రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

‘పద్మావతి’ పై ఆగని నిరసనలు – రాజస్థాన్‌

బాలీవుడ్‌ దర్శక దిగ్గజం సంజయ్‌లీలా భన్సాలీ ఏ ముహూర్తాన పద్మావతి చితాన్న్రి ప్రారంభించారో తెలియదు కానీ ఈ చారిత్రాత్మక చిత్రానికి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా ఈ బాలీవుడ్‌ చిత్రం పద్మావతిపై నిరసనలు రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి.

రాజస్థాన్‌లోని రాజసమంద్‌ జిల్లాలో రాజ్‌పుత్‌ వర్గీయులు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తూ నవంబర్‌ 18న చారిత్రక కుంభల్‌గఢ్‌ కోటలో ప్రవేశాన్ని సాయంత్రం వరకు అడ్డుకున్నారు. కోటలో జరిగిన పద్రర్శన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంజయ్‌లీలా భన్సాలీ దిష్టిబొమ్మను ఉరి తీసి నిరసనను తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు సెన్సార్‌ పూర్తి కాకుండానే ఈ చిత్రాన్ని కొందరు పాత్రికేయుల ముందు ప్రదర్శించడం కూడా వివాదంగా మారుతోంది.

సీబీఎఫ్‌సీ చూడకముందే ‘పద్మావతి’ చిత్రాన్ని పద్రర్శించడం, ఈ చిత్రంపై జాతీయ ఛానళ్ళలో రివ్యూలు రావడం అభ్యంతరకరంగా మారుతోంది. ఈ చిత్రం కల్పితమా ? లేక చరిత్ర ఆధారితమా ? అన్న విషయాన్ని నిర్మాతలు డిస్‌క్లేమర్‌లో చెప్పకుండా ఖాళీగా వదిలివేయడాన్ని సెన్సార్‌ బోర్డు ఆక్షేపిస్తోంది. తన చిత్రంపై పలు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ దీపికాపడుకునే తన శక్తిసామర్థ్యాల మేరకు అటు ఆందోళనాకారుల పైన, ఇటు విమర్శకులపైన పోరాడుతూనే ఉంది. క్రమక్రమంగా ఆమెకు మద్దతిచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి దీపికకు వస్తున్న బెదిరింపులకు నిరసనగా గోవాలో తలపెట్టిన ఇఫ్ఫీ వేడుకలను బహిష్కరించాలంటూ ప్రముఖ నటి షబాన ఆజ్మీ పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ‘పద్మావతి’ చిత్రానికి ఏర్పడుతున్న అడ్డంకులన్నీ తొలగిపోయి విడుదల కావాలని చిత్రబృందం కోరుకొంటోంది.

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ – జమ్ముకశ్మీర్‌

జమ్మూకశ్మీర్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్లో మన భద్రతాదళాలు విజయాన్ని సాధించి అక్రమ చొరబాటు తీవ్రవాదులకు మరో గుణపాఠం నేర్పాయి. నవంబర్‌ 18న జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో మన సైనికులు ముంబాయి దాడుల సూత్రధారి జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ మేనల్లుడు సహా మరో ఆరుగురు పాకిస్థాన్‌ ఉగ్రవాదులను హతమార్చి తెరవెనుకటి ఉగ్రదాడుల వ్యూహకర్తలను చావుదెబ్బే తీశారు.

ఈ ఎదురు కాల్పుల్లో మనదేశ వైమానిక దళానికి చెందిన ‘గరుడ్‌’ కమాండో వీరమరణం పొందగా ఓ సైనిక జవాన్‌ గాయపడ్డాడు. బందిపుర జిల్లాలోని హజిన్‌ ప్రాంతంలో ఉన్న చందర్‌గీర్‌ గ్రామంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపడుతుండగా అక్కడ దాక్కున్న తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ తప్పలేదు. ఉగ్రవాదుల కాల్పులకు భద్రతాదళాలు ధీటుగా బదులివ్వడంతో దాదాపుగా వార్‌ వన్‌సైడే అయ్యింది. ఎన్‌కౌంటర్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబుట్టామని, ఘటనాస్థలం నుంచి ఆరు ఆయుధాలను స్వాధీనపరుచుకున్నామని జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర డీజీపీ వెయిద్‌ స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత కార్యక్రమాలు ఊపందుకున్నవిషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170 మంది ముష్కరులను మన భద్రతాదళాలు హతమార్చాయి. నవంబర్‌ 7న పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్లో జైషే మహ్మద్‌ ముఠా అగ్రనాయకుడు మౌలానా మసూద్‌ అజాద్‌ మేనల్లుడిని తుదముట్టించిన విషయం విదితమే. సరిహద్దు చొరబాటుదారులను మన భద్రతాదళాలు ఎప్పటికప్పుడు తీవ్రస్థాయిలో అణచివేస్తున్నా వారిని ఉసిగొలిపే పాకిస్థాన్‌ టెర్రరిస్టు నాయకుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడం విషాదం.

అవినీతి తిమింగలం – ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తిమింగలాల విశ్వరూపాన్ని చూసి బడాబడా స్కాంలలో ఆరితేరిన కొందరు అవినీతి రాజకీయ నాయకులే విస్తుపోవలసి వస్తోంది. తాజాగా సస్పెన్షన్‌లో ఉన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ గేదెల లక్షీగణేశ్వర రావు నివాసాలపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో వెలుగుచూసిన రూ.500 కోట్లకు పైగా (బహిరంగ మార్కెట్‌ విలువ) అక్రమార్జిత సొమ్మును చూసి సంబంధిత శాఖ అధికారులే నివ్వెరపోవలసి వచ్చింది.

గతంలో పలుమార్లు పట్టుపడ్డా లక్షీగణేశ్వరరావు అవినీతి పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా గుణపాఠం నేర్చుకొన్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల గణేశ్వరరావు, ఆయన బంధువులు, బినామీల ఇళ్ళపై ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే అక్రమాస్తుల వివరాలు వెలుగు లోకి వచ్చాయి.

విశాఖ, విజయ నగరం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఈ సోదాలు కొనసాగాయి. విశాఖ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లక్షీగణేశ్వరరావుపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన్ను ఇటీవలే విధుల నుంచి తప్పించారు. విశాఖలోని సీతంపేటలో గణేశ్వరరావు తన బంధువు పేరిట 5 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు రంగంలో దిగి ఆయన అక్రమాలను బహిర్గతం చేశారు. ఈ దాడుల్లో రూ.70 లక్షల విలువైన వోల్వో కారుతో పాటు హోండా 120, ఇన్నోవా కార్లు, 3.2 కిలోల వెండి సామాగ్రి, కిలో బంగారు ఆభరణాలు, వివిధ స్థిరాస్థి పత్రాలను అధికారులు గుర్తించారు. వీటితోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 19 ఇళ్ళ స్థలాలు, ఐదు ప్లాట్లు, 30 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. 1982లో డిప్యూటీ సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ సర్వే ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి చేరిన ఈయన అవినీతిపరంగా అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకో కుండా తన అవినీతి సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించుకొంటూ వచ్చాడు.

రాహూల్‌కు లైన్‌ క్లియర్‌ – ఢిల్లీ

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ అధ్యక్షపగ్గాలు చేపట్టేందుకు తెరవెనుక కార్యాచరణ పూర్తయినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సోనియా గాంధీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలను రాహుల్‌ గాంధీకి అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాహుల్‌ ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. నవంబర్‌ 20న జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్‌ గాంధీకి అధ్యక్షపగ్గాలను అప్పగించాలన్న కీలక నిర్ణయానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు స్పష్టమవుతోంది.

అధ్యక్ష ఎన్నికలకు సీడబ్ల్యూసీ నిర్ణయం తప్పనిసరి కాకపోయినా సోనియా గాంధీ ఈ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికల తేదీలకు ఆమోదం లభించగానే పార్టీలోని ఎన్నికల విభాగం ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. అంతర్గత ఎన్నికలను పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు గడవునిచ్చిన విషయం విదితమే. సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టిన తర్వాత 2004 నుంచి 2014 వరకు దేశ రాజకీయాలను పరోక్షంగా తనదైన శైలిలో ప్రభావితం చేసి 2014 సాధారణ ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే క్రియాశీలక రాజకీయాల్లో తనదైనశైలిని ప్రదరిర్శస్తూ వస్తున్న రాహుల్‌ గాంధీ మున్ముందు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయగలరన్నది ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతోంది.

అక్కడ కేజీ ఉప్పు 250 రూపాయలు ! – అరుణాచల్‌ ప్రదేశ్‌

నిత్యావసరాల ధరలు దేశమంతా ఒకెత్తయితే అరుణాచల్‌ ప్రదేశ్‌ చంగ్‌లాంగ్‌ జిల్లాలోని విజయ్‌నగర్‌లో మరొకెత్తని చెప్పవచ్చు. ఇక్కడి ధరలను చూసి ధనికులు కూడా ‘అయ్య బాబోయ్‌’ అనక తప్పదు. ఇదంతా నమ్మశక్యంగా లేకున్నా, ఈ పట్టణంలో బస్తా సిమెంట్‌ ఖరీదు రూ.8 వేలు పలుకుతుండగా కేజీ ఉప్పు ధర రూ. 250గా ఉంది. 1500 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతానికి భూమార్గం గుండా వెళ్ళడం సాధ్యమయ్యే పనికాదు. ఇది నడకకు వీలున్న అతి సమీప ప్రాంతమైన మియావోకు 156 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో విజయ్‌నగర్‌కు వాతావరణం అనుకూలిస్తే వారానికోసారి హెలికాప్టర్‌ను నడుపుతుంటారు. విజయ్‌నగర్‌ ప్రజలకు అవసరమైన సామాగ్రిని హెలికాప్టర్‌లోనే రవాణా చేయాల్సి రావడంతో 150 కేజీల సిమెంట్‌ బస్తాకు రూ.8 వేలు ఛార్జి చేస్తుంటారు. చక్మాలు అధికంగా నివసించే ఇక్కడ ఇంతింత ధరలను పెట్టికొనలేని సామాన్యులు తమకు కావలసిన సామాగ్రిని వీపుపై మోసుకొని రోజుల తరబడి నడక సాగించాల్సిందే తప్ప మరో మార్గం లేదు. మూడు దేశాలతో సరిహద్దు కలిగిన అరుణాచల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గాలను ఏర్పాటుచేస్తే తమ కష్టాలు తీరగలవని స్థానికులు భావిస్తున్నారు.

ప్రైవేటు వైద్యుల సమ్మెతో ఆరుగురి మృతి – కర్ణాటక

డాక్టర్ల సమ్మె పుణ్యమా అని కర్ణాటక రాష్ట్రంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రైవేటు వైద్యశాలల నియంత్రణ ముసాయిదాకు వ్యతిరేకంగా నవంబర్‌ 14న ప్రయివేట్‌ వైద్యులు చేపట్టిన సమ్మె అనేక సమస్యలకు దారితీసింది.

ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు రోగులపై ఇష్టారాజ్యంగా రుసుములు వడ్డించకుండా కట్టడిచేసే ముసాయిదాను ప్రవేశపెట్టడం తథ్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనను కలిసిన వైద్యులకు స్పష్టం చేయడంతో వివాదం ముదిరి సమ్మెకు దారితీసింది. ఈ సమ్మెతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సరైన సమయంలో వైద్యసేవలు అందక రోగులు తీవ్రబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మరణించినట్లు విశ్వసనీయ సమాచారం. బెంగళూరులో వైద్యసేవలు బాగానే ఉన్నా ఇతర నగరాలు, పట్టణాల్లో సమ్మె కారణంగా సమస్య తీవ్రరూపం దాల్చింది. కొప్పళ్‌ జిల్లా పంచాయతీ పీడీఓ అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందు బాటులో లేకపోవడంతో మరణించారు. మరో సంఘటనలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మూడు నెలల పసిబిడ్డ తుదిశ్వాస విడిచింది. ధార్వాడ్‌, భాగల్‌కోట్‌, గదగ్‌లలో సకాలంలో వైద్యసేవలు అందక మరో నలుగురు మృత్యువాత పడ్డట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తన నివేదికలో పేర్కొంది. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కన్నడిగులు ప్రైవేటు వైద్యుల స్వార్థపూరిత సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న రాష్ట్రపతి – పంజాబ్‌

శాంతి పరిరక్షణ విషయంలో భారత్‌ ఆది నుంచి ఒకే వైఖరిని అవలంబిస్తోందని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా శాంతి పరిరక్షణకు కట్టుబడే ఉన్నామని రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ మరోసారి పునరుద్ఘాటించారు.

నవంబర్‌ 16న పంజాబ్‌లోని ఆదమ్‌పూర్‌లో వైమానిక దళంలోని 223 స్క్వాడ్రన్‌, 117 హెలికాఫ్టర్‌ విభాగాల వేడుకలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ దేశ సార్వ భౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు భారత్‌కు ఉన్న శక్తిసామర్థ్యాలన్నింటినీ వినియోగిస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రజంలతా ఎలాంటి భయం లేకుండా క్షేమంగా నిద్రపోగలుగుతున్నారంటే అందుకు కారణం మన భద్రతాదళాలేనన్నారు.

దేశానికి జవాన్లు అందిస్తున్న సేవలు మరువలేనివని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను చేపట్టిన అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలిసారి కుటుంబ సభ్యులతో కలసి అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వర్ణ దేవాలయ సమాచార కేంద్రంలో రాష్ట్రపతిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ సన్మానించింది.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *