రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌

మొక్కుబడి భృతి

ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అధికారపక్షం ఇప్పుడిప్పుడే తన అంబులపొదిలోని ఒకొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ సమరానికి సన్నద్దమవుతోంది. అందులో భాగమే ఆగమేఘాల మీద ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి. 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుందని, జాబు రానివాళ్ళకు రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ఇష్టారాజ్యంగా హామీలిచ్చి పీఠమెక్కిన చంద్రబాబు గత నాలుగేళ్ళగా ఆ హామీనే మరచి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తోండడంతో తూతూ మంత్రంగా వెయ్యి రూపాయల భృతిని ప్రకటించి నిరుద్యోగులను పండుగ చేసుకోమంటున్నారు.

అయితే ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి విధివిధానాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో చెప్పినదానికి, ఇప్పుడు చేపడుతున్న కార్యాచరణకు ఎక్కడా పొంతన కనపడటం లేదు. ఏదో మొక్కుబడిగా ఈ పథకాన్ని పట్టాలెక్కించారేగానీ దీంతో ఒనగూరేదేమీ లేదంటూ యువత మండిపడుతోంది. ఈ నిరుద్యోగ భృతిని పొందడానికి డిగ్రీ, డిప్లమాలను విద్యార్హతలుగా నిర్ణయించడం పట్ల కూడా సర్వత్రా ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. డిగ్రీ, డిప్లమా అభ్యర్థులకే నిరుద్యోగ భృతిని ఇస్తే టెన్త్‌, ఇంటర్‌ చదివి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్న విచక్షణ సర్కార్‌లో కొరవడటం బాధాకరమే. వాస్తవానికి ఈ కేటగిరీలకు చెందిన యువతీ, యువకులే అత్యధిక శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.

ఎన్నికల ప్రచార సందర్భంగా రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామంటూ ఆర్భాటంగా ఆనాడు ప్రచారం చేసిన చంద్రబాబు నాలుగేళ్ళు గడిచాక అందులో సగానికి సగం కోతకోయడం విమర్శలకు అవకాశమిస్తోంది. ఓటుబ్యాంకే లక్ష్యంగా వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నట్లు నిరుద్యోగులకు కూడా ఇవ్వాలని చూస్తున్నారే తప్ప వారిపై ప్రేమతో కాదన్నది నిజం. ఈ నిరుద్యోగ భృతిని ప్రకటించడం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే స్థోమత సర్కారుకు లేదని పరోక్షంగా ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా అంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో యువతను ఆకర్షించాలన్న రాజకీయ వ్యూహంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ మొక్కుబడి భృతి పథకాన్ని తెరపైకి తీసుకవచ్చిందన్నది నిర్వివాదాంశం.

మహారాష్ట్ర

బంపర్‌ ఆఫర్‌

బినామీల గురించి సరైన సమాచారమిచ్చి డబ్బులు పట్టుకెళ్ళండంటూ ఆదాయపన్ను శాఖ (ఐటి) ఇటీవలే ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మీ చుట్టుపక్కల లేదా మీ ఊళ్లో ఎవరైనా.. ఎవరికైనా.. బినామీగా ఉన్నారని మీకు తెలిస్తే అలాంటి సమాచారాన్ని సాక్ష్యాధారాలతో సహా ఐటి శాఖకు అందజేసి మంచి ప్రతిఫలం పొందవచ్చు. ఇలా సమాచారాన్ని అందజేసేవారికి సదరు శాఖ ఏకంగా కోటి రూపాయల బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. మరీ ఇంత పెద్ద మొత్తంలో బహుమానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందంటే పన్ను ఎగవేత కోసమని పెట్టిన బినామీ పుట్టల్లో ఎన్ని కోట్లు దాగున్నాయో ఊహించుకోవచ్చు. ఈ అక్రమ లెక్కల నిగ్గు తేల్చేందుకు ప్రజల సహకారాన్ని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకు ప్రతిగా భారీ నజరానాను ఇస్తోంది. బినామీ లావాదేవీలపై సమాచారం చేరవేసినవారికి ప్రోత్సాహక పథకాన్ని (సిబిడిటి) ప్రారంభించింది.

ఈ కొత్త పథకంలో భాగంగా బినామీ లావాదేవీలపై సమాచారమిస్తే రూ. కోటి వరకు బహుమానం ఉంటుంది. విదేశాల్లో నల్లధనాన్ని దాచినవారి సమాచారం తెలియజేస్తే బహుమతి విలువ రూ.5 కోట్లవరకు పెరుగుతుంది. అలాగే ఆదాయపన్ను ఎగ్గొట్టిన.. లేందటే ఆస్తులు వెల్లడించని వారి సమాచారమిస్తే నజరానా కింద ఆదాయ పన్ను విభాగం రూ.50 లక్షల వరకు ఇవ్వనుంది. ఎవరికైనా బినామీల సమాచారం తెలిస్తే ఆ వివరాలను నిర్దేశిత రూపంలో మీ దగ్గర్లో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయంలోని సంయుక్త లేదా అదనపు కమిషనర్లకు సమర్పించవలసి ఉంటుంది. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచుతారు. దేశంలో నల్లధనం నియంత్రణకు, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఆదాయపన్ను శాఖ చేపడుతోన్న చర్యల్లో ప్రజలు కూడా పాలుపంచు కునేలా చేయడమే ఈ ప్రోత్సాహక పథకం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

బిహార్‌

క్షమాభిక్ష తిరస్కరణ

మరణశిక్ష పడిన ఓ వ్యక్తి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరణకు గురైన తొలి క్షమాభిక్ష అభ్యర్థన ఇదే. రాష్ట్రపతి వద్ద ఇప్పుడు ఈ తరహా పిటీషన్‌లేవీ పెండింగ్‌లో లేవు.

ఓ గేదె అపహరణ వ్యవహారంలో చెలరేగిన వివాదంతో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులను సజీవ దహనం చేసిన జగ్‌రాయ్‌ అనే వ్యక్తికి చివరకు సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది.

2006లో బిహారులోని వైశాలి జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. తన గేదెను అపహరించా రంటూ మహతో అనే వ్యక్తి జగత్‌రాయ్‌, వజీర్‌రాయ్‌, అజయ్‌రాయ్‌ అనే ముగ్గురిపై కేసు పెట్టాడు. ఈ కేసును ఉపసంహరించు కోవలసిందిగా అతడిపై నిందితులు పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అందుకు మహతో నిరాకరించాడు. దీంతో కక్ష పెంచుకున్న జగత్‌రాయ్‌ ఓ రోజు రాత్రి మహతో ఇంటికి నిప్పంటించాడు.

ఆ ఘటనలో మహతో భార్య, అయిదుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోయిన మహతో ఆ తర్వాత కొన్నాళ్ళకు మరణించాడు. నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కర్ణాటక

ముందే పొడిచిన ‘పొత్తు’

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలతో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా అనూహ్యంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిజెపికి వ్యతిరేకంగా జతకట్టిన ఈ రెండు పార్టీలూ 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి పోటీచేయాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య చర్చలు కూడా పూర్తయ్యాయి. ఈ భవిష్యత్‌ పొత్తు విషయాన్ని కాంగ్రెస్‌ కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జి కెసి వేణుగోపాల్‌ ఇటీవలే ప్రకటించారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామితో కాంగ్రెస్‌ అగ్రనేతలు వేణుగోపాల్‌, మల్లిఖార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు జూన్‌ 1వ తేదీన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ విశాల ప్రయోజ నాల దృష్ట్యా కర్ణాటకలో రెండు పార్టీల మధ్య పొత్తు అతి ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆర్థికశాఖ కోసం తొలుత తాము పట్టుపట్టినప్పటికీ ఆ తర్వాత జేడీఎస్‌కు కేటాయించేందుకు అంగీకరించడానికి భవిష్యత్‌ పొత్తే ప్రధాన కారణమన్నారు. 2019 ఎన్నికల్లో ప్రతిఒక్క ఎంపి సీటు ఎంతో ముఖ్యమని కాంగ్రెస్‌ భావిస్తోండటం వల్లనే ఏ రాష్ట్రంలో అవకాశం దొరికినా ముందే పొత్తుకు సంసిద్ధమైపోతోంది.

మేఘాలయ

షిల్లాంగ్‌కు అదనపు బలగాలు

అల్లర్లతో అట్టుడుకుతున్న షిల్లాంగ్‌ (మేఘాలయ)కు అదనంగా 6 కంపెనీల పారా మిలటరీ సిబ్బందిని పంపించేందుకు కేంద్రం ఆమోదించింది. ఇప్పటికే 10 కంపెనీలకు చెందిన వెయ్యి మందిని తరలించింది. తాజాగా జూన్‌ 3వతేదీ రాత్రికూడా షిల్లాంగ్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. పంజాబీలైన్‌ ప్రాంతానికి సమీపంలో కొందరు ఆందోళనకారులు దాక్కోవ డంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా కొందరు ఎదురుతిరిగి ఓ అధికారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు. 14 ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో జూన్‌ 4న కూడా జనజీవనానికి అంతరాయం కలిగింది. మల్వాలీలో సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై ఆందోళన కారులు రాళ్ళు రువ్వడంతో ముగ్గురు గాయపడ్డారు. గత గురువారం ఓ బస్సు నిర్వాహకుడిపై స్థానికులు కొందరు దాడికి పాల్పడటంతో షిల్లాంగ్‌లోని పంజాబీలైన్‌ ప్రాంతంలో రెండువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు క్రమేపీ విస్తరించిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేసేందుకు పంజాబ్‌కు చెందిన ఓ సభ్యుడిని షిల్లాంగ్‌ పంపించేందుకు జాతీయ మైనార్టీల కమిషన్‌ నిర్ణయించింది. అలాగే కేబినెట్‌ మంత్రి నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందాన్ని పంపుతున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు.

ఒడిశా

పూరీ రత్న భాండాగారం తాళం చెవి మాయం

పూరీ రత్న భాండాగారం తాళంచెవి మాయంపూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం ప్రధాన(3వ) గది తాళంచెవి మాయమైంది. రెండు నెలలుగా దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జూన్‌ 1న ఏర్పాటైన శ్రీక్షేత్రం పాలకవర్గ సమావేశంలో ఈ విషయం లీకైంది. దీంతో విపక్షాలు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ఆగ్రహం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి.

పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ తదితరులు ఈ సంఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాళంచెవి మాయమవడంపై పూరీలో రెండు రోజులుగా ఆధ్యాత్మిక సంస్థలు, ఇతరులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

జూన్‌ 4వతేదీన భువనేశ్వర్‌లోని సిబిఐ కార్యాలయం ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు న్యాయశాఖ మంత్రి ప్రతాప్‌జైనా జూన్‌ 4వతేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను కలిశారు. అనంతరం ఈ వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

కాంగ్రెస్‌, భాజపా, ధార్మిక సంస్థలు మాత్రం సిబిఐ లేదా క్రైంబ్రాంచ్‌ ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపితేకానీ నిజానిజాలు వెలుగుచూడవని అటు రాష్ట్ర ప్రజలతో పాటు ఇటు ఆధ్యాత్మిక సంస్థలు కూడా అభిప్రాయ పడుతున్నాయి. తాళంచెవి మాయం కావడంపై ప్రజలకు ఏం సమాధానమివ్వాలో తెలియక రాష్ట్రప్రభుత్వ అధికారులు సతమత మవుతున్నారు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *