సీబీఐని అడ్డుకుంటే ఏమిటి లాభం ?

సీబీఐని అడ్డుకుంటే ఏమిటి లాభం ?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకున్నామని ప్రకటించారు. అదేదో ఘనకార్యమైనట్టు భుజాలు తడుముకున్నారు. ఓ జీవోని అడ్డుపెట్టుకుని సీబీఐ మన రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈయనకు తోడు పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అదే బాటలో నడిచారు. ఆప్‌ ఆధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా చంద్రబాబు చర్యను సమర్ధించారు.

రూల్‌బుక్‌ ప్రకారం చంద్రబాబు నాయుడు చేసింది సవ్యమే. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఏదైనా కేసు విషయంలో ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాలలో ప్రవేశించి విచారణ చేపట్టాలంటే ఆ రాష్ట్రాల అనుమతి తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంది. సీబీఐ సంస్థ అవినీతిలో కూరుకుపోయిందని, మోదీ సీబీఐని తన జేబుసంస్థగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ, కేంద్ర పెత్తనం ఇకముందు రాష్ట్రంలో సాగకుండా అడ్డుకున్నానని అంటున్నారు. రాహుల్‌గాంధీ కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేస్తున్నారో వాటిని చంద్రబాబు అనుసరిస్తున్నారు.

సీబీఐ కన్న అవినీతి నిరోధక శాఖ ఎంతో సమర్ధవంతమైనదని చంద్రబాబు చెబుతున్నారు. కానీ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలోని అధికారులే అవినీతికి పాల్పడి సస్పెండ్‌ అయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకు పోయిన అవినీతి నిరోధక శాఖ అవినీతిపరులను ఎలా పట్టుకోగలదో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి.

సీబీఐని రాష్ట్రంలోకి రానీయకుండా చేయటంలో తన అవినీతిని కప్పి పుచ్చుకోవటానికి చేసిన చర్యగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు, వారి అనుయాయులు చేస్తున్న అవినీతిని చూసీ చూడనట్లు ఉండడానికి, వారిపై వచ్చిన కేసులను నీరుకార్చి వారిని కాపాడటానికి, అలాగే బాబు తనను తాను రక్షించుకోవటానికి ఈ రకమైన చర్యలకు పాల్పడినట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. విశాఖ భూముల కుంభకోణం, అక్రమ మైనింగ్‌ తవ్వకాలు, ఇసుక మాఫియా, భూకబ్జా కేసులలో అసలు దోషులు బయటకు రాకుండా ఉండటం కోసం చంద్రబాబు సీబీఐని అడ్డుకున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు.

మమతా బెనర్జీ కూడా తన రాష్ట్రంలో సీబీఐకి అనుమతిని నిరాకరించినట్లుగా చెబుతున్నది. తనపై ఉన్న నారద, శారద చిట్‌ఫండ్‌ కుంభకోణాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మేల్యే చేస్తున్న అవినీతి బయట పడకుండా ఉండటం కోసం ఆమె అలా చేసిందనేది జగమెరిగిన సత్యం. కాని మమత బెనర్జీపై ఉన్న అవినీతి కేసులపై విచారణ చేపట్టమని సీబీఐకి కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు తీర్పును ఎవరు కాదనగలరు? అలాగే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కూడా ఒకవేళ సీబీఐకి కోర్టు అనుమతి ఇస్తే కాదనటం బాబు వల్ల అవుతుందా! నిజంగా అలా జరిగినట్లయితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న బాబు మరింతగా ప్రతిష్ఠ కోల్పోయి మరిన్ని కష్టాలను కొనితెచ్చుకోవచ్చు.

సీబీఐకి అనుమతి నిరాకరించడం విషయంలో రాజకీయ విశ్లేషకులు, మేధావులు చందబాబు చర్యను సమర్ధించడం లేదు. ఈ చర్య వల్ల రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అవినీతి పరులు, బ్లాక్‌ మార్కెటర్లు, భూకబ్జా దారులకు అడ్డులేకుండా పోతుందనేది వారి ఆందోళనకు కారణం. తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు కేంద్ర అధికారాలను అడ్డుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కర్నాటక ప్రభుత్వం కూడ ఇదివరలో సీబీఐకి సాధారణ అనుమతిని జీవో ద్వారా రద్దు చేసింది. కాని అవినీతి నిరోధక శాఖలోనే అవినీతి పెరిగిపోవడం, రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాలు పెరగటం, ఉగ్రవాద చర్యలు, దేశ విద్రోహ శక్తుల బలం పెరగటం గమనించిన అప్పటి కర్నాటక ప్రభుత్వం వెంటనే ఆ జీవోని ఉపసంహరించుకుంది.

అదే పరిస్థితి ఏపీలో కూడా ఏర్పడుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్ల ప్రభావం కనబడుతోంది. పట్టపగలు ఒక శాసనసభ్యుడ్ని, ఒక మాజీ శాసనసభ్యుడ్ని కాల్చి చంపిన సంగతి ఇంకా ప్రజల మనసుల్లో నుండి కనుమరుగు కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సీబీఐని నిరాకరించడంతో రానున్న రోజులలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి.

పన్ను ఎగవేతదారులను కాపాడటం కోసం ఐటీి దాడులను విమర్శించడం, అనంతరం సీబీఐని అడ్డుకోవడం వంటి చర్యలతో చంద్రబాబు అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో గట్టిపడుతున్నది. దీనివల్ల భవిష్యత్తులో చంద్రబాబు ప్రతిష్ట మరింత మసకబారటమే తప్ప ఇతరత్రా కలిగే లాభాలేవీ కనబడటం లేదు.

– వైష్ణవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *