రకటించారు. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని, లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. పేద మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామన్నారు. ఇంకా హైస్కూలు లేక ఇంటర్‌ చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ వంటి అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వీటన్నిటినీ మరిచారు. పైగా ప్రస్తుత ఎన్నికల సందర్భంగా మళ్లీ మహిళలకు స్మార్ట్‌ ఫోన్‌లు, ‘పసుపు కుంకుమ’ పేరుతో పదివేల రూపాయల చెక్కు ఇస్తామని అంటున్నారు. అయితే ఇవేవీ అమలు సాధ్యం కావని విపక్షాలు అంటున్నాయి. కొందరు టిడిపి మహిళా కార్యకర్తలకు అక్కడక్కడా స్మార్ట్‌ఫోన్‌ అందిన మాట వాస్తవమేనని, కాని అవి నెలరోజులలోనే పాడయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ‘పసుపు కుంకుమ’ పేరుతో పదివేలు ఇవ్వడం కూడా సాధ్యం కాదని, దానిపై ఎవరో ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే దానిని ఎన్నికల సంఘం రద్దు చేయవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. మహిళలకు ఇచ్చిన ఈ హామీలు కూడా పోయినసారి ఇచ్చిన హామీల లాగానే అమలుకు నోచుకోకపోవచ్చని అంటున్నారు. ఇదంతా బాబు ఎన్నికల రాజకీయమంటూ కొట్టిపారేస్తున్నారు. అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు మేనిఫెస్టో రాసుకోవడం ఎందుకని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *