రాజకీయ చదరంగం

రాజకీయ చదరంగం

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో అధికార పక్షమైన టీడీపీ ప్రభుత్వం ఇంతకాలం తన అమ్ములపొదిలో దాచుకొంటూ వస్తున్న వరాల పాశుపతాస్త్రాలను సంధించేందుకు రంగం సిద్దం చేసుకొంటోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటుబడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లే తాము అనుకున్న రీతిలో అభివృద్ధిని చేయలేకపోయామన్న వేదాంత వాణులను ఇప్పటి వరకు వినిపిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎన్నికల ఏడాది సమీపిస్తోండడంతో ఒక్కసారిగా అలర్ట్‌ కాక తప్పలేదు. 2018లోగా జాతీయ బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తిచేసి వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్దిని పొందాలని ప్రభుత్వం కలలు కన్నా ఆ కలలు నెరవేరే అవకాశాలు లేకపోవడంతో సరికొత్తగా మరిన్ని వినూత్న పథకాలను అమలుచేసి ఆ లోటును భర్తీ చేసుకోవాలన్న దిశగా కార్యాచరణలో నిమగ్నమైంది.

ఎంతో ప్రతిష్టాత్మకమైన సీమాంధ్రుల నూతన రాజధాని అమరావతి నిర్మాణ పనులు కేవలం గాఫ్రిక్స్‌ డిజైన్లకే ఇప్పటి వరకు పరిమితం కావడంతో వచ్చే ఏడాదిలోగా నిర్మాణాలను మొదలుపెట్టి ప్రజల్లో విశ్వసనీయతను కల్గించేలా చర్యలు చేపట్టే పనిలో అధికారపక్షం ఉంది. ఒకవైపు ప్రధాన విపక్ష నాయకుడైన వై.ఎస్‌. జగనన్మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్రలో నిర్వీర్యమైన ప్రభుత్వ హామీలపై దుమ్మెత్తి పోస్తోండడంతో చంద్రబాబు సర్కార్‌ దిద్దుబాటు చర్యలను చేపట్టక తప్పడం లేదు. 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా ‘బాబు వస్తేనే జాబు’ అంటూ కార్యాచరణకు సాధ్యపడని హామీనిచ్చి భంగపడ్డ అధికారపక్షం ఇప్పుడు ఆ హామీలో భాగంగా కొంతవరకైనా యువతను సంతృప్తి పరచాలన్న లక్ష్యంతో నిరుద్యోగభృతిపై దృష్టి పెట్టడానికి కారణం ఎన్నికల ఫీవరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తాజాగా ‘చంద్రన్న పెళ్ళికానుక’ పథకాన్ని కూడా తెరపైకి తీసుకు వస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రాథమికంగా ఇప్పటికే రూపొందించిన ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 200 అన్న కాంటీన్లను కూడా ప్రభుత్వం ప్రారంభించ నుంది. ఈ క్యాంటీన్లలో అతితక్కువ ధరలకే మంచి భోజనం, ఫలహారం లభించనుండడంతో పేద ప్రజలను ఆకర్షించవచ్చన్న ఎత్తుగడతోనే సర్కార్‌ ఈ పథకం అమలుకు నడుం బిగిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో చేపట్టనున్న ‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’ కూడా ఎన్నికల వరాల అమ్ముల పొదిలో నుంచి వెలువడనున్న మరో ఆకర్షణీయ పాశుపతాస్త్రమే.

అంతర్లీనంగా ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓటు చేసుకోవాలన్న దిశగా వైఎస్‌ఆర్‌సీపీ దూకుడును ప్రదర్శిస్తుండగా, వినూత్న సంక్షేమ పథకాల అమలుతో ఎలాగైనా వైఫల్యాలను కవర్‌ చేసుకొని మరోసారి పగ్గాలు చేజిక్కించుకోవాలన్న కార్యాచరణతో అధికారపక్షం వడివడిగా అడుగు లేస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏపీ ఫైబర్‌ ప్రాజెక్టు (ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు) సిద్ధం కావడం కూడా రానున్న ఎన్నికల మాయాజాలంగానే భావించవచ్చు. సమాచార సాంకేతిక విప్లవం ద్వారా ఒకే కనెక్షన్‌తో మూడు రకాల సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలన్నదే ప్రభుత్వ ఆశయంగా కనపడుతోంది. ఈ సేవల ద్వారా ఏపీలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ కనెక్షన్‌, 250 ఛానళ్ళ ప్రసారాలు తక్కువ ధరలకే అందనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,03,613 ఇళ్ళకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు సిద్దం కాగా వచ్చే మార్చి నాటికి కనీసం 10 లక్షల ఇళ్ళకు కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విప్లవం ద్వారా తమ సాంకేతిక ప్రగతి కార్యాచరణతో ప్రజల మెప్పును పొందాలన్నదే ‘తెలుగు దేశం’ పెద్దల అంతర్గతంగా స్పష్టమవుతోంది.

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగా వీలైనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రధాన విపక్షమైన వైకాపాను ఆత్మరక్షణలో పడేయాలన్నదే ప్రభుత్వ ఎత్తుగడగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను రెగ్యులర్‌ చేసి వారి ఓటుబ్యాంకును కాపాడుకోవాలన్న దిశగా కూడా ప్రభుత్వం తెరవెనుక కార్యాచరణను సిద్ధం చేస్తోందన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. ¬రా¬రీగా జరగనున్న ఎన్నికల్లో ఉత్తుత్తి హామీలను నమ్మి ఓట్లేసే పరిస్థితిలో ప్రజలు లేరని, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల్లో కొన్నింటినైనా నెరవేరిస్తేనే భవిష్యత్‌ ఉండగలదని చంద్రబాబు భావిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ హామీ కార్యాచరణతో 2004లో అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తాను మరణించినా ఇప్పటికీ రైతన్నల హృదయాల్లో చిరంజీవిగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో రైతు రుణ మాఫీతోనే చంద్రబాబు కూడా అధికారంలోకి రాగలిగారు. ఏది ఏమైనా 2019 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం రానున్న ఎన్నికల ఏడాదిలో మరెన్నో వినూత్న సంక్షేమ పథకాలను అమలుచేసి సరికొత్త హామీలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను బాగా ఫోకస్‌ చేసి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న దిశగా విపక్షాలు అడుగులేస్తున్నాయి.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *