రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

ఇక ‘రజనీ’ రాజకీయం – తమిళనాడు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న శుభగడియలు వచ్చేశాయి. ‘ఆ దేవుడు శాశిస్తే…ఈ రజనీ పాటిస్తాడు’ అంటూ ఎప్పుడూ చెప్పే తమిళ తలైవర్‌ తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యత నేపథ్యంలో ఇప్పుడు సమయం వచ్చిందని భావించి క్రియాశీలక రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆయన ఎన్నో సార్లు రాజకీయాల్లోకి రావాలనుకొన్నా వెనకడుగు వేస్తూ వచ్చారు. ప్రాంతీయభావం ఎక్కువగా ఉన్న తమిళులు ఏ జాతీయ పార్టీనీ ఆదరించే పరిస్థితి లేకపోవడం, జయలలిత మృతితో అన్నాడీఎంకే పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారడం, ప్రధాన విపక్షమైన డీఎంకే పరిస్థితి కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఆ రాష్ట్రంలో మరో నూతన రాజకీయపార్టీ ఆవిర్భావ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో మరో సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌ కూడా రాజకీయ ఎంట్రీకి తహతహలాడుతున్నా ప్రస్తుత పరిస్థితులు ఏమేరకు అనుకూలించగలవన్న అంచనాల్లో ఆయన సతమతమవుతున్నారు. కొద్దిరోజుల కిందట తాను రాజకీయాల్లోకి రానంటూ ప్రకటించిన రజనీకాంత్‌ ఇటీవల అనూహ్యంగా తన ఎంట్రీపై స్పష్టతనివ్వడంతో తమిళ రాజకీయాల్లో నూతన శకం ప్రారంభం కానుందనుటలో ఎలాంటి సందేహం లేదు. రజనీ ప్రకటనతో తమ దశాబ్దాల కల నెరవేరబోతోందంటూ ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోతున్నారు. చిత్రపరిశ్రమలో మ¬న్నత శిఖరాలను అధిరోహించిన ఈ దళపతి రాజకీయంగా ఎలాంటి సంచలన విజయాలను అందుకోగలరో అనే ఉత్కంఠ ఒక్క తమిళనాటే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నెలకొంది.

యుద్ధంలో విజయం సాధించాలంటే ఒక్క వీరత్వం మాత్రమే సరిపోదని, పక్కా వ్యూహం ఎంతో అవసరమని తన మనోభావాన్ని స్పష్టం చేసిన రజనీకాంత్‌ తదనుగుణ కార్యాచరణ పూర్తైందన్న నమ్మకం కల్గిన తర్వాతే కదనరంగాన పోరుబాటకు సంసిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రం వదిలి పొమ్మంటే హిమాలయాలకే వెళతానన్న రజనీ నిజాయతీని శంకించాల్సిన అవసరం లేదన్నది నిర్వి వాదాంశం. అవినీతి, కుంభకోణాలతో భ్రష్టుపట్టిన నేటి రాజకీయ వ్యవస్థకు రజనీలాంటి మార్గదర్శకులు ఎంతో అవసరం. తన రాజకీయ ఎంట్రీతో తమిళ రాజకీయాలనే కాకుండా జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలరని తమిళ ప్రజలు విశ్వసిస్తున్నారు.

 

పిరికిపందల దాడిలో ఐదుగురు జవాన్ల మృతి – జమ్మూకశ్మీర్‌

యావద్భారతదేశమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకబోయే శుభ తరుణంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద పిరికి పందలు జరిపిన ముష్కర దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతిచెందడం యావత్‌జాతిని కలవర పాటుకు గురిచేసింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో డిసెంబర్‌ 31 తెల్లవారుజామున మానవ మృగాల మారణహోమం ఐదుగురు వీరజవాన్లను బలికొంది. ఈ దాడిలో ఇద్దరు ఉగ్ర వాదులు మృతిచెందారు. ఈ ఉగ్రవాదులిద్దరూ స్థానిక కశ్మీరీలే కావడం గమనార్హం. భారీగా ఆయుధాలు ధరించిన ఈ ముష్కరులు డిసెంబర్‌ 31న తెల్లవారు జామున 2 గంటల సమయంలో లెథపోరలోని సీఆర్పీఎఫ్‌ 185వ బెటాలియన్‌ శిబిరం వద్దకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో ఉలిక్కిపడ్డ సెంట్రీలు ఎదురుకాల్పులు జరపవలసి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్లో తూటాలు తగిలి నలుగురు జవాన్లు మృతిచెందగా మరోజవాను గుండెపోటుతో మరణించాడు. ఉగ్రవాదుల మెరుపుదాడితో ఒక్కసారిగా అప్రమత్తమైన సైన్యం, సీఆర్పీఎఫ్‌, పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులను అంతమొందించడంతో ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. హతమైన ఉగ్రవాదులను మంజూర్‌ అహ్మద్‌ బాబా, ఫర్ధీన్‌ అహ్‌మద్‌ ఖండేగా గుర్తించారు.

ఫర్దీన్‌ ఓ పోలీసు అధికారి కుమారుడు కావడం గమనార్హం. ఈ ముష్కరులు జైషే మహ్మద్‌ ముఠా సభ్యులుగా తెలుస్తోంది. ఉగ్రవాద దాడికి గురైన సీఆర్పీఎఫ్‌ శిబిరంలో బదిలీపై కశ్మీర్‌ లోయలోకి వచ్చే సిబ్బందికి ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తుంటారు. ఇలాంటి దాడులు జరుగవచ్చని మూడు రోజుల కిందటే తమకు సమాచారం ఉన్నట్లు జమ్మూకశ్మీర్‌ డీజీపీ వెయిద్‌ చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించాల్సిన కాంగ్రెస్‌ మోదీ విదేశాంగ విధానం విఫలమైనందువల్లనే ఈ దాడి జరిగిందంటూ విమర్శలకు దిగడం విస్మయాన్ని కల్గిస్తోంది. ఇకనైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో వ్యవహరించి భవిష్యత్‌లో మరెలాంటి ఉగ్రదాడులు జరగకుండా చూడాలన్నదే జాతి ప్రజల ఆకాంక్ష.

 

భారీగా అక్రమ కట్టడాల కూల్చివేత – మహారాష్ట్ర

మధ్య ముంబయి పబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాద దుర్ఘటనలో 14 నిండు ప్రాణాలు బలైపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ నగరపాలక అధికారులు, పోలీసులు, అగ్నినిరోధక అధికారులు ఏకమై భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పెద్దఎత్తున దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ముంబయిలోని 314 ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్లు, పబ్‌లను అధికారులు గత ఏడాది డిసెంబర్‌ 30న కూల్చివేశారు. 7 ¬టళ్ళను మూసివేసి 417 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకొన్నారు. ప్రమాదాలను నివారించే భద్రతా చర్యల్లో భాగంగా బృహన్‌ ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ) పెద్దఎత్తున ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టంది. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన పబ్‌కు చెందిన ఇద్దరు సహ యజమానులు హితేష్‌ సింఘ్వీ, జిగార్‌ సింఘ్వీలకు పోలీసులు నోటీసులను జారీచేశారు. ముంబయి అధికార యంత్రాంగం చేపట్టిన భారీ స్థాయి అక్రమ కట్టడాల కూల్చివేతను నగర ప్రజలు స్వాగతిస్తున్నారు. నియమనిబంధనలకు తూట్లుపొడిచే విధంగా మున్ముందు కూడా ఎలాంటి అక్రమ కట్టడాలకు అనుమతులనివ్వకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.

 

కార్గిల్‌ అమరుడి భార్య మృతి – హర్యానా

ఇటీవలి కాలంలో మనదేశంలో కొన్ని ఆసుపత్రుల దారుణాలు మరింత శృతి మించుతున్నాయి. కార్గిల్‌ యుద్దంలో దేశానికి విజయాన్ని అందించేందుకు ప్రాణాలొడ్డిన ఓ అమర జవాను కుటుంబం ఆసుపత్రి యాజమాన్య దుర్మార్గపు నియమాల ముందు ఓడిపోయింది. ఆధార్‌కార్డు మరచిపోయి వచ్చారన్న కారణంతో అమర జవాను భార్యకు చికిత్స చేయబోమంటూ ఆసుపత్రి వర్గాలు నిరాకరించడంతో ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. హృదయ విదారకమైన ఈ దారుణ సంఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన అత్యంత వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించవలసి వచ్చింది.

సంఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే హవల్దార్‌ లక్ష్మణ్‌దాస్‌ కార్గిల్‌ యుద్ద సమయంలో (1999) శత్రువుల బుల్లెట్లకు బలయ్యాడు. మహ్లానా గ్రామంలో నివసిస్తున్న ఆయన భార్య శకుంతలాదేవి (55)కి గతేడాది డిసెంబర్‌ 28న గుండెపోటు రావడంతో కుమారుడు బల్వన్‌ తొలుత సోనిపట్‌లోని మాజీ సైనికుల భాగస్వామ్యంతో నడిచే ఆరోగ్య పథకం (ఈసీహెచ్‌) ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్ళాడు. అనంతరం ఆసుపత్రి యాజమాన్య సిఫార్సుతో తులిప్‌ హాస్పిటల్‌కు వెళ్ళారు. తన తల్లిని ఆస్పత్రిలో చేర్చుకోవాలంటే ఆధార్‌కార్డును చూపించాల్సిందే నంటూ తులిప్‌ ఆస్పత్రి సిబ్బంది పట్టుపట్టారని బల్వన్‌ ఆరోపించారు. కార్డును మరచిపోయానని, ముందు ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్సను ప్రారంభిస్తే ఇంటికెళ్లి ఆధార్‌కార్డును తీసుకు వస్తానని తెలిపినా సిబ్బంది వినిపించుకోలేదని వాపోయాడు. అందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించక పోవడంతో తన తల్లిని తిరిగి ఈసీహెచ్‌ ఆస్పత్రికి తీసుకురాగా అదేరోజు సాయంత్రం ఆమె చనిపోయారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఆసుపత్రి సిబ్బందిని విచారించగా తాము ఆధార్‌కార్డును అడిగినమాట నిజమేనని, అయితే కార్డు లేనిదే అసుపత్రిలో చేర్చుకోలేదన్న ఆరోపణ అబద్దమని ఖండించారు.

 

దెబ్బకు దెబ్బ – హిమాచల్‌ప్రదేశ్‌

సాధారణంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారెవరైనా ఓ దెబ్బకొడితే తిరిగి కొట్టేందుకు సామాన్యులు సాహసించరు. కానీ కొంతమంది సై అంటే సై అంటూ ఎంతకైనా తెగబడుతుంటారు. ఇలాంటి సంఘటనే ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకొంది. ఓ ఎమ్మెల్యే, కానిస్టేబుల్‌ పరస్పరం చెంప దెబ్బలు కొట్టుకొని చర్యకు ప్రతిచర్యను తీర్చుకొన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే ఆశాకుమారి గత ఏడాది డిసెంబర్‌ 29న సిమ్లాలో ఓ కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టగా అందుకు ప్రతిగా ఆ కానిస్టేబుల్‌ ఏమాత్రం తగ్గకుండా ఎమ్మెల్యేను చెంపదెబ్బకొట్టి ప్రతీకారచర్య తీర్చుకున్నారు. ఈ చెంపదెబ్బల తతంగమంతా వీడియో కెమెరాల్లో నమోదయింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే ఆశాకుమారి అక్కడకు చేరుకోగా అక్కడ విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఆమెను అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె కానిస్టేబుల్‌ చెంపను చెళ్ళు మనిపించింది. వెంటనే ఆమె కూడా శాసన సభ్యురాలని చూడకుండా చెంపదెబ్బ కొట్టింది. సంఘటన జరిగిన తదనంతరం నిగ్రహం కోల్పోయి చేయి చేసుకొన్నందుకు ఆశాకుమారి పశ్చాత్తాపాన్ని వ్యక్తంచేసి క్షమాపణలు కోరడం నిజంగా విశేషమే. ఆశాకుమారి మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు మేనకోడలు.

 

సంక్రాంతికి సై అంటున్న పందెం కోళ్ళు – ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పందేలకు కోళ్ళు సై అంటుండగా లక్షలాది రూపాయల మాయాజూదాన్ని ఆడేందుకు బెట్టింగ్‌ బంగార్రాజులు కార్యాచరణలో మునిగితేలుతున్నారు.

సంక్రాంతి సరదాల్లో కోడిపందేలు తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార యంత్రాంగం ప్రతి సంవత్సరం ఎన్నో పటిష్ట చర్యలు తీసుకొంటున్నా రాజకీయ ముసుగులో పందెం రాయుళ్ళు తమ గేమ్‌లను కొనసాగించేస్తున్నారు. ఈ కోడిపందేలకు చిరునామాగా మారిన ఏపీలోని భీమవరంలో బెట్టింగ్‌ బాబులు పందేల నిర్వహణ కోసం అక్కడే మకాం వేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయినట్లు తెలుస్తోంది. పందెం కాసేవాళ్ళ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తిచేసినట్లు సమాచారం. పందేల నిర్వహణ సమయంలో స్థానికుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా గ్రామసభలను పెట్టుకొని మరీ జాగ్రత్త పడుతున్నారు. ఈసారి భీమవరం పరిసరాల్లో కనీస పందెం రూ.5లక్షలుగా ఉండబోతున్నట్లు సంకేతాలందుతు న్నాయి. 5లక్షలపైన పందెం ఎంతవరకు పలకనుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది. భీమవరంలోని లాడ్జిలన్నిటిని పందెం రాయుళ్లు ముందుగనే బుక్‌చేసుకొన్నట్లు తెలుస్తోంది. ¬టల్‌ యజమానులు సాధారణ రోజుల్లో ఉండే అద్దె కన్నా సంక్రాంతి పర్వదిన సందర్భంలో పందెం రాయుళ్ళను దృష్టిలో పెట్టుకొని రెండింతలు వసూలు చేస్తున్నారు. ఈ పందేలను వీక్షించేందుకు ఫ్లడ్‌లైట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బరి దగ్గర దాదాపు పదివేల మంది పందేలను వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల పందేల్లో సరదా కోసం వేసుకొనేవే కనీసం రూ.50 వేలుగా ఉండబోతున్నట్లు సమాచారం. అధికార వ్యవస్థ ఎన్ని చర్యలు చేపట్టినా యధావిధిగా సంక్రాంతికి కోడిపందేలు జరిగిపోవడం ఈ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *