రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో యువకుడు బలి – మహారాష్ట్ర

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఎంఆర్‌ఐ (మాగ్నటిక్‌ రిసోనెన్స్‌ ఇమేజింగ్‌) స్కానింగ్‌ గదిలో ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన ముంబయిలో చోటుచేసుకొంది. స్థానిక నాయర్‌ ఆసుపత్రిలో జనవరి 27న రాత్రి ఎంఆర్‌ఐ పరీక్ష నిమిత్తం ఓ వృద్దురాలిని ఆమె బంధువు రాజేశ్‌ మారుతి తీసుకొచ్చాడు. అతడు ఆక్సిజన్‌ సిలిండర్‌ను పట్టుకొని స్కానింగ్‌ గదిలోకి వెళ్లాడు. అప్పటికే ఎంఆర్‌ఐ యంత్రం ఆన్‌ చేసి ఉండడంతో అందులోని శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం సిలిండర్‌తో పాటు రాజేశ్‌ను కూడా బలంగా లోపలకి లాక్కోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో సిలిండర్‌ తెరుచుకోవడంతో పెద్దమొత్తంలో ద్రవరూప ఆక్సిజన్‌ను రాజేశ్‌ పీల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. అతిశీతలంగా ఉండే ద్రవరూప ఆక్సిజన్‌ను పీల్చితే శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుంది.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు. చిన్నపాటి లోహపు వస్తువులను సైతం ఎంఆర్‌ఐ గదిలోకి అనుమతించరాదు. స్కానింగ్‌కు వెళ్ళే ముందు అక్కడి సిబ్బంది రోగిని, ఆ రోగి తరపున వచ్చిన వ్యక్తిని పరీక్షించి స్కానింగ్‌ గదిలోకి పంపవలసి ఉంటుంది. సిలిండర్‌ను గదిలోకి తీసుకెళ్ళొచ్చా అని రాజేశ్‌ ముందుగానే అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా యంత్రం ఆన్‌లో లేదు కాబట్టి ప్రమాదమేమీ ఉండదని, సిలిండర్‌ను తీసుకెళ్ళవచ్చని బదులు చెప్పినట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. ఈ దారుణ సంఘటనపై ప్రాథమిక విచారణను జరిపిన పోలీసులు ఆసుపత్రికి సంబంధించిన ఓ వైద్యుడితో సహా ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. మృతుడి కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మన దేశంలో ఎందరో రోగులు అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.

సంగీత రారాజుకు పద్మవిభూషణ్‌ – తమిళనాడు

తన సంగీత సుస్వరాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోన్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాను ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో నిష్ణాతులైన 85 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ గౌరవం దక్షిణాదికి దక్కిన మ¬న్నత పురస్కారంగా మాస్ట్రో ఇళయరాజా అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు చిత్రరంగాలను తన సుమధుర సంగీత బాణీలతో ఇళయరాజా కొన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సంగతి తెలిసిందే. 1975లో ‘అన్నాక్షి’ అనే ఓ తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఇళయరాజా ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 6500కు పైగా పాటల్ని స్వరపరిచారు.

తెలుగులో ఆయన చేసిన తొలిచిత్రం భద్రకాళి. ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఐదుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. గ్రామ్‌ఫోన్‌ రికార్డుల స్థానంలో క్యాసెట్లు వచ్చినా, క్యాసెట్ల స్థానంలో సిడిలు ఆవిష్కృతమైనా, వాటి స్థానంలో సరికొత్తగా పెన్‌డ్రైవ్‌లు పుట్టుకొచ్చినా వాటిల్లో దాచుకొనే స్వర మాంత్రికుడి ఇళయరాజా పాటలు మాత్రం మారడం లేదు. లండన్‌లోని ఓ విశ్వవిద్యా లయం నుంచి క్లాసికల్‌ గిటార్‌లో ఈ రాజాధిరాజు బంగారు పతకాన్ని కూడా పొందారు. లండన్‌ ‘రాయల్‌బిల్‌ హార్మోనిక్‌ ఆర్కెస్ట్రా’లో సింఫనీ స్వరాలను అందించిన తొలి ఆసియా కళాకారుడు ఇళయరాజానే. స్వరాలకు ఓ తరం దాసోహ మయిందంటే ఆయన స్వరాద్భుతాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించు కోవచ్చు. సంగీత పరిజ్ఞానం లేని పామరులు కూడా ఆయన పాటలతో పులకరించి పోతారు. చిత్ర పరిశ్రమ గర్వింపదగ్గ ఇళయరాజా ఓ స్వర జ్ఞాని, సుమధురవాణి పద్మవిభూషణ్‌ అవార్డుకే ఆయన ఓ అలంకారమని అభిమానులు భావిస్తున్నారు.

‘బాహుబలి’ పై అధ్యయనం – గుజరాత్‌

అంతర్జాతీయ చిత్రపరిశ్రమలో తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎగురవేసి విమర్శకుల మెప్పుతో పాటు కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించిన సంచలన చిత్రం ‘బాహుబలి’ కి మరో అరుదైన గౌరవం దక్కింది. చరిత్ర సృష్టించిన ఈ చిత్రంపై సునిశిత అధ్యయనానికి ప్రతిష్టాత్మక అహ్మదాబాద్‌ ఐఐఎం సన్నద్ధమవు తోంది. కళ, వ్యాపారం, సాంకేతిక నైపుణ్యం మేళవించిన ఈ చిత్రం అఖండ విజయం సాధించ డానికి గల కారణాలపై అధ్యయనం జరగాలని ఐఐఎం పూర్వ విద్యార్థులు, అతిథి అధ్యాపకుడిగా ఉన్న భరతన్‌ కందస్వామి సంకల్పించారు.

ఐఐఎం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌పై నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ‘చలనచిత్ర వ్యాపారం’ అనే అంశంపై బాహుబలి ఘన విజయాన్ని ఓ అంశంగా ఇవ్వనున్నారు. ఓ ప్రత్యేక కోర్సుగా ఎంపిక చేసిన ఈ అంశంపై సదరు విద్యార్థులు లోతైన అధ్యయనం చేయనున్నారు. నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ సమగ్ర అధ్యయనంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ వ్యాపారం పరంగా సరికొత్త పాఠాలను నేర్చుకొనే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలో చాలా చిత్రాలు సృజనాత్మకంగా, కళాత్మకంగా ఉన్నా మంచి వ్యాపారాన్ని చేయలేకపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రతిభావంతంగా వినియోగించుకోలేక పోవచ్చునని అతిథి అధ్యాపకుడైన కందస్వామి అభిప్రాయ పడుతున్నారు. కొన్ని కొన్ని సందర్బాల్లో మంచి కథలు లభించినా బాహుబలి స్థాయి విజయాన్ని సాధించలేక పోతున్నాయి. కళ, వ్యాపారం, సాంకేతిక పరిజ్ఞానాల మేళవింపు సమపాళ్ళలో ఉండటం వల్లనే బాహుబలి రాష్ట్రాలకు, దేశాలకు అతీతంగా ఘనవిజయాన్ని సాధించి మనదేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకోగలిగింది. బాహుబలి చిత్ర విజయపరంపరపై అధ్యయనం జరుగుతోందన్న వార్తతో తెలుగు రాష్ట్రాల ప్రజలు పరవశించి పోతున్నారు. తెలుగువారి సత్తా ఏమిటో యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పిన ఈ చిత్ర దర్శకుడు రాజమౌళిని చిత్రపరిశ్రమకు సంబంధించి యుగపురుషుడుగా సినీ అభిమానులు కీర్తిస్తున్నారు.

అవహేళన సరికాదన్న రాష్ట్రపతి – ఢిల్లీ

చారిత్రక విషయాలపై విభేదాలుంటే నిర్భయంగా చెప్పడంలో తప్పు లేదు గాని అవతలివారి హుందా తనాన్ని అవహేళన చేయడం సంస్కారమని పించుకోదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హితవు పలికారు. సహృద్భావ వాతావరణమున్న సమాజం ఏ దేశానికైనా ఎంతో అవసరమన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవస్థలన్నీ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ నైతిక రుజువర్తనతో మెలగాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి హితవు పలికారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే వ్యవస్థలే ఎంతో ముఖ్యమని, ఈ వ్యవస్థలు నీతి, నిజాయతీ, క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తూ ప్రజల మెప్పును పొందాలన్నారు.

బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావత్‌’ పై దేశవ్యాప్తంగా ఇటీవల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రపతి ఇచ్చిన ఈ హితోపదేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంది. మన హక్కులను, భావాలను కాపాడుకొంటూ ఎదుటివారి హక్కులకు భంగం కలుగకుండా చూడటమే నిజమైన ప్రజాస్వామ్యమని ఈ సందర్భంగా రాష్ట్రపతి సెలవిచ్చారు. సమాజంలో ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా నడచు కోవడమే సౌభ్రాతృత్వమని ఆయన వివరించారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని చిన్నారులకు చేర్చడమే మనముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. మనపిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి, దేశభవిష్యత్‌కు ఈ చర్యలు ముఖ్యమని పేర్కొన్నారు. 2020నాటికి మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి 70 ఏళ్ళు పూర్తవుతుందన్నారు. ఈ శతాబ్దంలో మన దేశం చేరుకోదగ్గ స్థానాన్ని చేరుకునేందుకు మనమంతా సమష్టిగా పాటు పడవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

నటి కృష్ణకుమారి కన్నుమూత – కర్ణాటక

దశాబ్దానికి పైగా తెలుగు చిత్రసీమను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బహు భాషా నటి కృష్ణకుమారి (85) జనవరి 24న బెంగళూరులోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నలుపు, తెలుపు చిత్రలోకపు మహారాణి అయిన ఈ నిండు చందమామ సువిశాల రంగుల లోకాన్ని వదిలి వెళ్ళారు. అందం, అమాయకత్వం కలబోసిన ఆ అభినయం సినీ అభిమానులకు ఇక ఓ తీపిగుర్తే. వివిధ భాషల్లో దాదాపు 110 చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి అందాల నటిగానే కాకుండా ఏ పాత్రను అయినా పోషించగల నటిగా ప్రేక్షకుల ఆదరణను పొందారు. అందం, రాజసం, దర్పం అనే ఆభరణాలు ఆమెకే సొంతం.

ఆమె నట జీవన ప్రస్థానంలో చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో మ¬న్నత పాత్రలను పోషించారు. తెలుగు చిత్రపరిశ్రమకు రెండు కళ్ళయిన ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌తో పోటీ పడి నటించి మెప్పించారు. కాంతారావుతో కలసి 28 జానపద చిత్రాల్లో ఆమె నటించి అభిమానులను అలరించారు. తెలుగులో అగ్ర కథానాయకుల సరసన వందల కొద్దీ గీతాల్లో కృష్ణకుమారి ఆడిపాడారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన కృష్ణకుమారి ఆయా భాషల్లో తనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణకుమారి ప్రముఖ నటి షావుకారు జానకి చెల్లెలే. పలు వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించిన కృష్ణకుమారి మూడుసార్లు జాతీయ అవార్డులను అందుకొన్నారు. ఆమె మృతిపట్ల చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

పోలీసుల అక్రమ వసూళ్లు – ఆంధ్రప్రదేశ్‌

కొంతమంది అవినీతి పోలీసులు దేశ పరువు, ప్రతిష్టలకు కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం. అంతర్జాతీయ స్థాయిలో మనదేశ పరువు ప్రతిష్టలను మంటగలిపిన పోలీసుల భాగోతం ఆంధ్రప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు గుంటూరు జిల్లాకు వచ్చిన విదేశీయులను కొందరు పోలీసులు బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రాష్ట్ర పోలీసు శాఖకు తలవంపులు తెచ్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మన దేశంలో ప్రవేశించిన విదేశీయుల వివరాల సేకరణ, పాస్‌పోర్టు తనిఖీ, అనుమతుల పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల అమెరికా, ఐర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన కొంతమంది విదేశీయులు గుంటూరు జిల్లాకు చెందిన తమ స్నేహితుడి కోరిక మేరకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు గుంటూరు జిల్లాకు వచ్చారు. సుమారు 20 మంది స్నేహితుడి వేడుకను తిలకించే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడకు చేరుకొని వారి పాస్‌పోర్టులను చూపించాలని, అంతమంది ఒక్కచోట ఎందుకు చేరారని ప్రశ్నలతో వారిని భయాందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని ఫోటోలు తీసి సరైన అనుమతులు లేవంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశీయులు తిరిగి తమ దేశాలకు చేరుకొన్న తర్వాత పోలీసుల దందాపై ఇండియన్‌ ఎంబసీలో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన డిజిపి సదరు అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సమగ్ర విచారణను జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోరినట్లు తెలుస్తోంది. విదేశీయులను ఇబ్బందిపెట్టిన పోలీసులపై చర్యల దిశగా కార్యాచరణ వేగవంతమయింది.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *