బాబు పాలనలో బలి పశువులు

బాబు పాలనలో బలి పశువులు

సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘం అభిశం సనకు గురయ్యారు. అంతేకాదు, ఎస్పీలు, సిఐలు, నిఘా విభాగం ఉన్నతాధికారి వరకు ఈసీ చేత మొట్టికాయలు వేయించుకున్నారు. ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా, అధికార పార్టీకి, ముఖ్య మంత్రికి లోబడి పని చేశారని వీరందరి మీద ఆరోపణ. ఈ ఆరోపణలను నిగ్గు తేల్చిన ఎన్నికల సంఘం ఈ అధికారులను ఎన్నికలతో సంబంధం లేని విభాగాలకు బదిలీ చేసింది. ఇది ఎన్నికల సమయంలో ఏపీ ముఖచిత్రం.

మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలకు సేవలు అందించడానికి అనేక వ్యవస్థలు, సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఈ వ్యవస్థలు, సంస్థ లన్నిటిని రాజ్యాంగం నియంత్రిస్తుంది. రాజ్యాంగం ఆదేశించిన ప్రకారం ఇవి పనిచేస్తాయి. అలాంటి స్వతంత్ర సంస్థలలో ఎన్నికల సంఘం ఒకటి. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి, ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే అవకాశం కల్పిస్తుంది.

రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాలలో ఎన్నికల సంఘమే సూపర్‌ పవర్‌. ఎన్నికలు సక్రమంగా నిర్వహించ డానికి కావలసిన అన్ని అధికారాలను రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. ఎన్నికల కోడ్‌ మొదలైనప్పటి నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆ ప్రాంతంలోని ఇతర వ్యవస్థలన్నిటిని ఎన్నికల సంఘమే నియంత్రిస్తుంది. ఎన్నికల ప్రక్రియ మొతాన్ని సక్రమంగా నిర్వహించడమే ఈ నియంత్రణ లక్ష్యం.

అయితే ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో ప్రవర్తించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా అటువంటి సంఘటనలు జరిగినా వాటిని సంఘం సమర్థంగా ఎదుర్కొని ఎన్నికలు సక్రమంగా జరిపిస్తుంది.

ఎన్నికల సమయంలో ప్రభుత్వం, ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తమ అధికారాలను కోల్పోతారు. ఎన్నికల సమయంలో వారి పదవులు నామమాత్రమే. ఎన్నికలలో తమ పార్టీ, ప్రభుత్వం గురించి ప్రచారం చేసుకుని ఓట్లు అభ్యర్థించడమే వాటి పని. ప్రభుత్వ వ్యవస్థలపై వారి పెత్తనం చెల్లదు. ఈ విషయంలో ముఖ్యంగా 1996 ఎన్నికల నాటి నుండి మన ఎన్నికల సంఘం మరింత దృఢంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో మనదేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా మంత్రిమండలి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాయి. రాజ్యాంగానికి ఎదురు తిరుగుతున్నాయి. అటువంటి రాష్ట్రాలలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లది అగ్రతాంబూలం.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి తరువాత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ నుండి కిందిస్థాయి ఎస్పీలు, సిఐల వరకు, పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు కొందరు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళికి అనుగుణంగా కాక అధికార పార్టీకి అనుగుణంగా మసలుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిలో రాష్ట్ర డీజీపి ఆర్‌పి ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వంటి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్దేవ్‌ శర్మ; మదనపల్లి సీఐ సురేశ్‌ కుమార్‌, తాడిపత్రి సీఐ నారాయణరెడ్డి వంటి కింది స్థాయి అధికారులూ ఉన్నారు. వీరంతా ఎన్నికల నియమావళికి అనుగుణంగా, నిస్పక్షపాతంగా కాక ప్రభుత్వ పెద్దలకు, అధికార పార్టీకి మద్దతుగా పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయించిన ఎన్నికల సంఘం వారిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించు కుని ఆయా అధికారులను ఎన్నికలకు సంబంధం లేని విభాగాలకు బదిలీ చేసింది.

ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన ఇటువంటి అధికారులు ఎన్నికల సంఘం జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసి, వాటికి వ్యతిరేకంగా కొత్త జీవోలు తెచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనిల్‌ చంద్ర పునేఠా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేస్తే ఆ బదిలీని రద్దు చేసి, ఆయనను ఆ పదవిలోనే తిరిగి నియమిస్తూ మరో జీవో తెచ్చారు. ఫలితంగా ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారందరిపై చర్యలు తీసుకుంది.

పునేఠాపై ఈసీ సీరియస్‌

ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాపై సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. ఆయనను ఉన్నపళంగా ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పించింది. ఏ విభాగంలోనూ పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘం నుండి ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

ముఖ్యంగా పునేఠా తాము తొలగించిన ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావును తిరిగి అదే పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. ఇదంతా ఎవరి ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. డీజీ వెంకటేశ్వరరావును వెనకేసుకొస్తూ, ఈసీ చర్యను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకెళ్లడాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు వెంకటరత్నం, రాహుల్దేవ్‌ శర్మలను బదిలీ చేస్తూ పునేఠ జీవో నంబరు 716 జారీ చేశారు. తర్వాత ఇంటెలిజెన్స్‌ డీజీ ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారంటూ జీవో నంబరు 721 జారీ చేశారు. ఆ వెంటనే డీజీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను రద్దుచేస్తూ.. డీజీ ఇంటెలిజెన్స్‌లోనే కొనసాగుతారంటూ జీవో 720 జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి పాటించకుడా ఇలా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయడం వల్లే పునేఠా ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది.

పునేఠా స్థానంలో 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాకు వేరే విభాగంలో పోస్టింగు ఇవ్వడం గురించి తర్వాత ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని ఎన్నికల సంఘం ఆ జీవోలో పేర్కొంది.

దృడ వ్యకి్త్వం.. గోపాలకృష్ణ ద్వివేది

ప్రభుత్వం పైనా సీరియస్‌

ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దుచేయడం, ఆయనను మళ్లీ అదే పదవిలో కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీచేయడంపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. ఏపీ ప్రభుత్వం ఒక అధికారిని ఇంతగా వెనుకేసుకు రావడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది.

ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిగా తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఆయన్ను ఆ పదవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించు కోవాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఆ మేరకు ప్రధాన కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి జీవోలు జారీ చేయించారని ఎన్నికల సంఘం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీనిగురించి కేంద్ర ఎన్నికల సంఘం పునేఠాను పిలిపించి వివరణ కోరింది. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటి? ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం వెనుక మతలబు ఏమిటి? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్‌ నుంచి నివేదికలు తెప్పించు కున్నట్లు తెలుస్తోంది.

ఈసీ ఆగ్రహానికి డీజీపీ సైతం..

ఇంటెలిజెన్స్‌ డీజీ ఎబీ వెంకటేశ్వరరావు బదిలీ రద్దు వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశ మయ్యింది. దీనిగురించి ఎన్నికల సంఘం మొదట పునేఠాను పిలిచి వివరణ కోరింది. తరువాత డీజీపీని పిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డీజీపీ ఢిల్లీలో ఈసీని కలిసే ముందే ఆయన్ను ఏసీబీ డీజీ విధుల నుంచి తప్పిస్తూ పునేఠా ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఢిల్లీ వెళ్లిన డీజీపీ కేంద్ర ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాస్‌, సుశీల్‌ చంద్రలను కలిసి వివరణ ఇచ్చారు. డీజీపీగాను, ఏసీబీ డీజీగాను రెండు విధులు నిర్వహిస్తున్న మీకు ఏబీ వెంకటేశ్వర రావుకు అనుకూలంగా జీవో ఇవ్వడం కోసం ప్రధాన కార్యదర్శిపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏం వచ్చిందని ఎన్నికల కమిషనర్లు డీజీపీని ప్రశ్నించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఇలా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి ఇక్కడి ప్రభుత్వం, అధికారులు సరైన సహకారం అందించకపోవడం దురదృష్టకరం. అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే కోరిక సహజం. కానీ దానికోసం వ్యవస్థలతో విభేధించడం శోచనీయం. ప్రజా స్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పు. ఆ తీర్పు ఒకసారి ఒక పార్టీకి అనుకూలమైతే, మరొకసారి మరొకపార్టీకి అనుకూలం కావచ్చు. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయడం, వారి సంక్షేమానికి కృషి చేయడమే కావాలి తప్ప మరొకటి కారాదు.

అలాగే ప్రభుత్వ పాలనలో ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఇతర అధికారుల పాత్ర కీలకం. పాలనలో ప్రజలకు ఏది మంచిదో గ్రహించి, శాసనాధికారులకు, రాజకీయ నాయకులకు మంచి సలహా ఇవ్వటం, పాలనలో ప్రజల సంక్షేమమే పరమావధిగా నడుచుకోవడం వారి విధి. దీనిని విస్మరించడం సబబు కాదు. పాలనలో అన్ని వ్యవస్థల లక్ష్యం ప్రజా సంక్షేమమే. అందులో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీ కీలకమే. ఒకరికొకరు సరైన సహకారం అందించుకుంటూ, నియమాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన పాలన అందిస్తే అది ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుంది. ఈ దిశలో రాజకీయ నాయకులదే మొదటి అడుగు కావాలి. అటువంటి స్వచ్ఛమైన రాజకీయాలను మనం ఆశిద్దాం.

– విజయ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *