బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

దక్షిణ ఆసియాలో ఉన్న అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం నెలకొని ఉంది. కాని ఆయా దేశాలలోని ప్రజాస్వామ్య సంస్థలు అనుభవం లేని కారణంగా తికమకకు గురవుతున్నాయి. ఈ మధ్య శ్రీలంకలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పాకిస్తాన్‌ ఎన్నికలలో సైన్యం జోక్యం, మాల్దీవులలో అత్యవసర పరిస్థితి ప్రకటన ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఆయా దేశాలలో ప్రజాస్వామ్యం బీటలు వారుతుందేమో అని భావించవలసి వస్తుంది.

మన దేశానికి నైరుతి దిశలో బంగ్లాదేశ్‌ ఉంది. ఈ దేశం 1971లో పాకిస్తాన్‌ నుండి వేరుపడింది. బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో ఇండియా భూమిక ప్రధానమైనది. 1971లో ఏర్పడిన బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు 19 మార్లు తిరుగుబాట్లు జరిగాయి. ఒకసారి సైనిక పాలన ఉంటే, మరోమారు ప్రజా స్వామ్య పాలన. విచారకరమైన విషయమేమంటే బంగ్లాదేశ్‌లో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? లేదా? అనే అనుమానం అక్కడి ప్రజలలో నెలకొని ఉంది. అక్కడ ఇవి 11వ పార్లమెంట్‌ ఎన్నికలు.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్‌ను జగతియో – సంసద్‌ అంటారు. మొత్తం పార్లమెంట్‌ స్థానాలు 350. బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ అవసరమైన బలగాలను నియుక్తి చేసింది.

బంగ్లాదేశ్‌లో ముఖ్యమైన రాజకీయ పార్టీలు అవామీలీగ్‌, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బిఎన్‌పి). 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలను బిఎన్‌పి బహిష్కరించింది. ఫలితంగా అవామీలీగ్‌ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. బంగ బంధు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కూతురు షేక్‌ హసీనా అవామీలీగ్‌కు నాయకత్వం వహిస్తోంది. ఇక బిఎన్‌పి అధ్యక్షురాలు బేగమ్‌ ఖలీదా జియా అధికార దుర్వినియోగం, నిధుల మళ్లింపు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం అవామీలీగ్‌ అధికారంలో ఉంది. అవామీలీగ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని బిఎన్‌పి పార్టీ అధ్యక్షుడికి అర్జీ పెట్టుకుంది. దానితోపాటు తమ నాయకురాలు బేగమ్‌ ఖలీదా జియాను విడుదల చేయాలని ఆ పార్టీ కోరుతోంది. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు బిఎన్‌పి పార్టీ డిమాండ్లను తిరస్కరించారు. అయితే ఎన్నికలను ఒకవారం రోజులు మాత్రం వాయిదా వేశారు. బిఎన్‌పి 2014లో ఎన్నికలను బహిష్క రించింది. కాని ఈ మారు ఎన్నికల బరిలో నిలబడింది. బిఎన్‌పికి ఇస్లామిక్‌ మత ఛాందస సంస్థలతో దగ్గరి సంబంధం ఉంది. అందులో జమత్‌ – ఎ- ఇస్లామి (జెల్‌) ప్రముఖమైనది. కాబట్టి అవామీలీగ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు ఈ ఎన్నికలు గట్టిపోటీని ఇవ్వనున్నాయి. షేక్‌ హసీనా గెలవడానికి చమటోడ్చవలసిందే. గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాబోదు. ఈ మారు అవామీలీగ్‌కు గట్టిపోటీని ఇవ్వడానికి బిఎన్‌పి అన్ని విధాల ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్‌ చరిత్రలో మొదటిసారిగా ఈ సారి ఎన్నికలను ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించడం లేదు.

అవామీలీగ్‌ ప్రభుత్వం భారత్‌కు అనుకూలంగా నడుచుకుంటున్నది. ఈ ఎన్నికలలో అవామీలీగ్‌ భాగస్వామ్య పార్టీలతో కలిసి బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు హెచ్‌యం ఎర్నాడ్‌కు చెందిన జాతీయ పార్టీతోనే ఇస్లామిస్ట్‌ పార్టీ అయిన హెజాపత్‌-ఎ-ఇస్లాంతోను, బికల్స్‌ధారా బంగ్లాదేశ్‌ పార్టీతోనూ కలిసి పోటీ చేస్తోంది.

ఇక బిఎన్‌పి ఐదు సంవత్సరాల విరామం తరువాత ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇది కూడా కొన్ని పార్టీలతో జత కట్టింది. అందులో డా||కమల్‌ హుసేన్‌ నాయకత్వంలో ఉన్న జాతీయ ఒకియా ఫ్రంట్‌ ఒకటి. ఇంతకు పూర్వం అవామీలీగ్‌ పార్టీ అంటే స్వేచ్ఛకు అనుకూలం, సెక్యులర్‌ ఫ్రంట్‌ అని, బిఎన్‌పి అంటే స్వేచ్ఛకు వ్యతిరేకం.. ఇస్లామిక్‌ ఫ్రంట్‌ అని కొట్టొచ్చినట్టు తెలియవచ్చేది. కాని ఈ మారు ఎన్నికలలో దానికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. రెండు ముఖ్యమైన పార్టీలు విభిన్న దృక్పథాలు కలిగిన రాజకీయ సంస్థలతో కలిసి ఎన్నికల బరిలో పోటీ పడుతున్నాయి.

బిఎన్‌పి ప్రధానంగా పాకిస్తాన్‌ అనుకూల వైఖరిని ఆవలంబించే పార్టీ. దీని భాగస్వామ్య పార్టీ జాతీయ ఒకియా ఫ్రంట్‌ నాయకుడు కమాల్‌ హుసేన్‌ సెక్యులర్‌వాది ఇక జెల్‌ ఒక ఇస్లామిక్‌ ఛాందస సంస్థ. షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌కు సన్నిహితుడు. 1981లో షేక్‌ హసీనా బహిష్కరణ తరువాత అవామీలీగ్‌ పార్టీకి రూపురేఖలు తీసుకువచ్చిన వ్యక్తి కమాల్‌ హుసేన్‌. ఎన్నికల ముందే ఇతడు నాలుగు పార్టీలతో కలిసి ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాడు. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఇద్దరు బేగమ్‌ల మధ్య జరిగినవే. ఈ మారు ఎన్నికలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

ఎలాగైనా అధికారం పొందాలనుకుంటున్న షేక్‌ హసీనా ముందుగానే పావులు కదిపింది. ఇస్లామిస్ట్‌ ఓట్లలో చీలిక తీసుకురావడానికి ఎత్తులు వేసింది. ఈ మధ్యనే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఇస్లామిస్ట్‌ గ్రూపులకు చెందిన వ్యక్తులకు అవామీలీగ్‌ పార్టీ టిక్కట్లపై బరిలోకి దించి గెలిపించుకుంది. ఎ.ఎల్‌. టిక్కట్లపై పోటీచేసి గెలుపొందిన వారిలో అధికులు ఇస్లామిస్ట్‌ వాదులే. దీనితో షేక్‌ హసీనాకు గల సెక్యులర్‌వాది అనే పేరు మసకబారింది.

బిఎన్‌పి, దాని మద్ధతుదారయిన జెల్‌ పార్టీలు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బిఎన్‌పి నాయకురాలు బేగమ్‌ ఖలీజియా జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా సరైన నాయకత్వం లేని ఆ పార్టీ అనుచరుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖలీదా జియా కొడుకు తారిఖ్‌ రహమాన్‌ కూడా షేక్‌ హసీనా మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణపై జైలు పాలయ్యాడు. ఒక విధంగా బిఎన్‌పికి అనుభవం గల నాయకత్వం లేనందువల్ల అభ్యర్థుల ఎంపికను జెల్‌ చేపట్టింది. ఇక జెల్‌ విషయానికి వస్తే బంగ్లాదేశ్‌ ఏర్పడిన కొత్తలో ఇది నిషేధానికి గురైంది.

ఆ తరువాత నిషేధం ఎత్తివేశారు. 2001లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో జెల్‌ పార్టీ బిఎన్‌పితో కలిసి పోటీ చేసింది. ప్రభుత్వంలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు.

2013లో ఎలక్షన్‌ కమిషన్‌ జెల్‌ గుర్తింపును రద్దు చేసింది. దీంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్ర యించింది. హైకోర్టు జోక్యం వలన ఈ ఎన్నికలలో జెల్‌కు సంబంధించిన కార్యకర్తలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. జెల్‌కు సంబంధించిన చాలామంది కార్యకర్తలు పాకిస్తాన్‌ అనుకూల ఆరోపణలు ఎదుర్కొంటూ జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జెల్‌ కార్యకర్తలు పాకిస్తాన్‌కు అను కూలంగా వ్యవహరించారు. ఈ పార్టీకి బంగ్లాదేశ్‌ సరిహద్దులలో మంచి పట్టు ఉంది. సుమారు 25 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటున్నదన్న విషయం అవామీలీగ్‌ పార్టీని కలవరపెడుతోంది.

ఇదే సమయంలో బిఎన్‌పికి చెందిన మోష్రాఫ్‌ హుస్సేన్‌, పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ అధికారికి మధ్య జరిగిన 7 నిమిషాల ఫోన్‌ సంభాషణ మీడియాలో లీక్‌ అయింది. అందులో చైనా నుండి అందే ఆర్థిక సహాయం ఎన్నికలలో వినియోగించాలనే అంశం దొర్లింది. బిఎన్‌పి పాకిస్తాన్‌ అనుకూల పార్టీ. దీన్ని అవామీలీగ్‌ పార్టీ తన గెలుపుకు ఆధారంగా ఉయోగించుకోవాలని యోచిస్తోంది. ఢాకాలో ఉన్న పాకిస్తాన్‌ దౌత్య కార్యాలయ అధికారులు బిఎన్‌పి స్టాండింగ్‌ కమిటీ సభ్యులు మీర్జా అబ్బాస్‌, అమినుల్‌ హక్‌, ఖండకర్‌ మోష్రాఫ్‌ హుస్సేన్‌లతో సత్సం బంధాలు ఉన్నాయన్న విషయం వెల్లడైంది. మన ఇరుగు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మాల్దీవులలో చైనా జోక్యం కల్పించుకోవడం మన దేశానికి ఇబ్బంది కలిగించే అంశమే. ఈ మధ్యనే శ్రీలకంలో జరిగిన రాజకీయ పరిణామాలు కలవరపరచేవే. బంగ్లాదేశ్‌ స్టాక్‌-ఎక్సేంజ్‌లో చైనాకు 25% వాటా లున్నాయి. బంగ్లాదేశ్‌లో చైనా సుమారు 34 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. దక్షిణ ఆసియా దేశాలలో చైనా నుండి ఆర్థిక సహాయం పొందే మొదటి దేశం పాకిస్థాన్‌.. ఆ తరువాత బంగ్లాదేశ్‌. పశ్చిమ దేశాల ఎన్నికలలో స్వార్థపర శక్తులు జోక్యం కల్పించుకుంటాయన్న విషయం అందరికీ తెలిసినదే. కాని దక్షిణ ఆసియా దేశాల ఎన్నికలలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ఇది మొదటిసారి. పాకిస్తాన్‌కు, బంగ్లాదేశ్‌కు ఉన్న సంబంధం, పాకిస్తాన్‌కు చైనాకు ఉన్న మైత్రి ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.

బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలు సజావుగా లేవు. పాకిస్తాన్‌ దౌత్య కార్యాలయ అధికారులు ఐఎస్‌ఐ చర్యలకు మద్దతు ఇస్తున్నారని బంగ్లాదేశ్‌ ఆరోపిస్తోంది. ఈ కారణం గానే పాకిస్తాన్‌ హై కమిషనర్‌ సక్లేన్‌ సయ్యద్‌ నియామ కాన్ని తిరస్కరించింది. 2016లో పాకిస్తాన్‌లో జరిగిన సార్క్‌ సమావేశాన్ని భారత్‌ బహిష్కరించింది. భారత్‌ నిర్ణయానికి బంగ్లాదేశ్‌ మద్దతు పలికింది. 2016లో ఢాకాలో ఒక ¬టల్‌లో జరిగిన బాంబు పేలుడులో పాకిస్తాన్‌ ప్రమేయమున్నట్లు విచారణలో తేలింది. టెర్రర్‌ చర్యలలో పాకిస్తాన్‌ హస్తమున్నట్లు రూఢీకావడంతో బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. షేక్‌ హసీనా తమ దేశ నిరసనను పాకిస్తాన్‌కు గట్టిగా తెలియజేసింది.

ఇదిలా ఉండగా అవామీలీగ్‌కు మరో సమస్య ఎదురవుతోంది. ఇన్నేళ్లు అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికలలో ఆంటీ-ఇన్‌కంబెన్సీ ప్రభావం చూపనుంది. అంతేగాకుండా అవామీలీగ్‌ నాయకుల మీద అవినీతి ఆరోపణలున్నాయి. జర్నలిస్టులపై జులుం, భావ ప్రకటన స్వేచ్ఛపై నిరంకుశ పాలన ఇలాంటి విషయాలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలుగా ఉపయోగపడగలవు. విపక్ష పార్టీల నాయకుల నిర్బంధం, కొందరి తొలగింపు కూడా ఎఎల్‌కు విఘాతాలే. ఈ కారణాలన్నింటి వలన ఈ మారు ఎన్నికలను పర్యవేక్షించడానికి 16 దేశాల నుండి పరిశీలకులు బంగ్లాదేశ్‌కి చేరుకున్నారు. ఎలాంటి హింస లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలలో జరిగేలా వీరు చూస్తారు.

షేక్‌ హసీనా ప్రభుత్వం కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా ఆమె గత దశాబ్ద కాలంలో బంగ్లాదేశ్‌ను ఆర్థికంగా పుంజుకునేలా చేసింది. 2017-18 సంవత్సరానికి గాను బంగ్లాదేశ్‌ ఆర్థిక అభివృద్ధి 7.86%. అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల కన్న ఇది ఎక్కువ. తయారీ రంగంలో కూడా బంగ్లాదేశ్‌ అభివృద్ధి సాధించింది. ఎప్పుడూ ప్రకృతి బీభత్సాలను చవి చూచే బంగ్లాదేశ్‌ లీస్ట్‌ డెవలప్‌ మెంట్‌ కంట్రీ నుండి డెవలపింగ్‌ ఎకానిమిక్‌ స్థితికి చేరుకుంది. షేక్‌ హసీనా దూరదృష్టి వలనే బంగ్లాదేశ్‌లో ఈ అభివృద్ధి సాధ్యపడింది. తమ పార్టీ విధానాలలో దేశాన్ని అభివృద్ధి చెందించామనే విషయాన్ని ప్రచారం చేసుకుని మరోమారు అధికారం చేపట్టాలని షేక్‌ హసీనా భావిస్తోంది. ప్రజలు కూడా అభివృద్ధికే ఓటు వేయాలని అనుకుంటున్నారు.

నిరంకుశ పాలన అభియోగాలలో కూరుక పోయిన అవామీలీగ్‌ పార్టీ బిఎన్‌పి పాకిస్తాన్‌ అనుకూల వైఖరిని, ఆ పార్టీ కార్యకర్తల అమానుష ప్రవర్తనకు అనుకూలంగా నిలబడిన శక్తులను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.

బిఎన్‌పి భాగస్వామ్య పార్టీ జెల్‌ బంగ్లాదేశ్‌ను తిరిగి పాకిస్తాన్‌లో కలపాలని చూస్తుంది. కాబట్టి బిఎన్‌పి, జెల్‌లు పాకిస్తాన్‌ అనుకూల పార్టీలు. ఎఎల్‌ పార్టీకి ఈ రెండే ప్రచారానికి ఉపయోగపడుతు న్నాయి. ఈ ఎన్నికలలో సరిహద్దు ప్రాంతాలలో బిఎన్‌పి కొన్ని సీట్లు సంపాదించగలదు. మిగతా చోట్ల మాత్రం అవామీలీగ్‌ ఎక్కువ సీట్లు పొంది అధికారం చేపట్టవచ్చని ఎన్నికల పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. అవామీలీగ్‌లో కొన్ని లోపాలున్నా దానికి బిఎన్‌పి ప్రత్యమ్నాయం కాలేదని పరిశీలకుల అంచనా. బంగ్లాదేశ్‌ ఎన్నికలలో కేవలం 2 నుండి 3 శాతం ఓట్ల తేడాతోనే అధికారం చేతులు మారుతుంది.

భారత్‌పై ప్రభావం

షేక్‌ హసీనా అధికారం చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్‌తో ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న టెర్రరిస్టు గ్రూపులను ఏరిపారేసింది. భారత్‌ – బంగ్లాదేశ్‌ సరిహద్దులను తీవ్రవాదులు లేకుండా చేసింది. షేక్‌ హసీనా తీసుకున్న చర్యల వల్ల భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలలో అక్రమ వలసలు తగ్గిపోయాయి. హసీనా 10 సంవత్సరాల పాలనలో భారతదేశానికి ఎంతో మేలు కలిగింది. భారత్‌ – బంగ్లాదేశ్‌ల మధ్య సహకారం పెరిగింది. ఎంతో కాలంగా ఇరుదేశాల మధ్య నలుగుతున్న సరిహద్దు సమస్య 2015 సంవత్సరంలో శాంతియుతంగా పరిష్కరించుకున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రకచ్చర్‌ రంగాలలో ఇరుదేశాల మధ్య సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. ఇరుదేశాల మధ్య బస్‌, ట్రైన్‌, ఓడ ద్వారా రవాణా సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. దీనివల్ల ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగు పడ్డాయి. భారతీయులు బంగ్లాదేశ్‌లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వం వీరికి 7.5 బిలియన్‌ డాలర్ల మద్దతును ప్రకటించింది. భారతదేశం యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి సంబంధించి బంగ్లాదేశ్‌కి ప్రముఖమైన కొన్ని సమస్యలున్నా ఇరు దేశాల మధ్య మైత్రి అవసరం. బంగ్లాదేశ్‌లో అవామీలీగ్‌ మరోమారు అధికారం చేపట్టడం భారత్‌కు మేలు చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *