రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌

సరిహద్దుల్లో బంగారు గనులు

అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న తన భూభాగంలో చైనా భారీ స్థాయిలో మైనింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలో 6వేల కోట్ల డాలర్ల విలువైన బంగారు, వెండి, ఇతర లోహాలు ఉన్నట్లు స్థానిక మీడియాలో ఓ కథనం వచ్చింది.

భారత్‌, చైనాల మధ్య ఇది మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మనదేశ సరిహద్దు పక్కనే ఉన్న లుంజేకౌంటీలో ఈ మైనింగ్‌ ప్రాజెక్టును చైనా చేపట్టిందని ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ ఒక కథనాన్ని వెలువరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. అది దక్షిణ టిబెట్‌లో భాగమని చెబుతోంది. తాజా మైనింగ్‌ కార్యకలాపాలు అరుణాచల్‌ప్రదేశ్‌ను హస్తగతం చేసుకోవడంలో భాగంగా చేపట్టినవేనని ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను ఉటంకిస్తూ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతంలోని సహజవనరులపై హక్కును ప్రకటించుకునేందుకు చైనా వేగంగా మౌలిక వసతులను కల్పిస్తోంది. ఫలితంగా ఇది మరో ‘దక్షిణ చైనా సముద్రం’ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ గనులు హిమాలయాల్లో భారత్‌, చైనాల మధ్య సమతౌల్యాన్ని దెబ్బతీయవచ్చని చైనా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఝెంగ్‌ యు చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం అక్కడ దాదాపు 6వేల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ సంపద ఉండవచ్చని తెలిపారు. చైనా ఇంకా అన్వేషణను కొనసాగిస్తోందని ఫలితంగా మరిన్ని గనులు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు వివరించారు.

ఛత్తీస్‌గఢ్‌

చెలరేగిపోయిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు చెలరేగిపోయారు. వివరాల్లోకెళితే దంతేవాడ జిల్లాలో రహదారి పనుల గస్తీ విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రతా సిబ్బంది వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరను పేల్చడంతో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దంతేవాడ జిల్లా కిరండోల్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కొంతకాలంగా బచేలి-చోర్నార్‌ రహదారి నిర్మాణం జరుగుతోంది. పనుల వద్ద గస్తీ విధులు నిర్వహించేందుకు ఆ జిల్లా పోలీస్‌, ఛత్తీస్‌గఢ్‌ ఏఆర్‌ బలగాలకు చెందిన ఏడుగురు మే 20వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో నిర్మాణ ప్రాంతానికి బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆ సమాచారం మావోయిస్టులకు అందడంతో రహదారి వెంట వాగు సమీపంలో మూటువేసి ఓ వంతెన సమీపంలో అమర్చిన శక్తిమంతమైన మందుపాతర (ఐఇడి)ని పేల్చారు. ఆ ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం వంద అడుగుల పైకి ఎగిరిపడి తునాతునకలైంది. శకలాలు సమీపంలోని వాగులో ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలం నుంచి రెండు ఏకె 47లు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్‌ ఆయుధాలతో పాటు గ్రెనేడ్‌లను మావోయిస్టులు ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాద ప్రాంతంలోని సమీప అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోది తన సంతాపాన్ని తెలియజేశారు.

గుజరాత్‌

నరరూప రాక్షసులు

‘మా’మాయమైపోతున్నడమ్మా…మనిషన్నవాడు’ అంటూ ఓ కవి రాసిన గేయానికి గుజరాత్‌లో జరిగిన ఓ అమానవీయ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కొంతమంది వ్యక్తులు ఓ దళితుణ్ణి చితకబాది హతమార్చిన సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా షాపూర్‌ పట్టణంలో చోటు చేసుకొంది. చెత్త ఏరుకుని జీవించే ఓ దళితుణ్ణి కొంతమంది యువకులు దొంగగా భావించి అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. మృతుని కుటుంబానికి గుజరాత్‌ ప్రభుత్వం రూ.8.25 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. వివరాల్లోకెళితే రాదాదియా ఇండస్ట్రీస్‌ ఆవరణలో కాగితాలు ఏరుకుంటున్న ముఖేష్‌ వనియా, అతని భార్య జయాబెన్‌ను కర్మాగారం యజమాని స్నేహితులు నలుగురు పట్టుకుని అతని చేతులను తాళ్ళతో కట్టేసి ఇనునపరాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేని ముఖేష్‌ స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలను కోల్పోయాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

కేరళ

‘నిఫా’ వైరస్‌ కలకలం

ప్రాణాంతకమైన నిఫా వైరస్‌ దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కలకలం రేపుతోంది. ఈ అరుదైన వైరస్‌ బారినపడి ఇప్పటివరకు కోజికోడ్‌లో ముగ్గురు మరణించగా మరొకరు చికిత్స పొందుతున్నారు. మరో ఎనిమిది మంది వైద్య నిపుణుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నిఫా’ వైరస్‌ కలకలంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. రెండు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో కొత్తగా నిఫా వైరస్‌ వచ్చిన మాట నిజమేనని, అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇస్తోంది. ఇన్ఫెక్షన్‌ సోకినవారు పరిసరాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వివరించింది. ఈ వైరస్‌తో మృతిచెందినవారు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కాగా వీరిలో 20 నెలల వయస్సు ఉన్నవారు ఇద్దరున్నారు. వీరి తండ్రి అత్యవసర చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరు నివసించే చోట ఓ బావిలో మృతిచెందిన గబ్బిలాలను గుర్తించి ఆ బావిని మూసివేయించారు. గబ్బిలాల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తిచెందడం గమనార్హం. ఈ వైరస్‌ వల్ల మరణించిన ముగ్గురికి చికిత్స అందించిన ఓ నర్సు ఈ నెల 21వ తేదీన మృతిచెందగా మరో ఇద్దరు నర్సులు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ సంఘటనలకు ఆ వైరసే కారణమా ? లేదా ? అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. జంతువుల నుంచి సోకే వైరస్‌ల కోవలోనికే నిఫా వస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు, మెదడువాపు లాంటి రుగ్మతలు చుట్టుముడతాయి. దీని నుంచి రక్షణ కల్పించే టీకాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *