విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం

విజయవాడలో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం

విజయవాడ కేదారేశ్వరపేటలోని కృష్ణరాజ అపార్ట్‌మెంట్‌లో ‘సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రల్‌ స్పిరిట్‌’ పేరుతో రాజకీయ, సామాజిక అధ్యయన కేంద్రం ‘గ్రంధాలయం’ జనవరి 26న ప్రారంభమైంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌గా, హిందూనగారా మాసపత్రిక సంపాద కులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి.వి.శ్రీరామశాయి స్వగృహంలో ఈ గ్రంథాలయాన్ని ఏకలవ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త పెరమారెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, ప్రముఖ రచయిత, హైదరాబాద్‌ నవభారతి ప్రచురణల నిర్వాహకులు వడ్డి విజయ సారధి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు.

ప్రముఖ రచయిత, కాలమిస్టు డా.దుగ్గరాజు శ్రీనివాసరావు ఈ గ్రంథాలయానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు.

గ్రంథాలయ ప్రారంభోత్సవం అనంతరం అధ్యక్షులు డా.దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ భావజాలం కలిగిన వ్యక్తులలో అధ్యయన శీలత తక్కువగా కనిపిస్తున్నదని, ఎంత విషయ పరిజ్ఞానమున్నప్పటికీ వివిధ అంశాలపై అధ్యయనం చెయ్యడం ఎంతో అవసరమని అన్నారు. ఉత్సాహ వంతులైన సామాజిక కార్యకర్తలకు విషయావగాహన కల్పించాలని, విలువైన గ్రంథాలలోని సమాచారం భావితరాలకు అందించాలనే సంకల్పం తనకు నాలుగేళ్ల కిందటే కలిగిందని, ఇటీవల తన మనస్సు లోని భావనను రామశాయి గారి ముందు పెట్టగా వారు వెంటనే అంగీకరించి మొదటగా తన దగ్గరున్న వేయి పుస్తకాలతో తమ ఇంటిలోనే గ్రంథాలయం ప్రారంభించటానికి అంగీకరించారని తెలిపారు.

ముఖ్యఅతిథి డా.వడ్డి విజయసారధి మాట్లాడుతూ జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడం అనేది వేదకాలం నుంచి ఉన్నదని, అలాగే జాతీయవాద సాహిత్యం భావితరాలకు అందాలంటే ఇలాంటి ప్రయత్నం అవసరమని తెలిపారు. ఔత్సాహికుల అధ్యయనానికి తగిన వాతావరణం కల్పిస్తే ఈ గ్రంథాలయం పది కాలాల పాటు జ్ఞాన ప్రదాయినిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రంథాలయ ప్రారంభకులు పి.వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాన్ని నేటి తరం యువత అవసరాలకు, ఆసక్తులకు నుగుణంగా అందు బాటులో ఉంచేందుకు ఇంటర్నెట్‌ సౌకర్యం, తగినన్ని కంప్యూటర్లు మొదలైన వాటితో ఆధునీకరించాలని తెలిపారు. నేడు తెలుగు చదవగలిగిన, రాయగలిగిన వారు అరుదుగా వున్నారని, ఈ గ్రంథాలు చదవడం ద్వారా విషయ పరిజ్ఞానమున్న వారు వారి భావాలను గ్రంథస్తం చేసే అలవాటు కూడా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పి.వి.శ్రీరామశాయి మాట్లాడుతూ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి మదిలో మెదలిన ఆలోచన తనకు ఈ సంకల్పాన్ని ఇచ్చిందని, దానితో మొదటగా తన దగ్గరున్న వెయ్యి పుస్తకాలతో ఈ గ్రంథాలయం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ ‘సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రల్‌ స్పిరిట్‌’కు ప్రముఖ రచయిత, కాలమిస్టు దుగ్గరాజు శ్రీనివాసరావు అధ్యక్షులుగా కొనసాగుతా రని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *