రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టం సజావుగా సాగేందుకు దర్శనాలు నిలిపివేయ నున్నారు. 17వ తేదీ ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. జూలై 14న నిర్వహించిన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరింటి నుంచి కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతించకుండా నిలిపి వేస్తామని, ఆలోపు వేచి ఉన్న భక్తులందరికీ పదో తేదీన దర్శనం కల్పిస్తామని తెలిపారు. భక్తులు ఇందుకు అనుగుణంగా సహకరించాలని విన్న వించారు.

ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్ట. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ చేస్తారు. 12 ఏళ్ళకోసారి ఈ క్రతువును నిర్వహిస్తుంటారు. ప్రతి ఆలయంలో ఈ క్రతువును నిష్టాగరిష్టంగా చేస్తారు. సజీవంగా ఉండే ఓ దేవతామూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణప్రతిష్ట చేస్తారు. తిరుమల ఆలయంలో స్వామివారికి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతుంటాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు కొన్ని మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతుంటాయి. వీటివల్ల కొన్నిసార్లు గర్భాలయంలో పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది అపచారంగా భావించి పన్నెండేళ్ళకోసారి గర్భాలయంలో అర్చకులే వీటికి మరమ్మతు చేస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఈ అంశను ఒక పూర్ణకుంభం లోకి ఆవాహనం చేస్తారు. ఇదే సంప్రోక్షణలో కీలక ఘట్టం. భక్తులు నడిచే ఆలయంలోని ఇతర ప్రాంతాలలోనూ పుణ్యావచనం, శుద్ది ప్రక్రియలను నిర్వహిస్తారు. ఆలయంలోని ఇతర ప్రాంతాలను అంతే శుద్ధితో శుద్ధి చేసి సుగంధ లేపనాలు చల్లుతారు. సంప్రోక్షణ పూర్తయ్యాక చివరగా స్వామి వారి జీవాన్ని తిరిగి మూల విరాట్టులోకి ప్రవేశపెట్టే క్రతువును చేపడతారు. 2006లో జరిగిన ఈ మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను స్వామివారి దర్శనానికి పరిమితంగా అనుమతించారు.

అప్పట్లో తిరుమలకు సగటున రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పైగానే ఉంది. దీంతో భక్తులపై పరిమితి విధిస్తే సమస్యలు వస్తాయన్న కారణంతో టిటిడి ఏకంగా దర్శనాన్నే నిలిపివేసింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న భక్తుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని, తుది నిర్ణయాన్ని జూలై 24న ప్రకటిస్తామని ఇవో తెలిపారు.

మహారాష్ట్ర

మల్టీప్లెక్స్‌లకు బయటి ఆహారం తీసుకెళ్లొచ్చు

మల్టీప్లెక్స్‌లకు వెళ్లేటప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని కూడా తీసుకెళ్లే సౌలభ్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మల్టీప్లెక్స్‌లకు వెళ్లినప్పుడు తినుబండారాలను అక్కడే కొనాలన్న నిబంధనకు అడ్డుకట్ట వేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం జూలై 13 నుంచి అమల్లోకి రానుంది. మల్టీప్లెక్స్‌ యాజమాన్యం దీన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దాంతో పాటు అక్కడ అమ్మే పదార్థాల అధిక ధరలకు కళ్లెం వేసేలా చర్యలు తీసుకోనుంది.

నాగ్‌పూర్‌లో ఈ మేరకు మంత్రి రవీంద్ర చవాన్‌ మీడియాతో మాట్లాడారు. ‘దీనిపై ¬ం డిపార్ట్‌మెంట్‌ ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోనుంది. ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై చర్యలు తీసుకొనేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నాం’ అని చవాన్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఎంఆర్‌పి ఉన్న అన్ని పదార్థాలకు ఒకేలా రేటు ఉండాలన్నారు.

బాంబే హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ఈ విషయంపై సమాధానం ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఈ ప్రకటన చేసింది. గత కొద్ది నెలలుగా మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన ఈ అంశంపై పోరాడుతోందని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం విశేషం.

తమిళనాడు

ఎస్‌పికె సంస్థపై ఐటి దాడులు

తమిళనాడులో ఆదాయపన్ను శాఖ అధికారులు మెరుపు దాడులను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టుకు తీసుకునే ఎస్‌పికె అండ్‌ కో సంస్థను లక్ష్యంగా చేసుకుని సోదాలు చేశారు. విరుద్‌నగర్‌ జిల్లా అరుప్పుకొట్టై, చెన్నైలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి ఈ తనిఖీలు జరిగాయి. అరుప్పుకొట్టైలోని సంస్థ నిర్వాహకులు, కార్యాలయాలు, చెన్నైలోని సంస్థ నిర్వాహకుల బంధువుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌, క్రోంపేట, బెసెంట్‌నగర్‌, అభిరామపురం, కోవిలంబాక్కం తదితర 30చోట్ల ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రూ.160 కోట్ల మేరకు లెక్కలో రాని నగదు, 100 కేజీల బంగారం, స్వర్ణాభరణాలను, 30 బ్యాంకు ఖాతాల వివరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎస్‌పికె సంస్థతో వ్యాపార సంబంధాలున్న టివిహెచ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అధినేత రవిచంద్రన్‌ నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయన డిఎంకెకు చెందిన మాజీ మంత్రి కె.ఎన్‌. నెహ్రూకు స్వయానా సోదరుడు. రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పళనిస్వామి తన బంధువులకు కట్టబెడుతున్నారని డివిఏసికి ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె జూన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కర్ణాటక

కంటతడి పెట్టిన సిఎం – ఇది ఎటు దారితీస్తుందో?

అధికార పీఠం దక్కినా తాను ఏమాత్రం సంతోషంగాలేనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. బెంగళూరులో జూలై 14న ఏర్పాటు చేసిన ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ఆవేదనను వెళ్ళగక్కుతూ కంట తడి పెట్టారు. ‘నేను ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం జనతాదళ్‌ కార్యకర్తలకు మాత్రమే సంతోషం. నాకు ఏమాత్రం కాదు. రైతుల కష్టాలను తీర్చాలన్న లక్ష్యంతో కష్టమైనా రుణమాఫీ ప్రకటించాను. ఆర్థికంగా పెనుభారమైన ఈ పథకానికి డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి!…ఈ పరిస్థితుల్లోనే పన్నుల భారాన్ని మోపా… సంకీర్ణ ప్రభుత్వంలో గరళాన్ని మింగిన శివుడిలా నా పరిస్థితి మారింది’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజల కోసం ఇంత చేస్తున్నా వారికి తనపై ఇంకా విశ్వాసం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన రోజే తాను సత్కారం చేయించుకుంటానని ముఖ్యమంత్రి బోరున విలపించారు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి కుమారస్వామిని కాంగ్రెస్‌ పార్టీ ఎంత ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకో వచ్చు. ఇది ఎటు దారితీస్తుందో !

ఢిల్లీ

రాజ్యసభకు నలుగురు నిష్ణాతులు

ప్రముఖ నృత్యకారిణి సోనాల్‌ మాన్‌సింగ్‌ సహా నలుగురిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 14న రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోది సలహా మేరకు ఈ నియామకాలు జరిగినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాజ్యసభకు పంపించేందుకు రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. వీరిలో ప్రస్తుతం ఎనిమిది మందే ఉన్నారు. తాజా నియామకంతో నాలుగు ఖాళీలూ భర్తీ అయినట్లే.

సోనాల్‌ మాన్‌సింగ్‌ పంప్రదాయ నృత్యకారిణి. భరతనాట్యం, ఒడిస్సీలలో ఆరు దశాబ్దాలకు పైగా అభినివేశం ఉంది. నృత్యదర్శకురాలిగా, ఉపాధ్యాయు రాలిగా, వక్తగా, సామాజిక ఉద్యమకారిణిగా ఆమెలో భిన్న పార్శ్వాలు ఉన్నాయి. ఆమె 1977లోనే ఢిల్లీలో భారత సంప్రదాయ నృత్య కేంద్రాన్ని నెలకొల్పారు. సోనాల్‌ మాన్‌సింగ్‌ 1992లో పద్మభూషణ్‌, 2003లో పద్మవిభూషణ్‌, సంగీతనాటక అకాడమీ పురస్కారాలను పొందారు.

రాకేశ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపి. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతూ వచ్చారు. రైతులు, కార్మికులు, వలసదారుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించారు. రోబెర్ట్స్‌గంజ్‌ (యుపి) నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.

రాకేశ్‌సిన్హా ఆరెస్సెస్‌ సిద్దాంత కర్త. ఢిల్లీలోని ఇండియా పాలసీ ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపకుడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మోతీలాల్‌ నెహ్రూ కళాశాలలో ఆచార్యునిగా ఉన్నారు. ‘భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి’ సభ్యుడు. సమకాలీన అంశాలపై ఆయన అనేక వ్యాసాలు రాశారు.

రఘునాథ్‌ మహాపాత్ర అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న శిల్పి. 1959 నుంచి ఆయన ఈ కళనే నమ్ముకుని దాదాపు 2000 మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. సంప్రదాయ శిల్పకళ, ప్రాచీన కట్టడాల పరిరక్షణకు పాటుపడ్డారు. పూరీలో విశ్వవిఖ్యాత జగన్నాథుని ఆలయ సుందరీకరణలోనూ ఆయన పాలుపంచుకున్నారు.

జమ్ము-కశ్మీర్‌

ఫరూక్‌ అబ్దుల్లాపై సిబిఐ అభియోగ పత్రం

జమ్ము-కశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై జూలై 16న సిబిఐ అభియోగపత్రం దాఖలు చేసింది. రాష్ట్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధి కోసం బిసిసిఐ 2002-2011 మధ్య కాలంలో ఇచ్చిన రూ.43 కోట్లను దుర్వినియోగం చేసినట్లు పేర్కొంది. ఆయనతో పాటు అప్పటి క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మహమ్మద్‌ సలీంఖాన్‌, అప్పటి కోశాధికారి అషాన్‌ అహ్మద్‌ మీర్జా, జెఅండ్‌కె బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ బషీర్‌ అహ్మద్‌ మిస్గర్‌లపై కూడా ఇక్కడి ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించింది. నేరపూరిత కుట్ర, విశ్వాస ద్రోహానికి పాల్పడ్డారంటూ జమ్ము-కశ్మీర్‌కు వర్తించే రణబీర్‌ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం కేసులు పెట్టింది. బిసిసిఐ మొత్తం రూ.112 కోట్లు కేటాయించగా అందులో రూ.43.69 కోట్లు పక్కదారి పట్టినట్టు ఆరోపించింది. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఈ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు 2015లో సిబిఐ దర్యాప్తునకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై తొలుత క్రికెట్‌ క్రీడాకారులు మజీద్‌ యాకూబ్‌ దర్‌, నిస్సార్‌ అహ్మద్‌ ఖాన్‌లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర పోలీసులు దర్యాపు జరిపినా, ఏమీ తేలకపోవడంతో హైకోర్టు సిబిఐకి అప్పగించింది. దీనిపై ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటనను విడుదల చేస్తూ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు. అసలు ఈ వ్యవహారంపై కేసు పెట్టాలని తొలుత కోరింది ఫరూక్‌ అబ్దుల్లాయేనని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మరో ప్రకటనలో తెలిపింది.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *