విమర్శలతో ఏం సాధించారు ?

విమర్శలతో ఏం సాధించారు ?

‘మోదీ, కేసిఆర్‌ కలిసి నన్ను ఇబ్బంది పెట్టి అమరావతి అభివృద్ధి కాకూడదని ప్రయత్నించారు’ అని బాబు అన్నారు. అయితే ఇది కూడా బాబు వేసిన ఒక రాజకీయ ఎత్తుగడే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలలో బాబును బూచిగా చూపించి కేసీఆర్‌ అఖండ విజయం సాధించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ను బూచిగా చూపించి బాబు వచ్చే ఎన్నికలలో అఖండ విజయం సాధించాలని అనుకుంటున్నారని, కాని ఇది బాబుకు సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గుంటూరులో ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక ఇంటిలోని సభ్యులంతా టివి చూస్తున్నారు. ఆ సమయంలో పెట్టిన ఒక చానల్‌లో చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతున్న వార్త ప్రసారమవుతోంది. వెంటనే టివి చూస్తున్నవారిలో ఉన్న ఆ ఇంటి గృహిణి చానల్స్‌ మారుస్తున్న తన కొడుకుతో ‘చంద్రబాబు వార్త తీసెయ్‌, ఎప్పుడూ మోదీని తిట్టడమేగా ఆయన పని! తిప్పెయ్‌’ అని విసుగ్గా అంది. ఆ గృహిణి పెద్దగా చదువుకున్న మహిళ కూడా కాదు.

ఒక గ్రామంలో ఉన్న ఒక చదువు రాని మహిళ ‘చంద్రబాబు పని మోదీని తిట్టడమే’ అనే అభి ప్రాయాన్ని ఏర్పరచుకుందంటే చంద్రబాబు మోదీని ఎంతగా తిడుతున్నారో అర్థమవుతున్నది. సందర్భం ఉన్నా లేకపోయినా, పార్టీ మీటింగ్‌ అయినా ప్రభుత్వ సమావేశం అయినా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాబు ఏదో ఒక వంక పెట్టుకుని మోదీని తిట్టడమో లేక విమర్శించడమో పనిగా పెట్టుకున్నారు. విమర్శలో కూడా ఏదైనా అర్థం పరమార్థం ఉంటు న్నాయా అంటే అది మచ్చుకైనా కనబడట్లేదు. పైగా మోదీ మీద విమర్శల పేరుతో బాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అది కూడా గత సంవత్సరంగా.

బాబు మోదీని తిట్టడానికి, విమర్శించడానికి కేటాయించిన సమయం, మోదీని తిట్టడానికి ఏర్పాటు చేసిన పార్టీ మీటింగులు, వాటికి అయిన ఖర్చులను ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తే ఈ సంవత్సరంలో అనేక ప్రజా పనులు పూర్తయ్యేవి. రాబోయే ఎన్నికలలో తనకు లాభం జరగడం కోసం బాబు రాష్ట్ర పాలనను గాలికొదిలేసి, సంవత్సర మంతా మోదీని తిట్టడానికే పరిమితమయ్యారు. ఇంతా చేసి బాబు రాష్ట్ర ప్రజలలో తన పట్ల దురభిప్రాయం పెంచు కోవటం తప్ప సాధించిందేమీ కనబడటం లేదు.

హైకోర్టు విభజనపై..

బాబు మొదట నుండి మోదీపై, కేంద్రంపై చేస్తున్న పస లేని విమర్శలలో తాజాగా మరొక అంశం చేరింది. అది ఉమ్మడి హైకోర్టు విభజన. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం మొదటి నుండి నత్త నడకన సాగుతోందని ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా పలుమార్లు మీడియాతో వాపోయారు. ఈ మధ్య కేంద్రానికి వ్యతిరేకంగా మారిన చంద్రబాబు మరో అడుగు ముందుకేసి ఈ డిసెంబర్‌ 31 నాటికి హైకోర్టును విభజించాలని సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. దానితో సుప్రీంకోర్టు జనవరి 1 నుండి రెండు రాష్ట్రాలలో హైకోర్టులు విడివిడిగా పని చేయాలని తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారంగానే డిసెంబర్‌ 31 నాటికి సుప్రీంకోర్టు ఉమ్మడి హైకోర్టు విభజనను వందశాతం పూర్తి చేసింది. ఇప్పుడు బాబు దానిని కూడా వివాదాస్పదం చేస్తూ ‘ఉన్న పళంగా మోదీ మా ఉద్యోగులను హైదరాబాద్‌ నుండి వెళ్లగొడితే వారు ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు’ అంటూ విమర్శలు అందుకున్నారు. ‘మేం ఆంధ్రకు రావడానికి ఒక నెల సమయం అడిగాం, దానిని కేంద్రం పట్టించుకోలేదు. చూశారా మనమీద ఎంత కక్ష గట్టిందో’ అంటూ విమర్శల దాడి పెంచారు. రాష్ట్రం విడిపోయి ఇప్పటికి నాలుగున్నర ఏళ్లు పూర్తయితే ఇంకా హైకోర్టు విడిపోకుండా ఎలా ఉంటుంది? ఈ విషయంలో కేంద్రం చేసిందేముంది ? హైకోర్టును విభజించటం సుప్రీంకోర్టు పని. సుప్రీం కోర్టు తన ప్రణాళిక ప్రకారం, బాబు దాఖలు చేసిన ప్రమాణపత్రం (అఫిడవిట్‌) ప్రకారం తన పని పూర్తి చేసింది. దీనికి కేంద్రానికి, మోదీకి సంబంధం ఏముంది ? ఇవ్వకపోతే ‘ఇవ్వట్లేదు చూశారా మోదీకి మనపై ఎంత కోపమో’ అని విమర్శి స్తారు, ఇస్తే ‘చూశారా ఇప్పటికిప్పుడు పొమ్మంటు న్నారు, మోదీకి మనపై ఎంత కక్షో’ అని విమర్శిస్తారు. మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్లుంది బాబు ఈ వింత ప్రవర్తన. మోదీని తానే ఏదో వంక పెట్టుకుని ఘోరంగా ప్రజల ముందు తిడుతూ, విమర్శిస్తూ, తనను మోదీ ఎదగనివ్వటం లేదు, ఆంధ్రకు అన్యాయం చేస్తున్నాడు అంటూ నిరంతరం విమర్శి స్తున్నారు. ఈ పస లేని విమర్శలు వినీ వినీ ప్రజలు విసిగిపోతున్నారు. ఇలా చేస్తే ‘బాబు ఏం చేసినా చివరికి మోదీని విమర్శించడానికే’ అనే అభిప్రాయం పౌరులలో కలగటంలో ఆశ్చర్య మేముంది?

ఇంకొక విషయం ఏమిటంటే, డిసెంబర్‌ నాటికి ఆంధ్రకు వెళ్తామని అఫిడవిట్‌ దాఖలు చేసిన చంద్ర బాబు ఇన్నాళ్లపాటు హైకోర్టు భవనం నిర్మించకుండా ఎందుకు తాత్సారం చేశారు ? సైబరాబాద్‌ను ఐదేళ్లలో తానే నిర్మించానని చెప్పుకునే బాబు ఈ ఐదేళ్లలో కేవలం హైకోర్టు భవనం నిర్మించలేక పోయారా ? అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే హైకోర్టు ఉద్యోగులు ఆంధ్రకు రావడానికి ఇంకొంత సమయం ఇవ్వమని అడిగితే ఇవ్వలేదంటూ బాబు మీడియా ముందు కేంద్రాన్ని విమర్శిస్తూ రాజకీయం చేస్తున్నారని, దానిబదులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో రిట్‌ వేస్తే సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాది ఒకరు అన్నారు.

ఇటువంటి పస లేని విమర్శలతో బాబు మోదీతో పాటు ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌నూ విమర్శించాల్సిన వారి జాబితాలో చేర్చారు. ‘మోదీ, కేసిఆర్‌ కలిసి నన్ను ఇబ్బంది పెట్టి అమరావతి అభివృద్ధి కాకూడదని ప్రయత్నించారు. అయినా నేను ఎన్నో పరిశ్రమలు తెచ్చాను, మోదీ అమరావతి పర్యటనకు వస్తానని రాకుండా కేసిఆర్‌తో నన్ను తిట్టిస్తున్నారు’ అన్నారు. అయితే ఇది కూడా బాబు వేసిన ఒక రాజకీయ ఎత్తుగడే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలలో బాబును బూచిగా చూపించి కేసీఆర్‌ అఖండ విజయం సాధించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ను బూచిగా చూపించి బాబు వచ్చే ఎన్నికలలో అఖండ విజయం సాధించాలని అనుకుంటున్నారని, కాని ఇది బాబుకు సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముగ్గురు మోదీలంటూ బాబు మోదీని, కేసీఆర్‌ను, జగన్‌ను కలిపి విమర్శించారు. వీరు ముగ్గురూ తనపై కక్ష గట్టారని, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మొదట కేవలం మోదీనే లక్ష్యంగా చేసుకున్న బాబు ఇప్పుడు కేసీఆర్‌, జగన్‌లను కూడా తన పస లేని విమర్శల జాబితాలో చేర్చారు.

అయితే దీనిపై రాష్ట్ర భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందిస్తూ బాబు వందమంది ధృత రాష్ట్రులతో సమానమన్నారు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. నాడు బాబు అసెంబ్లీలో సోనియాను, రాహుల్‌ను దుమ్మెత్తిపోసి, మోదీని పొగిడారని, ఇప్పుడు అదే నోటితో మోదీని ఎలా తిట్టగలుగు తున్నారని ప్రశ్నించారు. తనతో పాటు జగన్‌, పవన్‌లు కూడా మోదీని తిట్టాలని బాబు కోరుకుంటు న్నారని, ఇది ఎటువంటి రాజకీయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా, అగమ్య గోచరంగా ఉందని దుయ్యబట్టారు. నిధులివ్వడం లేదని బాబు నిరంతరం కేంద్రంపై మండిపడు తున్నారని, వాస్తవానికి కేంద్రం నిధులిస్తా మన్నప్పటికి బాబు కావాలనే తీసుకోకుండా రాజకీయం చేస్తున్నారని వీర్రాజు విమర్శించారు. తాజాగా కేంద్రం 700 కోట్లు ఇస్తామన్నా, యూసీలు ఇవ్వకుండా రాష్ట్రం కావాలనే జాప్యం చేస్తున్నదని అన్నారు.

అవి మేనిఫెస్టోలే..

ఇక బాబు ఈ మధ్య రాష్ట్ర అభివృద్ధి, పరిపాల నపై రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఆ శ్వేత పత్రాలలో ఇప్పటివరకూ తాను సొంతంగా ఎన్నో పనులు చేశానని, మరెన్నో చేస్తానని చెపుతున్నారు. కేంద్రం నిధులిచ్చి ఉంటే ఇంకా ఎన్నో చేసేవాడినని కూడా అంటున్నారు. ఇది ఎలా ఉందంటే ‘కంచాలు మునుపటిలా – మూలుగులు ఎప్పటిలా’ అనే సామెతలా ఉంది. అంటే తిండి కంచాలు కంచాలు అయిపోతోంది. కాని మూలుగులు మాత్రం ఎప్పటికీ తగ్గటం లేదు అని. అంటే బాబు కేంద్రం నుండి ఎన్నో తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇవ్వడం లేదని పెదవి విరుస్తున్నారు.

శ్వేతపత్రాల విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ భాజపా నాయకులు స్పందిస్తూ ‘అవి శ్వేతపత్రాలా? లేక అవినీతి పత్రాలా? అని ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద వేల కోట్లు ఇస్తున్నది కేంద్రం కాదా? కేంద్ర నిధులతో కాకుండా సొంతంగా బాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అభివద్ధి మోదీది అయితే అవినీతి చంద్రబాబుది’ అంటూ ఘాటుగా విమర్శించారు.

అయితే రాజకీయ పండితులు శ్వేతపత్రాల విడుదల గురించి విశ్లేషిస్తూ ఇది రాబోయే ఎన్నికల ప్రణాళిక అని, ఒక విధంగా చూస్తే ఎన్నికల మానిఫెస్టో అని అంటున్నారు. ఎందుకంటే శ్వేత పత్రాల ద్వారా బాబు తాను ఏం చేశారో చెప్తూ, రాబోయే రోజుల్లో ఏం చేద్దామనుకుంటున్నారో చెబుతున్నారు. ఇది ఎన్నికల ప్రణాళిక కాదా ? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనినిబట్టి రాబోయే ఎన్నికలకు బాబు ఇప్పటినుండే తయారవుతున్నారని అంచనా వేస్తున్నారు. ఈ శ్వేత పత్రాల వంకతో బాబు మోదీని మరింతగా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా బాబు తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు.

కేసీఆర్‌ హుందాతనాన్ని కోల్పోయి, దారుణంగా మాట్లాడుతున్నారని, ఆయన భాష అసహ్యంగా ఉందని బాబు మీడియా ముందు వాపోతున్నారు. మరి తాను అధికారంలోకి రావడానికి సహకరించి, నాలుగేళ్ల పాటు కేంద్ర నిధులను వాడుకుని, ఆ తరువాత చేసిన సహాయాన్ని మరిచి బాబు మోదీని ‘బంగాళాఖాతంలో పడేస్తాం’ అని, ‘మీ అంతు చూస్తాం’ అని అనలేదా ? బాబు బావమరిది బాలకృష్ణ మోదీని తిడుతూ తొడ కొట్టలేదా ? అని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. తాను ఇతరులను ఎలాగైనా తిట్టొచ్చు, కానీ ఇతరులు ఎవరూ తనను ఏమీ అనకూడదు. ఇది బాబు రెండు నాల్కల ధోరణి కాదా ? అని తర్కించుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి ఉండవలసిన ప్రవర్తన ఇదా ? అని ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌కు హైకోర్టు రావడాన్ని రాష్ట్ర ప్రజలు హర్షిస్తు న్నారు. 56 ఏళ్లుగా కంటున్న కల ఇప్పటికి నెరవేరిందని మురిసిపోతున్నారు. ఇన్నాళ్లుగా మారుమూల ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి ప్రజలు హైకోర్టుకు రావాలంటే సుదూరాన ఉన్న భాగ్యనగరం రావాల్సి వచ్చేదని, మాటిమాటికి వాయిదాల కోసం తిరగలేక నానా అగచాట్లు పడాల్సివచ్చిందని తమ గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ బాధల నుండి నేడు గట్టెక్కామని సంతోషిస్తున్నారు.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *