వాయు కాలుష్యంతో మనసులూ కలుషితమే !

వాయు కాలుష్యంతో మనసులూ కలుషితమే !

– మనం పీల్చే గాలి మన మనసుపై ప్రభావం చూపిస్తుందా?

– కాలుష్యమైన గాలి పీల్చిన వారిలో నేరప్రవృత్తి పెరుగుతోందా ?

– గాలి కాలుష్య ప్రదేశాలలో నేరాలు పెరగడం దానినే సూచిస్తోందా ?

– అవుననే అంటున్నాయి పరిశోధనలు.

– ఆ విషయాలను కూలంకషంగా వివరించేదే ఈ వ్యాసం.

మనిషి ఆరోగ్యంపై వాయుకాలుష్యం చూపే ప్రభావం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. వాయు కాలుష్యం వల్ల వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు, గుండెపోటు, ఊపిరి తిత్తుల క్యాన్సర్‌, అల్జీమర్స్‌ వ్యాధుల గురించి చాలా పరిశోధనలు జరిగాయి కూడా. కానీ వాయు కాలుష్యం మనిషి ఆలోచనలు, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుందని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

సీసం కలిసి ఉన్న పెట్రోలు వాడే వాహనాల నుంచి వచ్చే కార్బన్‌ అమెరికాలో ప్రజల ప్రవర్తనలపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఐక్యూ తగ్గి, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం కొరవడుతోందని గుర్తించారు. శరీరంలో సీసం పరిమాణం పెరగడం వల్ల పిల్లల్లో ఐక్యూ తగ్గడమే కాదు, వారిలో ఇతరుల పట్ల దౌర్జన్య ప్రవృత్తి కూడా పెరుగుతోందని గుర్తించారు. అందువల్ల 1970లలోనే అమెరికాలో పెట్రోలు నుండి సీసం తొలగించి వాడడం మొదలుపెట్టారు. పెట్రోలు నుండి సీసాన్ని తొలగించిన తరువాత 1990లలో అమెరికాలో 56 వరకు శాతం హింసాత్మక సంఘటనలు తగ్గడం గమనించారు.

షాంఘై నగరంలో సల్ఫర్‌ డయాక్సైడ్‌ కలిసిన వాయువులు పీల్చడం వల్ల మానసిక రుగ్మతలకు లోనై ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య ఎక్కువ కావడం ఒక సమస్యగా మారింది. పార్టిక్యులేట్‌ మేటర్‌ (PM) అధికంగా ఉన్న గాలిని పీల్చడం నగరాలు, ఆ పరిసర ప్రాంతాలలోని యుక్త వయస్కులలో నేర ప్రవృత్తి పెరుగుదల మీద ప్రభావం చూపుతోందని అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్‌లో జరిపిన ఒక అధ్యయనం వెల్లడిస్తోంది.

మనుషుల్లో, ముఖ్యంగా యువతలో నేర ప్రవృత్తి పెరగడానికి వాయుకాలుష్యం కూడా కారణమౌ తోందని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది ముందుముందు ఇంకా తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. అమెరికాలో 9,360 పట్టణాలలో జరిపిన ఆధ్యయనం ప్రకారం వాయుకాలుష్యం వల్ల మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతోందని వెల్లడయ్యింది.

కలుషిత వాయువులు పీల్చడం వల్ల హార్మోన్లపై వత్తిడి పెరుగుతుంది. ఇది మనుషుల్లో అలజడికి కారణమౌతోంది. అలజడికి లోనైనవారు అనా లోచితంగానే నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్మెంట్‌కి చెందిన Evan Herrnstadt, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకి చెందిన Erich Muehlegger చికాగో కేంద్రంగా వాయు కాలుష్యంపై పరిశోధనలు చేశారు. కొన్ని సంక్లిష్టమైన పద్ధతులను ఉపయోగించి వారు చేసిన పరిశోధనల నివేదికను 2015లో ప్రచురించారు. వాయు కాలుష్యం ఉన్న పట్టణాలలో ఇతర ప్రాంతాలలో కంటే నేరాల రేటు 2.2 శాతం అధికంగా ఉందని వారు అంటున్నారు.

చికాగో పోలీసు శాఖ అందించిన 2001-2012 మధ్య కాలంలో జరిగిన 20 లక్షల పెద్ద నేరాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆధారంగా చేసుకుని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. తమ పరిశోధనలలో భాగంగా వీరు వాహన కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలలోని ప్రధాన కూడలుల వద్ద కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. నేరాలు జరిగిన తేదీలలో ఆయా ప్రాంతాలలో గాలులు ఏ దిశలో వీచేయో ఆ సమాచారాన్ని వాతావరణ శాఖకు సంబంధించిన వివిధ రికార్డుల నుండి సేకరించారు. తాము అధ్యయనం చేసిన పట్టణాల పరిసర ప్రాంతాలలో వాయుకాలుష్యం తక్కువగా ఉన్న సందర్భాలలో జరిగిన నేరాల సమాచారాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల మనుషుల్లో నేరప్రవృత్తికి వాయుకాలుష్యం ఒక్కటే ఎంత మేరకు కారణం కాగలదో వారు స్పష్టంగా అంచనా వేయగలిగారు.

గాలిలోని కార్బన్‌ మోనాక్సైడ్‌ కన్నా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మనుషుల్లో నేర ప్రవృత్తికి ఎక్కువ కారణమవుతోందనీ, వేసవికాలంలో ఈ నేరప్రవృత్తి ఇంకా ఎక్కువగా ఉంటోందనీ ఈ పరిశోధకులు అంటున్నారు. వాయుకాలుష్యం అధికంగా ఉన్న నగరాలలో నేరాలు కూడా అధికంగా ఉన్నాయనీ, కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో నివసించే వారిలో నైతికత పట్ల చూపే ఔచిత్యం దెబ్బతింటోం దనీ, అందువల్ల వారు అనైతిక, అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందనీ, వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించినట్లయితే మనుషులలో నేరప్రవృత్తిని కూడా కొంతవరకు నియంత్రించవచ్చనీ పరిశోధకులు అంటున్నారు.

ఇంగ్లండుకి చెందిన ఒక పరిశోధన సంస్థ రెండు సంవత్సరాల పాటు చిన్న పట్టణాలు, బస్తీలలో సేకరించిన 1.8 లక్షల నేరాలకు, కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసింది. వివిధ కాలాలలో వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతానికి సంబంధించిన సమాచారం ఆధారంగా వారు అధ్యయనం చేశారు. పరిగణనలోకి తీసుకున్న ప్రతి పట్టణంలోను ప్రతిరోజూ వాతావరణం పరిశుభ్రంగా ఉందా లేక కలుషితమై ఉందా అన్న సమగ్ర సూచీని రూపొం దించారు. వారి పరిశోధనలో తేలిందేమిటంటే ఎక్కడైతే వాతావరణంలో కాలుష్యం 10 పాయింట్లు పెరుగుతోందో అక్కడ క్రైమ్‌ రేటు 0.9 శాతం ఉంటోంది. ఈ కోణంలోంచి చూస్తే లండన్‌ నగరంలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లో నేరాలు కూడా అధికంగా ఉన్నాయనీ; లండన్‌ నగరంలో అత్యంత ధనికులు, కడు పేదలు పక్కపక్కనే నివసిస్తున్న కలుషిత ప్రాంతాలలోనే నేరాలు అధికంగా జరుగుతున్నాయన్నది పరిశోధనలో తేలిన మరో విషయం.

అనేక రకాల వత్తిడులు, అలజడులతో పాటు వాయుకాలుష్యం కూడా మనుషుల్లో నేరప్రవృత్తి పెరగడానికి కారణమౌతోందనిPsychological Science ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది. ‘వాయుకాలుష్యం మనుషుల ఆరోగ్యాన్నే కాదు, వారి నైతికతను కూడా కలుషితం చేస్తోంది’ అని Julia Lee అంటారు. ఈమె ఈ అధ్యయన బృందంలో ఒకరు. గత తొమ్మిదేళ్లుగా 9 వేల పట్టణాలకు సంబంధించి US Environmental Protection Agency అందించిన సమాచారాన్ని, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అందించిన నేరాలకు సంబంధించిన గణాంకాలను ఈ పరిశోధన బృందం అధ్యయనం చేసింది. ఇతర ప్రాంతాలలో కన్నా వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నచోట్ల సగటు స్థాయి కన్నా నేరాలు ఎక్కువగా ఉన్నాయని వీరి అధ్యయనంలో వెల్లడయ్యింది.

వాయుకాలుష్యానికి, మనుషుల్లోని నేరప్రవృత్తికి మధ్య సంబంధాన్ని కనుగొనడానికి ఈ బృందం వరుసగా ఎన్నో పరిశోధనలు చేసింది. పొగబారిన ఆకాశం ఉన్న ప్రదేశాలలోనూ, స్వచ్ఛమైన నీలాకాశం ఉన్న ప్రదేశాలలోనూ నివసించే చాలామంది ఫోటోలను సేకరించి, వారి ముఖ, శారీరిక కవళికలను అధ్యయనం చేశారు. కలుషిత ప్రాంతాలలో కన్నా ఇతర ప్రాంతాలలో నివసించేవారి ముఖ కవళికలు ఎంతో ప్రశాంతంగా ఉండడం వీరు గమనించారు. ‘వాయుకాలుష్యానికి గురైన ప్రాంతాలు భారీగా నైతిక మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఇది పర్యావరణపరంగా, భౌతిక ఆరోగ్యపరంగా కలిగే నష్టం కన్నా ఎక్కువే!’ అని Dr. Jackson Lu అంటారు. ఈయన ఈ అధ్యయన బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ‘మనం దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే వాయుకాలుష్యం ప్రపంచంలో కోట్లాది ప్రజలపై ప్రభావం చూపుతోంది కదా! కాలుష్యరహిత ప్రాంతాలు ఆరోగ్యప్రదమైనవే కాదు, సురక్షితమైనవి కూడా’ అని Dr. Jackson Lu అంటారు. ‘మేము ఇంకా ఎక్కువగా పరిశోధనలు చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా మేం జరిపిన అధ్యయనాలు వెల్లడిస్తున్న విషయాలు వివిధ దేశాల ప్రభుత్వాలకు తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నాయి’ అని ఆయన అంటున్నారు.

‘వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా మానసిక అలజడులకు గురౌతున్నారు. ఇది వారిలోని అనైతిక ప్రవృత్తికి దారితీస్తోంది’ అని Polluted Morality: Air Pollution Predicts Criminal Activity and Unethical Behaviour పేరుతో వెలువడిన ఒక నివేదిక తెలుపుతోంది.

ఒకపక్క ప్రపంచంలో పలు దేశాలలో వాయుకాలుష్యం పెరుగుతూండడమే కాదు, మరోపక్క దాని దుష్పరిణామాలు కూడా అంచనాలకు అందనివిగానే ఉంటున్నాయి. ప్రపంచంలో ప్రతి పది మందిలో తొమ్మిదిమంది విషపూరితమైన వాయువునే పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

ప్రపంచంలోని ప్రజలంతా నెలకు ఒక్కరోజన్నా సరే తమ కార్లను, ఇతర వాహనాలను వదలి ప్రత్యామ్నాయ పద్ధతులలో ప్రయాణాలు చెయ్యాలని UN Breathe Life సంస్థ పిలుపునిచ్చింది.

వాయుకాలుష్యం మనుషుల వ్యక్తిగత ఆరోగ్యం, ప్రవర్తనలపై చూపే ప్రభావం గురించి మనకి తెలిసింది చాలా తక్కువే. కానీ మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యాలపై వాయు కాలుష్యం ప్రభావం చూపుతున్న ఉందంతాలు ఎన్నో పరిశోధనల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ సమస్యని నియంత్రించ డానికి వివిధ దేశాల ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకోవాలి.

– డా|| దుగ్గిరాల రాజకిశోర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *