వేర్పాటువాద మీడియాకు కష్టకాలం

వేర్పాటువాద మీడియాకు కష్టకాలం

కశ్మీర్‌లోయలో వేర్పాటువాదాన్ని, భారత వ్యతిరేక ధోరణులను పెంచి పోషించడంలో అక్కడి మీడియాది కీలకపాత్ర. కశ్మీర్‌కు సంబంధించిన వార్తలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అనుకూలంగా మలచి, కశ్మీరీ ప్రజల మెదళ్లను పాడుచేయడంలో అక్కడి మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అంతే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌లోయ గురించి వార్తలు రాసేందుకు వచ్చే జర్నలిస్టులను తప్పుదోవ పట్టంచడంలోనూ వీరిదే ముఖ్య భూమిక.

తమాషా ఏమిటంటే దేశవ్యతిరేక వార్తలు రాసి పబ్బం గడుపుకునే ఈ మీడియాకి ఊపిరిపోసేది ప్రభుత్వం ఇచ్చే వ్యాపార ప్రకటనలే. అంటే ఈ పత్రికలు భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో నడుస్తూ భారత దేశానికి వ్యతిరేకమైన కథనాలను ప్రచురిస్తున్నాయన్న మాట.

నిజానికి 2008 నుంచే అప్పటి కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ లోయనుంచి వెలువడే రైజింగ్‌ కశ్మీర్‌, గ్రేటర్‌ కశ్మీర్‌, కశ్మీర్‌ టైమ్స్‌ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం మానేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, దాని ఆధీనంలోని వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌, జమ్మూకశ్మీర్‌ బ్యాంక్‌లు మాత్రం ప్రకటనలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యతిరేక వార్తాకథనాలను రాసే, మతోన్మాదాన్ని పెంచిపోషించే పత్రికలకు నిధులను ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు అక్టోబర్‌ 18న ఆదేశాలు జారీ చేసింది.

అయితే జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న కొందరు మాత్రం ఇంకా ఈ ఆదేశాలు మాకు అందలేదని సాకు చెబుతూ ఆ పత్రికలకు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆరు నెలల పాటు శ్రీనగర్‌లో రాజధాని ఉంటుంది. చలికాలంలో ఆరు నెలలు రాజధాని జమ్మూలో ఉంటుంది. దీనిని దర్బార్‌ మూవ్‌ అంటారు. ఇది కశ్మీర్‌ మహారాజా కాలం నుంచి కొనసాగుతోంది. దర్బార్‌ మూవ్‌ను సాకుగా చూపి ఆ లేఖ తమకు అందలేదని అధికారులు ప్రకటించారు. కానీ సదరు లేఖ దర్బార్‌ మూవ్‌ కంటే చాలా ముందే ప్రభుత్వానికి అందింది. కాబట్టి అది అందలేదని చెప్పటంలో కుట్ర దాగుంది. అంటే జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వంలోని కొందరు అధికారులే వేర్పాటువాద మీడియాకు మద్దతిస్తున్నా రన్నమాట. ఇలా చేయడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం తప్ప మరేమీ కాదు.

జమ్మూకశ్మీర్‌లో ఆరువందలకు పైగా దిన పత్రికలు, వార, మాస, పక్ష పత్రికలు ఉన్నాయి. వీటిలో జమ్మూకి చెందిన 204 పత్రికలు, కశ్మీర్‌లోయకు చెందిన 171 పత్రికలు రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వద్ద ఎంపానెల్‌ అయి ఉన్నాయి. అంటే వీటికి ప్రభుత్వాలు తమ ప్రకటనలను ఇస్తాయి. దీన్ని బట్టి చూస్తే ఈ పత్రికల ఆర్థిక దన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే !

కానీ ఈ పత్రికల్లో, ముఖ్యంగా ఉర్దూ భాషలో వెలువడే పత్రికల్లో ఉగ్రవాదుల ప్రకటనలు యథేచ్ఛగా ప్రచురితమౌతాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాదం, మతమౌఢ్యాన్ని, ముఖ్యంగా హిందూ మైనారిటీల పట్ల వ్యతిరేకతను పెంచే కథనాలు ఇష్టారాజ్యంగా ప్రచురితమవుతాయి. చాలా సందర్భాల్లో భారత, హిందూ వ్యతిరేక రచనలను నకిలీ హిందువుల పేర్లతో ప్రచురించి, వేర్పాటువాదులకు అన్ని వర్గాల్లో మద్దతు ఉందన్న భావనను కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కశ్మీర్‌పై పాకిస్తాన్‌ చేసే ప్రకటనలను కశ్మీరీ మీడియా చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చి ప్రచురిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజోపయోగ కార్యాలకు ఏమాత్రం ప్రాచుర్యాన్ని ఇవ్వవు. ఒక వేళ వేయాల్సి వచ్చినా ఎక్కడో అట్టడుగున చిన్న వార్త రూపంగా వేస్తాయి. కశ్మీరీ మీడియా ఏనాడూ మసీదులను ఉగ్రవాదులు స్థావరాలుగా ఉపయోగించు కుంటున్న వైనం గురించి రాయదు. మౌల్వీలు మసీదు మైకుల ద్వారా భారత విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని ఏనాడూ ఖండించదు. నిజానికి ఇలాంటి పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపు చేయడమే కాదు, అసలు వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా కూపీలు లాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సార్లు ఆకాశవాణి శ్రీనగర్‌ కేంద్రం నుంచి దేశ వ్యతిరేక కథనాలు వచ్చిన సందర్భాలున్నాయి. పాక్‌ మద్దతుతో మన ప్రభుత్వ ప్రచార ప్రసార యంత్రాం గాలను దేశ వ్యతిరేక ప్రచారానికి వాడుకోవడం ఇన్ని దశాబ్దాలుగా నిరాఘాటంగా జరుగుతూ వచ్చింది. దశాబ్దాల కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దీనిని నిలుపు చేసేందుకు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో కశ్మీర్‌ లోయలోని దేశ వ్యతిరేక మీడియా వెర్రెత్తిపోతోంది.

నిజానికి కశ్మీర్‌లోయలో తొలి నుంచీ మీడియా ఒక పథకం ప్రకారం దేశ వ్యతిరేక అభిప్రాయాన్ని పెంచి పోషిస్తూ వచ్చింది. ఉదాహరణకు కశ్మీరీ భాషకు శారదా లిపి ఉన్నా, ఉర్దూ లిపిని ప్రోత్స హించింది. కశ్మీర్‌లో అత్యధికులు కశ్మీరీ, డోగ్రీ లేదా పహాడీ భాష మాట్లాడతారు. కానీ షేక్‌ అబ్దుల్లా కాలం నుంచి ఉర్దూభాష అధికార భాష అయింది. అందుకే ఉర్దూ పత్రికలు కూడా ఎక్కువే. కశ్మీరీ భాషీయులు కూడా ఉర్దూ నేర్చుకుని చదువుకోవలసిన అవసరం ఏర్పడింది. మరోవైపు శ్రీనగర్‌లో ఇతర రాష్ట్రాలు లేదా ఇతర దేశాలకు చెందిన విలేకరులు లేరు. అంటే కశ్మీర్‌లోయలో వేర్పాటువాద మద్దతుదారులు ఏం రాస్తే అదే వార్త. జాతీయ అంతర్జాతీయ ఏజెన్సీల విలేకరులుగా కూడా అదే ముఠా సభ్యులుండటంతో కశ్మీర్‌లోయలో వాస్తవ పరిస్థితులను దాచి, తాము చెప్పదలచుకున్నది మాత్రమే చెబుతున్నారు. దీనితో కశ్మీర్‌లోయ నుంచి ఏకపక్ష కథనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధృడంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి శక్తుల ఆటలు కట్టవుతున్నాయి. కశ్మీర్‌ లోయలో హవాలా ధనంపై కేంద్ర జాతీయ దర్యాప్తు బందం ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడీ శక్తులు మరింత బెంబేలెత్తు తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ జాతీయవాద మీడియాను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *