రెండు బండరాళ్ళ కథ !

రెండు బండరాళ్ళ కథ !

శ్రీనగర్‌ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో దాక్షీగామ్‌ నేషనల్‌ పార్క్‌ ఉంది. వన్య జంతువులను చూసేందుకు అక్కడికి చాలా మంది వెళ్తూంటారు. ఆ పార్క్‌ ‘మహాదేవ పర్వత్‌’ అనే కొండను ఆనుకుని ఉంటుంది. ఆ కొండ ఎందుకు మహాదేవ పర్వత్‌ అయిందన్నది చెప్పేవారు కశ్మీర్‌లో ఇప్పుడెవరూ లేరు. ఆ నేషనల్‌ పార్క్‌లో ఒక పెద్ద శిల ఉంది. ఆ శిల పేరు శంకరపల్‌. నిజానికి ఆ శిలకు కశ్మీర్‌ శైవ మతంలో చాలా ప్రాధాన్యం ఉంది. ఆ శిల గురించి కశ్మీర శైవదర్శన గ్రంథాల్లో చాలా విశేషంగా రాశారు. కశ్మీర శైవమతాచార్యులు ఆచార్య అభినవగుప్తుని శిష్యుడైన క్షేమరాజ్‌ తన ‘శివసూత్ర విమర్శిని’ అన్న గ్రంథంలో రాశారు. ‘మహతి శిలాతలం’ అంటూ దానిని పదేపదే ఆయన అభివర్ణించారు. శివుని శక్తిపాతం ద్వారా ఆ ప్రదేశంలో శివతత్వ బోధనం జరిగిందని ఆయన రాశారు.

నిజానికి శైవాగమాలను శివప్రోక్తాలుగా పరిగణిస్తారు. అయితే మధ్యకాలంలో కశ్మీర్‌లో శైవం దాదాపు లుప్తప్రాయమైపోయింది. అప్పుడు స్వయంగా శివుడే వసుగుప్తుడనే సిద్ధునికి కలలో కనిపించి ఆయనకు దీక్షనిచ్చాడని చెబుతారు. ఆయనను మహాదేవ పర్వతం సమీపంలో ఉన్న దాక్షీగామ్‌ (నేటి నేషనల్‌ పార్క్‌) అనే గ్రామంలో ఉన్న ఒక పెద్ద శిల వద్దకు వెళ్లమన్నారు. ఆ శిలవద్దకు వెళ్లి దానిని స్పశించగానే శివసూత్రాలన్నీ ఆయనకు దర్శనమిచ్చాయి. వాటిని ఆయన శివసూత్రమనే గ్రంథ రూపంలో లిపిబద్ధం చేశారు. ఆ శివసూత్ర రహస్యాలను ఆయన ఈ శిలపైనే భట్టకల్లట్‌ అనే శిష్యునికి బోధించారు. ఈ భట్టకల్లటుడు తరువాత ‘స్పందకారిక’ అనే గ్రంధాన్ని రచించారు. ఈ రెండు గ్రంథాల ఆధారంగానే కశ్మీర్‌లో మళ్లీ శైవమతం వేళ్లూనుకుందని, ఈ ఇద్దరు ఆచార్యుల శిష్యగణం మళ్లీ ఇంకిపోయిన శైవాగమాల ప్రాచీన ధారను పునరుజ్జీవితం చేశారని చెబుతారు. అప్పటి నుంచీ ఈ శిలకు శంకరపల్‌ అన్న పేరు వచ్చింది. ఆధునిక యుగంలో కశ్మీర్‌ శైవమత ఆచార్యులుగా ఆజీవన సాధన చేసిన స్వామి లక్ష్మణ జూ ఈ శంకర్‌పల్‌పై కూర్చుని సదా సాధన చేసే వారు. ఆయన కాలంలోనే ఈ శంకరపల్‌ శిలకు నలువైపులా చెక్క దిమ్మలు బిగించి సరిహద్దులను ఆయన నిర్ధారించారు. ఇలా ఈ శిలకు ఎంతో చారిత్రిక, సాంస్కతిక ప్రాధాన్యం ఉంది. కానీ ఈ శిల గురించి సగటు కశ్మీరీ హిందువుకే తెలియదు. ఇక కశ్మీరీ ముస్లింలకు తెలిసే అవకాశమే లేదు.

ఇక రెండో రాయి కథ !

అసొం రాష్ట్రంలోని ప్రధాన నగరం గువహటి నగరం నడిబొడ్డున ఉంది. ఈ రాయిని కానాయి బరశి బువాశిల్‌ అంటారు. అంటే కష్ణుడు చేపలు పట్టిన చోటు అని అర్థం. పగలు దానిపై బట్టలు ఉతుక్కునే వారు వచ్చి పని చేసుకుని వెళ్లిపోయేవారు. మామూలుగా కుర్రాళ్లు సాయంత్రాలు బ్రహ్మపుత్ర ఒడ్డున గడిపేందుకు ఈ బండనే ఎంచుకునేవారు. దీనిపై కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. చీకటి పడ్డాక చేయకూడని పనులు చేసేవాళ్లు అక్కడ జమ కూడేవాళ్లు. ఏళ్ల తరబడి ఈ బండరాయిని అలాగే ఉపయోగించేవారు. ఆ బండరాయిపై కొన్ని అక్షరాలు చెక్కి ఉండేవి.

‘శాకే తురగ యుగ్మేశ మధుమాస త్రయోదశే కామరూప సమాగత్య తురుష్కః క్షయమాయయుః’ అన్న ఆ శిలా శాసనం ఒక ఘనచరిత్రకు నిదర్శనం. శక సంవత్సరం 1127 చైత్ర మాసం త్రయోదశి నాడు (అంటే క్రీ.శ. 1205లో) అసొంపై దండయాత్ర చేయడానికి వచ్చిన తురుష్కులను పూర్తిగా ఓడించి, హతం చేసినట్టు ఈ శిలా శాసనం చెబుతోంది. కామరూప్‌ (నేటి అసొం) రాజ్యం రాజు పథువు బఖ్తియార్‌ ఖిల్జీ సైన్యాన్ని ఓడించాడని, ఆ తరువాత రెండు వందల సంవత్సరాల వరకూ మళ్లీ తురుష్కులు అసొంపై దండయాత్ర చేయడానికి సాహసించలేదు. అసొం చరిత్రలోని ఒక ప్రధాన ఘట్టానికి ఈ శిలా శాసనం సాక్ష్యం. నేడు అసొంలో నివసించే చాలా మందికి ఈ శిల గురించి తెలియదు. ఇక దేశంలోని మిగతా ప్రాంత ప్రజలకు అసలు తెలిసే అవకాశమే లేదు.

చరిత్రను మరిచిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుందా ? అందునా ప్రేరణనిచ్చి ముందుకు నడిపే మ¬జ్వల చరిత్రను మరిచిపోయే జాతికి భవిష్యత్తు ఉంటుందా ?

– సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *