మూడో కూటమి సాధ్యమేనా?

మూడో కూటమి సాధ్యమేనా?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తూ తదనుగుణంగా బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు దిశగా ఆలోచనలను వెల్లడిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశయం ఏ మేరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో ప్రధాని మోదికి బాహాటంగానే మద్ధతు ప్రకటించి తదనంతరం కయ్యానికి కాలు దువ్వుతున్న కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా వేస్తున్న అడుగులు గమ్యాన్ని చేరడం ఎంత వరకు సాధ్యమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

ఒకవైపు దేశం మోది నాయకత్వంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తుండగా ప్రస్తుతం దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, అస్పష్టత రాజ్య మేలుతోందని, ప్రగతి మందగించిందని కెసిఆర్‌ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలియాలి.

బిజెపి వరుస విజయాలు సాధిస్తూ దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన చేయడం ఆశ్చర్యకర పరిణామంగానే చెప్పొచ్చు.

ఒకవైపు మోదితో తనకు ఎలాంటి వైరం లేదని చెబుతున్న కెసిఆర్‌ మరోవైపు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ తన జీవితాన్ని దేశ ప్రజలకు అంకితం చేయడంలో తప్పు ఏముందంటూ ప్రశ్నించడం సరికొత్త చర్చలకు అవకాశమిస్తోంది. వచ్చే ఎన్నికలనంతరం తెలంగాణ పగ్గాలను తన కుమారుడు కెటిఆర్‌కు అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కెసిఆర్‌ ఈ ప్రకటన ద్వారా చెప్పకనే చెప్పారన్నది నిర్వివాదాంశం.

జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం ద్వారా కెసిఆర్‌ ప్రమాదపుటంచుల్లో విన్యాసాలు చేసే తన స్వభావాన్ని మరోసారి వెల్లడిరచుకొన్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడే అవకాశాలు ప్రస్తుతానికి లేవు.

అయితే కెసిఆర్‌ మూడో కూటమికి సంబం ధించిన కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపేతర, కాంగ్రెస్సేతర పార్టీలు, సంఘాలు, సంస్థలు, ప్రముఖులు, వివిధ వర్గాలతో చర్చించి దేశానికి అవసరమైన ఎజెండాను రూపొం దించే పనుల్లో ఆయన నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలానంతరం ఫ్రంట్‌ కార్యకలాపాలపై కెసిఆర్‌ పూర్తిస్థాయి దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయి, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో సమావేశాలు నిర్వహించి అక్కడి ప్రాంతీయ నేతలతో సమావేశమై భవిష్యత్‌ రాజకీయ శంఖారావాన్ని పూరించాలన్నదే కెసిఆర్‌ మనోగతంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో మూడో కూట ములు కొన్ని సందర్భాల్లో మెరుపుతీగలా వచ్చి వెళ్లాయే తప్ప జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేక పోయాయి.

దేశవ్యాప్తంగా మోది తన ప్రాభవాన్ని విస్తరించుకొంటూ అనితర సాధ్యంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే దేశ ప్రధాని అవుతారన్న ఊహాగానాలు వినపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్‌ నాయకత్వంలో మూడో ఫ్రంట్‌ ఏర్పడినా ఏం సాధించగలదని అభిప్రాయాలు వినపడుతున్నాయి.

మరోవైపు ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌ ఘోర పరాభవం పొందినప్పటికీ ఇటీవల జరిగిన రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లోనూ, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయపతాకాన్ని ఎగురవేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశమంతా కాంగ్రెస్సేతర, బిజెపేతర పార్టీలకు ప్రత్నామ్నాయం కోసం ఎదురుచూస్తోందని కెసిఆర్‌ ఏ విధంగా ఈ నిర్ణయానికి వచ్చారన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతోంది.

ఏది ఏమైనా దేశంలో నేడు ఎలాంటి రాజకీయ సంక్షోభం కాని, శూన్యత కాని లేవన్నది విస్పష్టం. ఇటువంటి పరిస్థితుల్లో కెసిఆర్‌ మూడో కూటమిని నిర్మించేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఆశించిన రీతిలో ఫలితాలు వచ్చే ఆవకాశాలు ఏమాత్రం కనపడటం లేదు.

రాజీవ్‌గాంధీ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీకి సమర్థుడైన నాయకుడు లేకపోవడం, అప్పట్లో బిజెపి ప్రాబల్యం పెద్దగా లేకపోవడంతో ఒకానొక దశలో మూడో ఫ్రంట్‌ రాజకీయాలు దేశంలో కొనసాగిన మాట నిజమే. కాని నేడు దేశంలో బిజెపి చాలా పటిష్టంగా ఉంది. రానున్న సాధారణ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయంగానే కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్‌ నేతృత్వంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ మూడో కూటమిగా అవతరించినా జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి ఏర్పడటం అసాధ్యం!

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *