రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

తిరుగులేని శక్తిగా బిజెపి – ఉత్తరప్రదేశ్‌

2014 లోక్‌సభ, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బిజెపి తాజాగా జరిగిన స్థానిక సంస్థల సంగ్రామంలోనూ విజయ కేతనాన్ని ఎగరవేసి రాజకీయంగా తనకు తిరుగులేదని నిరూపించుకొంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన ఏడు నెలల పాలనలో ఎదురైన తొలి పరీక్షను ఈ విజయంతో అధిగమించారు. రాష్ట్రంలో ఎస్పి, కాంగ్రెస్‌ పార్టీలకు మరోసారి పరాభవం ఎదురుకాగా, రెండు మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో మేయర్‌ పదవులను పొంది బిఎస్పి ఫర్వాలేదనిపించు కొంది. కొత్తగా కార్పొరేషన్లు అయిన అయోధ్య, సహరాన్‌పూర్‌, ఫిరోజాబాద్‌, మథురలలోనూ బిజెపి హవాను కొనసాగించింది. రాహుల్‌గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీ లోక్‌సభ నియోజకవర్గ పరిధి, అమేథీ నగర పంచాయతీలోను బిజెపి విజయం సాధించడం విశేషంగా చెప్పుకో వచ్చు. 2012లో ఓటమి చవిచూసిన అలహాబాద్‌, బరేలీ మున్సిపల్‌ కార్పొరేషన్ల (నగర్‌ నిగమ్‌)ను ఈ సారి కమలదళం సొంతం చేసుకొంది. అయితే బిజెపికి బాగా పట్టున్న ఆలీగఢ్‌ను ఆ పార్టీ కోల్పోగా ఇక్కడ బిఎస్పి అభ్యర్థి ఝ గెలుపొందారు. ప్రధాన మంత్రి మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వారణాసి మేయర్‌ పదవిని బిజెపి అభ్యర్థి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 78,843 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది చేజిక్కించుకొన్నారు. మరో వారంరోజుల్లో గుజరాత్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపిలో లభించిన భారీ విజయం కమలనాథుల్లో ఆనందోత్సహాలను రెట్టింపు చేస్తోంది. జిఎస్టి నిర్ణయాల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నదానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

నిరుద్యోగ భృతి ముసాయిదా – ఆంధ్రప్రదేశ్‌

2104 ఎన్నికల ప్రచార సందర్భంగా ముఖ్య మంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీ లన్నింటినీ తుంగలో తొక్కారని ఒకవైపు విపక్షాలు విరుచుకుపడు తోండటం, మరోవైపు సాధారణ ఎన్నికలు సమీపిస్తోండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా కొన్ని ముఖ్యమైన హామీలను నెరవేర్చే పనుల్లో సర్కార్‌ తలమునకలౌతోంది.

‘బాబు వస్తే జాబు’ హామీ సాధ్యం కాకపోవడంతో ఈ హామీతో అనుసంధానమైన మరోహామీ ‘నిరుద్యోగ భృతి’ చెల్లింపుపై సర్కార్‌ దృష్టిపెట్టింది. నిరుద్యోగ భృతిని అమలుచేయడానికి వీలుగా తెరవెనుక చర్యల్ని వేగవంతం చేసింది. ఈ హామీకి చట్టరూపం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సందర్భంగా చర్చ జరిగినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు నమోదైనట్లుగా లెక్కతేలినట్లు సమాచారం. వీరిలో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. మూడు ఎకరాల తడిపొలం, ఐదు ఎకరాల మెట్టపొలం ఉన్నవారిని, కుటుంబానికి సొంతకారు ఉన్నవారిని అనర్హులుగా పరిగణించాలని సర్కార్‌ భావిస్తోంది. గ్రామీణ ఉపాధి పనుల్లో ఉన్నవారిని నిరుద్యోగులుగా ఎలా గుర్తించాలన్న అభిప్రాయాన్ని మంత్రిమండలి చర్చ సందర్భంగా కొందరు వ్యక్తంచేయగా ఇది సమంజసం కాదన్న అభిపాయ్రం వ్యక్తమైంది. ఒకవైపు నిరుద్యోగభృతిని కల్పిస్తూ సామర్థ్యపెంపు శిక్షణను ఇవ్వడం ద్వారా వారికి భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలను కల్పించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్త్తోంది.

గుట్టు రట్టు – కర్ణాటక

రోగుల నిలువుదోపిడీ విషయంలో ప్రైవేటు వైద్యశాలల విశ్వరూపానికి అద్దం పడుతున్న సంఘటన ఇది. కొందరు వైద్యులు, రోగనిర్దారక కేంద్రాలు కుమ్మక్కై ఏ స్థాయిలో రోగులను దోచుకొంటున్నారన్న విషయాన్ని బెంగళూరు నగరంలో జరిగిన ఓ సంఘటన సాధికారికంగా రుజువు చేస్తోంది.

ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల ఇక్కడ నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే నిజాల్ని బహిర్గతం చేశారు. ఇక్కడి రోగనిర్దారణ కేంద్రాలు రూ.100 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా మాయం చేశాయన్న వ్యవహారం ఈ దాడుల్లో వెలుగు చూసింది. పరీక్షలకు సంబంధించి ఫలానా కేంద్రాలకు వెళ్ళవలసిందిగా రోగులకు సిఫార్సు చేసినందుకు, శస్త్రచికిత్సలను నిర్వహించినందుకు కమీషన్‌ రూపంలో వైద్యులకు ఒక ల్యాబ్‌ చెల్లించిన మొత్తం రూ.200 కోట్లు దాటిందని తెలిసి ఐటి విభాగం నిర్ఘాంతపోయింది. ఈ దాడుల్లో ఓ ప్రసూతి కేంద్ర వైద్యురాలి నివాసంలో రూ.1.4 కోట్ల నగదు, 3.5 కిలోల బంగారు ఆభరణాలు, విదేశాల్లోని బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లకు సంబంధించిన రసీదులను అధికారులు స్వాధీన పరచుకున్నారంటే మన ప్రైవేటు వైద్యులు ఏ స్థాయిలో బరితెగించి రోగుల ముక్కుపిండి వసూళ్ళకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. రోగనిర్దారణకు సంబంధించిన పరీక్షల నిమిత్తం సిఫార్సు చేసినందుకు ఆయా కేంద్రాల నుంచి వైద్యులకు వాటా వెళుతోందన్నది బహిరంగ రహస్యమే. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో 35శాతం, ఇతర రోగనిర్దారక పరీక్షలకు సంబంధించి 20 శాతం కమీషన్లు వైద్యులకు అందుతున్నట్లు ఈ దాడుల్లో తేలింది. ఒక్క బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా అటు వైద్యులు, ఇటు ల్యాబ్‌ యాజమాన్యాలు కుమ్మక్కై రోగులను పీల్చి పిప్పిచేస్తూ కోట్లకు కోట్లు గడిస్తున్నారన్న ప్రజల వాదన ఏమాత్రం అబద్దం కాదన్న విషయాన్ని బెంగళూరులో తాజాగా ఐటి శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో వెలుగుచూసిన నిజాలు స్పష్టం చేస్తున్నాయి.

వైద్యుల అజ్ఞానానికి పరాకాష్ట – ఢిల్లీ

వైద్యుల అజ్ఞానానికి పరాకాష్టగా నిలిచే ఓ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో నవంబరు 30న చోటుచేసుకొంది. బతికున్న శిశువును మరణించినట్లు ప్రకటించి ఓ ప్రముఖ ఆసుపత్రి వైద్యులు అభాసు పాలయ్యారు. నెలలు నిండకుండానే వర్ష అనే మహిళకు మృత కవలలు జన్మించారంటూ ఆసుపత్రి సిబ్బంది శిశవులను పాలిథిన్‌ సంచుల్లో ప్యాక్‌ చేసి తల్లిదండ్రులకు ఇచ్చారు.

22 వారాల వయసున్న ఆ మృత కవలలను కుటుంబ సభ్యులు అంతి మసంస్కారాలకు తీసుకెళుతుండగా ప్యాకెట్‌లో ఒక శిశువు కదలికను గమనించి తండ్రి బిత్తరపోయాడు. పాలిథిన్‌ కవర్‌ను తెరచిచూస్తే ఓ శిశువు ఊపిరి పీల్చుకొంటూ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆ శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్ళి, వైద్యుల తప్పిదంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందిందన్న శిశువు కదలికలపై సదరు ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీసులు నిలదీయగా పొరపాటుకు చింతిస్తున్నా మంటూ ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకొంది. వైద్యుల నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడు తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నివేదికను ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు.

తేరుకొన్న కన్యాకుమారి – తమిళనాడు

ఓఖి తుపానుతో అతలాకుతలమైన కన్యాకుమారి క్రమక్రమంగా కోలుకొంటోంది. ఈ తుపాను కేరళతో పాటు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లానూ వణికించిన విషయం తెలిసిందే. ఓఖి తుపాను దెబ్బకు వేల సంఖ్యలో కొబ్బరి, ఇతర చెట్లు నేలమట్టమయ్యాయి. వేల సంఖ్యలో పడవలు కూడా ధ్వంసం అయ్యాయి. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనావేసి నష్టపోయిన వారికి అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తుపాను మిగిల్చిన నష్టాన్ని భర్తీచేసుకునే పనుల్లో కన్యాకుమారి అధికార యంత్రాంగం నిమగ్నమయింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ఓఖి తుపాను ప్రభావం తగ్గిందని, అయితే మరో తుపానుకు అవకాశముందని చెప్పడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో సహాయకచర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో మత్స్యకారులను, పడవలను అధికారులు ఒడ్డుకు చేర్చారు. భారీ విధ్వసంసాన్ని సృష్టించిన ఈ తుపాను బారినుంచి రక్షంచిన వారిని లక్షదీవులు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పునరవాసాలకు తరలించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాకు చెందిన 2,124 మంది మత్స్యకారులను వివిధ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళాలు రక్షించాయి. తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కన్యాకుమారి జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు.

ఐఐటి-ఖరగ్‌పూర్‌లో ప్రాంగణ నియామకాలు – పశ్చిమబెంగాల్‌

పశ్చిమబెంగాల్‌లోని ఐఐటి-ఖరగ్‌పూర్‌లో డిసెంబర్‌ 2 నుంచి ప్రాంగణ నియామకాలు ప్రారంభ మయ్యాయి. మొదటి రెండురోజుల్లోనే 300కు పైగా విద్యార్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సంపా దించారు. టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఇక్కడ తొలిసారిగా నియామ కాలను చేపట్టింది. బెంగళూరు లోని తమ కార్యాలయానికి ఐదు మంది విద్యార్థులను ఆ సంస్థ ఎంపిక చేసుకొంది. ఫ్లిప్‌కార్ట్‌, హెచ్‌ఎస్‌బిసి, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఐబిఎం, జపి మోర్గాన్‌, ఉబెర్‌, ఎయిర్‌బస్‌ తదితర సంస్థలు కూడా ఎంపికలు నిర్వహించాయి. తొలి రెండురోజుల ప్రాంగణ ఎంపికల్లో 335 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించగా వారిలో 35 మందికి విదేశాల్లో పనిచేసే సదవకాశం వచ్చింది. ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ఉద్యోగయోగ్యుల సంఖ్య గత మూడేళ్ళలో బాగా పెరిగిందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధె పేర్కొన్నారు. మూడేళ్ళక్రితం విద్యార్థుల్లో ఉద్యోగయోగ్యులు 25 శాతం ఉండగా ఇప్పుడు 40శాతానికి చేరుకొన్నారని ఆయన అన్నారు. ఇంజనీరింగ్‌లో ప్రాంగణ ఎంపికలు ఇటీవల కాలంలో బాగా పెరుగుతోండడంతో ఇంజనీరింగ్‌కు మళ్ళీ డిమాండ్‌ పెరిగే అవకాశముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సరైన విద్యాబోధనలు లేకపోవడం వల్లనే విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో విఫలమవుతున్నారని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

– మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *