వరుస పరాభవాలతో…

వరుస పరాభవాలతో…

ముందు నంద్యాల ఉపఎన్నిక, తర్వాత కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వరుసగా ఎదురైన పరాభవా లతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దిక్కు తోచని స్థితిలో చిక్కుకున్నారు. ఈ రెండు చోట్ల తమ పార్టీకి తగు బలం ఉండడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికలను 2019 ఎన్నికలకు ‘సెమి ఫైనల్స్‌’ గా భావించి, వీటిల్లో గెలుపొందితే 2019లో అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా భావించారు. ఈ లోగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చి చేరడంతో అతని సూచనలతో అధికారం ఆమడ దూరంలో ఉన్నట్లు భావించారు.

ఈ రెండు చోట్ల కూడా గతంలో టిడిపి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటం గమనార్హం. కాకినాడలో అయితే 30 ఏళ్ళ తరువాత టిడిపిని మేయర్‌ పదవి వరించింది. పైగా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు అన్యాయం చేస్తున్నాడని విరుచుకు పడుతున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూతవేటు దూరంలో ఉన్నారు. కేవలం మునిసిపల్‌ ఎన్నికల్లో వైసిపికి లబ్ది చేకూర్చడం కోసమే అన్నట్లు నెల రోజుల పాటు ప్రతి రోజు పాదయాత్రకు బయలు దేరుతున్నానని ఇంటినుండి బయటకు రావడం, పోలీసులు నివారించడం జరిగింది. కాకినాడలో కాపు సామాజిక వర్గపు ఓటర్లు 20 శాతం వరకు ఉన్నారు.

ముద్రగడ కాపు ఓటర్లపై ఏమాత్రం చూపడం ప్రభావం లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. కాపులు గణనీయంగా ఉండి, గెలుపోటములను ప్రభావితం చేయగల 12 డివిజన్‌లలో టిడిపి దాదాపుగా గెలుపొందింది. వచ్చే ఎన్నికల్లో కాపు ఓటర్లను టిడిపికి దూరం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ఎదురు చూస్తున్న జగన్మోహన్‌ రెడ్డికి ఇదొక విధంగా కోలుకోలేని దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవంక నంద్యాల గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుచుకున్న సీటు. అయితే భూమా నాగిరెడ్డి టిడిపిలోకి వెళ్లిన తరువాత గట్టి నాయకుడిని అక్కడ ఏర్పర్చుకోలేకపోయారు. చివరి క్షణంలో టిడిపిలో సీటు రాదని తెలుసుకున్న శిల్పా మోహన్‌ రెడ్డిని తీసుకొచ్చి సీటు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. స్వయంగా 13 రోజులపాటు జగన్మోహన్‌ రెడ్డి మకాం వేసి, ఇంటింటికి తిరిగినా ప్రయోజనం లేకపోవ డంతో వైసిపి నాయకులలో అభద్రతాభావం ఎదురవు తున్నది. వచ్చే ఎన్నికల్లో తమను ఏం గెలిపిస్తారులే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని జగన్‌, తండ్రి కోల్పోయిన భూమా అఖిల ప్రియ కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని ఆర్‌.కె.రోజా విమర్శలకు దిగడాన్ని ఓటర్లు ఆమోదించలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. తమ కుటుంబంతో సన్నిహిత సంబంధం గల భూమా నాగిరెడ్డి చనిపోయి నప్పుడు కనీసం పరామర్శకు కూడా పోకుండా అఖిల ప్రియ సంతాపం తెలపడం కోసం అసెంబ్లీకి రావడాన్ని కూడా రాజకీయం చేయడం దగ్గర నుండి వైసిపి పొరపాట్లు చేసినట్లు స్పష్టం అవుతుంది.

ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం కల్పించమని అఖిలప్రియ స్వయంగా వై.ఎస్‌.విజయలక్ష్మిని కలసి కోరడంతో అందుకు అవకాశం కల్పించి ఉంటే పార్టీ బలం గుంభనంగా ఉండేదని వైసిపి వర్గాలు కూడా భావిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం సొంత జిల్లాలో బాబాయి వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించక లేకపోవడం, ఇప్పుడు ఈ పరాజయాలు ఎదురవడంతో వైసిపి వర్గాలు నైతిక స్థైర్యం కోల్పోయినట్లు అయింది.

మరోవంక ఉత్తరాదిన తన అవసరం లేదని ఇక దాదాపు అన్ని రాజకీయ పక్షాలు విదిలించుకున్న ప్రశాంత్‌ కిషోర్‌ సూచనల మేరకు పార్టీని నడిపే ప్రయత్నం జగన్‌ చేస్తూ ఉండటం పార్టీ వర్గాల నుండి అసమ్మతికి దారితీస్తుంది. నితీష్‌ కుమార్‌ గాని, కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ గాని, అంతకు ముందు నరేంద్ర మోదీ గాని ఎన్నికల ప్రచార వ్యూహాల వరకు అతని సలహాలను పరిమితం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాల్లో జోక్యం చేసుకోనీయ లేదు. ప్రస్తుతం దేశం మొత్తం మీద జగన్‌ మినహా అతని సేవలను మరెవరు కోరక పోవడం గమనార్హం.

ఉపఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సాధారణమే అయినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అవకాశాలు ఎక్కువగా ఉండటం నిజమే అయినా, పార్టీపరంగా వైసిపి నిర్దుష్ట స్వరూపాన్ని ఏర్పర్చుకోలేక పోతున్నట్లు ఆ పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. వైసిపిలో తమకు భవిష్యత్తు లేదని పలువురు పార్టీ శాసన సభ్యులు టిడిపిలో చేరే అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని కథనాలు వస్తున్నాయి. కనీసం డజన్‌ మంది క్యూలో ఉన్నారని చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం నియోజకవర్గాల పెంపు అవకాశం లేదని తేలడంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి తిరిగి సీట్లు ఇవ్వడం కూడా టిడిపికి ఇబ్బందికరం కావచ్చు. పైగా ఇప్పట్లో ఎన్నికలు ఏవీ లేకపోవడంతో ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం కూడా లేదు. దానితో ఆయా నియోజక వర్గాలలో తమకు బలమైన అభ్యర్థి లేకపోతే తప్ప ఫిరాయింపుదారుల పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో పార్టీ కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని నింపడం ఇప్పుడు జగన్‌ ముందున్న ప్రధాన సవాల్‌. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణలోకి తీసుకొని, మరింత హుందాగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ప్రజలను ఆకట్టుకోవాలని గ్రహించగలగాలి.

– ప్రవీణ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *