సుజీత్‌ కుమార్‌ – పత్రికల్లో కనిపించని ఒక పతాక శీర్షిక

సుజీత్‌ కుమార్‌ – పత్రికల్లో కనిపించని ఒక పతాక శీర్షిక

పాత్రికేయుడు మజీద్‌ హైదరీ మీడియా పాస్‌ చూపించుకుంటూ కారులో శ్రీనగర్‌లో తిరుగు తున్నాడు. అది పీర్‌బాగ్‌ బ్రిడ్జి ప్రాంతం. అతనికి దూరంగా తుపాకీ చేత పట్టుకున్న సిఆర్‌ఫిఎస్‌ జవాను కనిపించాడు. తలకు, ఒంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ రక్షణ. చేతిలో ఏకె 47. ‘కశ్మీర్‌పై కర్కశ క్రూర దమనకాండకు ప్రతీక వీడు’ అంటూ మనసులోనే తిట్టుకున్నాడు మజీద్‌ హైదరీ.

ఆయన కళ్లు హఠాత్తుగా రోడ్డు పక్కన కశ్మీరీలు చలికాలంలో ధరించే ఫేరన్‌ (ఓవర్‌ కోట్‌)ను ధరించి నేలమీద పాకుతున్న ఒకరిద్దరు కశ్మీరీ ముదుసలులపై పడింది. నేలమీద పడున్న కశ్మీరీలు.. చేతిలో తుపాకీతో సిఆర్‌ఫిఎఫ్‌ జవాను.. జర్నలిస్టు హైదరీ బుర్ర పాదరసంలా పనిచేసింది. ఆ దశ్యం రేపటి వార్తాపత్రికలో పతాక శీర్షికలా కనిపించింది. కారు నడుపుతూనే కెమెరా బయటకి తీశాడు.

అంతలో.. ఆ జవాను నేలపై పాకుతున్న కశ్మీరీల దగ్గరకి వెళ్లాడు. ఏదో మాట్లాడుతున్నాడు.

అదేమిటి ? ఆయన వెనక్కి వెళ్లి తన కిట్‌బ్యాగ్‌లో చేయి పెట్టాడు.

‘గ్రెనేడ్‌ విసురుతాడా ?’

‘బేడీలు వేస్తాడా ?’

హైదరీకి రేపటి హెడ్‌లైన్‌, అవార్డును గెలుచుకునే ఫోటో కళ్లముందు కదలాడాయి.

ఆ జవాను చేతిలో రొట్టెలు, అరటి పండ్లు. వాటిని పాకుతున్న ఆ కశ్మీరీలకు ఇచ్చాడు. వాళ్లు చేతులెత్తి ఆయనకు దండం పెడుతున్నారు. హైదరీకి కథ అర్థం కాలేదు. కారు ఆపి ఆ కశ్మీరీల దగ్గరకు వెళ్లాడు. వాళ్లను ప్రశ్నించాడు.

కర్ఫ్యూ వల్ల రెండు రోజులుగా మాకు తినేందుకు తిండి లేదు. ఏం చేయాలో తోచలేదు. నేనా అవిటి వాడిని ఏదైనా తెచ్చుకుందామని బయలుదేరాను. పాకుతూ వెళ్తూంటే ఈ జవాన్‌ వచ్చి ‘అన్నం తిన్నావా’ అని అడిగాడు. లేదు అని చెప్పాను. ఆయన వెళ్లి తన బ్యాగ్‌లోని ఆహారాన్ని తెచ్చి ఇచ్చాడు.

హైదరీకి కథ అర్థమైంది. జవాను ఇచ్చింది ఆరోజు తన వంతు ఆహారాన్ని. ఆయన ఆకలితో ఉండిపోతాడు. తన కడుపును మాడ్చుకుంటాడు కశ్మీరీ కడుపు నింపేందుకు.

మజీద్‌ హైదరీకి తల తిరిగిపోయింది. తాను మనసులో రాసుకున్న హెడ్‌ లైన్స్‌ కహానీ ఏమిటి ? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి ?

సిఆర్‌పిఎఫ్‌ జవానును ఆయన అడిగాడు ‘మీ ఫోటో తీసుకోవచ్చా ?’

‘వీల్లేదు. కుదరదు.’ అన్నాడా జవాను.

‘మీరు చూపిన మానవత్వం గురించి రాస్తాను. దానికోసం ఫోటో కావాలి’

‘నేను పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో ఈ పనిని చేయలేదు. అతనూ నా భారతీయుడే. నేనూ భారతీయుడినే. అందుకనే అతని ఆకలి తీర్చేందుకు ప్రయత్నించాను. ఇదేం గొప్పపని కాదు. నాకు ప్రచారం అక్కర్లేదు’ అన్నాడు ఆ జవాను. ఆ జవాను యూనిఫారంపై సుజీత్‌ కుమార్‌ అని రాసి ఉంది. ఈ పేరును జీవితంలో మరిచిపోలేను అనుకున్నాడు.

హైదరీ పట్టు విడవలేదు. పై అధికారితో మాట్లాడాడు. అనుమతి తెచ్చుకున్నాడు. దాంతో ఫోటో దిగేందుకు ఆ జవాను అంగీకరించాడు. కానీ ఫోటో కోసం కశ్మీరీలకు అరటిపళ్లు, రొట్టెముక్కలు ఇస్తున్నట్టు పోజులిస్తూ కాదు. యూనిఫారంలో ఉన్న జవాను గన్నుతో గస్తీ చేస్తున్నట్టుగానే దిగాడు.

ఆ ఫోటోను ప్రచురించి ‘కిరాతక సిఆర్‌పిఎఫ్‌ కాలి బూట్ల కింద కశ్మీరం’ అని శీర్షిక పెట్టుకోవచ్చు. అలా అయితే ఆ ఫోటో పత్రిక మొదటి పేజీలో వస్తుంది. ‘కశ్మీరీలకు సాయం చేసిన సిఆర్‌పిఎఫ్‌ జవాను’ అని రాస్తే ఏ పత్రికా వేసుకోదు. ఆ సంగతీ మజీద్‌ హైదరీకి తెలుసు. పత్రికల్లో దిక్కులేని వార్తలకు ఫేస్‌బుక్కే దిక్కు కదా ! అందుకే ఆ వార్తను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మార్చి 15 నాడు పోస్టు చేశాడు. ఇప్పుడా ఫోటో, పోస్టూ వైరల్‌ అయ్యాయి.

అన్నట్టు వేర్పాటువాద విందు భోంచేసి త్రేన్చినవాళ్లు మజీద్‌ హైదరీని బాగానే తిట్టు కుంటున్నారు. రాళ్లు విసిరే వాడికీ అన్నం పెట్టిన సుజీత్‌ను గుర్తుకు తెచ్చుకుని తనను తిడుతున్న వారిని క్షమించేస్తున్నాడు మజీద్‌ హైదరీ. ఇవేవీ పట్టని సుజీత్‌ ఇంకో చోట, ఇంకో వీధిలో పహరా కాస్తూనే ఉన్నాడు.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *