విశాఖ ‘భూ’ బకాసురులకు శిక్ష పడేనా !

విశాఖ ‘భూ’ బకాసురులకు శిక్ష పడేనా !

ఏపి, తెలంగాణలో ఇటీవలి కాలంలో భూ బకాసురుల దందా పతాకస్థాయికి చేరుకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ, అధికార ముసుగులో అమాయకులైన పేద, మధ్యతరగతి ప్రజల భూము లను, ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జాచేసి వికటాట్ట హాసం చేస్తున్న పెద్దల నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు.

విశాఖ నగర పరిధిలో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయంటూ మీడియా వరుస కథనాలతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో అప్రమత్తమైన చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బకాసురుల కబ్జాలపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది.

ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన అవినీతి లంచావతారాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ బడా స్కాంతో సంబంధాలున్న రాజకీయ నాయకులు, అధికారులు, సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు, ప్రైవేటు భూములకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయాలని సిట్‌ నిర్ణయించింది.

మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన భూములకు నిరభ్యంతర ధృవపత్రాల జారీలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే అదనుగా కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సిబ్బంది ఏకమై వేలాది ఎకరాల భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి కోట్లు గడించేశారు. ఈ అక్రమ దందా వ్యవహారంలో మొత్తం 325 క్రిమినల్‌ కేసులు నమోదు కానున్నాయి. ఈ జాబితాలో 42 మంది రాజకీయ నాయకులు, వారి వారసులు, 49 మంది సీనియర్‌ అధికారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ బడా రాకెట్‌లో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులు, విశాఖ జిల్లాలో గతంలో పనిచేసిన ఒకరిద్దరు ఐఎఎస్‌ అధికారులు సహా డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డిఒలు, ఇతరస్థాయి అధికారులు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. కొంతమంది తహశీల్దార్లు కూడా ఈ స్కాంలో భాగస్వామ్యాన్ని పంచుకొన్నట్లు తెలుస్తోంది.

గ్రేహౌండ్స్‌ డిఐజి వినిత్‌ బ్రిజ్‌లాల్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్‌ 28న గ్రేహౌండ్స్‌ డిఐజి వినిత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. విశాఖ నగర పోలీసు కమిషనర్‌ యోగానంద్‌ పర్యవేక్షణలో సిట్‌ బృందం ఆరునెలల పాటు ముమ్మరంగా దర్యాప్తు చేసి భూదందాకు మధ్యవర్తుల్లా వ్యవహరించి కోట్లు గడించిన అక్రమార్కుల భాగోతాలను వెలుగులోకి తీసుకు వచ్చింది. విశాఖ భూదందా వ్యవహారంలో కొంతమంది అమాయకులు ఫిర్యాదు చేసేందుకు భయపడి వెనక్కి తగ్గగా 337 మంది బాధితులు సిట్‌ బృందానికి ఫిర్యాదు చేశారు. సిట్‌ దర్యాప్తులో ఏకంగా రాష్ట్రమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యె విష్ణుకుమార్‌ రాజు తదితర రాజకీయ నాయకులు యథేచ్ఛగా కొనసాగిన భూదందాపై ఫిర్యాదు చేయడం నిజంగా విశేషమే. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ప్రభుత్వం కేటాయించిన భూముల బదలాయింపు కోసం జారీ అయిన 69 నిరభ్యంతర పత్రాలను సిట్‌ పరిశీలించింది. భూ దస్త్రాల గల్లంతుపై సిట్‌ విచారణ ముగియడంతో త్వరలోనే ప్రభుత్వానికి దర్యాప్తునకు సంబంధించిన నివేదిక అందనుంది. విచారణ నివేదికలో ప్రస్తుత కేసులకు సంబంధించిన అంశం ఒకటైతే భవిష్యత్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా భూ దస్త్రాల పరిరక్షణకు సిట్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేయడం మరో అంశంగా చెప్పుకోవచ్చు.

భూములు కోల్పోయిన బాధితులు

అయితే కబ్జాల్లో బాధితులు కోల్పోయిన భూములన్నీ స్వాధీనమయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఎందుకంటే ఎంతోమంది బాధితులు బెదిరింపులకు భయపడి సిట్‌ బృందానికి ఫిర్యాదు కూడా చేయలేకపోయారన్న వాదనలు వినపడు తున్నాయి. సిట్‌ బృందం అంచనాల మేరకు అక్రమార్కుల చేతిలో చిక్కిన మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు మాత్రమే తిరిగి ప్రభుత్వాధీనం లోనికి వచ్చే అవకాశం ఉంది.

విచారణ దశలోనే సిట్‌ బృందం కొన్ని ఎకరాలను స్వాధీనం చేసుకొని రెవిన్యూ శాఖకు అప్పగించిన విషయం తెలిసిందే. నిరభ్యంతర ధృవపత్రాల జారీకి సంబంధించి 300 ఎకరాలు ఉండగా అందులో ప్రస్తుతం 200 ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఖాళీ భూములను స్వాధీనం చేసుకోవడం సమస్య కాకపోయినా కట్టడాలున్న భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఏ విధంగా చర్యలను చేపట్టనుందన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగానే మిగులు తోంది. భూ అక్రమార్కులపై సిట్‌ బృందం సమగ్ర దర్యాపును జరిపి నివేదికను సమర్పించినా ప్రభుత్వం తదనుగుణంగా కబ్జాదారులందరిపైన కఠిన చర్యలు తీసుకొని బాధితులకు ఏమేరకు న్యాయం చేయగల దన్న అభిప్రాయాన్ని భూ బాధితులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ బడా స్కాంకు సంబంధించి కొంతమంది బడా నాయకులను, ఉన్నతాధికారులను తప్పించి నామమాత్రంగా కొందరిపై వేటువేసి చర్యల పరంగా ప్రభుత్వం ‘మమ’ అనిపిస్తుందా లేక నిక్కచ్చిగా వ్యవహరించి కబ్జాదారులందరిపైన చర్యలు తీసుకొనిపారదర్శకంగా వ్యవహరిస్తుందా అన్న విషయం మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *