‘హోదా’ రేసులో జగన్‌ దూకుడు

‘హోదా’ రేసులో జగన్‌ దూకుడు

గత ఎన్నికల్లో కేేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా రథసారథి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతం ‘హోదా’ రేసులో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎవరూ ఊహించని వ్యూహాలతో రాజకీయంగా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. గత నాలుగేళ్ళ నుంచి ‘హోదా’ పోరును కొనసాగిస్తూ వచ్చిన జగన్‌ తనకు రాజకీయంగా బద్ధ విరోధి అయిన టిడిపి అధినేత చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు కుదిరితే ఆమరణ నిరాహారదీక్షకు కూడా సంసిద్దమవుతున్నారన్న సంకేతాలందుతున్నాయి. అవసరమైతే ‘హోదా’ పోరులో తమ పార్టీ ఎంపిలు రాజీనామాలకు సైతం వెనకాడరని గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసిన ఆయన ఆ మాట నిలబెట్టుకొని రాజకీయ ఎత్తుగడల్లో తనకు తిరుగులేదనిపించుకొన్నారు.

రాష్ట్రానికి ‘హోదా’ వచ్చే పరిస్థితి లేకపోయినా ప్రజల్లో ఆ సెంటిమెంట్‌ను సజీవంగా ఉంచి అవసర సమయాల్లో రగిలించడంలోను, కేంద్రంపై ఇటీవల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంలోను, తదనంతరం ఎంపిల రాజీనామాలు, దీక్షల వ్యవహారంలోను జగన్‌ ప్రదర్శించిన దూకుడు ప్రత్యర్థులకు ముచ్చెమటలనే పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న జగన్‌ యాత్ర పూర్తికాగానే అప్పటి పరిస్థితులను బట్టి ఆమరణ నిరాహారదీక్షను చేపట్టి ఏకకాలంలో అటు కేంద్రంలోని బిజెపిని, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపిని రాజకీయంగా దెబ్బ తీసి వచ్చే ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలన్నదే ఆయన వ్యూహంగా తెలుస్తోంది.

విభజన హామీలను నెరవేర్చడంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏ.పి. ప్రజలను మోసం చేసిందంటూ వైకాపా నేతలు వరుసగా 12 రోజులకు పైగా అవిశ్వాస తీర్మాన నోటీసులను ఇవ్వడం, వాటిపై ఎలాంటి చర్చ జరగకుండా పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపిలు వై.వి. సుబ్బారెడ్డి, వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌లు స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామాలు చేయడం మున్ముందు తనకు బాగా కలసివచ్చే అంశంగా జగన్‌ విశ్వసిస్తున్నారు. తమ పార్టీ ఎంపిల రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించి ఉప ఎన్నికలు వస్తే ‘హోదా’ కోసం చేసిన త్యాగంతో ఘనవిజయం సాధించ వచ్చని, ఒకవేళ ఆమోదించని పక్షంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టి లబ్ది పొందొచ్చన్న ద్విముఖ వ్యూహంతో జగన్‌ ప్రణాళికను రచించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇప్పటికే ‘హోదా’ విషయంలోను, అవిశ్వాస తీర్మానం వ్యవహారంలోను యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు తమ పార్టీ ఎంపిలు రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతున్నా ఆ నిర్ణయంలోను ఆయన యూటర్న్‌ తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

హోదా అంశానికి కాలం చెల్లినా ఏదోలా ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా మైలేజ్‌ను పొందాలన్నదే వైకాపా లక్ష్యంగా తెలుస్తోంది. ప్రత్యేక¬దా అంశంపై ఇప్పటికే జగన్‌ పలు ఆందోళనలను నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్థావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొదటి నుంచీ హోదా సెంటిమెంట్‌ను ఎక్కడా బలహీనపర్చకుండా వైకాపా జాగ్రత్త పడుతూ వస్తోంది. ఈ అంశంపై రాష్ట్రంలో ఏ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినా (అధికారపక్షం తప్ప) వైకాపా మద్దతిచ్చింది.

తాము అధికారంలోకి వస్తే ఏ.పి.కి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకపోవడం, జనసేనాని పవన్‌కళ్యాణ్‌ కూడా ఇటీవల ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ హోదాతో సరిసమానంగా నిధులను ఇస్తే అభ్యంతర మేమీ లేదని పేర్కొనడం, హోదాపై మాటతప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడం తదితరాల నేపథ్యంలో ఈ సెంటిమెంట్‌ తమ పార్టీకే బాగా వర్కౌట్‌ కాగలదన్న ధీమా వైకాపా శ్రేణుల్లో ఉంది. తమ అధినేత ఆమరణ నిరాహారదీక్షను చేపడితే కేంద్రం రాష్ట్రానికి స్పెషల్‌ స్టేటస్‌ను ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వైకాపా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ముఖ్యమంతి చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకోవడం, మొన్నటివరకు ఆయనకు అండగా ఉన్న జనసేనాని అనూహ్యంగా హ్యాండిచ్చి టిడిపిపై తిరుగుబాటు చేయడం తదితరాల నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి హోదాపోరును మరింత ఉధృతం చేసి పార్టీని విజయ తీరాలకు నడిపించాలను కుంటున్నట్లుగా తెలుస్తోంది.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *