సొమ్ము కేంద్రానిది – సోకు చంద్రబాబుది

సొమ్ము కేంద్రానిది – సోకు చంద్రబాబుది

గత ఆరు నెలలుగా చంద్రబాబు రాష్ట్రంలో రోజుకో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం, ఆ సభలలో అవకాశం చూసుకొని కేంద్ర ప్రభుత్వంపై, మోదీపై దుష్ప్రచారానికి పాల్పడటం చేస్తున్నారు. కేంద్రం నిర్మిస్తున్న, ఇచ్చిన అనేక ప్రాజెక్టులు, పథకాలను తనవిగా చెప్పుకుంటున్నారు.

ఇటీవల నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించి ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పారు. కొత్త ప్రతిపాదలను కేంద్రానికి పంపితే వెంటనే వాటిని మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆ విధంగానే పనులు జరుగు తున్నాయి. గడ్కరీ వచ్చివెళ్ళినప్పటి నుండి బాబు, ఆయన తమ్ముళ్ళు పోలవరం గురించి మాట్లాడటం మానేశారు. గడ్కరీ పర్యటనకు పూర్వం ప్రతి సభలోను, అధికారుల సమావేశాలలోను తానే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లుగా బాబు గొప్పలు చెప్పుకునేవారు.

మంగళగిరిలో AIIM పనులు అనుకున్న దానికన్న వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జె.పి.నడ్డ వాటి పనులు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రస్థావించరు. పైగా ‘అందరికి ఆరోగ్యం’ అని ఈ మధ్య ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, ఆరోగ్యం గురించిన ఆధునిక సదుపాయాలను గ్రామాలలో సహితం అందచేస్తామని, గ్రామాల నుండి ప్రజలు పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేదని బాబు చెప్పారు. మరి వీటికి నిధులెక్కడి నుండి తెస్తారో ?

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికి అక్కడి ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వారికి డయాలసిస్‌ చేయటానికి జిల్లాలో సరి అయిన పరికరాలు లేక ఉన్న పరికరాలు చాలక రోగులు రోజుల తరబడి పడికాపులు కాస్తున్నారు. ఈ రోజుకీ అక్కడి ప్రజలు సరైన వైద్య సౌకర్యం లేక ప్రాణాలను మూఢనమ్మకాలకు బలిచేస్తున్నారు. రోడ్లు కూడా లేని దుస్థితి వారిది. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, ఆయుష్‌ నిధులు ఏమవుతున్నాయో తెలియదు. కేంద్రం ఉత్తరకోస్తా అభివృద్ధి కోసం (వెనుకబడిన 7 జిల్లాల ప్రాంతాలకు) ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయలేదు.

విభజన చట్టంలోని అంశాల ప్రకారం అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా ఐఐటిలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యాప్తికోసం తమ నిధులతో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు స్థాపిస్తుంటే సరిగా నిధులు ఇవ్వటం లేదని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.

బాబు ఈ మధ్య అట్టహాసంగా తిరుపతిలో జ్ఞానభేరిని ప్రారంభించారు. విద్యార్ధులలో మేథోశక్తిని పెంచడం కోసం కేంద్రప్రభుత్వంచే ప్రారంభించబడిన పథకం అది. విద్యార్ధులకు పరిశోధనలో అభిరుచి కలగచేయడం కోసం దేశంలోని అత్యున్నత విద్యాప్రమాణాలు పెరగటం కోసం కేంద్రం ఈ పథకం తెచ్చింది. ఆ పథకాన్ని తన స్వంత పథకంలా జ్ఞానభేరి అని పేరు పెట్టి ఆ పథకానికి రూపకల్పన చేసింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.

నదులు అనుసంధానం గురించి చంద్రబాబు ఎక్కువగా మాట్లాడతారు. నదుల అనుసంధానం ప్రారంభించింది అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో. అప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసారు. సురేష్‌ ప్రభు ఆ శాఖమంత్రి.

పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయి గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్‌కు వినియోగంలోకి వస్తే పట్టిసీమ పరిస్థితి ఏమిటి? కేంద్రం ఇచ్చిన నిధులను ప్రక్కదారి పట్టించి పట్టిసీమ నిర్మాణం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత దాని అవసరం పెద్దగా ఉండదనేది మేధావుల అభిప్రాయం. కేంద్రం నిధులివ్వకపోయినా తాను గోదావరి-పెన్న అనుసంధానం, ఉత్తరాంధ్ర నదుల అనుసంధానం చేస్తానని కబుర్లు చెబుతున్న ముఖ్యమంత్రి వాటికి సరిపడ నిధులు ఎక్కడ నుండి తెస్తారో మాత్రం ప్రజలకు చెప్పరు.

విశాఖ రైల్వే జోన్‌ను ఎట్టిపరిస్థితులలోను ఇస్తామని కేంద్ర గృహమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంటులో ప్రకటించగానే ఆ విజయం తనదే అని చెప్పుకోటానికి తెలుగుదేశం వారు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇలా విభజన చట్టంలోని అంశాలు ఒక్కొక్కటిగా కేంద్రం పూర్తి చేస్తుంటే ఆ పథకాలు, విజయాలు తనవిగా చెప్పుకుంటూ, కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులను తన స్వార్థం కోసం వాడుకుంటూ చంద్రబాబు ప్రజలను చాలా తెలివిగా మభ్య పెడుతున్నారు. కొన్ని పథకాలకు వచ్చిన నిధులను వేరే సొంత పనులకు మళ్ళిస్తూ, కొన్నిటిపై అబద్ధాలు చెపుతూ కాలం గడుపుతున్నారు.

అయితే ముఖ్యమంత్రి తానే సొంతంగా చేస్తానన్న పనులు అనేకం ఇంకా పూర్తవలేదు. అమరావతి నిర్మాణం నాలుగు సంవత్సరాలు దాటినా ఇంకా లేఅవుట్‌ దశలోనే ఉంది. రాష్ట్రప్రభుత్వమే చొరవతీసుకొని పూర్తిచేస్తామని చెప్పి కేంద్రం నుండి తీసుకున్న నిధులు వినియోగించలేకపోయింది. విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మించతలపెట్టిన పైవంతెన ఇంతవరకు సగం కూడ పూర్తికాలేదు. ఇలా అనేక పనులు నిర్మాణదశలోనే ఉండి పోయాయి.

ముఖ్యమంత్రి ఒకపక్క రాష్ట్రంలో పరిపాలనను పట్టించుకోకుండా, చేయాల్సిన పనులను పూర్తి చేయకుండా గడిపేస్తున్నారు. మరోపక్క ఎన్నికలు వస్తున్నాయంటూ రోజుకొక కొత్త పథకం ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం తమ విధులను విడిచిపెట్టి ఆయన వెంట తిరగవలసివస్తోంది. మరి ప్రజలను, పరిపాలనను పట్టించుకునే నాధుడెవరు?

– వైష్ణవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *