బీజేపీ ఎన్నికల ప్రణాళిక

బీజేపీ ఎన్నికల ప్రణాళిక

వాస్తవిక దృష్టి… ప్రజా శ్రేయస్సు..

ఇందులో ఆర్భాటంగా కురిపిస్తున్న వరాలు లేవు. ఈ మేనిఫెస్టోను అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్‌ను కూడా రాష్ట్రానికి తరలిస్తేనే సాధ్యమని ఎవరూ వ్యంగ్యాస్త్రాలు కురిపించే అవకాశం ఇవ్వకుండా రూపొందించిన సంక్షేమ పథకాలు మాత్రం ఉన్నాయి. వాస్తవికతతో కూడిన కొన్ని హామీలు ఉన్నాయి. తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రణాళికను చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. నీళ్లు, నియామకాలు, నిధులు అధికార పక్షం సొంతమని ఇంతకాలం చాటుకోవడం ఎంత హాస్యాస్పదమో కూడా ఈ ఎన్నికల ప్రణాళికను చూస్తే అర్థమవు తుంది. కేసీఆర్‌ ఆ మూడు అంశాలను కవితాత్మ కంగా, ఉద్వేగంగా చెప్పవచ్చు. కానీ అవి ఏ రాజకీయ పార్టీకైనా అవి నిర్వహించవలసిన సహజ విధులుగా కనిపిస్తాయి. నీళ్ల కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు తెరాస ఆధ్వర్యంలో మాత్రమే జరగలేదు. అసలు తెరాస ఆవిర్భావానికి ముందే నీటి కోసం ఇక్కడ పోరాటాలు జరిగాయి. ఎన్నో సమాలోచనలు జరిగాయి. బీజేపీ కూడా నీళ్లకు తన మేనిఫెస్టోలో ప్రముఖ స్థానమే ఇచ్చింది. నియామకాల గురించి కూడా సరైన పంథాలో చెప్పింది. ఇక కేంద్రం నుంచి వస్తున్న నిధులు సరేసరి.

రైతును ఆదుకోవడమనే విధానం ఈ దేశం మొత్తానికి అవసరం. బీజేపీ మేనిఫెస్టోలో రైతుల రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇది ఆహ్వానించదగినదే. వ్యవసాయ ధరల కమిషన్‌ ఏర్పాటు కూడా ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలులో ఉంది. అలాంటి వ్యవస్థ రైతుకు గొప్ప భరోసాను ఇస్తుంది. దళారుల బాధ నుంచి వారిని విముక్తం చేయడానికి ఉపయోగపడుతుంది. పది కోట్ల రూపాయలతో రైతు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలన్న యోచన కూడా స్వాగతించదగినదే. అలాగే ఉచితంగా విత్తనాల పంపిణీ హామీ కూడా ఆహ్వానించదగినదే.

సంపూర్ణ మద్య నిషేధం గురించి గత అనుభవం వల్ల కాబోలు, బార్‌లు, మద్యం దుకాణాలు వారంలో ఐదు రోజులు మాత్రమే తెరిచి ఉండడానికి అనుమతిస్తామని బీజేపీ చెబుతోంది. కానీ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సంపూర్ణ మద్య నిషేధం గురించి చెబుతున్నాయి. ఆ దిశగా కూడా ఆలోచించాలి. ఇది ఒక ప్రాంత అలవాటును కించ పరచడం కాబోదు. మద్యం మాఫియా చేతుల లోకి వెళ్లిన తరువాత జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. దీనిని గమనించడం వాస్తవిక దృక్పథమే అవుతుంది. ఉపాధి కూలీలకు అల్పాహారం అందించాలన్న యోచన సరైనది.

1. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ.

2. ఇళ్లు లేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం.

3. గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీల నిర్మాణం.

4. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.

5. కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేసి సాగునీరు అందించడం.

6. కాలేజీ విద్యార్థినులకు స్కూటీ(టూ వీలర్‌)లు.

8. హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేని వాళ్లకు అద్దె చెల్లింపు.

9. బార్‌లు, వైన్‌ షాపులు వారానికి ఐదు రోజులే తెరిచి ఉంచేలా నిబంధనలు.

10. గొర్రెల పెంపకందారుల సబ్సిడీ 20,000 నుంచి 50,000లకు పెంపు.

11. పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు.

12. డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.

13. పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా.

14. ఉపాధి హామి కూలీలకు అల్పాహారం.

15. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.

16. ప్రతి మండలంలో డ్రై, కోల్డ్‌ స్టోరేజ్‌ల ఏర్పాటు.

17. వ్యవసాయ ధరల నిర్ణయ కమిషన్‌ ఏర్పాటు.

18. రూ.10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు.

19. రైతులకు ఉచితంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ.

20. సీపీఎస్‌ విధానం రద్దు.

21. నిరుద్యోగ యువతకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి.

22. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దేందుకు రుణాలు.

2014 ఎన్నికల సమయంలో మోదీ చేసిన ప్రచారం తీరుతెన్నులను ఒక్కసారి గుర్తుకు తెచ్చు కుంటే చాలా విషయాలు బోధపడతాయి. అలవికాని హామీలు ఇచ్చినందువల్ల ఆయనకు అంత జనాదరణ రాలేదు. ఆయన హామీల గురించి చాలా తక్కువ మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచారంలో తాను ప్రస్తావించని అనేక సంక్షేమ కార్యక్రమాలను మోదీ అమలు చేసి చూపించారు.

నిజానికి కేసీఆర్‌ లెక్కకు మిక్కుటంగా ఎన్నికల హామీలు కురిపించారు. అందులో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఒకటి. దీనిని కూడా ఆయన నెరవేర్చే సాహసం చేయలేదు. అలాగే దళితులకు మూడెకరాల భూమి హామీ కూడా అలాంటిదే. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా పార్టీలకు ఎన్నికల ప్రణాళికను తరువాత మరచిపోయే సంప్రదాయం ఉంది. కాంగ్రెస్‌ నేర్పిన ఈ సంస్కృతి బీజేపీ వంటి ఒకటీ అరా పార్టీలు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకు అంటుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక, వాటిలో ఆయన అమలు చేసినవి బేరీజు వేస్తే ఎక్కడా పొంతన కుదరదు. అందుకే పత్రికలలో ఎన్నికల ప్రణాళికల మీద అంత విరివిగా వ్యంగ్య చిత్రాలు వెలువడుతున్నాయి. వీటి మీద ఎన్నికల కమిషన్‌ నిఘా ఉన్నప్పటికీ కూడా కొన్ని పార్టీలు ఇప్పటికీ అలవికాని హామీలు ఇస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా కోటలు దాటే మాటలతో ఎన్నికల ప్రణాళికలను ప్రజలకు మీదకు వదిలిపెట్టడం రివాజయింది.

ఈ నేపథ్యంలో బాధ్యత ఎరిగిన ఒక రాజకీయ పక్షంగా, ఒక జాతీయ పార్టీగా బీజేపీ సంక్షేమం, సామాజిక దృష్టి, సమన్యాయం అందించాలన్న ఆశయం కలగలిసిన ఎన్నికల ప్రణాళికను ముందుకు తెచ్చింది. అందుకే ఇది వాస్తవికంగా కనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *