రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

జమ్మూకశ్మీర్‌

ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల కొన్ని ముష్కర మూకలు ఉగ్రదాడులకు కుట్రపన్ని చావుదెబ్బ తిన్నాయి. మే 5న జమ్మూకశ్మీర్‌లో పోలీసులు లష్కరేతోయిబా ఉగ్రవాద ముఠాకు చెందిన ముగ్గురు ముష్కరులను హతమార్చగా 6వ తేదీన నిషేధిత హిజ్బుల్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో కొత్తగా ఉగ్రవాది అవతారమెత్తిన కశ్మీర్‌ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫె˜సర్‌ మహ్మద్‌ రఫీభట్‌ (33)తో పాటు ఆ ముష్కర ముఠా కమాండర్‌ సద్దాం పౌడర్‌ కూడా ఉన్నాడు.

వివరాల్లోకెళితే మే 5న జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక కార్యదళ పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు శ్రీనగర్‌ శివార్లలోని చత్తాబల్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనాన్ని చుట్టుముట్టి అందులో ఉన్న ముగ్గురు తీవ్రవాదులను హతమార్చారు. కేవలం నాలుగు గంటల్లోనే ఈ ఆపరేషన్‌ ముగిసింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలోని షాగుండ్‌ హజిన్‌కు చెందిన ఇద్దరు స్థానికులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు అపహరించి కాల్చిచంపారు. ఈ అమానుష దుర్మార్గం కలకలం సృష్టించడంతో మన భద్రతాదళాలు ప్రతీకార చర్యకు దిగక తప్పలేదు. మే 5న జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతంకాగా నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి మూడు ఏకె శ్రేణి తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రి, హెల్త్‌కిట్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.

యుపి, రాజస్థాన్‌

గాలివాన బీభత్సం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారత దేశంలో 109 మంది బలయ్యారు. గాలి దుమారా నికి ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు తోడై అక్కడ బీభత్సాన్నే సృష్టించాయి. మే 2వ తేదీన మొదలైన గాలివాన ప్రభావం తూర్పు రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది. అత్యంత వేగంతో వీచిన గాలులకు దుమ్ము తోడై ప్రళయాన్నే సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో ఒకేరోజు 73 మంది మరణించగా మరో 91 మంది గాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వడగళ్ళ వాన పంటలను నాశనం చేసింది. వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి.

రాజస్థాన్‌లో వరుణుడి ఉగ్రరూపానికి 36 మంది మరణించారు. ఈ రాష్ట్రంలో గాయపడిన వారి సంఖ్య వందకు పైగానే ఉంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు రాష్ట్రంలో అల్లకల్లోలాన్నే సృష్టించాయి. 13,000 విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. వందకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 250కి పైగా పశువులు మరణించాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గాలి దుమారం పెనుప్రభావాన్నే చూపింది. ఇక్కడ ఒక్కచోటే 43 మంది మరణించ గా మరో 51 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో అత్యధికంగా 19 మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలోనూ ఈ గాలి దుమారం పెను ప్రభావాన్నే చూపించింది. విమానాలు, రైళ్ళ రాకపోకలకు గాలివానలు అంతరాయం కల్గించాయి. అకాలంలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తుకు మొత్తం 109 మందికి పైగా బలి అయ్యారు. ఈ ప్రకృతి వైపరీత్యంపై తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్రప్రభుత్వం ఆగమేఘాలమీద సహాయక చర్యలను ప్రారంభించింది. బాధితులకు పునరావాసం కల్పించింది. రాష్ట్రాలతో కలసి పని చేయాలని ప్రధాని మోది అధికారులను ఆదేశించారు.

ఢిల్లీ

మాజీ సిఎంలు సామాన్య పౌరులే

మాజీ ముఖ్యమంత్రులకు ప్రభుత్వ బంగ్లాలను కేటాయించడం నిర్హేతుకమని, రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్థానం మే 7వ తేదీన స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ వసతిని పొందడానికి అనుమతిస్తూ గతంలో సమాజ్‌వాదీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని (సవరణ) కొట్టేసింది.

ఒకసారి పదవీకాలం పూర్తయిన తర్వాత ముఖ్య మంత్రులు సాధారణ పౌరులతో సమానమేనని జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌. భానుమతితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘ప్రభుత్వ బంగ్లాలు, అధికారిక నివాసాలు, సహజ వనరులు… తదితరాలన్నీ ప్రజల ఆస్తులని, వీటి పంపిణీ కేటాయింపుల్లో న్యాయం, నిష్పాక్షికతతో కూడిన విధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రుల పదవీకాలం పూర్తయిన తర్వాత భద్రత, ఇతర ప్రోటోకాల్‌ వంటివి కల్పిస్తున్నా ప్రభుత్వ బంగ్లాల కేటాయింపు, జీవితకాలం అందులో నివాసం ఉండటం వివక్షాపూరితమని, ఇది వారు పౌరుల్లో ప్రత్యేకమన్న భావనను కలుగజేస్తుందని పేర్కొంది. పదవీ కాలం పూర్తయిన తర్వాత వారు సామాన్య ప్రజల కంటే ప్రత్యేకం కారని, అది చట్టపరంగా అనుమతించని, తగని విధానమని తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు ములాయమ్‌సింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి సహా ఆరుగురు ప్రముఖులు బంగ్లాలను ఖాళీ చేయవలసి ఉంటుంది. వీరిలో బిజెపికి చెందిన రాజ్‌నాథ్‌సింగ్‌, కళ్యాణ్‌ సింగ్‌లతో పాటు నారాయణదత్‌ తివారీ (కాంగ్రెస్‌) ఉన్నారు. ఈ తీర్పుతో ఇతర రాష్ట్రాల్లో అధికార నివాసాల్లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రులు కూడా భవనాలు ఖాళీ చేయవలసి ఉంటుంది.

కర్ణాటక

25 శాతం మంది నేరస్థులే

కర్ణాటక ఎన్నికల్లో పోటీపడిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల్లో 25 శాతం మంది నేరస్థులుగానే తెలుస్తోంది. వీరందరిపైనా కేసులున్నాయి. వీరిలో 15 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు, మరో 10 శాతం మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ‘కర్ణాటక ఎలక్షన్‌ వాచ్‌’ పేరిట ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌’ (ఏడిఆర్‌) సంస్థ ఈనెల 6వ తేదీన ఈ వివరాలను వెల్లడించింది. అక్కడ బరిలో ఉన్న మొత్తం అభ్యర్థులు 2,655 మంది కాగా 2,560 మంది నామినేషన్లను ఈ సంస్థ సమీక్షించింది. మిగిలిన 95 మంది నామినేషన్లను సరిగా స్కానింగ్‌ చేయకపోవడం, అసంపూర్ణంగా భర్తీ చేయడంవల్ల సమీక్షించ లేకపోయినట్లు సంస్థ పేర్కొంది. వీరిపై ఉన్న కేసులతో పాటు వారి అస్తులను కూడా ఈ సంస్థ వెల్లడించింది. వీరిలో క్రిమినల్‌ కేసులున్న వారు 391 మంది కాగా తీవ్ర మైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారి సంఖ్య 254. వీరిలో నలుగురిపై హత్య కేసులు కూడా ఉన్నాయి. మహిళలపై దౌర్జన్యనం చేసిన వాళ్ళ సంఖ్య 23గా ఉంది. 25 మంది హత్యాయత్నం కేసుల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఇద్దరికి రూ. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులుండగా మరొకరికి రూ.840 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. 17 మందికి అసలు ఆస్తులే లేకపోగా అత్యల్ప ఆస్తులు కలిగినవారు ఇద్దరున్నారు.

ఒడిశా

రూ. 1.89 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

ఒడిశాలోని భువనేశ్వర్‌ బిజుపట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తున్న ముగ్గురిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డిఆర్‌ఐఈ) అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 5.822 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి కౌలాలంపూర్‌ మీదుగా భువనేశ్వర్‌కు మే 6వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్న ఎయిర్‌ ఏసియా ఎ.కె.-31 విమానంలో బంగారం రవాణా అవుతున్నట్లు డిఆర్‌ఐఈ అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమై ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కారు పార్కింగ్‌ వద్ద అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ముగ్గురి బూట్ల కింద ఉన్న హైహిల్స్‌లో మొత్తం అయిదు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

దాచేపల్లి ఘటనపై రాజకీయమా ?

ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని కుదిపేసిన దాచేపల్లి అమానవీయ సంఘటనను కొంతమంది ప్రజాప్రతినిధులు రాజకీయం చేయాలనుకోవడం నిజంగా బాధాకర పరిణామం. ఒకవైపు ఈ దుర్మార్గంపై సభ్య సమాజం సిగ్గుపడుతుండగా మరోవైపు ఈ అత్యాచార ఘటనను రాజకీయం చేసి కొన్ని పార్టీలు పబ్బం గడుపు కునేందుకు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకు లంటున్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఇటీవల తొమ్మిదేళ్ళ బాలికపై సుబ్బయ్య అనే 60 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం జరిపి తదనంతరం తాను చేసిన దుర్మార్గానికి పశ్చా త్తాపం చెంది ఉరి వేసుకొని మరణిం చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారమే రేగింది. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు రంగంలోకి దిగి ఆ ఘటనకు రాజకీయ రంగు అంటగట్టే ప్రయత్నం చేశారు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *